వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉమామహేశ్వర శర్మ , నిందితుడు శ్రీకాంత్
సోదరుడి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు ఘోరానికి పాల్పడ్డాడు. సొంత నానమ్మనే హత్య చేశాడు. ఆపై నగల కోసమే హత్య జరిగినట్లు నమ్మించేందుకు, వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొనిపరారయ్యాడు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 48గంటల్లో కేసును ఛేదించారు. నిందితుడు గతంలోనూ ఓ మహిళను హత్య చేసి, జైలుకు వెళ్లొచ్చినట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్, కీసర: తమ్ముడి పెళ్లి జరిగితే తనకు ఇంట్లో స్థానం ఉండదని భావించిన ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేయించేందుకు సొంత నాయనమ్మనే దారుణంగా హత్యచేసిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ , ఏసీపీ రషీద్, కీసర సీఐ సురేందర్‌గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. కీసరకు చెందిన పురాన పెద్దమ్మ(80)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు, కుమార్తెలు. వారిలో చిన్న కుమారుడు లక్ష్మయ్య స్థానిక నందిని నగర్‌లో ఉంటున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు శ్రీకాంత్, శ్రీహరి, శ్రీధర్. అందులో శ్రీకాంత్, శ్రీహరి వివాహాలు అయ్యాయి. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు.
చిన్న కొడుకు శ్రీధర్ వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబందాలు చూస్తున్నారు. ఓ కంపెనీలో పనిచేస్తున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో రెండు గదులు మాత్రమే ఉండటంతో, శ్రీధర్ వివాహం జరిగితే తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుందని భావించిన అతను ఎలాగైనా సోదరుడికి పెళ్లి జరకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మేనత్త నర్సమ్మ వద్ద ఉంటున్న నాయనమ్మ(పురాన పెద్దమ్మ)ను హత్య చేస్తే ఓ ఏడాదిపాటు పెళ్లి వాయిదా పడుతుందని పథకం పన్నాడు. ఇందులో భాగంగా శనివారం పోచమ్మ బస్తీలో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పురాన పెద్దమ్మ మనవడిని భోజనం చేయమని చెప్పగా, అతను వద్దని చెప్పడంతో వృద్ధురాలు భోజనం చేసి పడుకుంది. ఇదే అదునుగా భావించిన శ్రీకాంత్ ఆమె మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆభరణాల కోసమే దొంగలు హత్య చేసినట్లు నమ్మించేందుకు ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
సీసీ కెమెరాల ఆధారంగా పట్టివేత...
వృద్ధురాలి హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రోజు నిందితుడు అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. 48 గంటల్లోనే హత్య కేసును చేధించిన కీసర పోలీసు సిబ్బందిని డీసీపీ, ఏసీపీ లు అభి నందించి, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
గతంలోనూ ఓ మహిళనుహత్య చేసిన శ్రీకాంత్ ...
నిందితుడు శ్రీకాంత్ గతంలోనూ ఓ మహిళను హత్య చేసి జైలు శిక్ష అనుభవించాడు. 2011లో తనతో పాటు పని చేస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్న అతను ఆమెను నమ్మించి శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment