Justice Ramesh ranganathan
-
జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు పదోన్నతి లభించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంబంధిత ఫైలుపై బుధవారం సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. బాంబే, గౌహతి, సిక్కిం, కలకత్తా హైకోర్టులకు సైతం ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–04 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. -
ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం రెండు రోజుల కిందట ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–2004 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. -
వైద్యురాలి అవతారంతో సర్వారి ఉన్నీసా నిజస్వరూపం
సాక్షి, హైదరాబాద్: చదివింది ఏడో తరగతి. ఆర్థిక సమస్యలతో 2010లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా చేరింది. తర్వాత ఆస్పత్రికి సూపర్వైజర్ అయింది. ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో ఏకంగా వైద్యురాలి అవతారం ఎత్తింది. వైద్యపరంగా కనీస అర్హతల్లేకున్నా గర్భంలోని పిండాన్ని చిదిమేసింది. ఇదీ సైదాబాద్ డివిజన్ ఐఎస్ సదన్ సింగరేణి కాలనీ లోని గాయత్రి నర్సింగ్ హోంలో జరిగిన దారుణమైన భ్రూణహత్య ఘటనకు పాల్పడ్డ నకిలీ వైద్యురాలు సర్వారి ఉన్నీసా నేపథ్యం. సదరు ఆస్పత్రికి డాక్టర్ రచనా సింగ్ ఠాకూర్ డైరెక్టర్. ఆమె భర్త డాక్టర్ కిరణ్ కుమార్ చౌహాన్ ఎండీ. ఆర్టీసీ ఆస్పత్రిలో పెథాలజీ విభాగంలో రచనాసింగ్కు సర్కారీ కొలువు. ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహించేందుకు ఆమెకు చట్టపరంగా అర్హత లేదు. వీరిద్దరి సూచనల మేరకు ఉన్నీసా గర్భశ్రావం చేసింది. ఉన్నీసాకు ఏఎన్ఎం ఎన్.శోభ, ఆయా లక్ష్మమ్మ సహకరించారని హైకోర్టుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. గాయత్రి నర్సింగ్ హోం నిర్వాకంపై అంబర్‌పేటకు చెందిన సందీప్ యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. భ్రూణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సుల్తాన్‌బజార్ సహాయ పోలీస్ కమిషనర్ ఎం.చేతనకు అప్పగించామని, మరిన్ని వివరాలకు కొంత సమయం కావాలని సీపీ హైకోర్టును కోరారు. ప్రస్తుతం గాయత్రి నర్సింగ్ హోం మూతపడి ఉందన్నారు. ఆడబిడ్డేనని తెలిసి భ్రూణహత్య చేసినట్లు ఆధారాల్లేవని, గర్భస్రావం ఎవరికి చేశారో గుర్తించలేకపోయినట్లు వివరించారు. పిండాన్ని చిదిమేసిన ఉన్నీసా, రచనా సింగ్, కిరణ్ కుమార్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు నివేదించారు. వీరు ముగ్గురూ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. కాగా, ఈ కేసులో తమ వాదనను తెలిపేందుకు సమయం కావాలని గాయత్రి నర్సింగ్ హోం తరఫు న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. -
గర్భస్థ పిండాన్ని చిదిమేస్తారా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయేది ఆడ బిడ్డని తెలిసి పిండ దశలోనే ప్రాణం తీసేస్తున్న ఘటనలపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పిండాన్ని చిదిమేయడానికి చేతులెలా వస్తున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషనర్ చెబుతున్న వివరాలు వింటుంటే హృదయం ద్రవిస్తోందని, ఈ ఘాతుకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టరాదని స్పష్టం చేసింది. దీనిపై లోతుగా విచారించి వాస్తవాల్ని నిగ్గు తేల్చాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్ హోంలో చట్ట వ్యతిరేకంగా భ్రూణ హత్యలు పాల్పడుతున్నారంటూ అంబర్‌పేట్‌కు చెందిన సందీప్‌యాదవ్ హైకోర్టు లో దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి గాయత్రి నర్సింగ్‌హోంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, నర్సింగ్ హోం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. నర్సింగ్ హోంలో పనిచేసే సూపర్‌వైజరే వైద్యురాలిగా చలామణి అవుతూ గర్భస్రావాలు చేసేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ దారుణాల నుంచి తప్పించుకునేందుకు నర్సింగ్ హోం నిర్వాహకులు పిటిషనర్‌పై పోలీసు కేసు నమోదు చేశారని చెప్పారు. గర్భాన్ని చేతితో చిదిమేశారని, దీనికి సంబంధించిన వీడియో రికార్డు తన వద్ద ఉందని చెప్పారు. పిటిషనర్ చెబుతున్న వీడియో రికార్డు ఉన్న పెన్ డ్రైవ్‌ను పరిశీలించి ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని తెలంగాణ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా, మానవత్వానికే మాయని మచ్చలాంటి దారుణాలకు పాల్పడటం నిజమైతే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో వివరించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించింది. -
ఎంసీఐ రూల్స్ మేరకే ఇన్‌సర్వీస్ కోటా రద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలకు లోబడే పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాను రద్దు చేసి, వెయిటేజీ మార్కు ల విధానాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటాను తెలుగు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీకిచెందిన వైద్యులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర వియలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎంసీఐ నిబంధనల్లోని తొమ్మిది ప్రకారం ఇన్‌సర్వీస్ కోటాను ఎత్తివేసి వెయిటేజీ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదించారు. అఖిల భారత స్థాయిలో 50 సీట్ల భర్తీ జరుగుతుందని, మిగిలిన సగం సీట్లలో వైద్యులుగా సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాకు బదులు వెయిటేజీ మార్కులు ఇస్తామన్నారు. వెయిటేజీ మార్కుల విధానంలో ఒక్క సీటు కూడా తమకు రాదనే పిటిషనర్ల వాదనను ధర్మాసనం కొట్టేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదాపడింది. -
సీనియర్ న్యాయవాది మూర్తికి హైకోర్టు నివాళి
సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్జీకే మూర్తికి హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. మూర్తికి నివాళులు అర్పించేందుకు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూర్తితో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తుచేసుకున్నారు. అంతకుముందు తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు మూర్తి అందించిన సేవలను కొనియాడారు. మూర్తి మృతికి సంతాపంగా అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మూర్తి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
పేర్లు ఇవ్వకుంటే ఫుటేజీ తెప్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేలు నిర్వహించి తీరుతామంటూ సవాళ్లు విసిరిన ప్రజా ప్రతినిధులను తాము టీవీల్లో చూశామని, వారి పేర్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పేర్లు ఇవ్వ కుంటే టీవీల నుంచి ఫుటేజీ తెప్పించుకుని వారిని ప్రతి వాదులుగా చేరుస్తామంది. పందేలు జరిపిన నిర్వాహకుల్లో ప్రజా ప్రతినిధులు ఎంతమంది? ఎంతమందిపై కేసులు పెట్టారో చెప్పాలంది. తాము కోరిన వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎస్ దినేష్ కుమార్ సోమవారం విచారణకు హాజరై నివేదిక సమర్పించారు. -
బాబు లేఖ నేపథ్యంలో న్యాయమూర్తుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు కోసం అమరావతిలో ప్రభుత్వం గుర్తించిన భవనాలను పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఉద్యోగుల విభజనకు ఓ సబ్ కమిటీ, రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ పరిశీలనకు ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు తాము గుర్తించిన భవనాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు గత డిసెంబర్ 27న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజనకుపై న్యాయమూర్తులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏసీజే బుధవారం తన అధ్యక్షతన ఫుల్ కోర్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులందరూ పాల్గొన్న ఈ భేటీ దాదాపు గంటా 10 నిమిషాలు జరిగింది. సమావేశం ఒకింత వాడివేడిగా కొనసాగినట్లు సమాచారం. హైకోర్టు తరలింపుపై కొందరు న్యాయమూర్తులు కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తినట్లు తెలిసింది. హైకోర్టు విభజనపై 2015 మే 1న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు వల్ల ఎదురయ్యే సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. అంతేగాక న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఉద్యోగుల భత్యాల పెంపు తదితరాలపైనా న్యాయమూర్తులు చర్చించారు. ఈ రెండింటిపై తమ వైఖరిని ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పాలని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. మొత్తమ్మీద హైకోర్టు విభజనపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీజే ఓటింగ్ నిర్వహించారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం గుర్తించిన భవనాల పరిశీలనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గు చూపారు. హైకోర్టు విభజన ప్రక్రియ నిర్ణయాల్లో న్యాయవాదులను కూడా భాగస్వాములు చేయాలన్న అంశమూ చర్చకు వచ్చింది. వారిని ఈ దశలో భాగస్వాములను చేస్తే సమస్యలు పెరుగుతాయని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడటంతో ప్రతిపాదన పక్కకు వెళ్లింది. సబ్ కమిటీ భవనాలను పరిశీలించి వచ్చాక మరోసారి సమావేశమవాలని ఫుల్‌కోర్ట్ నిర్ణయించింది. తాత్కాలిక భవనాల్లో హైకోర్టు నిర్వహణకు అవసరమైన సదుపాయాలన్నింటి విషయంలో ఎక్కడా రాజీ పడరాదని న్యాయమూర్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయమై తమకు ఏమేం కావాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఉద్యోగుల విభజనకు వీలైనంత త్వరగా మార్గదర్శకాలు రూపొందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సబ్ కమిటీలో ఐదుమంది ఉండాలని నిర్ణయం జరిగింది. వీటి ఏర్పాటు అధికారాన్ని ఏసీజేకు కట్టబెట్టారు. ముందు భవనాల పరిశీలన కమిటీ, ఆ తర్వాత మిగతావి ఏర్పాటవుతాయి. మరోవైపు, 2015 నాటి జస్టిస్ సేన్‌గుప్తా ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ న్యాయవాదులు బుధవారం ఏసీజేను కోరారు. దాదాపు 300 మంది సంతకాలతో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు విభజనలో తమనూ భాగస్వాములను చేయాలని కోరారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కూడా ఏసీజేకి ఇదే విధంగా వినతిపత్రం సమర్పించారు. -
‘ఒకేషనల్’ వినతులపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్) పూర్తి చేసిన వారిని అర్హులుగా పరిగణించాలని వచ్చిన వినతులపై తగిన నిర్ణయం తీసు కోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు నెల ల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విస్తరణాధికారుల గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి బీఎస్సీ(ఏజీ) పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణి స్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఒకేషనల్ (క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెం ట్) కోర్సు పూర్తి చేసినవారు తమను కూడా అర్హులుగా పరిగ ణించాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం స్పందించక పోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ల వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని, రెండు నెలల్లో నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఒకటో తరగతి.. కాదు రెండో తరగతి..
సాక్షి, హైదరాబాద్: చదవలేను మొర్రో.. అని పిల్లాడు మొత్తుకుంటుంటే.. ఒకటో తరగతి కాదు రెండో తరగతి చదవాల్సిందేనన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రెండో తరగతి పాఠాల్ని తన మనవడు అద్వేత్య చదవలేకపోతున్నాడని, ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న తన వినతిని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ బాలుడి నాయనమ్మ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ రిట్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. స్కూల్ యాజమాన్యం దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ధర్మాసనం ముందుకు చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. బాలుడి నాయనమ్మ కోరిక మేరకే అద్వేత్యను రెండో తరగతిలో చేర్చామని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో సింగిల్ జడ్జి ఆమె వ్యాజ్యాన్ని కొట్టివేశారు. దాంతో ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. -
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
-
రైతు సమితులపై వివరణ ఇవ్వండి
కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం ► రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పిల్ దాఖలు ► అవి రాజ్యాంగేతర యంత్రాంగమని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటితో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను మూడు వారాలకు వాయిదావేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన జీవో 39ను సవాలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల రైతు చింపుల సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన యు.మనోహర్‌రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు. రైతులకు ఒక్కో సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. తగిన సిఫా రసులు చేసే బాధ్యతలను రైతు సమన్వయ సమితులకు అప్పగించిందని కోర్టుకు వివరిం చారు. అయితే ఈ రైతు సమన్వయ సమితుల ను నామినేట్ చేసేది మంత్రులేనని.. ప్రజా విధులను నిర్వర్తించేందుకు ఇలా రాజ్యాంగేతర యంత్రాంగాన్ని సృష్టించే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇలా సమితులు ఏర్పాటు చేయకుండా రాజ్యాం గంలో ఎక్కడా నిషేధం లేదని, నిషేధముంటే చూపాలని పేర్కొంది. దీంతో రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులను మంత్రులు నామినేట్ చేయడమన్నది అధికార దుర్వినియోగమే అవుతుందని న్యాయవాదులు వివరించగా... మంత్రులకు ఇలాంటి బాధ్యతలు అప్పగించ కూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో కూర్చుని తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని... కోర్టులు ఏ విషయాల్లో అయితే జోక్యం చేసుకోరాదో ఆ విషయాల్లో జోక్యం చేసుకో వాలంటూ కోరుతున్నారని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.. తిరిగి పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ... గ్రామస్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పంచాయతీలు ఉన్నాయని, ఇప్పుడు రైతు సమితుల ఏర్పా టుతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కోర్టుకు నివేదిం చారు. అంతేగా కుండా ఈ రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ రూ.500 కోట్లపై ప్రభుత్వ వివరణ కోరింది. దీనికి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి సమా ధానమిస్తూ.. రైతులు పండించిన కొన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కడం లేదని, వారికి కనీస మద్దతు ధర అందించేందుకే రూ.500 కోట్లు కేటాయిం చామని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఇంకా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కాలేదని, అది ఏర్పాటయ్యే వరకు నిధులను వ్యయం చేయబోమన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సిఫారసుల మేరకు రాష్ట్ర స్థాయి సమితి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు వ్యవ హారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
అభ్యంతరాలున్నా భూ సేకరణ చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ సవరణ చట్టం (2017) ప్రకారం రాష్ట్ర సర్కార్‌కు భూ సేకరణ జరిపే అధికారం ఉందని ఉమ్మడి హైకోర్టు చెప్పింది. అయితే భూ సేకరణపై రైతుల అభ్యంతరాల్ని త్వరితగతిన పరిష్కరించాలని.. వారి సమ్మతి, అందుకు అనుగుణంగా జరిగే ఒప్పందాలన్నీ సవరణ చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొంది. అలాగే రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన చట్ట సవరణలతో సంతృప్తి చెందనివారు వ్యాజ్యం దాఖలు చేసుకునే అధికారం వివరించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండగానే ఇతర రైతులతో భూ సేకరణ చేపట్టారంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం విచారణ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ కోసం బైలాంపూర్, తానేదార్పల్లి, తానేదార్పల్లి తండా, మామిడ్యాల రైతుల అభ్యంతరాల్ని కొలిక్కి తేకుండానే ఇతర రైతులతో సిద్దిపేట కలెక్టర్ ఒప్పందాలు చేసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం అభ్యంతరాల్ని పరిష్కరించకుండా సెక్షన్ 19 ప్రకారం ఒప్పందాలు చేయరాదన్నారు. అయితే 2013 భూ సేకరణ చట్టానికి సవరణలో సెక్షన్ 30–ఎ చేర్చారని, దీని వల్ల భూ సేకరణ అవార్డు విచారణ దశలోనూ రైతుల అంగీకారంతో భూమిని ప్రభుత్వం సేకరించవచ్చన్న రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ భూ సేకరణపై రైతుల వినతులు, అభ్యంతరాల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. -
స్వాతంత్య్ర సిద్ధిలో న్యాయవాదుల పాత్ర
వారి త్యాగఫలాలే ఈ స్వేచ్ఛా వాయువులు.. స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ సాక్షి, హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్య్ర సిద్ధిలో అనేక మంది న్యాయవాదుల పాత్ర ఉందని, వారి ప్రాణ త్యాగాల వల్లే ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీ, లాలాలజ్‌పత్ రాయ్, బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులంతా కూడా ప్రఖ్యాత న్యాయవాదులని, వీరిని ఈ 71వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకోవడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరంలో భూలాభాయ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, వీపీ మీనన్ తదితరుల పాత్రను వివరించారు. దేశం లౌకిక రాజ్యమే భారతదేశం లౌకిక రాజ్యమని నమ్మి, దానిని ఆచ రణలో చూపిన గొప్ప వ్యక్తి వల్లభాయ్ పటేల్ అన్నారు. మైనారిటీల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ప్రకటించి, ఆ మేర మైనారిటీలకు అన్ని హక్కులు కల్పించేలా చూశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం 552 రాచరిక రాష్ట్రాలను దేశంలో విలీనం చేయడంలో వల్లభాయ్ పటేల్, రాష్ట్రాల మంత్రిత్వశాఖ కార్యదర్శి వీపీ మీనన్‌ల కృషి అసాధారణ మన్నారు. పటేల్ కృషి వల్లే ఆధునిక ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటైం దన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యుద్ధ ఖైదీలుగా నిర్బంధానికి గురైన పలువురు భారత ఆర్మీ అధికారులకు స్వేచ్ఛ ప్రసాదించడంలో భూలాభాయ్ దేశాయ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆరోగ్య సహకరించకున్నా తన బలమైన వాదనలతో ఆ అధికారులు విడుదల య్యేలా చేశారన్నారు. అనంతరం చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్రంగనాథన్ చేతుల మీదుగా అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, తెలంగాణ అదనపు ఏజీ, ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, బార్ కౌన్సిల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పటిలోపు నియమిస్తారు?
♦ సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు ♦ కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన సమాచార కమిషనర్, ఇత ర కమిషనర్లను ఎప్పటిలోపు నియమిస్తారో రాతపూర్వకంగా తెలియచేయాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మా సనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని.. ఈ మేరకు వారి నియామకానికి చర్యలు తీసుకునేలా తెలంగాణ, ఏపీలను ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మనాభయ్య ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా విభజన జరగకపోవడంతో.. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. సమాచార కమిషన్ పునర్వి భజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉందని, అందువల్ల ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పరస్ప రం సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్క రించుకుంటాయని కోర్టుకు వివరించారు. సమాచార కమిషన్ విభజన జరగాల్సి ఉందని.. కమిషనర్ల నియామకానికి 3 నెలల గడువు కావాలని కోరారు. దీంతో మరి ఈ మూడు నెలల పాటు ప్రజల హక్కు మాటేమిటని ధర్మా సనం ప్రశ్నించింది. ఇక సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియను ఏడాది క్రితమే ప్రారం భించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది పెండింగ్‌లో ఉందని ఏపీ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు వివరించారు. కమిషనర్ల నియామకం పెద్ద పని కాదన్నారు. అయితే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే పెద్ద పని అని, ఇందుకు కొంత సమయం పడు తుందని తెలిపారు. తమ రాష్ట్రంలోనే తాము సమాచార కమిషన్ ఏర్పాటు చేసుకుంటా మని కోర్టుకు వివరించారు. అనంతరం పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ... సమాచార కమిషన్‌లో 20 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, దాంతో ప్రజల హక్కులకు భంగం కలుగు తోందని కోర్టుకు వివరించారు. -
ఏం చర్యలు తీసుకున్నారు?
హైకోర్టు విభజనపై కౌంటర్ దాఖలు చేయండి కేంద్రం, ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళ వారం క్యాబినెట్ కార్యదర్శి, కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2015లో తీర్పునిచ్చినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అలాగే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశా లు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది జె.నారాయణస్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నారాయణ స్వామి వాదనలు వినిపిస్తూ 1937లో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలంటూ 2015లో ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ తీర్పు అమలు కాలేదన్నారు. -
సైరన్ ఎవరు వాడొద్దో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కార్లపై ఎర్రబుగ్గ, సైరన్‌ను ఏయే హోదాల్లోని వ్యక్తులు ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్లపై ఎరుపు, నీలం రంగుల బుగ్గలు, సైరన్ల విని యోగంపై ఆంక్షలు ఉన్నా దర్పం ప్రదర్శించేందుకు కొందరు సైరన్‌ను వినియోగిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎర్రబుగ్గలు, సైరన్ల వినియోగంపై నిషేధం, ఆంక్షలు ఉన్నా, బహిరంగ ప్రదేశాల్లో, టోల్ గేట్ల వద్ద కొందరు సైరన్లను వాడుతున్నారని చెప్పారు. -
న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు
నరసింహారావుకు నోటీసు జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావుపై ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాఖ్యలు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయ పడిన హైకోర్టు, నరసింహారావుకు కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14(1) కింద నోటీసు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో వారం లోపు వివరించాలని అతన్ని ఆదేశించింది. అంతేకాక నరసింహారావును తక్షణమే అదుపులోకి తీసుకోవాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ భోజన విరామ సమయంలో నరసింహారావును అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం రూ.25 వేలకు రెండు పూచీ కత్తులు సమర్పించడంతో ఆయన్ను బెయిల్‌పై విడుదల చేశారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవాలి... ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా అధిక రేట్లకు థియేటర్లు టికెట్లు విక్రయిస్తున్నాయని, దీనివల్ల ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం పడుతోందని, అందువల్ల సదరు థియేటర్ల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. టికెట్ ధర విషయంలో వాస్తవాలను అధికారులు కోర్టు ముందుంచలేదని, దీంతో హైకోర్టు పలు ఉత్తర్వులిచ్చిందని, అవి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని నరసింహారావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్ దాఖలు చేసుకోవడమో లేక రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడమో చేయాలే తప్ప, ఆ ఉత్తర్వులను తాము స్వతంత్రంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణంతో నరసింహారావు పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది... అనంతరం నరసింహారావు స్పందిస్తూ, న్యాయ స్థానాలు వెలువరించే ఇటువంటి ఉత్తర్వుల వల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతు న్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ, అతనికి కోర్టు ధిక్కారం కింద నోటీసు జారీ చేసింది. -
వారిద్దరికీ వేతనాలు చెల్లించండి
రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వరంగల్ జిల్లా హసన్‌పర్తి కళాశాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు బకాయిలుసహా వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. గత మూడు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ వీవీ పద్మజతోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏపీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్శిటీల మధ్య ఉద్యోగుల పంపిణీ జరిగింది. ఏపీ స్థానికత ఉన్న 33 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 58:42 శాతం ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జీతాలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే 33 మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఉద్యోగులు ఆఫీసులో రిపోర్టు చేయడం లేదని, జీతాలు ఇవ్వాలంటే తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్శిటీ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అయితే కేవలం సంతకం చేసేందుకే వారిని హైదరాబాద్ రావాలని కోరుతున్నారని, ఇక్కడ కార్యాలయంలో వారికి ఎటువంటి పనిని కేటాయించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. వర్సిటీ విభజన సమయంలో వారు హసన్‌పర్తిలోనే ఉన్నారని, అక్కడి కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని...వారికి జీతాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. గత 15 నెలలుగా ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులకు ఎటువంటి పని ఇవ్వకుండానే జీతాలు చెల్లిస్తున్నారని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసి వారి నుంచి పని తీసుకోవాలని...వారికి పని ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోతే సంతకాలు చేయడానికి మాత్రమే హైదరాబాద్‌కు పిలిపించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
అక్రమ బస్సు ఆపరేటర్లపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం, మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్ల చట్టం, ఏపీ మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్ల నిబం ధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించిం ది. ముఖ్యంగా ఏపీ మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్ల నిబంధనల ప్రకారం డ్రైవర్ల పని గంటల విషయంలో జరుగుతున్న ఉల్లంఘన లను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకు న్నారోనివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు దివాకర్ ట్రావెల్స్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. మోటారు వాహన చట్టాలకు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రైవే టు బస్సు ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే గత నెల 28న కృష్ణాజిల్లా మూలపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం దని, ఇందుకు చట్టాన్ని అమలు చేయని సం బంధిత శాఖ అధికారులను బాధ్యులను చేయాలని కోరుతూ న్యాయవాది కె.వి.సుబ్బా రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. పర్మిట్లు లేకపోయినా అనుమతులు... చట్టబద్ధమైన పర్మిట్లు లేకపోయినప్పటికీ వేలాది బస్సులకు ఇరు రాష్ట్రాల అధికారులు అనుమతులిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.ఎ.పద్మనాభం చెప్పారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా అనుమతులు తీసుకు ని స్టేజ్ కారేజీలుగా నడుపుతున్నారని, తద్వా రా ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం కలుగు తోందని, అయినా అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ల పని గంటల్లో మార్పులు తీసుకొచ్చింద న్నారు. దీని ప్రకారం డ్యూటీకి మధ్య 8 గంటల విరామం ఉండాలని, వారంలో 72 గంటలకు మించి డ్రైవర్లు పని చేయడానికి వీల్లేదన్నారు. కానీ కొన్ని రూట్లలో డ్రైవర్లు ఏకబిగిన 26 గంటల పాటు పనిచేస్తు న్నార న్నారు. దీంతో అనేక ఘోర ప్రమా దాలు జరుగుతున్నాయని తెలిపారు. స్పందించిన ధర్మాసనం... డ్రైవర్ల పని గంటల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరి స్తూ నివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా, కార్మికశాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. మూలపాడు దుర్ఘటనకు కార ణమైన దివాకర్ ట్రావెల్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంట ర్లు దాఖలు చేయాలని సూచించింది. -
ఎస్ఎఫ్సీ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని (ఎస్ఎఫ్సీ) ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేయక పోవడాన్ని సవా లు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు విని పిస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ ఏర్పాటుకు 2015లో జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దానిని కార్యరూపంలోకి తీసుకురాలేదని వివరించారు. -
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి
హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ తిరుపతి లీగల్: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రమేశ్‌రంగనాథన్ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్‌ను ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ రమేశ్‌రంగనాథన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి వద్దు
హైకోర్టులో పిల్... విచారణకు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వానికి, పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇందిరాపార్క్, ధర్నాచౌక్‌తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాల నిర్వహణకు పోలీసులు అనుమతులిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. -
మీ ఆదేశాల మేరకే జీవో 38 తెచ్చాం
మధ్యంతర ఉత్తర్వులను సవరించండి ధర్మాసనాన్ని కోరిన ఏజీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూములమ్మిన వారికిగాక, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునర్నిర్మాణం, పునరావాసం కోసం 2013 చట్ట నిబంధనల ప్రకారం జీవో 38 జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు జీవో 123 వర్తింపచేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరింది. ఇందుకు సంబం«ధించి తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరపాలని విన్నవించింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 38 జారీ నేపథ్యంలో జనవరి 5న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. ఉభయ పక్షాల న్యాయవాదుల సమ్మతితో జీవో 123 చట్టబద్ధతపై తుది విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఈ వ్యాజ్యాలన్నీ విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ తమ అనుబంధ పిటిషన్‌ను ప్రస్తావించారు. జీవో 38 జారీ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. తుది విచారణ వల్ల జాప్యం జరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ అనుబంధ పిటిషన్‌పై వాదనలు వినాలన్నారు. ఈ సమయంలో అటు పిటిషనర్లు, ఇటు ఏజీ మధ్య కొద్దిసేపు తీవ్ర వాదనలు జరిగాయి. అనుబంధ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనమే విచారిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. -
భూదాన్ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భూదాన్ బోర్డును రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వర కు తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించిం ది. ఎప్పటిలోపు బోర్డును ఏర్పాటు చేస్తా రో స్పష్టం చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ భూదాన్ బోర్డును పునరుద్ధరించకపోవడాన్ని సవా లు చేస్తూ సర్వసేవసంఘ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మా సనం, భూదాన్ బోర్డును ఎందుకు ఏర్పా టు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఐటీ చట్టానికి పదును
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ⇒ కొత్త నేరాల నేపథ్యంలో కొత్త చట్టాలు అవసరమని వ్యాఖ్య ⇒ ఏపీలో జ్యుడీషియల్ అకాడమి ఏర్పాటు చేయాలని సూచన ⇒ విజయవాడలో మేధోసంపత్తి, వాణిజ్య చట్టాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ⇒ సైబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జస్టిస్ లోకూర్ ⇒ మేథో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం: హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ ⇒ అమరావతి, తిరుపతి, విశాఖలో వాణిజ్య కోర్టులు: సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సైబర్ క్రైమ్ నివారణకు ఐటీ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేరాలు కొత్తగా జరుగుతున్న నేపథ్యంలో చట్టాలు కూడా అందుకనుగుణంగా కొత్తవి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘మేథో సంపత్తి, వాణిజ్య న్యాయాలు – అందుకనుగుణమైన చట్టాలు’ అనే అంశంపై శుక్రవారం నగరంలోని ఎ కన్వెన్షన్ హాలులో బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్‌కు చెందిన జెట్రో ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. గతంలో మారుమూల ప్రాంతాల వారికి అంతగా అవకాశాలు దక్కేవి కావని, న్యాయ వ్యవస్థలో గ్రామీణ ప్రాంత న్యాయవాదులకు సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం అందరికీ అవకాశాలు పెరిగాయన్నారు. ఏపీలో జ్యుడీషియల్ అకాడమి ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఏపీకి చారిత్రక సంపద, సంస్కృతి ఉందని, ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయన్నారు. విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం అయిందని చెప్పారు. సదస్సులో ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓ కృష్ణకిషోర్ స్వాగతోపన్యాసం చేయగా, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్మథరావు ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కొత్తగా హైకోర్టుకు ఎన్నికైన జడ్జిలు రజని, మురళిలను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తుల ప్రొఫైల్స్ ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రెండో సెషన్లో ప్రాథమిక మేధో సంపత్తి హక్కులు అనే అంశంపై జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్, జస్టిస్ అకిర కటసె మాట్లాడారు. డిజిటల్ యుగంలో వాణిజ్య కోర్టులు, ఆధారాలు అనే అంశంపై మూడో సెషన్లో జరిగిన చర్చలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ మురళీధర్, కాంపిటీషన్, ఇంటర్నెట్, ఐటీ, సైబర్ చట్టాల గురించి నాలుగో సెషన్లో జరిగిన చర్చలో జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్, ఢిల్లీ సీనియర్ న్యాయవాది ప్రతిభా ఎం సింగ్ తదితరులు మాట్లాడారు. వాణిజ్య చట్టాలపై అవగాహన పెంచుకోండి మారుతున్న కాలానికి అనుగుణంగా జడ్జిలం తా వాణిజ్య కోర్టులు, కాంపిటీషన్, సైబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నా ఇంకా మీమాంస కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశా లపై జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకో వాలని సూచించారు. వాణిజ్య కోర్టుల సామర్థ్యంపైనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారపడి ఉండడంతో న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో ఆ అంశాలపై దృష్టి సారిం చాలన్నారు. చాలా ప్రాంతాల్లో వాణిజ్య కోర్టు లు ఏర్పాటైనా వాటిపై అధ్యయనం కేవలం ముంబై, ఢిల్లీ కోర్టులకే ఎందుకు పరిమిత మైందో అర్థం కావడం లేదన్నారు. మన దేశం కంటే ఇతర దేశాల్లో సైబర్ చట్టాలు బాగున్నా యని తెలిపారు. ఏపీకి ఎన్నో సవాళ్లున్నా, అనేక అవకాశాలూ ఉన్నాయని చెప్పారు. మేథో సంపత్తి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోనూ కమర్షియ ల్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కోర్టుల అవసరం ఎక్కువగా ఉంది రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని, అందుకనుగుణంగా కోర్టుల అవసరం ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. ఐటీ, ఇంటర్నెట్ ఆధారంగా అన్నీ జరుగుతున్న దశలో వాణిజ్య, మేధో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం ఏర్పడిందని, వాటి అవసరం ఉందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో మెడికల్ రంగాల రీసెర్చ్‌లో జపాన్ ముందుందని చెప్పారు. అందుకే అక్కడి వారికి ఆ రంగాల్లో నోబెల్ బహుమతులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కొత్త చట్టాలు రావాలి ప్రపంచమంతా డిజిటల్ రంగంపై ఆధారపడి పని చేస్తున్న దశలో అందుకనుగుణంగా చట్టాలు మారాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణి చెప్పారు. న్యాయ వ్యవస్థ సైతం మారుతున్న పరిస్థితులను అన్వయించుకుని ముందుకెళ్లాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబైలోనే ప్రస్తుతం వాణిజ్య డివిజన్లు ఉన్నాయని, దేశమంతా ఈ డివిజన్లు ఏర్పాటవ్వాల్సి ఉందన్నారు. బీబీఏ మెట్రోపాలిటన్ బార్గా మారాలి బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) మెట్రో పాలిటన్ బార్గా మారాల్సిన అవసరం ఉంద ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యన్ ఆకాంక్షించారు. విజయవాడ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. లీగల్ వ్యవహారాలన్నీ మారుతున్నా న్యాయవ్యవస్థ మాత్రం అలాగే ఉందన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయాలకు అనుగుణంగా జడ్జిలు, న్యాయవాదులకు శిక్షణ అవసరమని చెప్పారు. వాణిజ్య కోర్టులతో మెరుగయ్యాం వాణిజ్య కోర్టులు ఏర్పాటైన తర్వాత తమ దేశంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని జపాన్ మేధో హక్కుల హైకోర్టు జడ్జి జస్టిస్ అకిర కటసె చెప్పారు. తమ దేశంలో 2005లో ఈ కోర్టులను ప్రారంభించామని, ప్రస్తుతం నాలుగు డివిజన్లు ఉన్నాయన్నారు. ఈ కోర్టులకు వస్తున్న కేసులు, పరిష్కరిస్తున్న విధానం గురించి ఆయన వివరించారు. నాకు సహకరించండి: సీఎం చంద్రబాబు అనేక సమస్యలు, సవాళ్ల నడుమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తనకు మద్దతు తెలపా లని ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ మూర్తులను కోరారు. న్యాయకోవిదులు తమ వంతు సహకారం అందించాలన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జడ్జిలనుద్ధేశించి సీఎం మాట్లాడు తూ.. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో)తో కలసి పని చేయడం అభివృద్ధికి నాంది అని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఏపీని తాకకుండా వెళ్లలేని పరిస్థితులు న్నాయన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపా రు. అమరావతిలో మోడల్ జస్టిస్ సిటీ నిర్మాణం చేపట్టామన్నారు. సీఎం డ్యాష్ బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిన వివరాలను చంద్రబాబు వీడియో ద్వారా వివరించారు. -
సెట్‌టాప్ బాక్స్‌లపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టీవీ వీక్షకులు జనవరి 31 కల్లా సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం పై ఉమ్మడి హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 కల్లా వీక్షకులు సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరిగా సమకూర్చుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సి.రామచంద్రరాజు, కేంద్రం తరఫున బి.నారాయణరెడ్డి, స్టార్ ఇండియా తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, తూము శ్రీనివాస్, లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమ వాదనలను వినిపించారు. -
బాలలకు రక్షణ కవచం ‘జువైనల్ యాక్ట్’
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ విజయవాడ: సమాజంలో బాలల హక్కులను కాపాడేందుకు జువైనల్ జస్టిస్ యాక్ట్ రక్షణ కవచంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన నాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. విజయ వాడ సబ్–కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, కృష్జా జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన అట్టడుగు వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం చట్టాలు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపాల్సిన గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ బాలల రక్షణ స్నేహ పూర్వక సేవల పథకం ఉద్దేశాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో వివరించారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందడుగులో ఉండటం ముదావహమన్నారు. -
కోర్టు ఆదేశాలనే పట్టించుకోరా?
ఇరు రాష్ట్రాల సీఎస్ల తీరుపై హైకోర్టు అసహనం ఏపీఏటీ ఆస్తుల విభజనకు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) ఉద్యోగుల, ఆస్తుల విభజ నపై తేల్చాలని తామిచ్చిన ఆదేశాల అమలుకు ఎలాంటి చర్య లు తీసుకోక పోవడంపట్ల ఉమ్మడి హైకోర్టు గురువారం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలా అయితే వారిని కోర్టు ముందుకు పిలిపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్ కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీ సమర్పించిన నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ సర్కార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత నెలలో విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం... ఏపీఏటీ ఉద్యోగుల, ఆస్తుల విభజన విషయంలో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డిసెంబర్ 7లోపు సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది. నవంబర్ నెలకు వ్యయాలను ఏపీనే భరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గురు వారం ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ ఆదేశాల మేరకు సీఎస్‌లు తగిన చర్యలు తీసుకోక పోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పిన సమాధానాలపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోక పోవడం ఎంత మాత్రం సరికాదన్న ధర్మాసనం.. సీఎస్‌లను కోర్టు ముందుకు పిలిపిం చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఇరువురు ఏజీలు కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
వారి దేహాలను తీసుకురావడానికి ఏం చేస్తున్నారు?
గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల గురించి ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదంటూ హైదరాబాద్, ప్రగతినగర్‌కు చెందిన న్యాయవాది శ్రీధర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్నెల్లుగా శవాగారాల్లోనే మృతదేహాలు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, ఉభయ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డారని, వారి మృతదేహాలు గత ఆరు నెలలుగా శవాగారాల్లో ఉన్నాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ఈ వ్యవహారాన్ని ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవద్దు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వివరణలతో కౌంటర్లు దాఖలు చేస్తాయి’అని కేంద్రానికి స్పష్టం చేసింది. విచారణను జనవరి 2కు వాయిదా వేసింది. -
భవన యజమానులపై చర్యలేం తీసుకున్నారు?
పార్కింగ్‌కు అవకాశం లేకుండా చేయడంపై హైకోర్టు సీరియస్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక భవనాలను వాణిజ్య సము దాయాలుగా మార్చి, పార్కింగ్‌కు అవ కాశం లేకుండా చేస్తున్న భవన యజ మానులపై ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించాలని హైకోర్టు మంగళ వారం పురపాలకశాఖ, జీహెచ్ఎంసీలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణ ను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ ఉత్త ర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి లో పలు భవనాల్లోని పార్కింగ్ ప్రాంతా లను వాణిజ్య సముదాయాలుగా మార్చే శారని, దీంతో చాలామంది వాహనాల్ని రోడ్లపై పార్క్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయంటూ పత్రి కల్లో కథనాలు వచ్చాయి. హైకోర్టు, వీటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారిం చింది. పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
హై సెక్యూరిటీ ప్లేట్లపై కౌంటర్లు వేయండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ ఆదేశాల్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంత్రరాయ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. -
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. -
అసైన్డ్, పట్టాదారులు మధ్య తేడా ఎందుకు?
⇒ హైకోర్టుకు రైతుల తరఫు న్యాయవాదుల నివేదన ⇒ తదుపరి విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌దారులు, పట్టాదారుల మధ్య తేడా చూపుతుండటాన్ని రైతుల తరఫు న్యాయవాదులు బుధవారం హైకోర్టులో ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు సమానమేనని, పరిహారం చెల్లింపు విషయంలో వీరి మధ్య ఎటువంటి వివక్ష చూపడానికి వీల్లేదని వారు తెలిపారు. భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినట్లు చెబుతోందన్నారు. జీవో 123 కింద భూ సేకరణ చేపడుతుండటాన్ని సవాలు చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, మహబూబ్‌నగర్‌లో పట్టాదారులకు ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తుండగా, అసైన్డదారులకు రూ.3.5 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. పరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు ఒకటేనని గుర్తు చేసింది. రైతుల తరఫు న్యాయవాదులు 2013 చట్ట ప్రకారం భూ సేకరణ ముందు సామాజిక, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వం సెక్షన్ 40 కింద అత్యవసర క్లాజు ద్వారా భూ సేకరణ జరుపుతోందన్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. -
‘226’పై కీలక ప్రశ్నను లేవనెత్తిన ఉమ్మడి హైకోర్టు
రాజ్యాంగంలోని 226 అధికరణం కింద అధికారాలను ఎప్పుడు వాడొచ్చు? సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఏయే సందర్భాల్లో.. ఎలా వినియోగించాలన్న విషయంపై ఉమ్మడి హైకోర్టు తీర్పును వారుుదా వేసింది. 226 అధికరణం కింద హైకోర్టుకు విసృ్తత అధికారాలున్నప్పటికీ, ఆ అధికారాలను క్రిమినల్ కేసుల్లో బెరుుల్ మంజూరు చేసేందుకు సైతం వాడొచ్చా? అన్న విషయాన్ని తాము వెలువరించబోయే తీర్పులో తేలుస్తామని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్, దాని అనుబంధ సంస్థ విహాన్ డెరైక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మైఖేల్ జోసెఫ్ ఫెరీరా, మాల్కమ్ ఎన్.దేశాయ్, ఎం.వి.బాలాజీ, శ్రీనివాసరావు వంకా, నోజర్ కె.దేశాయ్ తదితరులు ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ వివిధ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యారుు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యారుు. ఈ కేసులపై వారు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రాజా ఇలంగో ఈ కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేశారు. అదే విధంగా వీరికి షరతులతో కూడిన బెరుుల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశిస్తూ ఈ నెల 4న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. 226 కింద బెరుుల్ ఉత్తర్వులు సరికాదు: హోంశాఖ న్యాయవాది వేణుగోపాల్ వాదిస్తూ... క్యూనెట్, విహాన్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా రూ.9వేల కోట్ల మేర 5లక్షల మంది ఖాతాదారులను మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతినిధులకు బెరుుల్ మంజూరు చేయాల్సిందిగా సూచిస్తూ, సింగిల్ జడ్జి 226 అధికరణంలోని అధికారాలతో దిగువ కోర్టుకు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, అధికరణం 226 కింద దాఖలైన పిటిషన్లో బెరుుల్ కోసం కోర్టు ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది.అధికరణం 226 కింద హైకోర్టుకు విసృ్తత అధికారం ఉన్నప్పటికీ దానిని వాడే విషయంలో పలు పరిమితులు ఉన్నాయంది. ఎవ్వరూ ప్రశ్నించజాలరు: పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, అధికరణం 226 కింద హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఏ ఒక్కరూ ప్రశ్నించజాలరన్నారు. 226 కింద దాఖలు చేసిన పిటిషన్లో కూడా బెరుుల్ కోసం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని తెలిపారు. పిటిషనర్లపై పలు ప్రాంతాల్లో బహుళ ఎఫ్ఐఆర్లు నమోదయ్యా యని, పోలీసులు అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేసి దేశమంతా తిప్పాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో వారి హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రరుుంచారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. విసృ్తతాధికారాలు సరే: ధర్మాసనం స్పందిస్తూ, ‘మీరు చెబుతున్నది నిజమే.. హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఎవ్వరూ ప్రశ్నించజాలరు. కాని ఆ విసృ్తత అధికారులను ఎలాపడితే అలా ఇష్టమొచ్చినట్లు వాడొచ్చా? 482 ఉండగా, 226 కింద బెరుుల్ ఇచ్చే అధికారం ఉందా? మేజిస్ట్రేట్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను 226 కింద మేం లాగేసుకోవచ్చా? అలా లాగేసుకునేంత అసాధారణ పరిస్థితులు ఈ కేసులో ఏమున్నారుు? తమకు కావాల్సింది ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రమే’నని తెలిపింది. -
బీపీఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. అందులో క్రమబద్ధీకరణకు అర్హమైనవెన్ని.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలను తమ ముందుంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ‘గ్రేటర్’పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. రెండు రోజుల క్రితం మరోమారు విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ, దరఖాస్తుల పరిశీలనకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, బీపీఎస్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని అర్హమైనవి.. వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేశవరావును ఆదేశించింది. -
డీఎస్పీల సీనియారిటీపై అఫిడవిట్ దాఖలు చేయండి
సాక్షి, హైదరాబాద్: డీఎస్పీల సీనియారిటీ ప్రక్రియ అంశాన్ని ఎంత కాలం పెండింగ్‌లో పెడతారని, ఆ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీనియారిటీని ఎలా నిర్ధారిస్తారని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. సీనియారిటీ ప్రక్రియ పూర్తి కి తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయా లని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీ ప్రభు త్వం 2015 మే 19న జారీ చేసిన మెమో ఆధారం గా డీఎస్పీ సివిల్ కేడర్‌లో సీనియారిటీని ఖరారు చేయాలని కోరుతూ నేరుగా డీఎస్పీలుగా ఎంపికై న పలువురు డీఎస్పీలు, అదనపు ఎస్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్‌నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఇన్స్పెక్టర్ల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందినవారికి నోషనల్ ప్రమోషన్ ద్వారా పదోన్నతి కల్పించడంతో నేరుగా డీఎస్పీలు గా ఎంపికై న వారికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచా రణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
‘అధిక ఫీజు’ స్కూళ్ల వివరాలివ్వండి
పేరెంట్స్ అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను 2 వారాల్లో సమర్పించాలని పేరెంట్స్ అసోసియే షన్ను హైకోర్టు ఆదేశించింది. స్కూళ్ల వివరాల్లే కుండా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫీజుల వివరాలను ముద్రిస్తున్నా, వన్‌టైం ఫీజు కింద ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, వీటికి రశీదు కూడా ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నిర్భంద విద్యా హక్కు చట్టం కింద పేదలకు సీట్లు కేటారుుంచడం లేదన్నారు. ఫీజులను నియంత్రిస్తూ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేందుకు ఏమైనా ఆధారాలున్నాయా అని పేరెంట్స్ అసోసియేషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను ఇవ్వాలని తీర్పునిచ్చింది. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
ఏసీజేకు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం వినతి సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్‌కు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జగన్, రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఏసీజేను కలసి వినతిపత్రం సమర్పించారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలపై సంఘం ప్రతినిధులతో చర్చించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. శెట్టి కమిషన్ సిఫార్సుల మేరకు కొత్తగా ఇవ్వాల్సిన పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని అక్కడే ఉన్న న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిని ఏసీజే ప్రశ్నించారు. కాగా, తమ సమస్యలపై ఏసీజే సానుకూలంగా స్పందించారని, సమ్మె కాలాన్ని లీవుగా పరిగణించాలన్న తమ అభ్యర్థనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని లక్ష్మారెడ్డి తెలిపారు. ఏసీజే ఆదేశాల మేరకు తమ సమస్యలపై చర్చించేందుకు రిజిస్ట్రార్ (పరిపాలన) నాగార్జున ఈనెల 14న సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
మార్కెట్ విలువ సవరణపై కౌంటర్ దాఖలు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. చట్టప్రకారం నిర్దిష్ట కాలవ్యవధిలోపు మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ బాధ్యతకు సంబంధించిన చట్టబద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రతీ రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ భూముల విలువను సవరించరాదని ఏమైనా నిషేధం ఉందా? అంటూ ప్రశ్నించింది. లేదని ఏజీ సమాధానం ఇవ్వడంతో 2014 నాటి భూముల ధరలకు, ప్రస్తుత ధరలకు ఎంతో వ్యత్యాసం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ జీవో 123 ద్వారా భూములను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం పాత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తోందని, మార్కెట్ విలువను సవరిస్తే ఎటువంటి న్యాయపోరాటం అవసరం లేకుండానే రైతులు ఎకరాకు రూ.13 లక్షల వరకు పొందే అవకాశం ఉందని వివరించారు. -
తదుపరి విచారణ వరకు కూల్చబోం
► సచివాలయ భవనాలపై హైకోర్టుకు ప్రభుత్వం హామీ ► వాస్తు వల్లే కూల్చేస్తున్నామన్నది అవాస్తవమన్న ఏజీ ► తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వలేమన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాలను తదుపరి విచారణ వరకు కూల్చబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. వాస్తు కారణంగా సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. అగ్నిప్రమాద నివారణ సౌకర్యాలు లేకపోవడం, భద్రతాపరమైన లోపాలు, తగి నంత పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తది తర కారణాలవల్లే సచివాలయం కూల్చి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించామంది. కూల్చివేత విషయంలో ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో సచివాలయ తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందు కు నిరాకరించింది. సచివాలయం తరలింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, కనుక ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు కు పది రోజుల గడువునిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేమెలా జోక్యం చేసుకుంటాం? సచివాలయం విషయంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఫలానా భవనం అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని తాము ఇక్కడ (కోర్టులో) కూర్చొని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. ఇందుకు సత్యంరెడ్డి స్పందిస్తూ.. ‘వాళ్లు అక్కడ (సచివాలయంలో) కూర్చొని చెబుతున్నప్పుడు మీరు (న్యాయమూర్తులు) ఇక్కడ కూర్చొని చెప్పడంలో తప్పులేదు’ అన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తోందన్నారు. అయితే తమకు సచివాలయం తరలింపుతో ఎంత మాత్రం సంబంధం లేదని, కేవలం భవనాల కూల్చివేతపైనే విచారణ చేపడుతామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ప్రస్తుత భవనాలు అత్యంత పురాతనమైనవన్నారు. అగ్నిప్రమాద నివారణ సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని, అలాగే భద్రతాపరంగా పలు లోపాలున్నాయని, పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు లేవని వీటన్నింటి కారణంతోనే ప్రస్తుత భవనాలను కూల్చి, కొత్త వాటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. వాస్తు కారణంతో భవనాలను కూల్చేస్తున్నామనడం ఎంత మాత్రం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సచివాలయంలోని తమకు కేటాయించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిందా? అని ప్రశ్నించింది. అప్పగింతపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నట్లు లేదని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘సచివాలయ భవనాలను రేపే కూల్చేస్తున్నారని పిటిషనర్లు చెబుతున్నారు. ఇది నిజమేనా?’ అని అడిగింది. ఇందుకు ఓ పది రోజుల పాటు కూల్చివేతలు చేపట్టబోమని ఆయన బదులిచ్చారు. హేతుబద్ధత ఉండాలి సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్‌కు చెందిన తేరా రజనీకాంత్‌రెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సచివాలయ భవనాలు పటిష్టంగా ఉన్నాయని, కొన్నింటిని ఇటీవలే నిర్మించారని, అయినా వాటన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు వాస్తును ప్రధాన కారణంగా చెబుతున్నారని, దీనిపై పత్రికల్లో విస్తృతంగా కథనాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో సహేతుకత, హేతుబద్ధత ఉండాలన్నారు. రంగులు పులమొద్దు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ.. సచివాలయ భవనాలను ఇవ్వరాదని ఏపీ నిర్ణయించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఏపీ మంచి నిర్ణయమే తీసుకుందని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనం అడ్డుతగులుతూ.. ఈ వ్యవహారానికి ఎలాంటి రంగులూ పులమవద్దని హితవు పలికింది. వ్యక్తుల గురించి మాట్లాడాలంటే అందుకు కోర్టులను వేదిక చేసుకోవద్దని స్పష్టం చేసింది. మేం చేసేదీ ప్రజా ప్రయోజనాల కోసమే... ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకోవడానికి సచివాలయం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ప్రజల ఆస్తి అని సత్యంరెడ్డి వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. ఏపీ తన సచివాల యాన్ని అమరావతికి మార్చుకుంది. అక్కడికి వెళ్లే లోపు ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఇవన్నీ తప్పవు. కూల్చివేతలు గానీ, తరలింపు గానీ చట్ట విరుద్ధమని చెప్పండి. ఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుం దో చూపండి. మేం జోక్యం చేసుకుంటాం’ అని స్పష్టం చేసింది. సచివాలయ కొత్త భవనాల నిర్మాణం కూడా ప్రజా ప్రయోజనాల్లో భాగమేనని ఏజీ చెప్పారు. ఈ సమయంలో సచివాలయం తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సత్యంరెడ్డి కోరినా ధర్మాసనం నిరాకరించింది. కూల్చివేతలపై ధర్మాసనం స్పష్టత కోరగా.. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఉండబోమని ఏజీ హామీ ఇచ్చారు. దీనిపై పది రోజుల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. -
నా ఇంట్లోనూ ఇంకుడు గుంత లేదు
- అందువల్ల ఈ అంశంపై పిటిషన్ విచారించలేనన్న ఏసీజే - ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే కేసు విచారణ సాక్షి, హైదరాబాద్: తన ఇంట్లో ఇంకుడుగుంత లేదని.. అందువల్ల ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యాజ్యాన్ని ప్రస్తుతం విచారించలేనని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే సంబంధిత వ్యాజ్యాన్ని విచారించడం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. తనది చిన్న ఇల్లు అని, ఇంకుడుగుంత ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియదని, ఎవరిని సంప్రదించాలో చెప్పాలని పిటిషనర్, జీహెచ్ఎంసీల తరఫు న్యాయవాదులను కోరారు. నివాస గృహాలన్నింటిలోనూ శాశ్వత ప్రాతిపదికన ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి పరిరక్షణ నిమిత్తం అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ నిబంధనలు, జీవో 350 ప్రకారం ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.వైదేహిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏసీజే తన ఇంట్లో ఇంకుడు గుంత లేని విషయాన్ని ప్రస్తావించారు. తన ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నాకే ఈ వ్యాజ్యాన్ని విచారించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంకుడు గుంత ఏర్పాటుకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలని.. నిబంధనల ప్రకారం ఇంకుడు గుంత ఏర్పాటుకు ఎంత వసూలు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో ఆ బాధ్యత తాను తీసుకుంటానని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ కోరిన విధంగా కార్యాచరణ ప్రణాళికను సమర్పించేందుకు ధర్మాసనం మూడు వారాల గడువునిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
అనుమతి లేకుండా రైతుల భూముల్లోకి వెళ్లొద్దు
అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐఎస్) రీ డిజైనింగ్ పేరుతో రైతుల భూముల్లో వారి అనుమతి లేకుండా ఎలాంటి సర్వే నిర్వహించరాదని హైకోర్టు సోమవారం రెవెన్యూ అధికారులను, నవయుగ కంపెనీ సిబ్బందిని ఆదేశించింది. రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ సర్వే చేయాలనుకుంటే చట్ట నిబంధనలకు లోబడి ఆ ప్రక్రియను పూర్తి చేయాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ఎల్ఐఎస్ రీ డిజైనింగ్‌లో భాగంగా తమ భూముల్లో నవయుగ కంపెనీ సర్వే నిర్వహిస్తోందని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రైతులు అప్పీల్ దాఖలు చేయగా సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది శశికిరణ్ వాదనలు వినిపిస్తూ సర్వే విషయంలో పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడం గానీ, వారి అనుమతి తీసుకోవడంగానీ చేయలేదన్నారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది టి.శరత్, నవయుగ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. -
చిన్నారుల కోసం ప్రత్యేక కోర్టు
-ప్రారంభించిన హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేష్ రంగనాథన్ -చిన్నారులు భయం లేకుండా సాక్ష్యం ఇవ్వవచ్చు : డీజీపీ సాక్షి, హైదరాబాద్ అఘాయిత్యాలకు గురయ్యే చిన్నారులు...నిర్భయంగా, స్వేచ్ఛగా సాక్ష్యం ఇచ్చేందుకు వీలుగా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం ప్రారంభించారు. జస్టిస్ ఫర్ కేర్, తెలంగాణ సీఐడీ, నాంపల్లి క్రిమినల్ కోర్టులు సంయుక్తంగా ఈ కోర్టును ఏర్పాటు చేశాయి. చిన్నారులు ఎటువంటి భయానికిలోనుకాకుండా అహ్లాదకరమైన వాతావరణలో స్వేచ్ఛగా సాక్ష్యం ఇచ్చేలా కోర్టును రూపొందించారని ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. చిన్నారులు భయపడకుండా సాక్ష్యం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక కోర్టు ఎంతో దోహదపడుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది బంధువులు, బాగా తెలిసిన వారే ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో చిన్నారులు వారిని కోర్టు హాల్లో చూస్తూ స్వేచ్ఛగా సాక్ష్యం చెప్పలేకపోతున్నారని, దీంతో మెజారిటీ కేసులు వీగిపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా కోర్టుల్లో చిన్నారులు నిర్భయంగా సాక్ష్యం ఇవ్వడం ద్వారా నేరం రుజువై నిందితులకు 100 శాతం శిక్షలుపడేలా చేయవచ్చన్నారు. పోలీసు శాఖలో కేవలం 5 శాతం మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నారని, త్వరలో చేపట్టబోయే నియామకాల్లో 33 శాతం పోస్టులను మహిళలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సివిల్ దుస్తుల్లోనే న్యాయమూర్తి, న్యాయవాదులు, ఇతర సోషల్ వర్కర్ వీరి నుంచి సమాచారాన్ని సేకరిస్తారని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని పేర్కొన్నారు. నిందితులను చూసి బాధిత చిన్నారులు భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నిందితుడు...చిన్నారి ఇచ్చే సాక్ష్యాన్ని వినే ఏర్పాటు చేశామన్నారు. జంట నగరాల పరిధిలోని న్యాయమూర్తులు శ్రమ, సమయం వృధా అనుకోకుండా చిన్నారుల సాక్ష్యాన్ని ఈకోర్టుకే వచ్చి నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1640 పోస్కో చట్టం కింద నమోదైన కేసులు విచారణలో ఉన్నాయన్నారు. చిన్నారులు స్వేచ్ఛగా సాక్ష్యం ఇవ్వాలంటే ఈ తరహా కోర్టులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా సూచించారు. ఢిల్లీలో 4, గోవాలో 1 కోర్టు చిన్నారుల కోసం పనిచేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పాటు చేసింది 6వ కోర్టు అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కోర్టుకు సరైన సౌకర్యాలు లేవని, సౌకర్యాలను మెరుగుపర్చాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, చక్రవర్తి, సుదర్శన్, డ్యానీరూత్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, ఉపాధ్యక్షులు నారాయణ, తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిది.. చిన్నారులను ఆకట్టుకునేలా రంగురంగులూ, ఆటబొమ్మలూ ఏర్పాటు చేశారు. భారత దేశంలో గోవా, ఢిల్లీ తర్వాత దక్షిణ భారతేదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా కోర్టు హాల్‌ను రంగురంగులతో తీర్చిదిద్దారు. అలాగే చిన్నారులు అడుకునేందుకు వారికి అటబొమ్మలూ ఏర్పాటు చేశారు.