రైతు సమితులపై వివరణ ఇవ్వండి | Give explanation on farmers' sets | Sakshi
Sakshi News home page

రైతు సమితులపై వివరణ ఇవ్వండి

Published Wed, Sep 13 2017 2:46 AM | Last Updated on Mon, Oct 1 2018 4:15 PM

రైతు సమితులపై వివరణ ఇవ్వండి - Sakshi

రైతు సమితులపై వివరణ ఇవ్వండి

కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం
► రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పిల్‌ దాఖలు
► అవి రాజ్యాంగేతర యంత్రాంగమని ఆరోపణ


సాక్షి, హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటితో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను మూడు వారాలకు వాయిదావేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ అధికారం ప్రభుత్వానికి లేదు..
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిమిత్తం జారీ చేసిన జీవో 39ను సవాలు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల రైతు చింపుల సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యు.మనోహర్‌రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు.

రైతులకు ఒక్కో సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. తగిన సిఫా రసులు చేసే బాధ్యతలను రైతు సమన్వయ సమితులకు అప్పగించిందని కోర్టుకు వివరిం చారు. అయితే ఈ రైతు సమన్వయ సమితుల ను నామినేట్‌ చేసేది మంత్రులేనని.. ప్రజా విధులను నిర్వర్తించేందుకు ఇలా రాజ్యాంగేతర యంత్రాంగాన్ని సృష్టించే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇలా సమితులు ఏర్పాటు చేయకుండా రాజ్యాం గంలో ఎక్కడా నిషేధం లేదని, నిషేధముంటే చూపాలని పేర్కొంది.

దీంతో రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులను మంత్రులు నామినేట్‌ చేయడమన్నది అధికార దుర్వినియోగమే అవుతుందని న్యాయవాదులు వివరించగా... మంత్రులకు ఇలాంటి బాధ్యతలు అప్పగించ కూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టులో కూర్చుని తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని... కోర్టులు ఏ విషయాల్లో అయితే జోక్యం చేసుకోరాదో ఆ విషయాల్లో జోక్యం చేసుకో వాలంటూ కోరుతున్నారని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది..
తిరిగి పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ... గ్రామస్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పంచాయతీలు ఉన్నాయని, ఇప్పుడు రైతు సమితుల ఏర్పా టుతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కోర్టుకు నివేదిం చారు. అంతేగా కుండా ఈ రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం ఈ రూ.500 కోట్లపై ప్రభుత్వ వివరణ కోరింది.

దీనికి అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి సమా ధానమిస్తూ.. రైతులు పండించిన కొన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) దక్కడం లేదని, వారికి కనీస మద్దతు ధర అందించేందుకే రూ.500 కోట్లు కేటాయిం చామని వివరించారు. రాష్ట్రస్థాయిలో ఇంకా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కాలేదని, అది ఏర్పాటయ్యే వరకు నిధులను వ్యయం చేయబోమన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సిఫారసుల మేరకు రాష్ట్ర స్థాయి సమితి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు వ్యవ హారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement