సాక్షి, హైదరాబాద్: పుట్టబోయేది ఆడ బిడ్డని తెలిసి పిండ దశలోనే ప్రాణం తీసేస్తున్న ఘటనలపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పిండాన్ని చిదిమేయడానికి చేతులెలా వస్తున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పిటిషనర్ చెబుతున్న వివరాలు వింటుంటే హృదయం ద్రవిస్తోందని, ఈ ఘాతుకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టరాదని స్పష్టం చేసింది. దీనిపై లోతుగా విచారించి వాస్తవాల్ని నిగ్గు తేల్చాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్ హోంలో చట్ట వ్యతిరేకంగా భ్రూణ హత్యలు పాల్పడుతున్నారంటూ అంబర్‌పేట్‌కు చెందిన సందీప్‌యాదవ్ హైకోర్టు లో దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి గాయత్రి నర్సింగ్‌హోంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, నర్సింగ్ హోం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. నర్సింగ్ హోంలో పనిచేసే సూపర్‌వైజరే వైద్యురాలిగా చలామణి అవుతూ గర్భస్రావాలు చేసేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ దారుణాల నుంచి తప్పించుకునేందుకు నర్సింగ్ హోం నిర్వాహకులు పిటిషనర్‌పై పోలీసు కేసు నమోదు చేశారని చెప్పారు. గర్భాన్ని చేతితో చిదిమేశారని, దీనికి సంబంధించిన వీడియో రికార్డు తన వద్ద ఉందని చెప్పారు.
పిటిషనర్ చెబుతున్న వీడియో రికార్డు ఉన్న పెన్ డ్రైవ్‌ను పరిశీలించి ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని తెలంగాణ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా, మానవత్వానికే మాయని మచ్చలాంటి దారుణాలకు పాల్పడటం నిజమైతే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో వివరించాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించింది.
గర్భస్థ పిండాన్ని చిదిమేస్తారా?: హైకోర్టు
Published Wed, Apr 4 2018 2:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment