సాక్షి, హైదరాబాద్: పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిసి పిండ దశలోనే చిదిమేసిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను చూసే శక్తి తమకు లేదింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మహిళేనని తెలిసి విస్తుపోయింది. ఆ మహిళపై చర్య తీసుకోడానికి పోలీసులు మీనమేషాలు లెక్కించడంపై మండిపడింది.
మానవత్వానికే మాయని మచ్చలాంటి ఇలాంటి ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పిండాన్ని చిదిమేసిన మహిళ, ఆమెకు సహకరించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలధర్మాసనం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
ఆమె ఎక్కడుందో కూడా తెలియదా?
సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో ఉన్న గాయత్రి నర్సింగ్ హోంలో చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడపిల్లేనని తేలితే పిండ దశలోనే చిదిమేస్తున్నారంటూ అంబర్‌పేట్‌కు చెందిన ఆర్.సందీప్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని, నర్సింగ్ హోంలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న మహిళ వైద్యురాలిగా అవతారమెత్తి గర్భస్రావాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన పిటిషనర్‌పైనే పోలీసు కేసు పెట్టించారని సందీప్ తరఫు న్యాయవాది ఎస్.ఆర్.సంకు వాదించారు.
ఆడ బిడ్డ అని పరీక్షల్లో తేలిన తర్వాత వైద్యురాలి అవతారంలో ఉన్న సర్వారి ఉన్రిసా అనే మహిళ పిండాన్ని చిదిమేసిన వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను వైద్య, ఆరోగ్య/హోం శాఖల తరఫున వాదించే ప్రభుత్వ న్యాయవాదులకు అందజేశారు. ఆ వీడియో ఆధారాలతో పిండా న్ని చిదిమేసిన మహిళపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది.ఆమెను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది.
వచ్చే విచారణకు పూర్తి వివరాలతో కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయాలని, లేకుంటే 17న నగర పోలీస్ కమిషనర్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదుల వాదనల సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ‘‘నర్సింగ్ హోం నిర్వా హకులు ఫిర్యాదు చేస్తే పిటిషనర్‌పై కేసు నమో దు చేస్తారా? భ్రూణ హత్య చేసిన వారిపై పిటి షనర్ వివరాలిస్తే చర్యలు తీసుకోలేరా? పిండా న్ని చిదిమేయడం నిజమేనని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నప్పుడు ఆ నేరం చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఇది పోలీసులు, ఇతర అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. మేం మళ్లీ ఆదేశించే వరకూ నర్సింగ్ హోం నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకోండి’’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment