Fetal murder
-
భ్రూణ హత్య వీడియో చూసే శక్తి మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిసి పిండ దశలోనే చిదిమేసిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను చూసే శక్తి తమకు లేదింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మహిళేనని తెలిసి విస్తుపోయింది. ఆ మహిళపై చర్య తీసుకోడానికి పోలీసులు మీనమేషాలు లెక్కించడంపై మండిపడింది. మానవత్వానికే మాయని మచ్చలాంటి ఇలాంటి ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పిండాన్ని చిదిమేసిన మహిళ, ఆమెకు సహకరించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలధర్మాసనం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఆమె ఎక్కడుందో కూడా తెలియదా? సైదాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో ఉన్న గాయత్రి నర్సింగ్ హోంలో చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడపిల్లేనని తేలితే పిండ దశలోనే చిదిమేస్తున్నారంటూ అంబర్‌పేట్‌కు చెందిన ఆర్.సందీప్ యాదవ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని, నర్సింగ్ హోంలో సూపర్వైజర్గా చేస్తున్న మహిళ వైద్యురాలిగా అవతారమెత్తి గర్భస్రావాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన పిటిషనర్‌పైనే పోలీసు కేసు పెట్టించారని సందీప్ తరఫు న్యాయవాది ఎస్.ఆర్.సంకు వాదించారు. ఆడ బిడ్డ అని పరీక్షల్లో తేలిన తర్వాత వైద్యురాలి అవతారంలో ఉన్న సర్వారి ఉన్రిసా అనే మహిళ పిండాన్ని చిదిమేసిన వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను వైద్య, ఆరోగ్య/హోం శాఖల తరఫున వాదించే ప్రభుత్వ న్యాయవాదులకు అందజేశారు. ఆ వీడియో ఆధారాలతో పిండా న్ని చిదిమేసిన మహిళపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది.ఆమెను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. వచ్చే విచారణకు పూర్తి వివరాలతో కౌంటర్ వ్యాజ్యం దాఖలు చేయాలని, లేకుంటే 17న నగర పోలీస్ కమిషనర్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదుల వాదనల సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ‘‘నర్సింగ్ హోం నిర్వా హకులు ఫిర్యాదు చేస్తే పిటిషనర్‌పై కేసు నమో దు చేస్తారా? భ్రూణ హత్య చేసిన వారిపై పిటి షనర్ వివరాలిస్తే చర్యలు తీసుకోలేరా? పిండా న్ని చిదిమేయడం నిజమేనని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నప్పుడు ఆ నేరం చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఇది పోలీసులు, ఇతర అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. మేం మళ్లీ ఆదేశించే వరకూ నర్సింగ్ హోం నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకోండి’’ అని స్పష్టం చేసింది. -
గర్భంలో గోల్డ్
120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఐదుగురు భరతమాత ఆడబిడ్డలు పతకాలు సాధించారు. మన ఆడపిల్ల గోల్డ్ గెలవాలంటే... ముందు తల్లి గర్భంలో గెలవాలేమో! భ్రూణ హత్య అంటే.. కడుపులో బంగారాన్ని ఖూనీ చేయడమే. భరతమాత ముద్దుబిడ్డలైన బంగారు తల్లులను హత్య చేయడమే. ఆడపిల్లలను బతికించుకుంటే... ఆడపిల్లలను చదివించుకుంటే.. ఆడపిల్లలను ఆటలు ఆడనిస్తే... దేశమాత మెడలో కీర్తిప్రతిష్టల మెడల్ వేస్తారని తాజాగా సాక్షి, సింధు నిరూపించారు. ఇకనుంచి... ఇప్పటి నుంచి ఆడపిల్లలను కాపాడుకుందాం. గర్భంలోని మన బంగారాలను పండించుకుందాం. ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. ఎక్కడా అంటే ఎక్కడో రియోలో! ఇంతకు మించి ఎవరికీ ఏ ఇంట్రెస్టూ లేదు. దేశం చప్పగా ఉంది. పేపర్ చూడ్డం, పతకాల లిస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, జపాన్.. కనిపించడం. అంతవరకే! మనవాళ్లు ఆడుతున్నా.. మనవి కాలేకపోతున్నాయి ఒలింపిక్స్. ఒక్కరైనా గెలుస్తుంటే కదా!! అప్పుడే రెండు వారాలు గడిచిపోయాయి. ఇంకో రెండుమూడు రోజులు గడిస్తే రియో ఖాళీ. అక్కడ ఒక్క సంచలనం లేదు. ఇక్కడ ఇండియాలో చలనం లేదు. అప్పుడొచ్చింది సాక్షి! సాక్షి మలిక్!! హర్యానా అమ్మాయి. ఇండియాకు మెడల్ తెచ్చింది. ఇండియా మెడలో వేసింది! స్వర్ణమా? రజతమా? కాంస్యమా అన్నది తర్వాత. ముందైతే అది పతకం. రియో ఒలింపిక్స్‌తో భారత్‌కు తొలి పతకం. ఒక మహిళ సాధించిన పతకం! ‘‘ఒక ఆడపిల్లను కడుపులోనే చంపేయకపోతే, ఏం సాధించగలుగుతుందో సాక్షి మనకు చెప్పింది. రియోలో భారత్ చేతులెత్తేస్తున్న సమయంలో ఒక ఆడపిల్ల మన పరువు నిలబెట్టింది’’ - అని క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. దేశం కదిలిపోయింది! ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలన్న ప్రేరణను ఆ ట్వీట్ కలిగించింది. రియోకి బయల్దేరడానికి వారం ముందు... సాక్షి మాలిక్ తన ఫొటో ఒకటి ఫ్రేమ్ కట్టించి, ఇంట్లో గోడకు తగిలించింది. ఆమె నిలబడి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మువ్వన్నెల జెండా కనిపిస్తూ ఉంటుంది. ఆ జెండా పై ‘ఐ విల్ విన్’ అనే అక్షరాలు ఉంటాయి. గెలుస్తానని చెప్పి మరీ వెళ్లి ఒలింపిక్స్‌లో గెలిచింది సాక్షి. పతకం సాధించుకొచ్చింది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ‘ఐ విల్ విన్’ అంటుంది సాక్షి! ఇంత కాన్ఫిడెన్స్, ఇంత నమ్మకం.. తమ కూతుళ్లపై ఈ దేశంలో ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది?! ప్రభుత్వాలు మాత్రం? ఏనాడైనా అవి క్రీడల్లో మహిళల ప్రతిభను, శక్తిసామర్థ్యాలను తమంతట తాముగా గుర్తించి ప్రోత్సహించాయా? అమ్మాయిలు కష్టపడి సాధించుకొస్తే అప్పటికప్పుడు వారిని ప్రశంసించడం, సన్మానించడం, వరాలు కురిపించడం తప్ప... క్రీడల్లో వాళ్లను కార్యసాధకులుగా మలిచేందుకు అవసరమైన ఒక శాశ్వతమైన పథకం, ప్రణాళిక లేదా ఒక ఉద్యమం లాంటిది ఏదైనా ఉందా? బేటీ బచావో... బేటీ పడావో ‘ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లల్ని చదివించండి’ అనే నినాదంతో భారత ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ప్రారంభ నిధితో 2015 జనవరి 22న ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలో నానాటికీ తగ్గిపోతున్న స్త్రీ జననాలను పెంచి, స్త్రీల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయడం ఈ ఉద్యమం లక్ష్యం. 2001 జనాభా లెక్కల ప్రకారం 0-6 ఏళ్ల వయసు మధ్య.. భారత్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 927 గా ఉన్న అమ్మాయిల సంఖ్య... 2011 లెక్కల నాటికి 918కి క్షీణించడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీ దేశ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని కూడా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఫలితమే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ఉద్యమ నినాదం. ఇందులో భాగంగానే తొలి విడతగా బాలబాలికల నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉన్న 100 జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో భ్రూణ హత్యల్ని తగ్గించడం ద్వారా బాలబాలికల జననాలను సమస్థాయికి తెచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలు పెట్టింది. రెండు ఉద్యమాలూ హర్యానావే! ‘సెల్ఫీ విత్ డాటర్’ మొదలైన బీబీపూర్ హర్యానాలోని గ్రామం. ‘బేటీ బచావో... బేటీ పడావో’ మొదలైన పానిపట్ కూడా హర్యానాలోనిదే. హర్యానాలో ఇలాంటి విప్లవాత్మకమైన సాంఘిక పరివర్తన ఉద్యమాలు ప్రారంభం అవడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆడపిల్లల సంరక్షణ, సంక్షేమాల విషయంలో హర్యానా మిగతా రాష్ట్రాల కన్నా కాస్త వెనకే ఉంది. భ్రూణ హత్యలు, బాలికల పెంపకంలో వివక్ష కారణంగా అప్రతిష్టలో అనేక ‘పతకాలను’ హర్యానా ఇప్పటికే మెడలో వేసుకుంది. ఆ హర్యానా నుంచే ఇప్పుడు సాక్షి మలిక్ అనే అమ్మాయి ఒలింపిక్ పతకం సాధించి ఆడపిల్లల ఘనతను ఇంటింటికీ చాటింది! ఆడపిల్లలను కడుపులోనే చంపేయకపోతే మనం ఎన్ని కోల్పోకుండా ఉంటామో ఈ ఒక్క గెలుపుతో దేశానికి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడిక... బేటీ ఖిలావో! ఆడపిల్లను కాపాడాలి. ఆడపిల్లను చదివించాలి.అక్కడితో సరిపోదు.. ఆడపిల్లను ఆడనివ్వాలి. చిన్నప్పుడు గుండెల మీద ఆడించడం మన సంతోషం కోసం. తనను ఆడనివ్వడం మాత్రం పూర్తిగా ఆమె సంతోషం కోసం, ఆమె సంకల్పం కోసమే మాత్రమే జరగాలి. సాక్షి మలిక్ని చిన్నప్పుడు రొహ్టక్లోని సర్ చోటా రామ్ స్టేడియంకి టూర్‌కి తీసుకెళ్లినప్పుడు టీచర్లు ఆమెకు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ ఆటల్ని చూపించారు. అవేవీ సాక్షిని ఆకర్షించలేదు. ఈలోపు కొంత మంది అబ్బాయిలు రంగురంగుల కోట్లు వేసుకుని స్టేడియంలోకి వచ్చారు. వారంతా రెజ్లర్లు! సాక్షి ఎక్సైట్ అయిపోయింది. ‘‘అమ్మా.. నేనది నేర్చుకుంటా’’ అంది. ‘‘అమ్మాయిలకు ఆ ఆట కష్టం తల్లీ’’ అని చెప్పింది తల్లి. సాక్షి వినలేదు. ఎప్పటికైనా నేను రెజ్లర్‌ని అయి తీరుతా అని పట్టుపట్టింది. సాక్షి తాతగారు కుస్తీ యోధుడు. ఆయన్ని అందరూ ‘‘పెహల్వాన్ జీ నమస్తే’’ అని భక్తిభావంతో అభివాదం చేయడం చిన్నారి సాక్షి ఎన్నోసార్లు అబ్బురంగా చూసింది. అది ఆమె మనసులో బలంగా ఉండిపోయింది. ఆడబిడ్డ అని చూడకుండా అమె మనసును గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పడానికి తాజా నిదర్శనం సాక్షి విజయం. గత ఫిబ్రవరిలో జాట్ల రిజర్వేషన్ అల్లర్లతో హింసాత్మకంగా మారిపోయి, నేటికీ పొగలు కక్కుతున్న హర్యానాలో ఇప్పుడు ప్రతి ఇల్లూ... ఇంట్లో ఆడపిల్లకు ఇవ్వవలసిన రిజర్వేషన్ గురించి ఆలోచిస్తోంది! బహుశా త్రిపురలో, తెలుగు రాష్టాల్లో ఇంటింటా ఇదే ఆలోచన ఉండొచ్చు. ఓడినా... అది గెలుపే! త్రిపుర అమ్మాయి దీపాకర్మాకర్కు రియో ఒలింపిక్స్‌లో ఏ పతకమూ రాలేదు. కానీ అత్యంత ప్రమాదకరమైన జిమ్నాస్ట్ విన్యాసం.. ‘ప్రోడునోవా’ను విజయవంతంగా ప్రదర్శించడమే ఆమె తన దేశానికి అందించిన బంగారు పతకం! ఒలింపిక్స్‌కి వెళ్లిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా దీపాకర్మాకర్ గుర్తింపు పొందినట్లే... తొలి మహిళా జిమ్నాస్ట్‌గా కూతుర్ని ఒలింపిక్స్‌కి పంపగలిగినందుకు ఆమె తల్లిదండ్రులూ యావత్ దేశానికీ గుర్తుండిపోతారు. మన బంగారం సింధు ఇక బాడ్మింటన్‌లో రజత పతక విజేత పి.వి. సింధు పేరెంట్స్ అయితే... ‘బేటీ ఖిలావో..’ అనే సరికొత్త నినాదానికి తెలుగు రాష్ట్రాల అనధికార ‘బ్రాండ్ అంబాసిడర్’ లు అయిపోయారు! ‘‘ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి’’ అని సాక్షి ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు తల్లి విజయ యావద్దేశానికీ అంతర్లీన సందేశం ఇచ్చారు. అవును. ఇంటింటా మొక్కలా... ప్రతి ఇంటా ఆడపిల్ల ఉండాలి. ఆ పిల్లను బతకనివ్వాలి. చదవనివ్వాలి. ఆడనివ్వాలి. అప్పుడే ఇంటికీ ఆరోగ్యం. దేశానికీ సౌభాగ్యం. సెల్ఫీ విత్ డాటర్ బేటీ బచావో... బేటీ పడావో’ మొదలైన ఆరు నెలలకు.. 2015 జూన్‌లో సోషల్ మీడియాలో ‘సెల్ఫీ విత్ డాటర్’ అనే ఉద్యమం ప్రారంభమైంది! అకస్మాత్తుగా మొదలై, వేగంగా విస్తరించిన స్త్రీ సంక్షేమ నినాదం అది. దాని సృష్టికర్త బీబీపూర్ గ్రామ సర్పంచ్ సునీల్ జగ్లాన్. కూతురు నందినితో తీసుకున్న సెల్ఫీని జూన్ 19న ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రపంచం దృష్టిలో... ముఖ్యంగా ప్రధాని మోదీ దృష్టిలో పడ్డారు. ప్రశంసలు అందుకున్నారు. అదే స్ఫూర్తితో సునీల్ ‘సెల్ఫీ ఎగైన్స్ట్ డౌరీ’ అనే మరో ఉద్యమాన్ని ప్రారంభించారు. అవివాహిత యువతీయువకులు తమ సెల్ఫీలతో ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే సెల్ఫీ ఎగైన్స్ట్ డైరీ. డాటర్స్ డే... డాటర్స్ వీక్ కేంద్ర మంత్రి మనేకాగాంధీ ఈ ఆగస్టు 11న ‘డాటర్స్ డే’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 11న డాటర్స్ డే. 11 నుంచి ఏడు రోజుల పాటు ‘డాటర్స్ వీక్’. మీ కోడళ్లు, మనవరాళ్లతో ఫొటోలు దిగి, వాటిని ట్వీట్ చెయ్యండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మనేకా. ఆడపిల్ల విలువలను గుర్తించి, సమాజంలో ఆమె ఎదుగుదలకు ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పడమే ‘డాటర్స్ డే’ ముఖ్యోద్దేశం. ‘బేటీ బచావో...’ ఉద్యమాన్ని మొత్తం మూడు శాఖలు పర్యవేక్షిస్తుంటాయి.. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర మానవ వనరుల శాఖ. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మనేకా గాంధీ చొరవ చూపి, ‘డాటర్స్ డే’ని ప్రారంభించారు. మహిళలే మన ఆశా దీపాలు! ఎప్పటికైనా వనితలే మన దేశానికి ఘనత అని రియో ఒలింపిక్స్‌తో రుజువైంది! సానియా మీర్జా, దీపా కర్మాకర్, లలితా బాబర్, సైనా నెహ్వాల్ రియోలో పతకాలు తేలేకపోవచ్చు. కానీ వారి ఫైటింగ్ స్పిరిట్.. పతకానికి ఏ మాత్రం తక్కువ కానిది! అంతేకాదు, క్రీడల్లో భారతీయ పురుషులతో పోలిస్తే... భారతీయ స్త్రీలే ప్రపంచ దేహ ప్రమాణాలకు దగ్గరగా ఉంటున్నారని స్పోర్ట్స్ సైంటిస్టులు చెబుతున్నారు. పి.టి ఉష.. కరణం మల్లీశ్వరి : 1984లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పరుగుల రాణి పి.టి. ఉష వెంట్రుకవాసిలో 400 మీ. హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నారు. కానీ ఆ ఈవెంట్‌తో ఆమె ప్రపంచ క్రీడా పటంలో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. 25 ఏళ్ల తర్వాత కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి భారతీయ మహిళల్లో అంతర్లీనంగా ఉండే శక్తికి లిఫ్ట్ ఇచ్చారు. భారతీయ క్రీడాకారిణుల వెయిట్ పెంచారు. తర్వాత సైనా నెహ్వాల్. తర్వాత మేరీ కోమ్. ఇప్పుడు సాక్షి, సింధు. వీళ్లంతా రగిలించిన స్ఫూర్తి భారతీయ క్రీడా జ్యోతిని కలకాలం వెలిగిస్తూనే ఉంటుంది. ఒక జ్యోతి నుంచి మరో జ్యోతి ప్రజ్వలన జరుగుతూనే ఉంటుంది. -
'ఆడ' పుట్టుకే శాపమా
♦ కడుపులోనే తుంచడమో.. కని వదిలేయడమో! ♦ పెంచే స్థోమతలేదని అమ్ముకోవడమో.. ♦ ఏటికేడు తగ్గుతున్న ఆడ శిశువుల సంఖ్య ప్రపంచ చరిత్ర పురుడుపోసుకునేది ఆమె గర్భంలోనే. సమాజానికి మార్గదర్శకులు పెరిగేది ఆమె పొత్తిళ్లలోనే. సాంకేతికతకు పరుగులు నేర్పే శాస్త్రవేత్తలు నడకలు నేర్చేది ఆమె నీడలోనే.. అనితర సాధ్యమైన సవాళ్లకు ఎదురొడ్డి ఆకాశంలో సగమంటూ మగవారికి దీటుగా మహిళలు దూసుకెళుతున్నారు. ఎవరెస్టంత ఎత్తు ఎదిగినా.. అంతరిక్షాన్ని చుట్టివస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నా.. సమాజంలో ఆమెపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కొందరు కడుపులోనే తుంచుతుంటే, మరికొందరు ఆడశిశువు నేలపై పడగానే ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో వదిలివెళుతున్నారు. ఇంకొందరు అమ్ముకుంటున్నారు. ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షపై ఫోకస్.. - కామారెడ్డి ‘‘కటిక దరిద్రం.. ఉండడానికి ఇల్లులేదు. కరువు వల్ల చేయడానికి పని లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ఒక ఆధార్ కార్డు తప్ప మా వద్ద ఇంకేం లేదు. మాకు ఇప్పటికే ఇద్దరు అడపిల్లలు.. మరో అడ పిల్ల పుట్టింది. వారిని ఎలా పెంచాలో తెలియలేదు. పసిపాపను తీసుకెళ్లి బోధన్‌లో భిక్షాటన చేశాం. ఇల్లు కూడా గడవడం కష్టమవడంతో నెలన్నర పాపను అమ్ముకోవాలనుకున్నాం’’ ఇది అంతాపూర్ తండాకు చెందిన శాంతాబాయి, మోహన్ దంపతుల ఆవేదన. ఈ శిశువు విక్రయాన్ని ఇటీవల ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇది వెలుగులోకి వచ్చింది.. వెలుగులోకి రాని పసిబిడ్డల అమ్మకాలెన్నో.. - వర్ని జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు.. ♦ వర్ని మండలం అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఒక పాపను అమ్మేందుకు ప్రయత్నించారు. ♦ లింగంపేట మండలం కన్నాపూర్ తండాకు చెందిన లక్ష్మీబాయి, విఠల్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారసుడికోసం మరో కాన్పు కోసం వేచిచూశారు. గతేడాది నాలుగో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. నలుగురు ఆడపిల్లలను ఎలా సాకేదంటూ అమ్మకానికి పెట్టగా.. అప్పట్లో అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు నచ్చజె ప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో పిల్లలను శిశువిహార్‌కు తరలించారు. ♦ లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన శమంత, సర్దార్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మూడో కాన్పులోనూ ఆడ పిల్లే జన్మించింది. శిశువును విక్రయించే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. పడిపోతున్న నిష్పత్తి ♦ జనాభాలో ఆడ, మగ నిష్పత్తి సమానంగా ఉండాలి. కానీ ఆడపిల్లలపై వివక్ష కారణంగా ఈ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోంది. భ్రూణహత్యలు, శిశుహత్యలతో భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. జిల్లా జనాభాను పరిశీలిస్తే వివక్ష ఎలా ఉందో స్పష్టమవుతోంది. ♦ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 25,51,335. ఇందులో మహిళలు 13,00,694 మంది కాగా పురుషులు 12,50,641 మంది. ఈ లెక్కల ప్రకారం మహిళల జనాభా ఎక్కువగా ఉంది. కానీ ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. బాలికల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ♦ జిల్లాలో పిల్లల సంఖ్య 2,82,417 మంది కాగా.. అందులో మగ పిల్లలు 1,44,977 మంది, ఆడపిల్లలు 1,37,440 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 50 వేలపైచిలుకు మహిళలు ఎక్కువగా ఉంటే, పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్లల సంఖ్య 7,500 తక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదమే.. పుష్కర కాలం తర్వాత మగవారికి పెళ్లి కావడం గగనమే.. వారసత్వం కొడుకుకేనా? సమాజంలో వారసత్వం అంటే కొడుకుకే అన్న భావన ఎక్కువగా ఉంది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం ద్వారా ఆమె తమ వంశం నుంచి మరో వంశంలోకి అడుగుపెడుతుందని, తద్వారా ఆమె తమకు వారసురాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. నిరక్షరాస్యులే కాదు చదువుకున్న వారూ ఈ భావనతోనే ఉన్నారు. దానికితోడు పేదరికం, ఆడ, మగ సమానమన్న అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించే యంత్రాంగం కూడా లేకపోవడంతో ఆడపిల్లలపై వివక్ష అంతం కావడంలేదు. కొందరు చదువుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారు. కుమారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్న తల్లిదండ్రులు.. బిడ్డలను మాత్రం సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆడపిల్లల్ని కాపాడుకుందాం కూతురును భారంగా భావించే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు లేకుండా మానవాళి ఉనికిలో ఉండగలదా అని ప్రశ్నించుకోవాలి. ఆడపిల్లలపై వివక్షకు ఫలితాలను ఇప్పటికే అనుభవిస్తున్నాం. చాలామంది పెళ్లీడుకొచ్చిన మగవారికి వధువులు దొరకడం లేదు. ఇది ఆడపిల్లలపై వివక్ష ఫలితమేనన్నది కాదనలేని సత్యం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.. రాబోయే పది, పదిహేనేళ్ల కాలంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఊహించడం కష్టమేం కాదు.. ఆడపిల్లల్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకనబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడపిల్లల్ని వద్దనుకుంటే రేపటికి మనుగడే లేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ’పై నిషేధం ఉన్నా.. ఆడపిల్లలంటే భారమనే భావనతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టేది ఆడపిల్లని తెలియగానే చాలా మంది గర్భంలోనే పిండాలను చిదిమేస్తున్నారు. ఫలితంగా బాలికల సంఖ్య ఏడాదికేడాది పడిపోతోంది. భ్రూణహత్యలు పెరుగుతుండడంతో 1994లో కేంద్ర ప్రభుత్వం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గర్భస్థ పిండానికి కొన్ని పద్ధతుల ద్వారా నిర్ధారణకు ఈ చట్టం అవకాశం కల్పించింది. మిగిలిన ఏ సందర్భంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టం ప్రకారం కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం సరిగా అమలు కావడం లేదు. స్కానింగ్ కేంద్రాల వద్ద లింగనిర్ధారణ పరీక్షలు నేరమనే బోర్డులుంటాయి. అయినా.. డబ్బులకోసం కక్కుర్తితో చాలా కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కక్కుర్తి ఆడజాతికి శాపంగా మారింది. ప్లస్సూ -మైనస్ భావన పోవాలి నిరక్షరాస్యులు, పేదరికంలో మగ్గేవారు అవగాహన లేక ఆడపిల్లలను వద్దనుకుంటుంటే.. చదువుకున్న వారు మాత్రం ఆడపిల్లను మైనస్ అని, మగపిల్లవాడిని ప్లస్ అని భావిస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లను చదివించి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయాలని, మగపిల్లాడైతే చదివిస్తే చాలు ఏ ఖర్చు ఉండదనే భావనతో మరికొందరున్నారు. పిల్లలెందరని ఎవరైనా అడిగితే.. ‘వన్ ప్లస్ వన్ మైనస్’ అనో.. ‘రెండూ ప్లస్లే అనో.. ‘టూ మైనస్’ అనో చెబుతూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగిస్తున్నారు. విద్యాధిక కుటుంబాల్లో ఈ భావన ఎక్కువగా ఉంది. కాలువలు, ముళ్లపొదలపాలు.. ఎన్నో అడ్డంకులను అధిగమించి నేలపై అడుగిడిన ఆడ శిశువులను కొందరు తల్లిదండ్రులు భారంగా భావించి మురికి కాలువలు, ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే చాలు ఎలాగోలా వదిలించుకోవాలనే భావనతో గుట్టుచప్పుడు కాకుండా వదిలివెళుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని మురికి కాలువలో గతేడాది నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు కనిపించాయి. ఓ చోట కొనప్రాణంతో ఉన్న శిశువును గుర్తించి కాపాడారు. నిజామాబాద్ నగరంలో కవల ఆడ పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆస్పత్రిలోనే వదిలి మాయమయ్యారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలోనూ గతేడాది ఓ ఆడశిశువును పాడుబడ్డ బావిలో వదిలివెళ్లారు. శిశువు ఏడుపును విని గ్రామస్తులు కాపాడారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. -
పైసలే పరమావధి
► అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో నిబంధనల ఉల్లంఘన ► అబార్షన్’ సమాచారంతో వైద్యాధికారుల తనిఖీ ► సదరు గర్భిణికి సర్వజనాస్పత్రిలో వైద్యపరీక్షలు ► గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు నిర్ధారణ ► భ్రూణ హత్యగా అనుమానం అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైసలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భ్రూణహత్యలకు సైతం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’లో జరిగిన ఘటన ఈ అనుమానాలను బలపరుస్తోంది.గార్లదిన్నె ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఇర్షాద్ అహమ్మద్ పేరుకు ప్రభుత్వ వైద్యుడైనా సేవ మాత్రం ప్రైవేట్‌లోనే. ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’ను ఈయనే నెలకొల్పారు. పైగా ఈ ఆస్పత్రిలో కనీన నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి గైనిక్ విభాగంలో వైద్యురాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ లక్ష్మీకాంత కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వజనాస్పత్రిలోనే విధులు నిర్వర్తించాలి. కానీ ఈమె మధ్యాహ్నం 12 గంటల నుంచే అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటానంటూ బోర్డు పెట్టుకుని మరీ వైద్యం చేస్తున్నారు. ఆదివారం జిల్లా వైద్యాధికారుల తనిఖీలో ఈ విషయాలు బట్టబయలయ్యాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి శనివారం ‘అహ్మద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’కు వెళ్లింది. అప్పటికే ఆమెకు రెండేళ్ల కుమార్తె ఉంది. కడుపునొప్పి కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెబుతున్నా.. లింగ నిర్ధారణ చేసి ఆడశిశువని తేలితే అబార్షన్ చేయించుకోవాలనేది ప్లాన్. ఈ విషయం ఓ వ్యక్తికి తెలియడంతో చైల్డ్‌లైన్ -1098కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైద్యాధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది తదితర వివరాలేవీ రికార్డుల్లో లేవు. ఆపరేషన్లు ఎవరు చేస్తున్నారన్న సమాచారం కూడా లేదు. సుమారు 13 రికార్డులను తనిఖీ చేయగా అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగి పేరు, చిరునామా తప్పిస్తే వారికి అందించిన వైద్య సేవలు నమోదు చేయలేదు. ఆస్పత్రిలో మెడికల్ స్టోర్ లేకపోయినా రెండు గదుల్లో మందులు నిల్వ చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అంటే కనీసం 20 పడకలుండాలి. కానీ పది పడకలు కూడా కన్పించలేదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం డాక్టర్ లక్ష్మీకాంత పేరుమీద రిజిస్టరైంది. ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న ఈమె అనుమతి తీసుకున్న చోట కాకుండా మరో చోట పరీక్షలు చేస్తున్నట్లు వెలుగు చూసింది. గత ఏడాది జులై నుంచి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసినా అవి ఎవరికి చేశారు.. ఆ ఆస్పత్రికి వారిని ఎవరు రెఫర్ చేశారన్న వివరాలను పొందుపరచలేదు. ప్రస్తుతం చికిత్సకు వచ్చిన మహిళకు సంబంధించిన కేస్ షీట్లో కూడా వైద్యపరమైన వివరాలేవీ లేవు. దీంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ట్రాసౌండ్ యంత్రం, మరికొన్ని పరికరాలు సీజ్ చేసి.. ఎగ్జామినేషన్ గదికి తాళం వేశారు. తనిఖీల్లో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డెమో హరిలీలాకుమారి, చైల్డ్‌లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమాచారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రమణ్యం, హెల్ప్ జిల్లా కో ఆర్డినేటర్ కొండప్ప, హెచ్ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గర్భంలోనే మృతి చెందిన శిశువు అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గర్భిణికి బ్లీడింగ్ జరుగుతుండటంతో ఆమెను ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రేడియాలజిస్టులు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డ్యూటీ డాక్టర్లు పరీక్షించి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయితే గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బాధితురాలు, ఆమె భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు తెలియజేశారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ వైద్యులకు సూచించారు. కాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ ఆస్పత్రిలో హడావుడి చేశారు. సదరు మహిళను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వాగ్వాదానికి దిగారు.అయితే.. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ రాజకీయం చేయొద్దని డీఎంహెచ్ఓ సూచించడం వారు వెనుదిరిగారు. -
భ్రూణ హత్యలకు అడ్డేది...?
ఖమ్మం వైరారోడ్ : భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాల అమలులో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. లింగ నిర్ధారణనిషేధ చట్టం అమలు విషయంలో తీసుకున్న చర్యలు, వాటివల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దశలో జిల్లాలో ఈ చట్టం ఏమేరకు అమలవుతోంది, ఇందుకోసం అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటో పరిశీలిద్దాం... పురుషుల కంటే మహిళల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గర్భంలోనే శిశువును గుర్తించి అమ్మాయి అయితే అంతం చేస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ఉద్యమాలు చేపట్టినా.. భ్రూణహత్యల నివారణకు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నెలకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అన్ని స్థాయిల అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేయడం లేదని, ఇందుకోసం నిర్వహించే డెకాయి ఆపరేషన్‌కు వారు ముందుకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఆడపిల్ల అని తేలితే ఇక్కడే ఆబార్షన్ చేయించుకుంటున్నారని సమాచారం. డెకాయి ఆపరేషన్లు నిల్... లింగ నిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో తరచూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించాలి. జిల్లాలో సంబంధిత అధికారులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఫలితంగా పలువురు రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారి ఆధ్వర్యంలో రహస్యంగా డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తారు. దానికి కొందరు సిబ్బందిని ఒక టీంగా ఏర్పాటు చేసి స్కానింగ్ సెంటర్ల వద్ద నిఘా పెట్టిస్తారు. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చినట్లు నటించి, ముందుగానే తాము ఏర్పాటు చేసిన దంపతులను స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. పరీక్షలు చేయించుకునే వారి వద్ద డబ్బు తీసుకుని లింగ నిర్ధారణకు అంగీకరిస్తే వారిని చాకచక్యంగా వల పన్ని పట్టుకోవడాన్ని డెకాయి ఆపరేషన్ అంటారు. అలా చేయటం వల్ల ఈ హత్యలను చాలా వరకు నివారించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జయకుమార్ కొంత మేర చట్టం అమలుపై దృష్టి సారించారు. డెకాయి ఆపరేషన్ నిర్వహించి లిగనిర్దారణ చేస్తున్న ఓ వైద్యుడిని పట్టుకోవడంతో పాటు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. నిబంధనల అమలేది..? లింగ నిర్ధారణకు పాల్పడితే చేసిన వారికి, చేసుకున్నవారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుంది. మొద టి సారి చట్ట పరిధిలో చేసిన తప్పుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత అదే నేరానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలి. లింగ నిర్ధారణ చేసిన సంబంధిత సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి. అయితే గత రెండేళ్లుగా డెకాయి ఆపరేషన్ నిర్వహించకపోవటంతో స్కానింగ్ సెంటర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏం జరుగుతోంది... చట్టం ప్రకారం అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వద్ద నిర్దేశించిన రుసుముతో తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జిల్లాలో ఇప్పటి వరకు 101 స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెపుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్షలు చేయించు కోవడానికి చట్టం అనుమతిస్తుంది. జన్యు సంబంధమైన, గర్భస్థ శిశువుకు సంబంధించిన వ్యాధులు కనుగొనడానికి అల్ట్రా సౌండ్, స్కానింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. రెండుసార్లు, అంత కంటె ఎక్కువ సార్లు గర్భ స్రావం జరిగినప్పుడు, గర్భిణి, ఆమె భర్త కుటుంబీకులలో ఎవరికైనా మానసిక బుద్ధి మాంద్యం, శారీరక వైక ల్యం, జన్యు సంబంధిత వ్యాధులు కలిగి నప్పుడు మాత్రమే గర్భస్థ పిండానికి పరీక్షలు చేయించు కోవాలని చ ట్టం చెబుతోంది. కానీ చట్టాన్ని రక్షించాల్సిన ఆరోగ్యశాఖ మొద్దునిద్ర పోతుండటంతో పలు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం.