ఖమ్మం వైరారోడ్ : భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాల అమలులో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. లింగ నిర్ధారణనిషేధ చట్టం అమలు విషయంలో తీసుకున్న చర్యలు, వాటివల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈ దశలో జిల్లాలో ఈ చట్టం ఏమేరకు అమలవుతోంది, ఇందుకోసం అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటో పరిశీలిద్దాం...
పురుషుల కంటే మహిళల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గర్భంలోనే శిశువును గుర్తించి అమ్మాయి అయితే అంతం చేస్తున్నారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ఉద్యమాలు చేపట్టినా.. భ్రూణహత్యల నివారణకు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ చట్టాలు అక్రమార్కులకు చుట్టాలుగా మారాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నెలకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, అన్ని స్థాయిల అధికారులకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్‌లను తనిఖీ చేయడం లేదని, ఇందుకోసం నిర్వహించే డెకాయి ఆపరేషన్‌కు వారు ముందుకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాతోపాటు వరంగల్, నల్గొండ, కృష్ణా జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఆడపిల్ల అని తేలితే ఇక్కడే ఆబార్షన్ చేయించుకుంటున్నారని సమాచారం.
డెకాయి ఆపరేషన్లు నిల్...
లింగ నిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో తరచూ డెకాయి ఆపరేషన్లు నిర్వహించాలి. జిల్లాలో సంబంధిత అధికారులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఫలితంగా పలువురు రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారి ఆధ్వర్యంలో రహస్యంగా డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తారు. దానికి కొందరు సిబ్బందిని ఒక టీంగా ఏర్పాటు చేసి స్కానింగ్ సెంటర్ల వద్ద నిఘా పెట్టిస్తారు.
స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చినట్లు నటించి, ముందుగానే తాము ఏర్పాటు చేసిన దంపతులను స్కానింగ్ సెంటర్‌కు పంపిస్తారు. పరీక్షలు చేయించుకునే వారి వద్ద డబ్బు తీసుకుని లింగ నిర్ధారణకు అంగీకరిస్తే వారిని చాకచక్యంగా వల పన్ని పట్టుకోవడాన్ని డెకాయి ఆపరేషన్ అంటారు. అలా చేయటం వల్ల ఈ హత్యలను చాలా వరకు నివారించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జయకుమార్ కొంత మేర చట్టం అమలుపై దృష్టి సారించారు. డెకాయి ఆపరేషన్ నిర్వహించి లిగనిర్దారణ చేస్తున్న ఓ వైద్యుడిని పట్టుకోవడంతో పాటు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు.
నిబంధనల అమలేది..?
లింగ నిర్ధారణకు పాల్పడితే చేసిన వారికి, చేసుకున్నవారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవుతుంది. మొద టి సారి చట్ట పరిధిలో చేసిన తప్పుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత అదే నేరానికి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలి. లింగ నిర్ధారణ చేసిన సంబంధిత సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి. అయితే గత రెండేళ్లుగా డెకాయి ఆపరేషన్ నిర్వహించకపోవటంతో స్కానింగ్ సెంటర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఏం జరుగుతోంది...
చట్టం ప్రకారం అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వద్ద నిర్దేశించిన రుసుముతో తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జిల్లాలో ఇప్పటి వరకు 101 స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెపుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్షలు చేయించు కోవడానికి చట్టం అనుమతిస్తుంది. జన్యు సంబంధమైన, గర్భస్థ శిశువుకు సంబంధించిన వ్యాధులు కనుగొనడానికి అల్ట్రా సౌండ్, స్కానింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
రెండుసార్లు, అంత కంటె ఎక్కువ సార్లు గర్భ స్రావం జరిగినప్పుడు, గర్భిణి, ఆమె భర్త కుటుంబీకులలో ఎవరికైనా మానసిక బుద్ధి మాంద్యం, శారీరక వైక ల్యం, జన్యు సంబంధిత వ్యాధులు కలిగి నప్పుడు మాత్రమే గర్భస్థ పిండానికి పరీక్షలు చేయించు కోవాలని చ ట్టం చెబుతోంది. కానీ చట్టాన్ని రక్షించాల్సిన ఆరోగ్యశాఖ మొద్దునిద్ర పోతుండటంతో పలు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం.
భ్రూణ హత్యలకు అడ్డేది...?
Published Thu, Sep 18 2014 2:19 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement