ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: మహిళలపై అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. మొన్న నిర్భయ, నిన్న అభయ ఘటనలు మరువక ముందే ఖమ్మంజిల్లా కేంద్రంలో ఓ యువతిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి దుండగులు యత్నించారు. వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన ఓ యువతి(19) ఖమ్మంలోని త్రీటౌన్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ప్రతీ రోజు షాపు మూసివేసిన తర్వాత ఆ యువతిని షాపు యజమానురాలు బస్టాండ్ వరకు తీసుకువచ్చి బస్ ఎక్కించి వెళ్లేది. మంగళవారం రాత్రి పని ఒత్తిడి కారణంగా ఆమె రాకపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో యువతి ఒంటరిగా వెళ్లేందుకు షాపు ఎదుట ఆటో కోసం వేచి ఉంది.
అదే సమయంలో ఓ ఆటో రావడం, అందులో ఓ మహిళ కూడా ఉండడంతో ఎక్కింది. ఆ ఆటో అక్కడ నుంచి గాంధీచౌక్, కాల్వొడ్డు, మయూరి సెంటర్ బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా మయూరిసెంటర్‌లో మరో వ్యక్తి ఎక్కాడు. అక్కడి నుంచి బస్టాండ్ సెంటర్‌లో ఆటో ఆపకుండా వెళ్తుండడంతో ఆ యువతి కేకలు వేసింది. దీంతో ఆటోలో ఉన్న మహిళతో పాటు మరో వ్యక్తి యువతి నోరు మూశారు. ఖమ్మంనగర సమీపంలోని గోపాలపురం వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించారు. అప్పటికే భయపడిన యువతికి నోరు, ముక్కుల నుంచి రక్తం వచ్చి స్ఫృహ కోల్పోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆ ముగ్గురు యువతి చెవి దిద్దులు(సుమారు రూ.6వేలు) తీసుకుని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్పృహలోకి వచ్చిన ఆ యువతి రోడ్డుపైకి వచ్చి బాటసారులకు విషయం చెప్పడంతో వారు బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని ఖానాపురం హవేలీ(అర్బన్) పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విషయం తెలిపారు. ఈ కేసు తమ పరిధి కాదని త్రీటౌన్ పోలీసుల పరిధిలోకి వస్తుందని వారిని పోలీసు వాహనంలో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విషయంపై త్రీటౌన్ పోలీసులను వివరణ కోరగా వారు తమకు ఫిర్యాదు ఇవ్వలేదని, కేసు వద్దని వెళ్లిపోయారని తెలిపారు.