సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్ ఏసీపీ ప్రసన్నకుమార్
ఖమ్మంఅర్బన్ : నగరంలోని కొత్తగూడెంలో మూడు రోజులు క్రితం చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు లైంగిక దాడి చేశారు. వారిని గురువారం అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు ఖమ్మం ఇన్‌చార్జి ఏసీపీ, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, అర్బన్ సీఐ నాగేంద్రచారి తెలిపారు. గురువారం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మవద్దన్నారు. నమ్మినవారే ఇలాంటి దారుణాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇంటర్రెట్ చౌకగా రావడంతో నీలి చిత్రాలను వయస్సుతో సంబంధం లేకుండా చూడటం ఎక్కువగా ఉందన్నారు. వాటిని చూసి చిన్న వయస్సు దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారే ఉంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను... బంధువులైనా సరే, వారి వెంట ఒంటరిగా పంపకూడదని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లితండ్రులు నిరంతరం దృష్టి సారించాలన్నారు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ వెంకటనర్సయ్య, త్రీటౌన్ సీఐ వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment