'ఆడ' పుట్టుకే శాపమా | yearly gross down Number of female infants | Sakshi
Sakshi News home page

'ఆడ' పుట్టుకే శాపమా

Published Sat, Jun 18 2016 4:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

'ఆడ' పుట్టుకే శాపమా

'ఆడ' పుట్టుకే శాపమా

కడుపులోనే తుంచడమో.. కని వదిలేయడమో!
పెంచే స్థోమతలేదని అమ్ముకోవడమో..
ఏటికేడు తగ్గుతున్న ఆడ శిశువుల సంఖ్య

ప్రపంచ చరిత్ర పురుడుపోసుకునేది ఆమె గర్భంలోనే. సమాజానికి మార్గదర్శకులు పెరిగేది ఆమె పొత్తిళ్లలోనే. సాంకేతికతకు పరుగులు నేర్పే  శాస్త్రవేత్తలు నడకలు నేర్చేది ఆమె నీడలోనే.. అనితర సాధ్యమైన సవాళ్లకు ఎదురొడ్డి ఆకాశంలో సగమంటూ మగవారికి దీటుగా మహిళలు దూసుకెళుతున్నారు. ఎవరెస్టంత ఎత్తు ఎదిగినా.. అంతరిక్షాన్ని చుట్టివస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నా.. సమాజంలో ఆమెపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కొందరు కడుపులోనే తుంచుతుంటే, మరికొందరు ఆడశిశువు నేలపై పడగానే ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో వదిలివెళుతున్నారు. ఇంకొందరు అమ్ముకుంటున్నారు. ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షపై ఫోకస్..
- కామారెడ్డి

‘‘కటిక దరిద్రం.. ఉండడానికి  ఇల్లులేదు. కరువు వల్ల చేయడానికి పని లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ఒక ఆధార్ కార్డు తప్ప మా వద్ద ఇంకేం లేదు. మాకు ఇప్పటికే ఇద్దరు అడపిల్లలు.. మరో అడ పిల్ల పుట్టింది. వారిని ఎలా పెంచాలో తెలియలేదు. పసిపాపను తీసుకెళ్లి బోధన్‌లో భిక్షాటన చేశాం. ఇల్లు కూడా గడవడం కష్టమవడంతో నెలన్నర పాపను అమ్ముకోవాలనుకున్నాం’’ ఇది అంతాపూర్ తండాకు చెందిన శాంతాబాయి, మోహన్ దంపతుల ఆవేదన. ఈ శిశువు విక్రయాన్ని ఇటీవల ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇది వెలుగులోకి వచ్చింది..  వెలుగులోకి రాని పసిబిడ్డల అమ్మకాలెన్నో..   - వర్ని

జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు..
వర్ని మండలం అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఒక పాపను అమ్మేందుకు ప్రయత్నించారు.

లింగంపేట మండలం కన్నాపూర్ తండాకు చెందిన లక్ష్మీబాయి, విఠల్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారసుడికోసం మరో కాన్పు కోసం వేచిచూశారు. గతేడాది నాలుగో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. నలుగురు ఆడపిల్లలను ఎలా సాకేదంటూ అమ్మకానికి పెట్టగా.. అప్పట్లో అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు నచ్చజె ప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో పిల్లలను శిశువిహార్‌కు తరలించారు.

లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన శమంత, సర్దార్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మూడో కాన్పులోనూ ఆడ పిల్లే జన్మించింది. శిశువును విక్రయించే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు.

 పడిపోతున్న నిష్పత్తి
జనాభాలో ఆడ, మగ నిష్పత్తి సమానంగా ఉండాలి. కానీ ఆడపిల్లలపై వివక్ష కారణంగా ఈ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోంది. భ్రూణహత్యలు, శిశుహత్యలతో భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. జిల్లా జనాభాను పరిశీలిస్తే వివక్ష ఎలా ఉందో స్పష్టమవుతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 25,51,335. ఇందులో మహిళలు 13,00,694 మంది కాగా పురుషులు 12,50,641 మంది. ఈ లెక్కల ప్రకారం మహిళల జనాభా ఎక్కువగా ఉంది. కానీ ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. బాలికల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

జిల్లాలో పిల్లల సంఖ్య 2,82,417 మంది కాగా.. అందులో మగ పిల్లలు 1,44,977 మంది, ఆడపిల్లలు 1,37,440 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 50 వేలపైచిలుకు మహిళలు ఎక్కువగా ఉంటే, పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్లల సంఖ్య 7,500 తక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదమే.. పుష్కర కాలం తర్వాత మగవారికి పెళ్లి కావడం గగనమే..

 వారసత్వం కొడుకుకేనా?
సమాజంలో వారసత్వం అంటే కొడుకుకే అన్న భావన ఎక్కువగా ఉంది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం ద్వారా ఆమె తమ వంశం నుంచి మరో వంశంలోకి అడుగుపెడుతుందని, తద్వారా ఆమె తమకు వారసురాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. నిరక్షరాస్యులే కాదు చదువుకున్న వారూ ఈ భావనతోనే ఉన్నారు. దానికితోడు పేదరికం, ఆడ, మగ సమానమన్న అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించే యంత్రాంగం కూడా లేకపోవడంతో ఆడపిల్లలపై వివక్ష అంతం కావడంలేదు. కొందరు చదువుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారు. కుమారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్న తల్లిదండ్రులు.. బిడ్డలను మాత్రం సర్కారు బడికి పంపిస్తున్నారు.

 ఆడపిల్లల్ని కాపాడుకుందాం
కూతురును భారంగా భావించే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు లేకుండా మానవాళి ఉనికిలో ఉండగలదా అని ప్రశ్నించుకోవాలి. ఆడపిల్లలపై వివక్షకు ఫలితాలను ఇప్పటికే అనుభవిస్తున్నాం. చాలామంది పెళ్లీడుకొచ్చిన మగవారికి వధువులు దొరకడం లేదు. ఇది ఆడపిల్లలపై వివక్ష ఫలితమేనన్నది కాదనలేని సత్యం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.. రాబోయే పది, పదిహేనేళ్ల కాలంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఊహించడం కష్టమేం కాదు.. ఆడపిల్లల్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకనబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడపిల్లల్ని వద్దనుకుంటే రేపటికి మనుగడే లేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి.

 ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ’పై నిషేధం ఉన్నా..
ఆడపిల్లలంటే భారమనే భావనతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టేది ఆడపిల్లని తెలియగానే చాలా మంది గర్భంలోనే పిండాలను చిదిమేస్తున్నారు. ఫలితంగా బాలికల సంఖ్య ఏడాదికేడాది పడిపోతోంది. భ్రూణహత్యలు పెరుగుతుండడంతో 1994లో కేంద్ర ప్రభుత్వం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గర్భస్థ పిండానికి కొన్ని పద్ధతుల ద్వారా నిర్ధారణకు ఈ చట్టం అవకాశం కల్పించింది. మిగిలిన ఏ సందర్భంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టం ప్రకారం కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం సరిగా అమలు కావడం లేదు. స్కానింగ్ కేంద్రాల వద్ద లింగనిర్ధారణ పరీక్షలు నేరమనే బోర్డులుంటాయి. అయినా.. డబ్బులకోసం కక్కుర్తితో చాలా కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కక్కుర్తి ఆడజాతికి శాపంగా మారింది.

ప్లస్సూ -మైనస్ భావన పోవాలి
నిరక్షరాస్యులు, పేదరికంలో మగ్గేవారు అవగాహన లేక ఆడపిల్లలను వద్దనుకుంటుంటే.. చదువుకున్న వారు మాత్రం ఆడపిల్లను మైనస్ అని, మగపిల్లవాడిని ప్లస్ అని భావిస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లను చదివించి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయాలని, మగపిల్లాడైతే చదివిస్తే చాలు ఏ ఖర్చు ఉండదనే భావనతో మరికొందరున్నారు. పిల్లలెందరని ఎవరైనా అడిగితే.. ‘వన్ ప్లస్ వన్ మైనస్’ అనో.. ‘రెండూ ప్లస్‌లే అనో.. ‘టూ మైనస్’ అనో చెబుతూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగిస్తున్నారు. విద్యాధిక కుటుంబాల్లో ఈ భావన ఎక్కువగా ఉంది.

 కాలువలు, ముళ్లపొదలపాలు..
ఎన్నో అడ్డంకులను అధిగమించి నేలపై అడుగిడిన ఆడ శిశువులను కొందరు తల్లిదండ్రులు భారంగా భావించి మురికి కాలువలు, ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే చాలు ఎలాగోలా వదిలించుకోవాలనే భావనతో గుట్టుచప్పుడు కాకుండా వదిలివెళుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని మురికి కాలువలో గతేడాది నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు కనిపించాయి. ఓ చోట కొనప్రాణంతో ఉన్న శిశువును గుర్తించి కాపాడారు. నిజామాబాద్ నగరంలో కవల ఆడ పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆస్పత్రిలోనే వదిలి మాయమయ్యారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలోనూ గతేడాది ఓ ఆడశిశువును పాడుబడ్డ బావిలో వదిలివెళ్లారు. శిశువు ఏడుపును విని గ్రామస్తులు కాపాడారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement