చిన్నారి హత్యను నిరసిస్తూ లక్నోలో కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న యూనివర్సిటీ విద్యార్థులు
అలీగఢ్ (యూపీ)/ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేయడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ వ్యక్తి రూ.10 వేలు అప్పు తీర్చలేదనే కారణంతో దుండగులు అభం శుభం తెలియని అతడి కుమార్తె (రెండున్నరేళ్లు)ను గొంతు పిసికి, కనుగుడ్లు పెరికి చంపి చెత్తకుప్పలో పారేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసింది.
టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు.
రాహుల్, ప్రియాంక దిగ్భ్రాంతి
‘మనిషనే వారెవరైనా చిన్నారులపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?. పోలీసులు సత్వరం స్పందించి దోషులకు శిక్షలు పడేలా చూడాలి’ అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన అమానవీయమని ప్రియాంకగాంధీ అన్నారు. ‘అందరూ సిగ్గుపడాల్సిన∙ఘటన’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్‌కుమార్, అభిషేక్, షబనా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment