ఒంగోలు / కందుకూరు: అభం శుభం తెలియని ఓ చిన్నారి అనుమానస్పద మృతి పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై దెబ్బలతో కాళ్లు కట్టేసి బావిలో పడేసిన స్థితిలో చిన్నారిని స్థానికులు గుర్తించారు. స్థానికులు. కానీ, అంతలోనే గుట్టుచప్పుడు కాకుండా బంధువులు మృతదేహాన్ని ఖననం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సాయంత్రం వెలుగుచూసిన ఈ సంఘటన కందుకూరు పట్టణంలోని బూడిదపాలెంలో జరిగింది. ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన పోలీసులు చిన్నారి మృతి మిష్టరీని చేధించే పనిలో పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బూడిపాలేనికి చెందిన షేక్ బషీర్, బషీరున్ దంపతుల కుమార్తె నేహా(7). తండ్రి బషీర్ ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కుమార్తె తల్లి బషీరున్ వద్దే ఉంటుంది. అయితే ప్రతి రోజు పగలు మొత్తం వీరి ఇంటికి సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి నేహా వెళ్తూ ఉంటుంది. పగలంతా అక్కడే ఉండి తిరిగి రాత్రి పడుకునే సమయానికి తల్లి వద్దకు వస్తుంటుంది. అయితే మంగళవారం నేహా అమ్మమ్మ వద్దకు వెళ్లలేదు. ఎంత సేపు చూసినా మనువరాలు రాకపోవడంతో ఇంటికి దగ్గర ఉందేమోనని తీసుకెళ్లేందుకు మధ్యహ్నం సమయంలో కుమార్తె ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే నేహా బావిలో శవమై తేలింది.
దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ సయమంలో నేహా కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పాటు, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో చిన్నారి నేహా మృతి మిస్టరీగా మారింది. ఈ సంఘటన బయటకు పొక్కకుండా మృతురాలి బంధువులే జాగ్రత్త పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేహ మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. దీంతో స్థానికులు జరిగిన సంఘటనపై పరిష్కార వేదిక సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి మంగళవారం రాత్రి పోలీసులు చేరుకున్నారు. నేడు తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తల్లిపైనే అనుమానం...
చిన్నారి నేహా మృతిపై ఆమె తల్లి బషీరున్‌పైనే స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేహాతో కలిసి బూడిదపాలెంలోనే ఆమె నివాసం ఉంటుంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా ఉండదని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి ఏమైనా చేసిందా, లేక వేరొకరి ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్ల బాలికను కాళ్లు చేతులు కట్టేసి బావిలో వేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే విషయాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment