పైసలే పరమావధి | Ahmed, a multi-specialty hospital in violation | Sakshi
Sakshi News home page

పైసలే పరమావధి

Published Mon, Apr 4 2016 4:35 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

పైసలే పరమావధి - Sakshi

పైసలే పరమావధి

అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో నిబంధనల ఉల్లంఘన
అబార్షన్’ సమాచారంతో వైద్యాధికారుల తనిఖీ
సదరు గర్భిణికి  సర్వజనాస్పత్రిలో వైద్యపరీక్షలు  
గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు నిర్ధారణ
భ్రూణ హత్యగా అనుమానం

 
అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైసలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భ్రూణహత్యలకు సైతం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నగరంలోని  రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’లో జరిగిన ఘటన ఈ అనుమానాలను బలపరుస్తోంది.గార్లదిన్నె ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఇర్షాద్  అహమ్మద్ పేరుకు ప్రభుత్వ వైద్యుడైనా సేవ మాత్రం ప్రైవేట్‌లోనే.  ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’ను ఈయనే  నెలకొల్పారు. పైగా ఈ ఆస్పత్రిలో కనీన నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి గైనిక్ విభాగంలో వైద్యురాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ లక్ష్మీకాంత కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వజనాస్పత్రిలోనే విధులు నిర్వర్తించాలి. కానీ ఈమె మధ్యాహ్నం 12 గంటల నుంచే అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటానంటూ బోర్డు పెట్టుకుని మరీ వైద్యం చేస్తున్నారు. ఆదివారం జిల్లా వైద్యాధికారుల తనిఖీలో ఈ విషయాలు బట్టబయలయ్యాయి.


అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి శనివారం  ‘అహ్మద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’కు వెళ్లింది. అప్పటికే ఆమెకు రెండేళ్ల కుమార్తె ఉంది. కడుపునొప్పి కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెబుతున్నా.. లింగ నిర్ధారణ చేసి ఆడశిశువని తేలితే అబార్షన్ చేయించుకోవాలనేది ప్లాన్. ఈ విషయం ఓ వ్యక్తికి తెలియడంతో చైల్డ్‌లైన్ -1098కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైద్యాధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేశారు. 

ఇక్కడ వైద్యులు, సిబ్బంది తదితర వివరాలేవీ రికార్డుల్లో లేవు. ఆపరేషన్లు ఎవరు చేస్తున్నారన్న సమాచారం కూడా లేదు. సుమారు 13 రికార్డులను తనిఖీ చేయగా అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగి పేరు, చిరునామా తప్పిస్తే వారికి అందించిన వైద్య సేవలు నమోదు చేయలేదు. ఆస్పత్రిలో మెడికల్ స్టోర్ లేకపోయినా రెండు గదుల్లో మందులు నిల్వ చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అంటే కనీసం 20 పడకలుండాలి. కానీ పది పడకలు కూడా కన్పించలేదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం డాక్టర్ లక్ష్మీకాంత పేరుమీద రిజిస్టరైంది.  ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న ఈమె అనుమతి తీసుకున్న చోట కాకుండా మరో చోట పరీక్షలు చేస్తున్నట్లు వెలుగు చూసింది. గత ఏడాది జులై నుంచి అల్ట్రాసౌండ్  పరీక్షలు చేసినా అవి ఎవరికి చేశారు..

ఆ ఆస్పత్రికి వారిని ఎవరు రెఫర్ చేశారన్న వివరాలను పొందుపరచలేదు. ప్రస్తుతం చికిత్సకు వచ్చిన మహిళకు సంబంధించిన కేస్ షీట్‌లో కూడా వైద్యపరమైన వివరాలేవీ లేవు. దీంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ట్రాసౌండ్ యంత్రం, మరికొన్ని పరికరాలు సీజ్ చేసి.. ఎగ్జామినేషన్ గదికి తాళం వేశారు. తనిఖీల్లో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డెమో హరిలీలాకుమారి, చైల్డ్‌లైన్  1098 జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమాచారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రమణ్యం, హెల్ప్ జిల్లా కో ఆర్డినేటర్ కొండప్ప, హెచ్‌ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  
 
 గర్భంలోనే మృతి చెందిన శిశువు
అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గర్భిణికి బ్లీడింగ్ జరుగుతుండటంతో ఆమెను ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రేడియాలజిస్టులు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డ్యూటీ డాక్టర్లు పరీక్షించి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయితే గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బాధితురాలు, ఆమె భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణకు తెలియజేశారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ వైద్యులకు సూచించారు. కాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ ఆస్పత్రిలో హడావుడి చేశారు. సదరు మహిళను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వాగ్వాదానికి దిగారు.అయితే.. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ రాజకీయం చేయొద్దని డీఎంహెచ్‌ఓ సూచించడం వారు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement