గర్భంలో గోల్డ్
120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఐదుగురు భరతమాత ఆడబిడ్డలు పతకాలు సాధించారు.
మన ఆడపిల్ల గోల్డ్ గెలవాలంటే...
ముందు తల్లి గర్భంలో గెలవాలేమో!
భ్రూణ హత్య అంటే.. కడుపులో బంగారాన్ని ఖూనీ చేయడమే.
భరతమాత ముద్దుబిడ్డలైన బంగారు
తల్లులను హత్య చేయడమే.
ఆడపిల్లలను బతికించుకుంటే...
ఆడపిల్లలను చదివించుకుంటే..
ఆడపిల్లలను ఆటలు ఆడనిస్తే...
దేశమాత మెడలో కీర్తిప్రతిష్టల మెడల్ వేస్తారని తాజాగా సాక్షి, సింధు నిరూపించారు.
ఇకనుంచి... ఇప్పటి నుంచి ఆడపిల్లలను కాపాడుకుందాం.
గర్భంలోని మన బంగారాలను పండించుకుందాం.
ఒలింపిక్స్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. ఎక్కడా అంటే ఎక్కడో రియోలో! ఇంతకు మించి ఎవరికీ ఏ ఇంట్రెస్టూ లేదు. దేశం చప్పగా ఉంది. పేపర్ చూడ్డం, పతకాల లిస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, జపాన్.. కనిపించడం. అంతవరకే! మనవాళ్లు ఆడుతున్నా.. మనవి కాలేకపోతున్నాయి ఒలింపిక్స్. ఒక్కరైనా గెలుస్తుంటే కదా!! అప్పుడే రెండు వారాలు గడిచిపోయాయి. ఇంకో రెండుమూడు రోజులు గడిస్తే రియో ఖాళీ. అక్కడ ఒక్క సంచలనం లేదు. ఇక్కడ ఇండియాలో చలనం లేదు.
అప్పుడొచ్చింది సాక్షి! సాక్షి మలిక్!! హర్యానా అమ్మాయి. ఇండియాకు మెడల్ తెచ్చింది. ఇండియా మెడలో వేసింది! స్వర్ణమా? రజతమా? కాంస్యమా అన్నది తర్వాత. ముందైతే అది పతకం. రియో ఒలింపిక్స్‌తో భారత్‌కు తొలి పతకం. ఒక మహిళ సాధించిన పతకం!
‘‘ఒక ఆడపిల్లను కడుపులోనే చంపేయకపోతే, ఏం సాధించగలుగుతుందో సాక్షి మనకు చెప్పింది. రియోలో భారత్ చేతులెత్తేస్తున్న సమయంలో ఒక ఆడపిల్ల మన పరువు నిలబెట్టింది’’ - అని క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. దేశం కదిలిపోయింది! ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలన్న ప్రేరణను ఆ ట్వీట్ కలిగించింది.
రియోకి బయల్దేరడానికి వారం ముందు... సాక్షి మాలిక్ తన ఫొటో ఒకటి ఫ్రేమ్ కట్టించి, ఇంట్లో గోడకు తగిలించింది. ఆమె నిలబడి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మువ్వన్నెల జెండా కనిపిస్తూ ఉంటుంది. ఆ జెండా పై ‘ఐ విల్ విన్’ అనే అక్షరాలు ఉంటాయి.
గెలుస్తానని చెప్పి మరీ వెళ్లి ఒలింపిక్స్‌లో గెలిచింది సాక్షి. పతకం సాధించుకొచ్చింది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ‘ఐ విల్ విన్’ అంటుంది సాక్షి! ఇంత కాన్ఫిడెన్స్, ఇంత నమ్మకం.. తమ కూతుళ్లపై ఈ దేశంలో ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది?!
ప్రభుత్వాలు మాత్రం? ఏనాడైనా అవి క్రీడల్లో మహిళల ప్రతిభను, శక్తిసామర్థ్యాలను తమంతట తాముగా గుర్తించి ప్రోత్సహించాయా? అమ్మాయిలు కష్టపడి సాధించుకొస్తే అప్పటికప్పుడు వారిని ప్రశంసించడం, సన్మానించడం, వరాలు కురిపించడం తప్ప... క్రీడల్లో వాళ్లను కార్యసాధకులుగా మలిచేందుకు అవసరమైన ఒక శాశ్వతమైన పథకం, ప్రణాళిక లేదా ఒక ఉద్యమం లాంటిది ఏదైనా ఉందా?
బేటీ బచావో... బేటీ పడావో
‘ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లల్ని చదివించండి’ అనే నినాదంతో భారత ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ప్రారంభ నిధితో 2015 జనవరి 22న ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలో నానాటికీ తగ్గిపోతున్న స్త్రీ జననాలను పెంచి, స్త్రీల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయడం ఈ ఉద్యమం లక్ష్యం. 2001 జనాభా లెక్కల ప్రకారం 0-6 ఏళ్ల వయసు మధ్య.. భారత్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 927 గా ఉన్న అమ్మాయిల సంఖ్య... 2011 లెక్కల నాటికి 918కి క్షీణించడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీ దేశ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని కూడా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఫలితమే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ఉద్యమ నినాదం. ఇందులో భాగంగానే తొలి విడతగా బాలబాలికల నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉన్న 100 జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో భ్రూణ హత్యల్ని తగ్గించడం ద్వారా బాలబాలికల జననాలను సమస్థాయికి తెచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలు పెట్టింది.
రెండు ఉద్యమాలూ హర్యానావే!
‘సెల్ఫీ విత్ డాటర్’ మొదలైన బీబీపూర్ హర్యానాలోని గ్రామం. ‘బేటీ బచావో... బేటీ పడావో’ మొదలైన పానిపట్ కూడా హర్యానాలోనిదే. హర్యానాలో ఇలాంటి విప్లవాత్మకమైన సాంఘిక పరివర్తన ఉద్యమాలు ప్రారంభం అవడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆడపిల్లల సంరక్షణ, సంక్షేమాల విషయంలో హర్యానా మిగతా రాష్ట్రాల కన్నా కాస్త వెనకే ఉంది. భ్రూణ హత్యలు, బాలికల పెంపకంలో వివక్ష కారణంగా అప్రతిష్టలో అనేక ‘పతకాలను’ హర్యానా ఇప్పటికే మెడలో వేసుకుంది. ఆ హర్యానా నుంచే ఇప్పుడు సాక్షి మలిక్ అనే అమ్మాయి ఒలింపిక్ పతకం సాధించి ఆడపిల్లల ఘనతను ఇంటింటికీ చాటింది! ఆడపిల్లలను కడుపులోనే చంపేయకపోతే మనం ఎన్ని కోల్పోకుండా ఉంటామో ఈ ఒక్క గెలుపుతో దేశానికి అర్థమయ్యే ఉంటుంది.
ఇప్పుడిక... బేటీ ఖిలావో!
ఆడపిల్లను కాపాడాలి. ఆడపిల్లను చదివించాలి.అక్కడితో సరిపోదు.. ఆడపిల్లను ఆడనివ్వాలి. చిన్నప్పుడు గుండెల మీద ఆడించడం మన సంతోషం కోసం. తనను ఆడనివ్వడం మాత్రం పూర్తిగా ఆమె సంతోషం కోసం, ఆమె సంకల్పం కోసమే మాత్రమే జరగాలి. సాక్షి మలిక్‌ని చిన్నప్పుడు రొహ్‌టక్‌లోని సర్ చోటా రామ్ స్టేడియంకి టూర్‌కి తీసుకెళ్లినప్పుడు టీచర్లు ఆమెకు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ ఆటల్ని చూపించారు. అవేవీ సాక్షిని ఆకర్షించలేదు. ఈలోపు కొంత మంది అబ్బాయిలు రంగురంగుల కోట్లు వేసుకుని స్టేడియంలోకి వచ్చారు. వారంతా రెజ్లర్లు! సాక్షి ఎక్సైట్ అయిపోయింది. ‘‘అమ్మా.. నేనది నేర్చుకుంటా’’ అంది. ‘‘అమ్మాయిలకు ఆ ఆట కష్టం తల్లీ’’ అని చెప్పింది తల్లి. సాక్షి వినలేదు. ఎప్పటికైనా నేను రెజ్లర్‌ని అయి తీరుతా అని పట్టుపట్టింది. సాక్షి తాతగారు కుస్తీ యోధుడు. ఆయన్ని అందరూ ‘‘పెహల్వాన్ జీ నమస్తే’’ అని భక్తిభావంతో అభివాదం చేయడం చిన్నారి సాక్షి ఎన్నోసార్లు అబ్బురంగా చూసింది. అది ఆమె మనసులో బలంగా ఉండిపోయింది.
ఆడబిడ్డ అని చూడకుండా అమె మనసును గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పడానికి తాజా నిదర్శనం సాక్షి విజయం. గత ఫిబ్రవరిలో జాట్‌ల రిజర్వేషన్ అల్లర్లతో హింసాత్మకంగా మారిపోయి, నేటికీ పొగలు కక్కుతున్న హర్యానాలో ఇప్పుడు ప్రతి ఇల్లూ... ఇంట్లో ఆడపిల్లకు ఇవ్వవలసిన రిజర్వేషన్ గురించి ఆలోచిస్తోంది! బహుశా త్రిపురలో, తెలుగు రాష్టాల్లో ఇంటింటా ఇదే ఆలోచన ఉండొచ్చు.
ఓడినా... అది గెలుపే!
త్రిపుర అమ్మాయి దీపాకర్మాకర్‌కు రియో ఒలింపిక్స్‌లో ఏ పతకమూ రాలేదు. కానీ అత్యంత ప్రమాదకరమైన జిమ్నాస్ట్ విన్యాసం.. ‘ప్రోడునోవా’ను విజయవంతంగా ప్రదర్శించడమే ఆమె తన దేశానికి అందించిన బంగారు పతకం! ఒలింపిక్స్‌కి వెళ్లిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా దీపాకర్మాకర్ గుర్తింపు పొందినట్లే... తొలి మహిళా జిమ్నాస్ట్‌గా కూతుర్ని ఒలింపిక్స్‌కి పంపగలిగినందుకు ఆమె తల్లిదండ్రులూ యావత్ దేశానికీ గుర్తుండిపోతారు.
మన బంగారం సింధు
ఇక బాడ్మింటన్‌లో రజత పతక విజేత పి.వి. సింధు పేరెంట్స్ అయితే... ‘బేటీ ఖిలావో..’ అనే సరికొత్త నినాదానికి తెలుగు రాష్ట్రాల అనధికార ‘బ్రాండ్ అంబాసిడర్’ లు అయిపోయారు! ‘‘ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి’’ అని సాక్షి ‘ఫ్యామిలీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు తల్లి విజయ యావద్దేశానికీ అంతర్లీన సందేశం ఇచ్చారు. అవును. ఇంటింటా మొక్కలా... ప్రతి ఇంటా ఆడపిల్ల ఉండాలి. ఆ పిల్లను బతకనివ్వాలి. చదవనివ్వాలి. ఆడనివ్వాలి. అప్పుడే ఇంటికీ ఆరోగ్యం. దేశానికీ సౌభాగ్యం.
సెల్ఫీ విత్ డాటర్
బేటీ బచావో... బేటీ పడావో’ మొదలైన ఆరు నెలలకు.. 2015 జూన్‌లో సోషల్ మీడియాలో ‘సెల్ఫీ విత్ డాటర్’ అనే ఉద్యమం ప్రారంభమైంది! అకస్మాత్తుగా మొదలై, వేగంగా విస్తరించిన స్త్రీ సంక్షేమ నినాదం అది. దాని సృష్టికర్త బీబీపూర్ గ్రామ సర్పంచ్ సునీల్ జగ్లాన్. కూతురు నందినితో తీసుకున్న సెల్ఫీని జూన్ 19న ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచం దృష్టిలో... ముఖ్యంగా ప్రధాని మోదీ దృష్టిలో పడ్డారు. ప్రశంసలు అందుకున్నారు. అదే స్ఫూర్తితో సునీల్ ‘సెల్ఫీ ఎగైన్‌స్ట్ డౌరీ’ అనే మరో ఉద్యమాన్ని ప్రారంభించారు. అవివాహిత యువతీయువకులు తమ సెల్ఫీలతో ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే సెల్ఫీ ఎగైన్‌స్ట్ డైరీ.
డాటర్స్ డే... డాటర్స్ వీక్
కేంద్ర మంత్రి మనేకాగాంధీ ఈ ఆగస్టు 11న ‘డాటర్స్ డే’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 11న డాటర్స్ డే. 11 నుంచి ఏడు రోజుల పాటు ‘డాటర్స్ వీక్’. మీ కోడళ్లు, మనవరాళ్లతో ఫొటోలు దిగి, వాటిని ట్వీట్ చెయ్యండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మనేకా. ఆడపిల్ల విలువలను గుర్తించి, సమాజంలో ఆమె ఎదుగుదలకు ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పడమే ‘డాటర్స్ డే’ ముఖ్యోద్దేశం. ‘బేటీ బచావో...’ ఉద్యమాన్ని మొత్తం మూడు శాఖలు పర్యవేక్షిస్తుంటాయి.. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర మానవ వనరుల శాఖ. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మనేకా గాంధీ చొరవ చూపి, ‘డాటర్స్ డే’ని ప్రారంభించారు.
మహిళలే మన ఆశా దీపాలు!
ఎప్పటికైనా వనితలే మన దేశానికి ఘనత అని రియో ఒలింపిక్స్‌తో రుజువైంది! సానియా మీర్జా, దీపా కర్మాకర్, లలితా బాబర్, సైనా నెహ్వాల్ రియోలో పతకాలు తేలేకపోవచ్చు. కానీ వారి ఫైటింగ్ స్పిరిట్.. పతకానికి ఏ మాత్రం తక్కువ కానిది! అంతేకాదు, క్రీడల్లో భారతీయ పురుషులతో పోలిస్తే... భారతీయ స్త్రీలే ప్రపంచ దేహ ప్రమాణాలకు దగ్గరగా ఉంటున్నారని స్పోర్ట్స్ సైంటిస్టులు చెబుతున్నారు.
పి.టి ఉష.. కరణం మల్లీశ్వరి : 1984లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పరుగుల రాణి పి.టి. ఉష వెంట్రుకవాసిలో 400 మీ. హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నారు. కానీ ఆ ఈవెంట్‌తో ఆమె ప్రపంచ క్రీడా పటంలో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. 25 ఏళ్ల తర్వాత కరణం మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి భారతీయ మహిళల్లో అంతర్లీనంగా ఉండే శక్తికి లిఫ్ట్ ఇచ్చారు. భారతీయ క్రీడాకారిణుల వెయిట్ పెంచారు. తర్వాత సైనా నెహ్వాల్. తర్వాత మేరీ కోమ్. ఇప్పుడు సాక్షి, సింధు. వీళ్లంతా రగిలించిన స్ఫూర్తి భారతీయ క్రీడా జ్యోతిని కలకాలం వెలిగిస్తూనే ఉంటుంది. ఒక జ్యోతి నుంచి మరో జ్యోతి ప్రజ్వలన జరుగుతూనే ఉంటుంది.