Paris Olympics 2024: ‘హ్యాట్రిక్‌’పై సింధు గురి | PV Sindhu for a Historic Hat-Trick at Paris Olympics 2024 | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: ‘హ్యాట్రిక్‌’పై సింధు గురి

Published Sun, Jul 21 2024 6:15 AM | Last Updated on Sun, Jul 21 2024 6:15 AM

PV Sindhu for a Historic Hat-Trick at Paris Olympics 2024

సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి పతకావకాశాలు  

సంచలనంపై లక్ష్యసేన్‌ దృష్టి 

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌పై ఆశలు  

బ్యాడ్మింటన్‌ను 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లలో ఎగ్జిబిషన్‌ / డెమాన్‌్రస్టేషన్‌ స్పోర్ట్‌గా ఆడించారు. అంటే పోటీలు జరిపి విజేతలను ప్రకటించినా...ఆ విజయాలను పతకాల జాబితాలో కలపరు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్‌నుంచి అధికారికంగా బ్యాడ్మింటన్‌ ఒలింపిక్స్‌లో భాగమైంది. 

1992 నుంచి 2008 వరకు భారత షట్లర్లు పోటీల్లో పాల్గొన్నా...ఈ ఐదు ప్రయత్నాల్లోనూ మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో చెప్పుకోదగ్గ విజయాలతో అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్, విమల్‌ కుమార్, మధుమిత బిష్త్, పీవీవీ లక్ష్మి, అపర్ణా పొపట్, అనూప్‌ శ్రీధర్‌లాంటి ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు చేరడమే అప్పటి వరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. 

వరుసగా మూడు సార్లు... 
2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పరిస్థితి మారింది. అప్పటికే వరుస విజయాలు, సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్న సైనా నెహా్వల్‌ భారత్‌కు బ్యాడ్మింటన్‌లో తొలి ఒలింపిక్‌ పతకాన్ని అందించింది. సెమీ ఫైనల్లో యిహాన్‌ వాంగ్‌ (చైనా) చేతిలో ఓడిన సైనా...ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో గ్జిన్‌ వాంగ్‌ (చైనా)పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరో వైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు రాగలిగాడు. 

నాలుగేళ్ల తిరిగే సరికి షటిల్‌లో భారత్‌ పతకం మరింత మెరుగైంది. అంతర్జాతీయ యవనికపై దూసుకొచ్చిన 21 ఏళ్ల యువ తార పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పదునైన ఆటతో ఫైనల్‌ చేరిన సింధు...తుది పోరులో కరోలినా మరీన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడింది. 

ఈ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌ వరకు చేరినా...చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ చేతిలో ఓడి నిష్క్రమించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఈ సారి కూడా సింధునే పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో తై జు (తైపీ) చేతిలో ఓటమిపాలైన సింధు... ప్లే ఆఫ్‌ పోరులో బింగ్‌జియావో (చైనా)పై గెలిచి వరుసగా రెండో ఒలింపిక్‌ పతకాన్ని తన మెడలో వేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీపై ఆ సమయంలో మంచి అంచనాలే ఉన్నా...దురదృష్టవశాత్తూ వాళ్లు గ్రూప్‌ దశకే పరిమితమయ్యారు.  

అనుకూలమైన ‘డ్రా’తో... 
ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. సుశీల్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), సింధు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచే అవకాశం సింధు ముందుంది. ఊహించినట్లుగానే గ్రూప్‌ దశలో రెండు సునాయాస మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 2020లో కాంస్య పోరులో తాను ఓడించిన బింగ్‌జియావో, చెన్‌ యు ఫె, మరీన్‌లను దాటితే ఫైనల్‌ వరకు వెళ్లగలదు.

 గత కొంత కాలంగా గొప్ప ఫామ్‌లో లేకపోయినా...కీలక సమయంలో సత్తా చాటగల నైపుణ్యం సింధు సొంతం. అందుకే ఆమె పతకం గెలవడంపై అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్‌లో కూడా సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టికి మంచి ‘డ్రా’నే లభించింది. గ్రూప్‌ ‘సి’లో విజేతగా ముందంజ వేస్తే ఈ జోడీకి నాకౌట్‌లోనూ తమకంటే బలహీన ప్రత్యర్థులే ఎదరు కావచ్చు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఎంత వరకు వెళతాడనేది ఆసక్తికరం. జొనాథన్‌ క్రిస్టీలాంటి టాప్‌ ప్లేయర్‌ను ఓడిస్తే లక్ష్యసేన్‌ నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఉంది. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్‌ ఎదురు కావచ్చు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో జోడి గ్రూప్‌ దశను దాటి నాకౌట్‌కు చేరడం కష్టమే.  

ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో గత మూడు ఒలింపిక్స్‌లలో వరుసగా పతకాలు వచ్చాయి.  2012లో సైనా నెహా్వల్‌ కాంస్యంతో మెరవగా...2016లో పీవీ సింధు రజతం సాధించింది. 2020లోనూ తన జోరును కొనసాగిస్తూ సింధు కాంస్యాన్ని అందుకుంది.                         

–సాక్షి క్రీడా విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement