ఎవరూ ఫేవరెట్లు కాదు
‘రియో’లో ఎవరైనా పతకాలు గెలవొచ్చు
బ్యాడ్మింటన్ స్టార్ సింధు అభిప్రాయం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో ప్రత్యేకించి ఫేవరెట్లు లేరని... ఎవరైనా పతకాలు గెలవొచ్చని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయపడింది. బరిలోకి దిగిన రోజు మన శక్తిమేరకు రాణిస్తే విజయం లభిస్తుందని తెలిపింది. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకొని రాణించడం, కోర్టులో అప్పటికి తగిన వ్యూహాన్ని మార్చి ఆడితే గెలుపు ఏమంత కష్టం కాదని 21 ఏళ్ల ఈ హైదరాబాదీ స్టార్ తెలిపింది. ‘రియో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి వారం రోజుల ముందే అక్కడికి వెళుతున్నాం. మాకు ఈ వారం ప్రాక్టీస్ చాలా కీలకమని భావిస్తున్నా. దీంతో పాటు అక్కడి వాతావరణానికి కూడా మేం అలవాటుపడిపోతాం. పోటీల రోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ తరహా కసరత్తులు దోహదం చేస్తాయి’ అని సింధు వివరించింది. వరుసగా 2013, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలుపొందిన ఆమె ఇప్పుడు ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ప్రాక్టీసు చేస్తోంది.
రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారిపై గెలిచిన అనుభవం తనకుందని చెప్పిన ఆమె... ప్రత్యర్థుల ఆటతీరు మనకు తెలిసినట్లే మనం ఆడే షాట్లు వారికి తెలుసని... కోర్టులో అప్పటికప్పుడు ఎవరు అగ్రశ్రేణి ఆటతీరు కనబరిస్తే వారే గెలుస్తారని తెలిపింది. తను ఈ ఏడాది చాలా టోర్నీల్లో ఆడానని, కావాల్సినంత అనుభవం సంపాదించానని చెప్పుకొచ్చింది. ఒత్తిడి ఆటగాళ్ల జీవితంలో ఓ భాగమని దానిపై ఏమాత్రం బెంగలేదని పేర్కొంది. డ్రా ఇదివరకే విడుదలైందని ప్రత్యర్థుల గురించి కంగారు లేదని చెప్పింది. గ్రూప్ ‘ఎమ్’లో ఉన్న ఆమె లీగ్ దశలో మిచెల్లి లి (కెనడా), లౌరా సరోసి (హంగేరి)లతో తలపడుతుంది. ఈ దశను అధిగమిస్తే ఈ భారత క్రీడాకారిణికి నాకౌట్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ), యిహాన్ వాంగ్ (చైనా) ఎదురవుతారు. వీరిపై గెలిస్తే సెమీస్ చేరుకోవచ్చు. కాగా... రేపు (మంగళవారం) భారత బ్యాడ్మింటన్ బృందం రియోకు పయనమవుతుంది.