జనగణమనే మా స్ఫూర్తి మంత్రం!
సింధు మరో పదేళ్లు ఆడుతుంది
మీడియాతో గోపీచంద్
ఇంతటి అభిమానాన్ని చూడలేదన్న సింధు
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఇంకా ఆ సంతోషం నుంచి తేరుకోలేదు. సొంత నగరానికి తిరిగొచ్చిన అనంతరం సోమవారం లభించిన ఘన స్వాగతం, సన్మాన కార్యక్రమాలతో ఆ సంతోషం రెట్టింపైంది. తమ శ్రమకు తగిన ఫలితం లభించిందని వారిద్దరు విజయానందంతో చెప్పారు. అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న సింధు, గోపీ తమ ఆనందాన్ని పంచుకున్నారు. విశేషాలు వారి మాటల్లోనే...
ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది ఒకప్పుడు నా లక్ష్యం. కానీ ఇప్పుడు పతకం సాధించాలనే కల కూడా నెరవేరింది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. దీనికి కారణమైన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఎయిర్‌పోర్ట్‌నుంచి ర్యాలీ సాగినంత సేపు గర్వంగా అనిపించింది. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలిచినా దీని ముందు ఏదీ సాటి రాదు. గోపీ సర్ ప్రతీసారి గెలుపు కోసం నాలో స్ఫూర్తి నింపారు. రియో వెళ్లే ముందు మెడల్ గురించి ఆలోచన మాత్రం లేదు. ఒక్కో మ్యాచ్‌లో అడ్డంకిని అధిగమించిన కొద్దీ నమ్మకం కలిగింది. గాయంనుంచి కోలుకొని తిరిగి కోర్టులోకి వచ్చాక ఇంత మంచి ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా బాగా ఆడి అంచనాలు అందుకుంటా. దూకుడు ఆటలో మాత్రమే చూపించాలి ఆ తర్వాత కాదు. అందుకే ఫైనల్ ముగిశాక మారిన్ దగ్గరికెళ్లి అభినందించాను. గోపీ సర్ శిక్షణను బట్టి చూస్తే నాలాంటి ఎంతో మంది మున్ముందు దూసుకొస్తారని నమ్ముతున్నా.
- పీవీ సింధు, ఒలింపిక్స్ రజత పతక విజేత
చాలా మంది గొప్ప ఆటగాళ్లు కూడా కీలక క్షణాల్లో తడబడతారు. సింధు మాత్రం అవసరమైన సమయంలోనే అసలు సత్తా చూపించింది. పతకం గెలిచినా ఆమె పరిపూర్ణ క్రీడాకారిణి అంటే నేనొప్పుకోను. కాస్త సమయం తీసుకున్నా ఇంకా మెరుగయ్యేందుకు అవకాశం ఉంది. మరో పదేళ్లు ఆడగల సత్తా ఉంది కాబట్టి మరిన్ని విజయాలు దక్కుతాయి. సైనా ఉన్నా, వెళ్లిపోయినా ఇంకా సాధించాలనే కసి నాలో ఎప్పుడూ తగ్గలేదు. నా ఆలోచనలకు తగిన అంకితభావం గల ప్లేయర్ దొరకడం వల్లే ఇది సాధించాం. ఆమె ఏదో రాష్ట్రానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు. సింధు భారతీయురాలు అనేదే ముఖ్యం. మిగతావారికి పతకాలు రాకపోయినా ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమనే ఘనతను చిన్నది చేయవద్దు. మనకు ఏ మాత్రం అవకాశం లేని ఈవెంట్‌లను లెక్క గట్టి పతకం రాలేదని నిందించడం తప్పు. గెలిచినవారిని సూపర్ హీరోలను చేసి మిగతా వారిని తక్కువ చేయకుండా వాస్తవ దృష్టితో ఆలోచించాలి. ప్రతీ మ్యాచ్‌కు ముందు మేం జనగణమన తప్పనిసరిగా పాడేవాళ్లం. దేశం కోసం ఆడుతున్నామనే భావనే ఆటగాళ్లను నడిపిస్తుంది. అదే క్రీడల్లో ఉన్న గొప్పతనం. -పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ కోచ్