హిమాదాస్
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు...
... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం
సాక్షి క్రీడా విభాగం
ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...!
నవ యువత... అనుభవజ్ఞులు
ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్‌లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు
బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
గతమే స్ఫూర్తి...
కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్‌లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్‌లకు తోడు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది.
సింధు, శ్రీకాంత్‌లపై దృష్టి
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్‌లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్‌ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్‌ఎస్ ప్రణయ్‌పైనా ఆశలున్నాయి.
హిమాదాస్ మెరిసేనా...
అసోంకు చెందిన హిమాదాస్‌పై ఈ ఏషియాడ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు.
వీరేం చేస్తారో...
రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్‌లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్‌లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్‌ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది.
ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..?
పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. గత ఏషియాడ్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది.
‘కిక్’ ఇస్తారా?
బాక్సింగ్‌లో భారత్‌కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు.
కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది.
► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు.
11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్‌బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం.
ప్రారంభ వేడుకలు
సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం
మనోళ్లు 17 మంది...
► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్).
► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ)
► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ)
► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ)
► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్)
► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ)
► సెపక్‌తక్రా– తరంగిణి (తెలంగాణ)
► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ)
► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ)
Comments
Please login to add a commentAdd a comment