indonasia
-
కర్తవ్యపథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర వేడుకలు
ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు. #WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳National anthem and 21 Gun salute follows.(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్ వేదికగా ప్రదర్శించనున్నాయి బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్డీవో ‘రక్షా కవచ్’ థీమ్‌ను ప్రదర్శించనుంది.మౌంటెడ్ కాలమ్‌కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ మోటార్‌సైకిల్ ప్రదర్శన 90 నిమిషాల నిడివి గల కవాతులో హైలైట్‌గా నిలవనుంది. కర్తవ్య పథంలో మొత్తం 5,000 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలపై ‘సారే జహాన్ సే అచ్ఛా’ ను వినిపించనున్నారు. ఢిల్లీలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీని ఆరు లేయర్ల భద్రతా కొనసాగుతుంది. ఫేస్ రికగ్నైజన్ టెక్నాలజీతో 2,500 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు, యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు, రూఫ్‌టాప్ స్నిపర్లు పహారాకాస్తున్నాయి. -
Mob Attack: రోహింగ్యాలు వెళ్లిపోవాలని నిరసన
మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యాలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఇండోయనేషియాలోని నిరసనకారులు డిమాండ్ చేశారు. పెద్ద నిరసనకారుల మూక బాండా అచే సీటీలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న మయన్మార్ చెందని రోహింగ్యాలు వెళ్లిపోవాలని దాడులకు దిగారు. ఇండోనేషియా నుంచి రోహింగ్యాలు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. రోహింగ్యాలు నివాసం ఉంటున్న చోటుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు దూసుకురావటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. A large crowd of Indonesian students stormed a convention center housing hundreds of Rohingya refugees from Myanmar in the city of Banda Aceh, demanding they be deported, @Reuters footage showed https://t.co/dYV7NVFbpE pic.twitter.com/xrhQKlSbB1 — Reuters (@Reuters) December 27, 2023 ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్రీన్ కలర్ జాకెట్లు ధరించిన కొంతమంది నిరసనకారుల మూక ఓ కన్వెన్షన్ సెంటర్ బిల్డింగ్ సెల్లార్లో ఉంటున్న రోహింగ్యాలు వెళ్లిపోవాలంటూ బెదరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు తమపై రావడంతో రోహింగ్యా మహిళలు, చిన్న పిల్లలు భయంతో రోధించారు. నిరసనకారులు 137 మంది రోహింగ్యాలను బలవంతంగా రెండు ట్రక్కులపై ఎక్కించి, బాండా అచే నుంచి పరో ప్రదేశాని బలవంతంగా తరలించారు. రోహింగ్యాలు.. ఇండోనేషియాలో తీవ్రమైన వ్యతిరేతక, తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో ఇండోనేషియాకు వస్తున్న రోహింగ్యాల పట్ల రోజురోజుకు ఇండోనేషియాలో వ్యతిరేకత పెరుగుతోంది. అందులో భాగంగానే బుధవారం నిరసనకారుల మూక రోహింగ్యాలపై దాడులకు తెగపడినట్లు తెలుస్తోంది. This is heartbreaking. This is completely madness. Such a notorious response from Muslim students of Indonesia is extremely shameful. History will not forget this behaviour. May Allah judge it. pic.twitter.com/5O4D8G20HC — Hujjat Ullah (@hujjatullahhb) December 27, 2023 యునైటెడ్ నేషన్స్ రేఫ్యూజీ ఏజెన్సీ ఈ ఘటనపై స్పందించింది. ‘ఈ ఘటన చాలా విచారకరం. మయన్మార్ రోహింగ్యాల కుటుంబాలపై దాడికి దిగటం చాలా బాధకరం. అక్కడ అధిక సంఖ్యలు మహిళలు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు’ అని పేర్కొంది. వారికి భద్రత కల్పించాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఇండోనేషియాకు వస్తున్న మానవ అక్రమ రవాణాపై ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు రోహింగ్యాలకు తాత్కాలిక వసతులు కల్పించాలని అన్నారు. -
ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష
జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్ -
Recipe: ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!
చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ బోర్ కొట్టాయా? అయితే బోన్‌లెస్ చికెన్ ముక్కలతో ఇలా ఇండోనేషియన్ వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి! ఇండోనేషియన్ సటే తయారీకి కావలసిన పదార్థాలు ►బోన్‌లెస్ చికెన్ ముక్కలు – కేజీ ►కబాబ్ స్టిక్స్ – ఆరు (చల్లటి నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి ►కీరా – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి ►ఆయిల్– వేయించడానికి సరిపడా. మ్యారినేషన్ కోసం ►నూనె – మూడు టేబుల్ స్పూన్లు ►నిమ్మగడ్డి – రెండు రెమ్మలు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ధనియాల పొడి – టీస్పూను ►కారం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు తయారీ... ►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి.. మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాల. ►నానిన చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్‌కు గుచ్చి బొగ్గు మీద కాల్చాలి. ►రెండు పక్కల కాలిన తరువాత కొద్దిగా ఆయిల్ రాసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►కీరా, ఉల్లిపాయ ముక్కలు, ఏదైనా సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Chha Gosht Recipe: అరకేజీ మటన్‌తో ఇలా ఘుమఘుమలాడే వంటకం తయారు చేసుకోండి! -
Indonesia Masters: క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11 స్కోరుతో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. 71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం. చివరి గేమ్‌లో మాత్రం సింధు ఏకపక్షంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ లక్ష్య సేన్ 21–18, 21–15తో రస్మస్ గెమ్కె (డెన్మార్క్)ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సుమీత్ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్ చైనా ద్వయం జెంగ్ సీ వీ– హువాంగ్ కియాంగ్ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు. -
Thomas Cup 2022: ఆకాశాన మన ‘స్మాష్’...
కిడాంబి శ్రీకాంత్ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్‌కోర్ట్ స్మాష్‌ను సంధించాడు... ప్రత్యర్థి క్రిస్టీ వద్ద దానికి జవాబు లేకపోయింది... అంతే! శ్రీకాంత్ వెనుదిరిగి రాకెట్ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు... కనీసం ప్రత్యర్థికి మర్యాదపూర్వకంగా శ్రీకాంత్ ఒక షేక్ హ్యాండ్ అన్నా ఇవ్వమంటూ రిఫరీ చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా మన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది... శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు... ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించాడు... వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. లక్ష్య సేన్ 20 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడంతోపాటు మూడు బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ అందుకున్నాడు... హెచ్ఎస్ ప్రణయ్ ఖాతాలోనూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ ఉండగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్... డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఇటీవల సంచలనాలు సృష్టిస్తోంది. విడివిడిగా చూస్తే వీరంతా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించారు... అంతకుముందు తరంలో ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ కూడా భారత బ్యాడ్మింటన్ స్థాయిని పెంచే ఆటను ప్రదర్శించారు. కానీ జట్టుగా, కలిసికట్టుగా, సమష్టిగా చూస్తే మాత్రం భారత్ ఖాతాలో భారీ విజయం లోటు ఇన్నేళ్లుగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. ఈ చిరస్మరణీయ ఘట్టం ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనే ఆవిష్కృతమైంది కాదు... గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరిన ప్రస్థానమిది. సాక్షి క్రీడా విభాగం భారత జట్టు థామస్ కప్ కోసం వెళ్లినప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు... గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న ఆటగాళ్లతో పాటు అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లు ఉన్న ప్రత్యర్థులను దాటి మన జట్టు ముందంజ వేయడం కష్టమనిపించింది. ఎవరి నుంచైనా ఏదైనా అద్భుత ప్రదర్శన వచ్చినా ఇతర మ్యాచ్‌లూ వరుసగా గెలిస్తే తప్ప జట్టుకు విజయం దక్కదు. అయితే ఎలాంటి ఆశలు లేకుండా పోవడమే టీమ్‌కు మేలు చేసింది. తమను ఎవరూ నమ్మని సమయంలో ఆటగాళ్లే తమను తాము నమ్మారు... వారికి కోచ్‌లు అండగా నిలిచి స్ఫూర్తిని నింపారు. జట్టు ప్రకటించిన తర్వాత టోర్నీ ఆరంభానికి ముందు భారత బృందం ‘వి విల్ బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసుకుంది. చాంపియన్‌గా నిలిచే వరకు ఇందులో ప్రతీ క్షణం స్ఫూర్తి నింపే సందేశాలే. చివరకు మన షట్లర్లు చిరస్మరణీయ విజయంతో తామేంటో చూపించారు. సెమీస్ చేరడంతోనే కనీసం కాంస్యం ఖాయం చేసుకొని మన టీమ్ టోర్నీలో తొలి పతకంతో కొత్త చరిత్ర సృష్టించింది. కానీ ఆ జోరు తుది లక్ష్యాన్ని అందుకునే వరకు ఆగలేదు. అందరూ అదరగొట్టగా... బ్యాడ్మింటన్‌కు ప్రపంచకప్‌లాంటి థామస్ కప్‌లో భారత్‌కు విజయం అందించినవారిని చూస్తే ఒక్కరి ఖాతాలోనూ ఒలింపిక్ పతకం లేదు! కానీ ఈ మెగా టోర్నీకి వచ్చేసరికి అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. అజేయ ఆటతో శ్రీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లీగ్ దశలో భారత్ ఒక మ్యాచ్ ఓడినా శ్రీకాంత్ మాత్రం ఒక్కసారి కూడా నిరాశపర్చలేదు. ఇక క్వార్టర్స్, సెమీస్‌లలో ప్రణయ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు 2–2తో సమంగా నిలిచిన స్థితిలో చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే ఆటగాడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రణయ్ ఎంతో పట్టుదలగా నిలబడ్డాడు. తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడి జట్టును గెలిపించాడు. అదృష్టవశాత్తూ ఫైనల్లో అతను ఆడాల్సిన అవసరమే రాలేదు. రెండు నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశపర్చిన లక్ష్య సేన్ అసలు సమరంలో సత్తా చాటాడు. ఫైనల్లో అతడు తన స్థాయిని ప్రదర్శించడం భారత్ అవకాశాలు పెంచింది. ఇక విశ్వసనీయమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్–చిరాగ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే థామస్ కప్‌లాంటి ఈవెంట్లలో బలహీన డబుల్స్ కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడుతూ వచ్చిన భారత్‌కు ఈ ద్వయం కారణంగా ముందంజ వేసే అవకాశం దక్కింది. ఇంతింతై వటుడింతై... థామస్ కప్‌లో భారత్ గెలవడమే కాదు, గెలిచిన తీరుకు కూడా జేజేలు పలకాల్సిందే. ఈ రోజు మన ఘనతను చూసి సాధారణ అభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆటను దగ్గరి నుంచి చూసిన వారికి ఈ విజయం విలువేమిటో మరింత బాగా కనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా షటిల్ పరిస్థితులు గొప్పగా ఏమీ లేవు. కానీ గోపీచంద్ కోచ్‌గా మారిన తర్వాత షటిల్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సరిగ్గా చెప్పాలంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత ఆటపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సైనా సాధించిన వరుస విజయాలు ఈ క్రీడ స్థాయిని పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సైనా మెరవడంతో బ్యాడ్మింటన్ కూడా ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటిగా మారింది. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన రజతం ఈ క్రీడ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. సాధారణ క్రీడాభిమానులు కూడా బ్యాడ్మింటన్‌ను అనుసరించసాగారు. ప్రపంచంలో ఏ మూల టోర్నీ జరిగినా వాటి ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇక ఆయా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు టోర్నీ వేదికలకు వెళ్లి మరీ మన షట్లర్లను ప్రోత్సహించసాగారు. పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా బ్యాడ్మింటన్ ఫలితాలను చర్చిస్తుండటంతో సంబంధం లేనివారి దృష్టి కూడా ఆటపై పడింది. కొన్నేళ్ల క్రితం వరకు మన షట్లర్లు మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టడం, టాప్–100 ర్యాంకుల్లో ఉండటం కలగానే అనిపించేది. కానీ ఇప్పుడు ఎంతో మంది నేరుగా పెద్ద టోర్నీల్లో తలపడుతున్నారు. ఈ పురోగతి అంతా నేటి థామస్ కప్ విజయం వరకు తీసుకెళ్లిందంటే అతశయోక్తి కాదు. -
ఆంకజాతో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నెదర్లాండ్స్ తాజాగా ఆంకజా పురా–2తో షేర్‌హోల్డర్స్, షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా మిడాన్లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు సంబంధించిన ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ఏడాది నవంబర్‌లో చేజిక్కించుకుంది. ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఆంకజా పురా–2నకు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. -
భర్త చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టిన భార్య!
‘గతంలో మా వాళ్లు అలా ఉండేవారు.. పూర్వం ఇంటిపనులన్నీ భార్యలే చూసుకునేవారు’ అనుకుంటే అది నేటి సమాజంలో కుదరదు. ప్రస్తుత జీవన విధానంలో భార్యా-భర్తలు తమ తమ విధులతో బిజీగా ఉండటమే కాదు.. భార్యదే శ్రమాధిక జీవనమని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అటువంటి తరుణంలో చిన్న చిన్న పనులు కూడా భర్త చేసుకోలేకపోతే అది కాపురంలో చిచ్చుపెట్టడమే కాకుండా, సోషల్ మీడియా వరకూ వెళుతుంది కూడా. ఒక జంట విషయంలో ఇదే పరిస్థితి తలెత్తింది. ఒక భర్త ఇలా చేసేనందుకే అతని బండారాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేసింది భార్య. భార్యాభర్తలు బాధ్యతగా ఉండటమంటే ఒకరి పనుల్లో మరొకరు సహకరించుకోవడమే. ప్రధానంగా ఇంటిపనుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒక పని భార్య చేస్తే, మరొక పని భర్త చేయాలి. అలా కాకపోతే ఇద్దరి మధ్యలోకి గొడవలు రావడం అతి సాధారణం. కనీసం తను తినడానికి వాడిన వస్తువుల్ని కూడా భర్త శుభ్రం చేయకుండా భార్యే చూసుకుంటుందులే అనుకుంటే అది పొరపాటే. ఇండోనేసియాలో భర్త విషయంలో ఇది రుజువైంది కూడా. ప్లేట్లు కడగలేదని సోషల్ మీడియాలో.. ఇండోనేషియాకు చెందిన ఆ జంట కాపురం సోషల్ మీడియాకు ఎక్కడానికి భర్త తిని కడగకుండా వదిలేసిన ప్లేట్, కప్ కారణం. ఏ రోజు కూడా తినడం, వెళ్లిపోవడమే చేస్తున్నాడు భర్త. కనీసం వాటిని సింక్‌లో వేయాలి.. వాటిని శుభ్రం చేయాలనే సోయి కూడా లేకుండా పోయింది. దాంతో విసిగిపోయిన భార్య.. ఒకరోజు తిరుగుబాటుకు దిగింది. భర్త తిని పక్కనే పడేసిన వస్తువుల్ని విసిరి కొట్టడమే కాకుండా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది. పనిలో పనిగా ఇలా చేసే పురుషుల్నికూడా నిలదీసింది. మీ భార్యను అర్థం చేసుకోండి.. ‘మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఉపయోగించిన వంట వస్తువుల్నిఎందుకు పురుషులు కడగరు. పురుషులారా.. మీరు తినడం పూర్తి చేసిన అనంతరం వాటికి వాడిన వస్తువుల్ని వదిలేయడం ఎందుకు. మీరు ఉపయోగించిన ప్లేట్ కానీ ఏ వస్తువునైనా కడగడంలో తప్పు ఏముంది‘ అని ప్రశ్నించింది. ఇది ఆన్లైన్ చర్చకు దారి తీసింది. ఆ వస్తువుల్ని భర్త వాష్ చేసే ఉద్దేశం లేకపోతే కనీసం సింక్‌లో ఉంచాలని కొందరు సూచించగా, దీనికి అరటి ఆకుల్ని వాడటం మరొక ఉత్తమ మార్గమని కొంతమంది సలహాలు ఇచ్చిపడేస్తున్నారు. -
ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!
రాక్షస వివాహం.. రుక్మిణిని కృష్ణుడు పెళ్లి చేసుకున్న తీరుకు ఉదాహరణగా చెప్తారు. ఈ కథలో రుక్మిణి కూడా కృష్ణుడిని ఇష్టపడింది.. ఆమె అనుమతితోనే ఆ పెళ్లి జరిగింది. ఇండోనేషియాలోని సుంబా దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘కవిన్ టాంగాప్’ అనే పేరుతో కొనసాగుతున్నది. నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి. అవసరమైతే తన బంధుగణంతో అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకూ వెళ్తాడు. కిడ్నాప్ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా అరుదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి యువతుల్లో 28 ఏళ్ల సిట్రా ఒకరు. కానీ ఆమె కిడ్నాప్ నుంచి తప్పించుకుంది. ఎలా? సుంబాలో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది సిట్రా. ఒకరోజు ఆమెను తన తండ్రి తరపు దూరపు బంధువులే కిడ్నాప్ చేశారు. ఏదో సమావేశం ఉంది హాజరు కావాలని నమ్మించి, బలవంతంగా కారు ఎక్కించారు. కారు వరుడు ఇంటి ముందు ఆగగానే పెద్దగా గంటలు మోగించి, మంత్రాలు చదువుతూ సిట్రాను ఇంట్లోకి లాక్కెళ్లారు. ఈ విషయాన్ని అతి కష్టం మీద తన తల్లిదండ్రులకు, సన్నిహితులకు మెసేజ్ చేసింది సిట్రా. ప్రేమతోనే కిడ్నాప్ చేశామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా సిట్రా లొంగలేదు. 6 రోజులు బందీగానే ఉంది. ఆచారం ప్రకారం ఆ ఇంట్లో వాళ్లు పెట్టింది తింటే పెళ్లికి సిద్ధమైనట్లే. అందుకే సిట్రా 6 రోజుల పాటు వాళ్లు పెట్టింది ఏదీ తినలేదు. దొంగచాటుగా నీళ్లు, ఆహారం తీసుకుని తనని తాను రక్షించుకుంది. మొత్తానికి మహిళా సంఘాలు కలుగజేసుకుని.. పలు చర్చలు జరిపి ఆమెను విడిపించారు. తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది సిట్రా. ఇలా ఇప్పటి వరకూ సిట్రా సహా ముగ్గురు మాత్రమే తప్పించుకోగలిగారు. సుంబా ప్రజల ఆచార వ్యవహారాలు కొన్నిసార్లు ఈ ‘కవిన్ టాంగాప్’ పెద్దలు కుదుర్చిన పెళ్లిగానూ మారిపోతుందట. గత జూన్‌లో కూడా ఇలాంటి కిడ్నాప్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కఠిన చర్యలు లేకపోవడమే ఈ దురాచారానికి కారణమని.. మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశాయి. దాంతో ఈ ఆచారాన్ని నిషేధించే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. వింత నమ్మకం సుంబా ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారు. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్ అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
ఏపీ గవర్నర్‌తో ఇండోనేషియా కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, విజయవాడ: ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరిచందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి) టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ అభినందన టోక్యో పారాలింపిక్స్‌లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్ , రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్ ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించారని ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని గవర్నర్ పేర్కొన్నారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్‌ను కూడా గవర్నర్ బిశ్వ భూషణ్ అభినందించారు. దేశ ప్రజలు వారి విజయాలను చూసి గర్వపడుతున్నారని, భవిష్యత్తులో దేశానికి మరిన్ని పురస్కారాలు అందించేదుకు కృషి చేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన) -
అందుకే నా కుమారులతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..!
జకార్తా: సాధారణంగా తల్లిదండ్రులందరు తమ పిల్లల కోసం పరితపిస్తుంటారు. తమ వారు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి కావాల్సింది కొనిస్తారు. అయితే, కొంత మంది పిల్లలు ఆన్లైన్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆశ్లీల వీడియోలు చూస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొంత మంది పిల్లలు పాశ్చాత్య పోకడలకు పోయి.. ప్రతి చిన్న విషయాలకు అబద్ధాలు చెబుతూ.. కన్న వారిని సైతం, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. అయితే, ఈ తల్లి అందరిలా కాకుండా.. కాస్త వెరైటీగా ఆలోచించింది. ‘పిల్లలకు ఏది వద్దంటే.. అదే చేస్తారు’. కాబట్టి వారికి దాంట్లో మంచి..చెడులను చెప్పాలనుకుంది. అందుకే తన పిల్లలతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తూ వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పించింది. దీంతో ఈమె వార్తలలో నిలిచింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్ స్టార్ యుని శరాకు ఇద్దరు కొడుకులు. ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 47 ఏళ్ల వయసున్న యూనీ, తన ఇద్దరు కొడుకులు.. కెవిన్ సియాహన్, సెల్లో నియాహన్లతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానని బాంబ్ పేల్చింది. ప్రస్తుత స్మార్ట్ యుగంలో పిల్లలను చెడు వ్యవసనాల బారిన పడకుండా చూడటం దాదాపు అసాధ్యం. ఒకవేళ మనం వారిని దీనిపై కట్టడి చేస్తే.. మనకు తెలియకుండా ఎలాగైనా దొంగ చాటున చూసేస్తారు. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నానని యూనీ తెలిపింది. తన పిల్లలు శృంగారాన్ని ఓ బూతూలా కాకుండా.. ఓపేన్ మైండెడ్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా, పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు.. ‘నీకేమైన బుద్ధుందా.. ఇదేం పైత్యం’ అంటూ.. తిట్టిపోస్తూంటే.. మరికొందరు ‘ఆమె చేస్తుంది సరైన పనే’ అంటూ యూని శరాను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. View this post on Instagram A post shared by WahyuSetyaningBudi✨ (@yunishara36) -
ఇండోనేషియాలో ప్రాజెక్టు.. ఇండియన్లకి తాకిన పన్నుల పోటు
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో నిర్మిస్తున్న పామ్‌బేస్‌డ్ బయో డీజిల్ ప్రాజెక్టు ఇండియాకు చేటు తెచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీగా నిధులు సమకూర్చుతోంది ఇండోనేషియా. అందు కోసం ఆ దేశ ప్రధాన ఆదాయ వనరులో ఒకటైన పామాయిల్ ఎగుమతులపై భారీగా కస్టమ్స్ డ్యూటీ విధిస్తోంది. ఏడు నెలలుగా ఓ వైపు అమెరికా, బ్రెజిల్‌లలో కరువు కారణంగా వంట నూనె ధరలు పెరిగాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌కి మళ్లుదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. వంట నూనెల్లో ఎప్పుడు చవకగా లభించే పామాయిల్ ధర సైతం లీటరు రూ. 150 దగ్గర ఉంది. దీనికి కారణం ఇండోనేషియాలో పెరిగిన ఎగుమతి పన్నులు. నిధుల సేకరణ పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా పామ్ బేస్డ్ బయో డీజిల్ ఉత్పత్తి ప్రాజెక్టును ఇండోనేషియా చేపట్టింది. దీనికి నిధుల సమీకరణకు పామ్నే ఎంచుకుంది. దీంతో ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతిపై గత డిసెంబరులో ఉన్నట్టుండి పన్నులు పెంచింది. టన్ను పామాయిల్ కస్టమ్స్ డ్యూటీని 438 డాలర్లకు పెంచింది. అంతటితో ఆగకుండా క్రూడ్ పామాయిల్ లేవీని టన్నుకు రూ. 225 డాలర్లుగా నిర్ణయించింది. మన దేశ పామాయిల్ అవసరాల్లో యాభై శాతం ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. గత డిసెంబరు నుంచి పెరిగిన పన్నులతో ఇండియాలో కూడా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మలేషియా ఇండోనేషియాలో పన్నుల భారం భరించలేని విధంగా పెరిగిపోవడంతో మలేషియా నుంచి పామ్ఆయిల్ ఇండియా దిగుమతి చేసుకుంటోంది.మలేషియా సైతం సుంకాలు తగ్గించడంతో ఇండియాకి పామాయిల్ ఎగుమతులు ఏకంగా 238 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇండోనేషియా దిగుమతులు 32 శాతం తగ్గాయి. ధరలు తగ్గేదెన్నడు ఇండోనేషియాలో ఎగుమతి సుంకం పెరిగిపోవడంతో మలేషియా వైపు ఇండియా మళ్లింది. దీంతో ఎగుమతి పన్నులు తగ్గించాలంటూ ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఇండియా అవసరాలను గమనించిన మలేషియా సైతం క్రమంగా క్రమంగా పన్నులు పెంచుతోంది. ఏతావతా ఇండోనేషియా, మలేషియాల మధ్య జరుగుతున్న పామాయిల్ వాణిజ్యంలో ఇండియాలో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. కనీసం పామాయిల్ ధరలైనా తగ్గేలా చూడాలని కోరుతున్నారు. చదవండి : చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! -
Delta Variant: ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియెంట్ దడ
వాషింగ్టన్/మాస్కో: మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసిన కోవిడ్–19 డెల్టా వేరియెంట్ (బి.1.617.2) ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. యూకే థర్డ్ వేవ్ గుప్పిట్లో చిక్కుకొని ఆంక్షల సడలింపుని వాయిదా వేసింది. రష్యా, ఇండోనేసియాలో డెల్టా వేరియెంట్ విజృంభిస్తోంది. ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు ఒక ముప్పుగా పరిణమించిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. కోవిడ్–19పై వారాంతపు నివేదికను విడుదల చేసిన ఆమె 80 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియెంట్ కేసులు ఉన్నాయని, మరో 12 దేశాల్లో డెల్టా కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. యూకేలో వారం రోజుల్లోనే డెల్టా వేరియెంట్ కరోనా కేసులు 33,630 వెలుగు చూశాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) వెల్లడించిన నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ కూడా దీని ప్రమాదాన్ని తన వారాంతపు నివేదికలో పొందుపరిచింది. ఇండోనేషియాలోని జకార్తాలో డెల్టా వేరియెంట్ కేసులు వస్తున్నాయి. మాస్కోలో రోజుకి 9 వేల కేసులు రష్యాలో కరోనా ముప్పు తొలిగిపోయిందని ప్రభుత్వం భావించిన వేళ డెల్టా వేరియెంట్ విజృంభణతో ఆ దేశం బెంబేలెత్తిపోతోంది. రాజధాని మాస్కోలో శుక్రవారం ఒక్కరోజే 9,056 కేసులు నమోదయ్యాయి. అందులో 89% డెల్టా వేరియెంటేనని నగర మేయర్ సెర్గెయి సొబ్యానిన్ తెలిపారు. గత రెండు వారాల నుంచి కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు. రష్యాలో మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 9.9% జనాభాకి మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తయింది. డెల్టా వేరియెంట్ మరింత విజృంభించకుండా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం చేయాలని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమెరికాని కూడా డెల్టా వేరియెంట్ భయపెడుతోంది. ముఖ్యంగా అక్కడ యువతలో ఎక్కువ ప్రభావం చూపించడం ఆందోళన పెంచుతోంది. ఈ వేరియెంట్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. యువతకు ఈ వేరియెంట్‌తో ముప్పు పొంచి ఉందన్న ఆయన అందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్‌ని కట్టడి చేయగలమని అన్నారు. -
ఇండోనేషియాలో భూకంపం 8 మంది మృతి
మలాంగ్: ఇండోనేషియాలోని జావా దీవిలో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7 గంటలకు (స్థానిక కాలమానం), 6.0 పరిణామంతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 8 మంది మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. మలాంగ్ జిల్లాలకు 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే దీని కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా ఎర్త్‌క్వేక్ అండ్ సునామీ సెంటర్ రహ్మద్ త్రియోనో స్పష్టం చేశారు. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలకు దగ్గరగా ఉండవద్దని, అవి విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం సమయంలో ప్రజలంతా భయపడుతూ భవనాల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడి టీవీల్లో కనిపించాయి. లుమజాంగ్ జిల్లాలో బైక్‌పై వెళుతున్న మహిళపై కొండ చరియలు విరిగిపడటంతో ఆమె మరణించింది. మరికొన్ని చోట్ల భవనాల కింద మరణించిన వారి శరీరాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చదవండి: మరోసారి మయన్మార్ సైన్యం కాల్పులు, 82 మంది మృతి! -
షాకింగ్: ఒంటి నిండా కట్లు.. షార్ట్ మీద వచ్చిన వరుడు
జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్కోర్స్.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్ చేయండి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. పెట్రోల్ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి. బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్ మీద వచ్చాడు’’ అని తెలిపింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. -
సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా?
ఆల్రెడీ ఎండలు మొదలయ్యాయి.. ఈసారి హాట్‌హాట్‌గానే ఉండబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. అవునూ.. ఎండాకాలమంటే గుర్తొచ్చింది.. అసలు సమ్మరే లేని సంవత్సరం ఒకటుంది.. దాని గురించి మీకు తెలుసా? ఆ ఏడాది ఎండాకాలంలో మంచు కురిసింది! ఇంకా చాలాచాలా జరిగాయి.. వీటన్నిటికీ కారణం తంబోరా అనే అగ్నిపర్వతం.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. చలోఇండోనేషియా.. పేలడంలో ప్రపంచ రికార్డు.. 1816 ఏప్రిల్ 5న ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం బద్దలైంది. ఏకంగా ఐదారు కిలోమీటర్ల ఎత్తున లావాను వెదజల్లింది. భారీ ఎత్తున వాయువులు, దుమ్ము, ధూళిని వాతావరణంలోకి వదిలింది. ఈ పేలుడుతో సుంబావా దీవిలో నివసిస్తున్న 10వేల మందిలో దాదాపు అందరూ చనిపోయారు. అగ్నిపర్వతం పేలుడుతో ఏర్పడిన ప్రకంపనలు, సముద్రంలో పడ్డ లావా వల్ల సునామీ ఏర్పడింది, వ్యాధులూ విజృంభించాయి. వీటితో చుట్టూ ఉన్న దీవుల్లో మరో 80– 90వేల మంది మరణించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, వాయువులు వాతావరణంలో కొన్నికిలోమీటర్ల ఎత్తుకు (స్ట్రాటోస్ఫియర్ పొర వరకు) చేరాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించి.. కొద్దినెలల పాటు ఉండిపోయాయి. భూమిపై గత పది వేల ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం అదే కావడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధన చేసి రిపోర్టు రూపొందించారు. 1816 బీభత్సానికి కారణమైన మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఇదే. నాటి పేలుడు ధాటికి.. అగ్ని పర్వతంపై ఏకంగా అర కిలోమీటర్ లోతు, తొమ్మిది కిలోమీటర్ల వెడల్పున బిలం ఏర్పడింది. సమ్మర్లో వింటర్.. మొత్తమ్మీద ఈ పేలుడు ఎఫెక్ట్‌కు ఆకాశంలో దుమ్ము, ధూళి, నల్లని వాయువుల కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరడం తగ్గిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆ ఏడాది ఎండాకాలమే లేకుండా పోయింది. యూరప్, ఉత్తర అమెరికాలలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవి ఉంటుంది. కానీ 1816లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా.. ఆ తర్వాత కూడా మంచు కురుస్తూనే ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలను అధికారికంగా రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 1816వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. సమ్మర్ లేక.. సమస్యల రాక.. ఆ ఏడాది ఎండల్లేక పోవడంతో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలు, ఉత్తర ఆసియా దేశాల్లో నిత్యం మంచు కురుస్తూనే ఉండటంతో ఉన్న పంటలన్నీదెబ్బతిన్నాయి. మళ్లీ పంటలు వేసే పరిస్థితే లేకుండా పోయింది. చాలా దేశాల్లో తీవ్రమైన కరువు తలెత్తింది. దాంతో జనం గొర్రెలు, మేకలు, ఇతర పశువుల మాంసం తిని బతకాల్సి వచ్చింది. భారత్, చైనా దేశాల్లో రుతుపవనాలు అస్తవ్యస్తమయ్యాయి. ఎండాకాలంలోనూ కుండపోత వానలు కురిసి.. భారీ ఎత్తున వరదలు వచ్చాయి. చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. 1816లో ఏర్పడిన కరువుతో ఆహారం లేక, చలికారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయినట్టు అంచనా. ఈ పరిస్థితి భారీ ఎత్తున వలసలకు కారణమైందని, వాతావరణం స్థిరంగా ఉండే ప్రాంతాలకు జనం తరలివెళ్లారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. అప్పట్లో ప్రధాన రవాణా సాధనమైన గుర్రాలకూ ఆ ఏడాది మేత కరువైంది. మనుషులు, సరుకు రవాణాకు చార్జీలూ పెరిగిపోయాయి. ఈ పరిస్థితులే.. కార్ల్ డ్రెయిస్ అనే జర్మన్ శాస్త్రవేత్త 1817 సంవత్సరంలో సైకిల్‌ను తయారు చేయడానికి ప్రధాన కారణమని చెబుతారు. తర్వాత ఇరవై ఏళ్లకు మాక్మిలన్ దానిని మరింత అభివృద్ధి చేసి.. ఇప్పుడున్న మోడల్ సైకిల్‌ను రూపొందించాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం!
జకార్త : నవమాసాలు మోసిన తర్వాతే ఏ మహిళైనా బిడ్డకు జన్మనిస్తుంది. గాలి దేవుడిని ప్రార్థించి కుంతీదేవి భీమసేనుడిని కన్నదని కేవలం పురాణాల్లో మాత్రమే చదువుకున్నాం. వందల శతాబ్ధాల తరువాత మరోసారి అలాంటి వార్తనే వింటున్నాం. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ తన గర్భం వెనుకున్న రహస్యం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి చెందిన జైనా అనే 25 ఏళ్ల మహిళా ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాను పురుషుడితో కలయిక ద్వారా కాకుండా గాలి ద్వారా గర్భం దాల్చినట్లు పేర్కొంది. అంతేగాక తను గర్భవతి అవ్వడం, ప్రసవించడం అంతా కేవలం గంట సమయంలోనూ జరిగిపోయిందని వింత వాదన చేస్తోంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్న తరువాత, నా యోని ద్వారా గాలి నా శరీరంలోకి అకస్మాత్తుగా ప్రవేశించింది. ఆ సమయంలో నేను మీద నేల పడుకున్నాను. గదిలో గాలి వీచిన 15 నిమిషాలకు కడుపులో నొప్పిగా అనిపించింది. కొద్దిసేపటి తరువాత పొత్తికడుపు ఆకస్మాత్తుగా పెద్దదిగా అయ్యింది’ అని పేర్కొంది. అయితే బాధితురాలు నిజంగానే గర్భందాల్చడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి కమ్యూనిటీ క్లినిక్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, గాలి వల్ల గర్భం దాల్చానని చెబుతున్న ఆమె మాటలు ఏ విధంగా నమ్మశక్యంగా లేవని వైద్యులు చెబుతున్నారు. ప్రసవించే వరకు మహిళకు తను గర్భవతి అనే విషయం తెలియకపోవచ్చని అంటున్నారు. కాగా ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చివరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గర్భం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జైనాకు భర్త, కుమారుడు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె మాజీ భర్తను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిడ్డకు జన్మనిచ్చిన సితి జైనాహ్ను.. ఆమెకు పుట్టిన బిడ్డను చూసేందుకు అధికారులతో పాటు జనాలు క్యూ కడుతున్నారు. అయితే సుడిగాలి ద్వారా గర్భం అంటూ ఈమె చెబుతున్నదంతా కట్టుకథ అని వైద్య అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని.. అంటే తాము గర్భం దాల్చినట్టు వారికి తెలియదని ప్రముఖ వైద్యుడు ఏమాన్ సులేమాన్ అంటున్నారు. ఇక ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరస్తున్నప్పటికీ ఇండోనేషియాలో గతంలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయని పోలీసుల వర్గాలు తెలుస్తోంది. న్యూస్ పోర్టల్ కోకోనట్ ప్రకారం.. గత ఏడాది జూలైలో ఇలాంటి కేసు వెలుగు చూసింది. 2017 లో కూడా ఓ కన్య గర్భం దాల్చిన మూడు గంటల్లోనే శిశువుకి జన్మనిచ్చినట్లు తన కథనంలో పేర్కొంది. -
ప్రేయసితో యువతి.. ఒక్క ట్వీట్‌తో!
జకార్తా: స్వలింగ సంపర్క జంటలకు ఇండోనేషియా స్వర్గధామం వంటిదంటూ చేసిన ట్వీట్ ఓ యువతిని కష్టాల్లోకి నెట్టింది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు దేశాన్ని వీడాల్సిందిగా స్థానిక అధికారులు ఆమెను ఆదేశించారు. వీరి వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. అమెరికాకు చెందిన క్రిస్టిన్ గ్రే అనే యువతి తన ప్రేయసి సాండ్రాతో కలిసి కొన్ని నెలల క్రితం బాలికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే నివాసం ఏర్పరచుకున్న ఈ జంట.. ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలో బాలిలో తమ జీవన విధానం, అక్కడ నివసించేందుకు అవుతున్న ఖర్చు, పొందుతున్న సౌకర్యాలు తదితర అంశాల గురించి అవర్ బాలి లైఫ్ ఈజ్ యువర్స్ పేరిట పుస్తకం రాశారు. గ్రాఫిక్ డిజైనర్ అయిన క్రిస్టిన్ ఈ ఇ-పుస్తకాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో వారు పంచుకున్న అనుభవాలు వివాదానికి దారి తీశాయి. (చదవండి: ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు) ‘‘కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో మేం వేసుకున్న ప్రణాళికలు చెల్లాచెదురైపోయాయి. అందుకే లాస్ ఏంజెల్స్‌లో ఉండే మేం బాలికి మకాం మర్చాం. అతి తక్కువ ధరలో ఇక్కడ విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ఇక్కడి పరిసరాలు అత్యద్భుతం. ముఖ్యంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ ఇక్కడ హాయిగా జీవించవచ్చు’’ అని క్రిస్టినా పేర్కొంది. అంతేగాకుండా.. కోవిడ్ సమయంలో అక్రమ పద్ధతుల్లో బాలికి ఎలా రావాలో తమ వీసా ఏజెంట్ల ద్వారా చెబుతామంటూ ఓ లింక్‌ను ట్విటర్లో షేర్ చేసింది. ఈ విషయంపై స్పందించిన న్యాయ శాఖ అధికారులు.. క్రిస్టిన్, ఆమె సహచరి ఉద్దేశపూర్వకంగానే తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాలి సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. వారిని అమెరికా తిరిగి పంపివేస్తామని, ఇందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక స్థానిక ఎల్జీబీటీ కమ్యూనిటీ సైతం క్రిస్టిన్ తీరును తప్పుబట్టింది. ఇండోనేషియాలో స్వలింగ సంపర్కం నేరం కానప్పటికీ, తమ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదని, దుష్ప్రచారాలు మానేయాలని హితవు పలుకుతున్నారు. అయితే క్రిస్టిన్ మాత్రం తానేమీ నేరం చేయలేదని, తాను గే అయినందు వల్లే దేశం నుంచి పంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం గమనార్హం. For anyone curious about the deleted/hidden Bali thread pic.twitter.com/FYA3mRcMNf — Salt chip (@gastricslut) January 17, 2021 -
ఉల్కాపాతం.. కోటీశ్వరుడయ్యాడు
జకర్తా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. మట్టిలో మాణిక్యాలు దొరికి కోటీశ్వరులు అయిన వారిని చూశాం. కానీ ఉల్కాపాతం వల్ల కోటీశ్వరుడు అయిన వారి గురించి వినడం కానీ చూడటం కానీ ఇంతవరకు జరగలేదు కదా. తాజాగా ఈ అరుదైన సంఘటన వాస్తవ రూపం దాల్చిఇంది. ఉల్కా రాత్రికి రాత్రే ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశం నుంచి ఇంటి పై కప్పు మీద 13 కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్పేస్ రాక్ పడింది. దాంతో అతడి దశ తిరిగింది. వివరాలు.. జోసువా హుటగలుంగ్ అనే వ్యక్తి ఇండోనేషియా ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్‌లో నివాసం ఉంటున్నాడు. శవపేటికలు తయారు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇంట్లో శవపేటిక తయారు చేస్తుండగా ఇంటి పై కప్పు మీద ఏదో పడినట్లు శబ్దం వినిపించింది. ఎవరైనా తన ఇంటి మీద రాళ్లు వేస్తున్నారా ఏంటి అనే అనుమానంతో బయటకు వచ్చి చూశాడు. అతడికి అక్కడ నల్లటి ఓ రాయి కనిపించింది. చేతిలోకి తీసుకున్నప్పుడు అది ఇంకా వేడిగానే ఉంది. బాగా పరిశీలించి చూడగా అది స్పేస్ రాక్ అని అర్థం అయ్యింది అన్నాడు. (చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..) జోసువా మాట్లాడుతూ.. ‘ఇంటి పై కప్పు మీద పడిన ఆ ఉల్క 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయింది. ఇక దీని బరువు సుమారు 2.1కిలోగ్రాములు ఉంది. ఇది తప్పకుండా ఆకాశం నుంచే పడి ఉంటుందని నా నమ్మకం. మా ఇరుగుపొరగువారు కూడా ఇది ఉల్కే అన్నారు. ఎందుకంటే ఆకాశం నుంచి నా ఇంటికి మీదకు రాయి విసిరే అవకాశం లేదు. ఈ ఉల్కాపాతంతో నన్ను అదృష్టం వరించింది. ఇక నా జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి. ఈ ఉల్క విలువ సుమారుగా 13 కోట్ల రూపాయలు ఉంటుంది అంటున్నారు. అంటే నా 30 ఏళ్ల జీతానికి సమానం. ఈ డబ్బులో కొంత భాగాన్ని చర్చి నిర్మాణానికి వినియోగిస్తాను’ అన్నాడు. ఇక ఈ ఉల్క క్వాలిటీ, పరిమాణాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక స్వచ్ఛతని బట్టి దీని విలువ గ్రాముకు 0.50-50 అమెరికన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన లోహాలకు గరిష్టంగా గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని తెలిపారు. (చదవండి: అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...) ఇక జోసువాకు దొరికిన స్పేస్ రాక్ 4.5 బిలయన్ సంవత్సరాల క్రితం నాటిదని.. ఇది సీఎం1/2 కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన అరుదైన స్పేస్ రాక్ అని తేలింది. ఇక దీని ధర గ్రాముకు 857 అమెరిన్ డాలర్లు పలుకుతుందని.. మొత్తం చూస్తే.. 1.85 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 137437517.50 రూపాయల)విలువ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. -
78వ ఏట 17ఏళ్ల పడుచుతో పెళ్లి.. వెంటనే
జకర్తా: గత నెల ఇండోనేషయాలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఓ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలయ్యాయి. ఎందుకంటే 78 ఏళ్ల వృద్ధుడు వయసులో తనకంటే 61 ఏళ్లు చిన్నదైన యువతిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించాడు. జనాలు ఈ పెళ్లి షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో బాంబ్ పేలింది. పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాకముందే విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు ఈ దంపతులు. ఆ వివరాలు.. గత నెలలో అబా సర్నా (78), నోని నవిత (17) అనే యువతిని ఎంతో వైభవంగా బంధుమిత్రులందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లై కనీసం నెల రోజులు కూడా కాలేదు. సరిగ్గా చెప్పాలంటే వివాహం అయిన 22 రోజులకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఇదంతా కలలా తోస్తుంది. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. విడాకులు తీసుకోబోతున్నారని తెలిసి షాక్ అయ్యాం’ అన్నారు. అంతేకాక ‘అబా సర్నాతో మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ వివాహం నచ్చలేదు. అక్కడి నుంచే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చు’ అన్నారు. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!) కానీ అబా సర్నా కుటుంబ సభ్యులు మాత్ర నోని పెళ్లికి ముందే గర్భవతి అని.. ఆ విషయం దాచి పెట్టి వివాహం చేశారని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితో నోని కుటుంబ సభ్యులు ఈ ఆరోపణల్ని ఖండించారు. ఇక వివాహ సమయంలో అబా సర్నా, నోనికి మోటార్ సైకిల్‌తోపాటు 50 వేల రూపాయల నగదుతో పాటు ఆమెకు అవసరమైన వాటిని కట్నంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక్కడ వరుడు, వధువుకు కట్నం ఇవ్వడం సాధారణం. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో గత ఏడాది చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ని బాధపెట్టడం ఇష్టం లేక ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. -
ఇండోనేషియాలో వరదలు..16 మంది మృతి
జకార్తా : ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్సులో వరదల కారణంగా 16 మంది మరణించారు. భారీ వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు 23 మంది గల్లంతయినట్లు జాతీయ విపత్తు సహాయ బృందం ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, అయితే వర్షం కారణంగా సహాయకచర్యలకు ఇబ్బంది వాటిల్లుతుందని చెప్పారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సమీపంలోని మూడు నదులను ముంచెత్తాయి. దీంతో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసం అయినట్లు గుర్తించారు. దాదాపు 4000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు ఉత్తర లువు జిల్లా కలెక్టర్ ఇందాపుత్రి పేర్కొన్నారు. వరద ఉదృతికి విమానాశ్రయం రన్ వే సహా రహదారి ప్రాంతాలు దెబ్బతిన్నాయని వివరించారు. ఈ ఏడాది జనవరిలోనూ భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలో 66 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. (భారీ వర్షాలకు భవనం కూలి ముగ్గురు మృతి) #IEWorld | Flash floods kill at least 16, displace hundreds in Indonesiahttps://t.co/vhexnpOTNA — The Indian Express (@IndianExpress) July 15, 2020 -
భూప్రకంపనలు.. ఇండోనేషియాలో అత్యధికం
జకార్తా : ఇండోనేషియా సహా వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియా, సింగపూర్ సహా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అత్యధికంగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు కాగా, సింగపూర్‌లో తెల్లవారుజామున 4.24 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో తెల్లవారుజామున 1:33 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జావా తీరం సముద్రగర్భంలో 528 కిలోమీటర్ల లోతులో భూకంపన కేందద్రాన్ని గుర్తించినట్టు ఇండోనేషియా వాతావరణ జియోఫిజిక్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని , సునామీ వచ్చే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. M6.1 #earthquake (#gempa) strikes 142 km N of #Semarang (#Indonesia) 7 min ago. Effects reported by eyewitnesses: pic.twitter.com/M19yatlAlO — EMSC (@LastQuake) July 6, 2020 -
‘ఆ పది మంది ఇండోనేషియన్లకు కరోనా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవలే ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 60 ఏళ్ల వృద్దుడికి కరోనా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయింది. ఈ నెల 14న కరీంనగర్లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి పది మంది సభ్యులు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన వారిలో తొలుత ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించగా.. తాజాగా మిగతా ముగ్గురికి కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఇండోనేషియా బృందాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. -
ది సర్జన్ గర్ల్.. బాలి దీవిపర్యటన
ఇండోనేషియాలోని అందమైన దీవి బాలి. ఇది ప్రకృతి రమణీయతకు ఆలవాలం. కనువిందు చేసే బీచ్‌లతో, సుందరమైన దేవాలయాలతో మధురానుభూతిని కలిగిస్తుంది. బాలి ప్రకృతి అందాలను వీక్షించి తన అనుభవాలను వెల్లడించారు నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ అనూన్యరెడ్డి. ప్రపంచంలోని ప్రకృతి అందాలను తిలకిస్తూ, నోరూరించే పుడ్స్ వివరాలతో పాటు మోటివేషనల్ మెసేజ్‌తో కొందరిలోనైనా మార్పు తీసుకురావాలన్న తపనతో ఇన్‌స్ట్రాగామ్‌లో ది సర్జన్ గర్ల్ పేరిట ఓ బ్లాగ్‌ను కూడా క్రియేట్ చేశారు ఆమె. బాలి దీవిపర్యటన వివరాలను పంచుకున్నారిలా.. శ్రీనగర్‌కాలనీ :గత నవంబర్‌లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాలి గురహ్ రాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి వెళ్లాను. నాన్న, తమ్ముడికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో అక్కడే కారు అద్దెకు తీసుకుని ప్రయాణాన్ని కొనసాగించాం. ఉలువాటు: పురా తానాలాట్ దేవాలయం నీటి మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళితేగానీ అక్కడి అందాలను వర్ణించడం కష్టం. ఇక్కడే ఉలువాటు దేవాలయం ఉంది. ఇదో ప్రత్యేకమైన దేవాలయం. ఇక్కడే రామాయణ ఇతిహాసాన్ని వివరిస్తూ నాటక ప్రదర్శన చేస్తారు. కచ్చితంగా చూడాల్సిన నాటకమిది. ఉలువుటా అంటే రాతి కట్టడం అని అర్థం. ఇక్కడి కట్టడాలు కనువిందు చేస్తాయి. నూసాపెనిడా: నూసా పెనిడా ఐలాండ్ ప్రశాంతతకు నిలయం. ఇక్కడ చాలా బీచ్‌లు ఉన్నాయి. కెలింగ్కింగ్ బీచ్, బ్రోకెన్ బీచ్, ఏంజెల్స్ బిలాబాంగ్, క్రిస్టల్ బే బీచ్‌లు ప్రత్యేకం. వాటర్ కూడా చాలా నార్మల్ ఉంటాయి. ఇక్కడే జీవితకాలం ఉండాలిపించేంతగా బీచ్‌లు ఉంటాయి. నూసా దువా వాటర్ బౌల్ మరో అద్వితీయమైన ప్రదేశం. ఉబుద్: బాలిలో ఉబుద్ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడ టిట్రా దేవాలయం ఉంది. ఇక్కడి నీటిని చాలా పవిత్రంగా చూస్తారు. ఇక్కడ తెగనుంగా వాటర్‌ఫాల్స్, తుకడ్ వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. సూర్యుడి కిరణాలు పడినపుడు వాటర్ ఫాల్స్‌లోని నీరు బంగారువర్ణంగా కనిపిస్తూ మధురానుభూతిని కలిగిస్తాయి. ఉబుద్లోనే తెగల్లాలాంగ్ రైస్ టెర్రస్ ఆహ్లాదమైన ప్రదేశం. చాలా ఎత్తులో రైస్ టెర్రస్ ఉంటుంది. కింద రైస్ పంట ఉంటుంది. ఇక్కడ లవ్ షేప్‌లో ఉండే ఓ నిర్మాణం నుంచి చూస్తే కనులవిందుగా ఉంటుంది. ఇక్కడే స్కేర్డ్ మంకీ ఫారెస్ట్ ఉంది. పురా పెనటరన్ దేవాలయం: బాలిలో మౌంట్ లెంపియాంగ్ కరంగసెమ్లో పురా పెనటరన్ దేవాలయం ఉంది. చాలా ఎత్తులో ఉండే అతి పురాతమైన దేవాలయం ఇది. ఇక్కడి కట్టడాలు, అందాలు వర్ణణాతీతం. ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇందులో పురా దను బ్రతన్, తమన్ అయున్, సరస్వతీ దేవాలయం, బేజి దేవాలయాలు ప్రత్యేకం. బాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకృతి అందాలు, కట్టడాలు అద్వితీయం. హనీమూన్ స్పాట్‌గా కూడా ప్రత్యేకం. ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రదేశం బాలి. సరికొత్త విషయాలు, ఫుడ్, ట్రావెల్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో నా బ్లాగ్ ఫాలో కావచ్చు. కుటా: కుటా ప్రాంతం షాపింగ్, నైట్‌లైఫ్, సర్పింగ్ బీచ్‌లు, క్లబ్‌ల నిలయం. ఇక్కడ ఫుల్‌గా షాపింగ్, ఎంటర్టెయిన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇండోనేషియా సంప్రదాయ వస్తువులు, కళాఖండాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియన్, చైనీస్, జపనీస్, అమెరికన్ స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇండోనేషియన్ పుడ్‌లో నాసిగొరిగో, మీగొరిగోలు ప్రత్యేకం. -
‘ఆసియా’ చాంప్ తస్నిమ్
సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి తస్నిమ్ మీర్ విజేతగా అవతరించింది. భారత్‌కే చెందిన తారా షాతో ఆదివారం జరిగిన ఫైనల్లో తస్నిమ్ మీర్ 17–21, 21–11, 21–19తో విజయం సాధించింది. గుజరాత్‌కు చెందిన 13 ఏళ్ల తస్నిమ్ తన తల్లితో కలిసి 2017లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో చేరి ఆయన వద్దే శిక్షణ తీసుకుంటోంది. తస్నిమ్ తండ్రి ఇర్ఫాన్ అలీ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఖేలో ఇండియా గేమ్స్‌లో అండర్–17 సింగిల్స్ విభాగంలో స్వర్ణం నెగ్గిన తస్నిమ్ గతేడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన రెడ్డితో కలిసి అండర్–15 డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. -
మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం (డబ్ల్యూఐఎఫ్3) ప్రతినిధి విజయ్. కె.లబ్సెత్వార్ నుంచి ఇరిగేషన్ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ (ఐసీఐడీ) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. మిషన్ కాకతీయపై సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, చిన్న నీటివనరుల ఎస్ఈ కె.శ్యాంసుందర్‌లు రాసిన సాంకేతిక పత్రం ఈ సదస్సులో సమర్పించేందుకు ఆమోదం పొందింది. అలాగే ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటి నిర్వహణ అభివృద్ధి గురించి, ఎస్సారెస్పీలో నీటి సమర్థ వినియోగం గురించి రాసిన సాంకేతిక పత్రాలు కూడా సదస్సు ఆమోదం పొందాయి. ఈ మేరకు ఈ మూడు అంశాలపై ఇరిగేషన్ అధికారులు సదస్సుకు హాజరై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మూడు సాంకేతిక పత్రాలు రాసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, అడ్మిన్ ఈఎన్సీ బి.నాగేందర్‌రావులు అభినందించారు. -
ఫారిన్లో పాట
ఇండోనేషియాలో ల్యాండయ్యారు హీరో సూర్య. వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా! కాస్త విశ్రాంతి తీసుకుందామని టూర్ ప్లాన్ చేశారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అంత టైమ్ లేదు సూర్యకు. ఒప్పుకున్న సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇండోనేషియా ఎందుకు వెళ్లారు అంటే.. ‘కాప్పాన్’ సినిమా కోసం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఇండోనేషియాలోని జావా ద్వీపానికి వెళ్లారు టీమ్. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమాలో మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ‘కాప్పాన్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ‘శూరరై పోట్రు’ అనే సినిమాలో, ఆ తర్వాత శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారు సూర్య. అలాగే సూర్య పూర్తి చేసిన ‘ఎన్జీకే’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. -
బాలి..భలే
వేసవి సీజన్లో విభిన్న ప్రాంతాలను చుట్టి రావాలని ఆశించే సిటీజనుల కోసం నగరానికి చెందిన టూర్ఆపరేటర్లు రకరకాల ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సందడి సృష్టిస్తున్నారు. ఇటీవల నగరం నుంచి టూర్స్‌కి వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాటు అందుబాటు బడ్జెట్లో ఉండే వాటికి ఆదరణ కూడా పెరుగుతుండడంతో ఈ తరహా ప్యాకేజీల విషయంలో ఆపరేటర్ల మధ్యపోటీ నెలకొంది. ఇది దేశ విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను మధ్యతరగతి వారికి కూడా చేరువ చేస్తోంది. అలాంటి వాటిలో ఇండోనేసియా రాజధానిబాలి ఒకటి. సాక్షి, సిటీబ్యూరో :ఇండోనేసియాలోని అందమైన ఐలాండ్ సిటీ బాలి. అగ్ని పర్వతాలకు చేరువలోనే అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు, ఉలువట్టు టెంపుల్, బీచ్ సైడ్ సిటీ కుటా, సెమిన్యాక్, సనూర్, నూసా డువా వంటి రిసార్ట్ టౌన్స్, యోగా మెడిటేషన్ రిట్రీట్స్‌కి కూడా ఈ ఐలాండ్ పేరొందింది. పూర్తిగా ప్రకృతి సౌందర్యానికి నిలయం ఈ ఐలాండ్ సిటీ. నగరం నుంచి బాలికి పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని టూర్ ఆపరేటర్లు కనీసం రూ.40 వేల నుంచి మొదలుకుని ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ టూర్ ఆపరేటర్ కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ ఒక వ్యక్తికి రూ.43,882 చొప్పున ప్యాకేజీని ప్రకటించింది. రాకపోకల విమాన ఖర్చుల నుంచి 7రోజులు, 6 పగళ్లు వసతి వరకూ ఇందులోనే కలిపి ఉన్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునే చిట్కాలు.. ♦ నగరంలో అంతర్గత రాకపోకలకు షటిల్ సర్వీస్ బస్సులను వినియోగించాలి. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉండడంతో పాటు తక్కువ ఖర్చు, సురక్షితం, సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. నగరంపై అవగాహనకూ ఉపకరిస్తాయి. ♦ ఇక్కడ వీధుల్లో లభించే ఆహారం కూడా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో ముగించాలని అనుకునేవారు వీటిని ఎంచుకోవడం ఉత్తమం. -
ఛీ.. ఛీ.. వాక్.. సబ్బును టేస్ట్ చేస్తారా?
సబ్బు.. టెస్ట్ చేయాలంటే శరీరానికి రుద్దుకోవాలి.. మరి టేస్ట్ చేయాలంటే.. ఛీ.. ఛీ.. వాక్.. సబ్బును టేస్ట్ చేస్తారా ఎవరైనా! అనే కదా మీకు అనిపిస్తుంది. కానీ ఈ ఫొటోలో ఉన్నామె కాస్త డిఫరెంట్. సబ్బును టేస్ట్ చేస్తాను అంటూ ముందుకొస్తోంది. ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన ఖోసిక్ అసీఫాకు ఓ వింత రకమైన అలవాటు ఉంది. సబ్బులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మరీ వాటికి రేటింగ్ ఇస్తుందట. రెండేళ్ల కిందట ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. దీంతో ఆమె సబ్బులను ఇలా రుచి చూడటం ప్రారంభించిందట. రుచి చూడటమంటే ఏదో అలా నాలుక చివర అంటించుకుని మమ అనిపించేయడం కాదు.. చక్కగా ఐస్‌క్రీం మాదిరిగా రుచి చూసి మరీ రేటింగ్ ఇస్తుందట. అంతేకాదు ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. వేలాది లైకులు.. కామెంట్లు వస్తున్నాయి కూడా. అంతేకాదు ఆ తర్వాత ఏ సబ్బును రుచి చూడాలో వాటి బ్రాండ్ పేరును సూచిస్తున్నారు ఫాలోవర్లు. ఎప్పుడు.. ఎవరు.. ఎలా ఫేమస్ అయిపోతారో అస్సలే అర్థం కావట్లేదు..! -
ఇండోనేషియా మహిళను పెళ్లాడిన తమిళ తంబి
అన్నానగర్: ఇండోనేషియా దేశానికి చెందిన మహిళను తమిళ సంప్రదాయం ప్రకారం తమిళనాడులోని కారైకుడి యువకుడు బుధవారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. కారైకుడి సమీపంలోని పల్లత్తూర్ ప్రాంతానికి చెందిన మునియాండి రైతు కుమారుడు కార్తికేయన్ (32). ఇతను డిప్లొమో చదివి సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే ఇండోనేషియాకి చెందిన బెర్లిస్ (30), కార్తికేయన్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో బెర్లిస్, తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని కోరింది. బుధవారం కారైకుడిలోని పల్లత్తూరులో పెద్దల సమక్షంలో బెర్లిస్, కార్తికేయన్ వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. -
అయ్యో పులి!
మన తర్వాతి తరాలు పులులను చూడాలంటే ’జూ’కు కాకుండా మ్యూజియానికి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇరవై ముప్పై లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన పులులు రాను రాను పూర్తిగా అంతరించి పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల పులి జాతులే మనకు మిగిలి ఉన్నాయి. అవి కూడా మొత్తం 4 వేల పులులే ప్రాణాలతో ఉన్నాయి. కాస్పియన్ సముద్ర ప్రాంతం, జావా, బాలి ప్రాంతాల్లోని పులులు ఇప్పటికే పూర్తిగా అంతరించి పోయినట్లు ‘కరెంట్ బయోలజీ’అనే సైన్స్ జర్నల్ ప్రచురించింది. పులుల ప్రస్థానానికి సంబంధించిన తొలి జన్యు అధ్యయనమిది అని బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన షు జిన్ ల్యో చెప్పారు. పులుల్లో ఆసక్తికరమైన అంశాలు.. పులులు సంచరించే దేశాలు, ప్రాంతాలను బట్టి వాటి లక్షణాల్లో కూడా భిన్నత్వం ఉంటుంది. ఆసియాలోని పెద్ద పిల్లులు (బిగ్ క్యాట్స్) వాసనని బట్టి కాకుండా చూపును బట్టీ, ధ్వనిని బట్టి వేటాడతాయి. ఒక్కో పులి ఒక్కసారి దాదాపు 40 కిలోల మాంసాన్ని తింటుంది. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లలకి జన్మనిస్తుంది. పులి పిల్లలు రెండేళ్ల తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి. లైంగిక పునరుత్పత్తి ప్రక్రియలు ఆడ పులుల్లో మూడు నుంచి నాలుగేళ్లకు ప్రారంభమైతే.. మగపులులకు నాలుగు నుంచి ఐదేళ్లకు ప్రారంభమవుతుంది. ఎక్కువ శాతం పులులు రెండేళ్ళకు మించి జీవించడం లేదు. అయితే పులుల జీవన ప్రమాణం మాత్రం రెండు దశాబ్దాలు. సైబీరియాలోని అమూర్ టైగర్ అనే అతిపొడవైన మగ పులిజాతులు 300 కేజీల బరువుంటాయి. చిన్నవైన సుమత్రా టైగర్ ఉపజాతులు 140 కేజీలు ఉంటాయి. అయితే అన్ని పులుల్లోనూ మగ పులులు ఆడ పులులకంటే బరువు ఎక్కువగా ఉంటాయి. అంతరించిపోతున్న పులిజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. అయితే ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దీన్నిబట్టి అడవులను కాపాడుకోవడమే అరుదైన పులిజాతులను మన భవిష్యత్ తరాలకు అందించే ఏకైక మార్గం అని అర్థం అవుతోంది. పెద్ద పిల్లులు ప్రత్యేకం.. చూడటానికి ఒకేలా ఉన్నా పులులన్నీ ఒకే రకంగా ఉండవనీ, వాటి శరీర పరిమాణాన్ని బట్టి పులుల్లో వైవిధ్యాన్ని గుర్తించొచ్చని ల్యో అభిప్రాయం. భారతదేశపు పులుల కంటే కూడా రష్యా పులుల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే మలేసియా పులులకు, ఇండోనేసియా పులులకు మధ్య తేడా ఉంటుంది. పులులు అంతరించి పోవడానికి ప్రధాన కారణాలు.. మనుగడకు అవకాశం లేకపోవడం అడవుల ఆక్రమణ వాతావరణ మార్పుల ప్రభావం కొన్ని పులిజాతుల్లో రాను రాను జనన సామర్థ్యం పూర్తిగా క్షీణిస్తున్నట్లు జన్యు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలి ఉన్న పులి జాతులివే.. బెంగాల్ టైగర్ అమూర్ టైగర్ సౌత్ చైనా టైగర్ సుమత్రా టైగర్ ఇండోచైనీస్ టైగర్ మలయాన్ టైగర్ -
2వేలకు చేరిన ఇండోనేసియా మృతులు
పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సునామీ, భూకంపం సంభవించి పది రోజులు గడిచినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు పలూ పట్టణంలో సుమారు 2వేల మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలుత 5వేలకు పైగా గల్లంతు అయ్యారని భావించిన్పటికీ.. ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే అంచనాకు అందటం లేదన్నారు. హోటల్ మొత్తం జల్లెడపట్టామని, ఇక్కడ 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,944కు చేరుకుంది. ఈ నెల 11 వరకు అధికారికంగా గాలింపుచర్యలు చేపడతామని స్థానిక మిలటరీ ప్రతినిధి తోహిర్ తెలిపారు. -
ఇంకా 1000మంది జాడ తెలియదు
పలూ: గతవారం ఇండోనేసియా దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం, సునామీ విలయంలో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వెయ్యిమందికి పైగా ఉన్నట్లు తాజాగా తేలింది. తీవ్ర భూకంపంతో పాటుగా సునామీ ధాటికి సులావేసి ద్వీపంలోని పలు నగరంలో మరణించిన వారి సంఖ్య 1,558కు చేరుకుంది. అక్కడి నివాస గృహాలు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది ప్రజలు ఆ ప్రాంతంను వదిలి వెళ్ళిపోయారు. ఈమేరకు శుక్రవారం ఇండోనేసియా ప్రభుత్వ ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. సునామీ ఘటనలో మరణించిన వారికి బలరోవా ప్రాంతంలో ప్రభుత్వమే సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది. -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సునామీ విలయ విధ్వంసం
పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. తొలుత భూకంపంతో భవనాలు నేలకొరగడం, అంతలోనే 6 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడటంతో సులవేసి ద్వీపంలో ఆదివారం సాయంత్రం నాటికి 832 మంది చనిపోయారు. ద్వీపంలోని ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు దుకాణాలతో పాటు తాగునీటి ట్యాంకర్లను సైతం లూటీ చేస్తున్నారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కల్లా మాట్లాడుతూ..భూకంపం సంభవించిన ఉత్తర సులవేసి ప్రాంతంలో మృతుల సంఖ్య వేలలో ఉండొచ్చని తెలిపారు. చాలామంది ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని వెల్లడించారు. భూకంపం–సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదన్నారు. కాగా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆదివారం సాయంత్రం సులవేసిలోని పలూ పట్టణాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం–సునామీ నేపథ్యంలో ఇండోనేసియాలో చిక్కుకున్న 71 మంది విదేశీ పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు, దక్షిణ కొరియాకు చెందిన ఓ పర్యాటకుడి జాడ తెలియరాలేదని వెల్లడించారు. వాయుసేనకు చెందిన సీ–130 హెర్క్యులస్ విమానం ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఆపద్బాంధవుడిగా ఫేస్బుక్ భూకంపం–సునామీ తాకిడికి అతలాకుతలమైన సులవేసి ద్వీపంలో ప్రజలకు ఫేస్బుక్ సహాయకారిగా మారింది. చాలామంది తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. సంబంధిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరికొందరేమో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఫొటోలు తీసి ఫేస్బుక్ గ్రూపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారనీ, సాయం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు దొరికితే సామూహిక ఖననం చేయవద్దనీ, వాటిని తాము తీసుకువెళతామంటున్నారు. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ ఇండోనేసియాలో భూకంపం–సునామీతో 832 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో మిత్రుడైన ఇండోనేసియాకు తోడుగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. పని చేయని హెచ్చరిక వ్యవస్థ ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సులవేసి ద్వీపంలో మృతుల సంఖ్య 832కు చేరుకుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. 2004 సునామీ సృష్టించిన భయానక విధ్వంసం తర్వాత పసిఫిక్ ప్రాంతంలో సునామీలను గుర్తించేందుకు సెన్సార్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, బోయెలతో ఓ ప్రోటోటైప్ వ్యవస్థను అమెరికా–జర్మనీ– మలేసియా–ఇండోనేసియా శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందుకోసం అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ రూ.21.75 కోట్లను కేటాయించింది. ఈ హెచ్చరిక వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కేవలం రూ.50 లక్షలు కావాల్సి ఉండగా, ఆర్థికస్థితి బాగోలేదంటూ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. సరైన నిర్వహణ లేకపోవడంతో సముద్ర గర్భంలోని ప్రకంపనలను పసిగట్టే చాలా బోయెలు చెడిపోగా, మరికొన్ని చోరీకి గురయ్యాయి. అలాగే సునామీని ముందుగా హెచ్చరించే ‘టైడ్ గేజ్’లు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో ఫైబర్ కేబుల్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఏ విభాగం కూడా ముందుకు రాలేదు. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ప్రజలు కకావికలమయ్యారనీ, ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సునామీ హెచ్చరిక సైరన్లను అధికారులు మోగించలేకపోయారని నిపుణులు గుర్తించారు. భూకంపాలు సంభవించినప్పుడు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లిపోవాలన్న అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సునామీలో చిక్కుకుని చాలా మంది దుర్మరణం చెందారన్నారు. రియల్ హీరో ఏటీసీ ఉద్యోగి భూకంపం సందర్భంగా తన ప్రాణాలను కోల్పోయినా వందలాది మందిని కాపాడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ) ఆంథోనియస్ గునవన్ అగుంగ్(21)ను స్థానిక మీడియా హీరోగా కీర్తిస్తోంది. పలూలోని మురియారా ఎస్ఐఎస్ అల్ జుఫ్రీ విమానాశ్రయంలో ఆంథోనియస్ శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. దీంతో మిగతా ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందిని బయటకు పంపిన ఆంథోనియస్ తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. వరుస ప్రకంపనలు భవనాన్ని కుదిపేస్తున్నా అక్కడే ఉండి ఎయిర్‌పోర్టులోని విమానాలకు క్లియరెన్స్ ఇవ్వసాగాడు. ఎయిర్‌పోర్ట్‌లోని చిట్టచివరి విమానం టేకాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో నాలుగంతస్తుల భవనం నుంచి ఒక్కసారిగా దూకేశాడు. అంతర్గత రక్తస్రావంతో పాటు కాలు విరిగిన ఆంథోనియస్ను సహోద్యోగులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్) అక్కడకు చేరుకునేలోపే ఆంథోనియస్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఆంథోనియస్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన ర్యాంకును రెండు లెవల్స్‌కు పెంచినట్లు ఎయిర్ నావ్ కంపెనీ తెలిపింది. సునామీలో ధ్వంసమైన దుకాణం నుంచి సరుకులను ఎత్తుకెళ్తు్తన్న స్థానికులు -
సునామీ బీభత్సం.. 800కు చేరిన మృతుల సంఖ్య
జకార్తా : సునామీ దాటికి దీవుల దేశం ఇండోనేషియా చిగురుటాకులా వణికుతోంది. శుక్రవారం సంభవించిన భారీ భూకంపంతోపాటు, సునామీ ప్రకంపనలకు మృతుల సంఖ్య 800 మందికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా సులవేసి సమీపంలోని పలూ పట్టణంలో అత్యధికంగా ప్రజలు మరణించినట్లు అధికారులు తెలిపారు. పలూ పట్టణంలో వీదేశి పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్దమవుతున్న తరుణంలోనే సునామీ రావడంతో ప్రాణ నష్టం భారీ సంఖ్యలో వాటిల్లింది. సునామీ ధాటికి వేల మంది గల్లంతయ్యారని, వారి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ.. హెలికాఫ్టర్లు, సైనిక దళాల సహాయంతో చర్యలు చేపడుతున్నారు. సునామీ ధాటికి రోడ్లు, భవనాలు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రతాపానికి అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనారు. కాగా ఇండోనేషియాను భారత్ తరఫున తగిన సహాయం అందిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారీ భూకంపం.. 400 మంది మృతి
జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. హృదయ విదారక దృశ్యాలు భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్‌లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి. నిరాశ్రయులు లక్షల్లోనే.. భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు. రంగంలోకి సైన్యం ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో చీఫ్ టామ్ హోవెల్ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమత్రాలో మొదలై.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్ డే (డిసెంబర్ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్‌సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ ధ్వంసం పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు -
ఇండోనేషియా మరోసారి భూకంపంతో సునామీ
-
సునామీ దాటికి వణికిన దీవుల దేశం..!
జకార్తా : దీవుల దేశం ఇండోనేషియా మరోసారి భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళలకు గురైయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదవ్వడంతో ప్రజలు ఇళ్లలోంచి భయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తీర ప్రాంతంలో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఎగసిపడడంతో ప్రజలు ఉరుకులుపరుగులు తీశారు. సునామీ దాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద విపత్తు సంభంవించే అవకాశం ఉన్నందున అధికారులంతా సిద్దంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఎంతా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. కాగా గతనెల ఇండోనేషియాలోని లాంబోక్ దీవిలో సంభవించిన భూకంపంలో 500కి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. -
అట్టహాసంగా ఏషియాడ్ ముగింపు వేడుకలు
-
జకార్తా జిగేల్...
ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ చిత్రగీతాలు వేదికపై హైలైట్ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్ హిట్టయ్యాయి. జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్డ్ ట్రయాథ్లాన్ ఈవెంట్ జరిగింది. జపాన్ బృందం ఈ గేమ్స్ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఆటలేమో చూడలేదు కానీ! ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్. అందుకేనేమో సిద్ధార్థ్ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్ గయా’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్ స్టంట్తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చీఫ్ అహ్మద్ అల్ ఫహాద్ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి. ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. -
ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన భారత హాకీ జట్టు
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్ మ్యాచ్‌లో భారత్26-0తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది. భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్‌తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్‌చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్‌లో కూడా భారత్17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. FT| The Indian Men's Hockey Team score 26 goals against Hong Kong China in their third game of the @asiangames2018 which saw 4 players claim hat-tricks and a sublime team effort to achieve the large score-line on 22nd August 2018.#IndiaKaGame #AsianGames2018 #INDvHKG pic.twitter.com/UiqYtgzbsq — Hockey India (@TheHockeyIndia) 22 August 2018 -
నేటి నుంచి ఏషియన్ గేమ్స్
-
భిన్ భిన్... అటుంగ్... కాకా
2018 ఆసియా క్రీడల మోటోగా ‘ఎనర్జీ ఆఫ్ ఆసియా’ను నిర్ధారించారు. దీంతో పాటు మస్కట్లుగా భిన్ భిన్, అటుంగ్, కాకాలను ప్రకటించారు. భిన్ భిన్ను బర్డ్ ఆఫ్ ప్యారడైజ్‌గా అభివర్ణిస్తారు. ఈశాన్య ఇండోనేసియాలో కనిపించే ఈ పక్షి వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక. అతుంగ్... వేగంగా పరుగెత్తే బవియన్ దుప్పి. ఇండోనేసియా మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయివి. ‘ఎప్పటికీ వదలొద్దు (నెవర్ గివ్ అప్)’ అనే ఉద్దేశంలో దీనిని ఎంపిక చేశారు. చివరిదైన కాకా... ఖడ్గమృగం. అసలు పేరు ఇకా. అంతరిస్తోన్న ఈ జంతువు విశిష్టత తెలిపేందుకు, శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ మస్కట్‌గా ప్రకటించారు. -
ఏషియాఢంకా
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు... ... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం సాక్షి క్రీడా విభాగం ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...! నవ యువత... అనుభవజ్ఞులు ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్‌లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతమే స్ఫూర్తి... కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్‌లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్‌లకు తోడు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది. సింధు, శ్రీకాంత్‌లపై దృష్టి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్‌లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్‌ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్ఎస్ ప్రణయ్పైనా ఆశలున్నాయి. హిమాదాస్ మెరిసేనా... అసోంకు చెందిన హిమాదాస్‌పై ఈ ఏషియాడ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీరేం చేస్తారో... రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్‌లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్‌ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది. ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..? పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. గత ఏషియాడ్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ‘కిక్’ ఇస్తారా? బాక్సింగ్‌లో భారత్‌కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది. ► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు. 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్‌బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ప్రారంభ వేడుకలు సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం మనోళ్లు 17 మంది... ► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్). ► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ) ► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ) ► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ) ► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్) ► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ) ► సెపక్తక్రా– తరంగిణి (తెలంగాణ) ► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ) ► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ) -
రన్నరప్ జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అజయ్ ఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 30 ఏళ్ల భారత ఆటగాడు 14–21, 10–21తో రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లోనే భారత ప్లేయర్ ఆట ముగిసింది. ‘ఫైనల్లో ఏ దశలోనూ నేను నిలకడగా ఆడలేదు. అనవసర తప్పిదాలు చాలా చేశాను. నెట్ వద్ద తడబడ్డాను. సుదీర్ఘ ర్యాలీలకు సరైన ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నాక గత రెండు నెలల్లో మంచి ప్రదర్శనే చేశాను. రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాను’ అని జయరామ్ వ్యాఖ్యానించాడు. -
ఏకంగా 300 మొసళ్లను చంపేశారు
-
శతాబ్దాల బాంధవ్యం
ఆగ్నేయాసియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ ప్రాంతమంతటా భారతీయ ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ప్రస్తుత తరం ఆగ్నేయాసియా ప్రజలకు భారతీయుల గురించి, ప్రస్తుత తరం భారతీయులకు ఆగ్నేయాసియా ప్రజల గురించి చాలా తక్కువగానే తెలిసి ఉండటం దురదృష్టకరమైంది. అమెరికా, యూరప్ చరిత్ర గురించి మనకు బాగానే తెలుసు. పైగా గులాబీ యుద్ధం జరిగిన చోటు, బ్రిటిష్ రాజుల సమాధి స్థలాలు వంటి పాశ్చాత్య దేశాల్లోని అప్రాధాన్య ప్రాంతాలను సందర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం కానీ, భారతదేశం నుంచి ఆగ్నేయాసియా వారసత్వంగా స్వీకరించిన హిందూ, బౌద్ధ చారిత్రక నిర్మాణాల గురించి మర్చిపోయాం. ఇండోనేషియాలోకి ఇస్లాం మతం కత్తితో కాకుండా వ్యాపారంతో విస్తరించింది. మతాన్ని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన వ్యాపారులు అప్పటికే ఉన్న హిందూ, బౌద్ధ సంస్కృతి నుంచి ఇస్లాం మతానికి శాంతియుతంగా పరివర్తన చేశారు. అందుకే సీతా అనే అమ్మాయి ఇస్లాం మతాన్ని ఆచరించే అరుదైన దృశ్యం ఇండోనేషియాలోనే కనిపిస్తుంది. హిందూ మతంతో ముడిపడిన అనేక పౌరాణిక గాథలు వీరికి తెలుసు. నా పర్యటనలో నేను పాల్గొన్న శిక్షణా కార్యక్రమానికి పలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తమ భాషలోని అక్షరాలు భారతీయ అక్షరమాలనే పోలి ఉంటాయని, వలసపాలనలోనే రోమన్ అక్షరాలు తమ అక్షరమాల స్థానంలో వచ్చి చేరాయన్నారు. నా పర్యటనలో భాగంగా యోగ్యకర్త పట్టణం (సౌభాగ్యనగరం అని అర్థం) సందర్శించాను. ఇది కూడా సంస్కృతపదమే. ఇక్కడే బోరోబుదుర్ అనే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం. యోగ్యకర్త పట్టణంలో దక్షిణభారత శిల్పశైలిని ప్రతి బింబించే అద్భుతమైన ఆలయాలను చూడవచ్చు. ఇండోనేషియాలో బౌద్ధం నిర్వహించిన ముఖ్య పాత్రకు బోరోబుదుర్ నిర్మాణాలు నిదర్శనాలు. అలాగే ఆ దేశ సాంస్కృతిక వారసత్వంలో రామాయణ జానపద గా«థలు ఓ అంతర్భాగం. ఆగ్నేయాసియాతో భారత్‌కున్న సన్నిహిత సాంస్కృతిక బాంధవ్యాలకు మరో చక్కటి నిదర్శనం కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం. బోరోబుదుర్లో శిలలపై బుద్ధుడి జీవిత విశేషాలను చిత్రించినట్లుగానే, అంగ్కోర్ వాట్ ఆలయ శిలలపై వాటితోపాటు భీష్ముడి అంపశయ్య వివరాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమ ప్రాచీన రాజులు భారతీయ రాజరికపు కుదురు నుంచి వచ్చారని చెబుతుంటాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలోనే అయోధ్యకు చెందిన కొందరు రాజకుమారిలు తమ దేశ చక్రవర్తిని పెళ్లాడారని కొరియన్ల విశ్వాసం. కొరియా పురాణాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈ కాలంలోనే కాంబోడియాలో నెలకొన్న ఒక సామ్రాజ్యానికి భారతీయ మూలాలున్నట్లు అక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిద్వారా భారత్‌తో మతపరమైన సంబంధాలు మరింతగా బలపడ్డాయి. దక్షిణ భారతంతోపాటు కళింగ రాజులు కూడా ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నారు. బొరోబుదుర్ మహా శిల్ప నిర్మాణం ముందు, అంగ్కోర్ వాట్ అద్భుత దేవాలయం ముందు నిలబడినప్పుడు కలిగేటంత అనుభూతిని ఏ ఇతర దేశాన్ని కానీ లేక యూరప్ చారిత్రక నిర్మాణాలను, అమెరికా సహజ సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు పొందలేం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాలకు తక్కువ ఖర్చుతోనే మనం పర్యటించవచ్చు. వాణిజ్య అవసరాల ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీని భారత ప్రజలకు ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుసంధాలను మరింత బలపర్చేవిధంగా మెరుగుపర్చాలి. అలాగే ఇరుప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేవిధంగా పర్యాటక సంస్కృతిని మరింతగా పెంపొం దించాలి. భారతీయ ఉపఖండంతో ఈ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘ చారిత్రక బాంధవ్యాన్ని ప్రజలు మరిం తగా తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలి. ఐవైఆర్ కృష్ణారావు : వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
తల్లి శవపేటిక మీద పడి.. విషాదం
ఇండోనేషియా : తల్లి చనిపోయిన బాధలో ఉన్న ఆ కొడకు జీవితం విషాదంగా ముగిసింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో తల్లి శవపేటిక మీద పడి తీవ్ర గాయాలపాలైన కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర తొరజాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర తొరజాలోని పారిండింగ్ లోయకు చెందిన సేమెన్ కొండోరుర(40) తల్లి ‘బెర్తా’ కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అక్కడి సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని ఒక శవపేటికలో ఉంచి చెక్కతో తయారు చేసిన ఓ చిన్న పాటి మేడలో ఉంచాలి. అనుకున్న ప్రకారం అంతా సిద్ధం చేసి శవపేటికను మేడ పైకి తరలిస్తున్న సమయంలో నిచ్చెన పక్కకు జరగటంతో అంతా ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. దీంతో శవపేటిక మేడపై నుంచి సేమెన్ మీదకు జారి పడింది. బరువైన శవపేటిక అలా అంత ఎత్తు నుంచి మీద పడటంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సేమెన్ మృతి చెందాడు. సేమెన్ శవాన్ని తల్లి బెర్తా శవంతో పాటే ఉంచి ఘనంగా ఖననం చేశారు బంధువులు. -
ఇండోనేసియా చేరుకున్న మోదీ
జకార్తా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇండోనేసియాకు చేరుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఇండోనేసియాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఆ దేశ రాజధాని జకార్తా చేరుకున్న వెంటనే మోదీ ఇంగ్లిష్, ఇండోనేసియా భాషల్లో ట్వీట్ చేస్తూ ‘జకార్తాలో దిగాను. నాగరికత, చారిత్రక విషయాల్లో భారత్, ఇండోనేసియాల మధ్య బలమైన బంధం ఉంది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక, ప్రయోజనాలను నా పర్యటన మరింత విస్తృతం చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడోతో మోదీ బుధవారం భేటీ అయ్యి, తీరప్రాంత అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు. వారిద్దరూ కలసి వివిధ కంపెనీల సీఈవోల సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఇండోనేసియాలోని భారతీయులతో మోదీ సమావేశమవుతారు. గురువారం మలేసియా వెళ్లి, కొత్తగా ఎన్నికైన ప్రధాని మహథిర్ మహ్మద్‌ను మోదీ కలిసి శుభాకాంక్షలు చెబుతారు. మహథిర్తో చర్చలు జరిపిన అనంతరం సింగపూర్ వెళ్తారు. శుక్రవారం అక్కడ షాంగ్రీ లా డైలాగ్‌లో ప్రసంగిస్తారు. భద్రతాంశాలపై ప్రతి ఏడాదీ జరిగే సదస్సును షాంగ్రీ లా అని పిలుస్తారు. ‘ఈ సదస్సులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాల పరిరక్షణ పట్ల భారత వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం’ అని మోదీ ట్వీట్ చేశారు. సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకుబ్, ప్రధాని లీ హ్సీన్ లూంగ్‌లను కూడా మోదీ కలుస్తారు. మహాత్మా గాంధీ అస్థికలను సముద్రంలో కలిపిన చోటైన ‘క్లిఫర్డ్ పియర్’ వద్ద మోదీ ఓ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. -
జాలీగా...బాలి వెళ్లొద్దామా...
నేలతల్లికి పచ్చని చీర చుట్టినట్టు పరుచుకున్న వరిచేలు, గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పురాతన కట్టడాలు, అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు, నోరురించే రుచులతో ఆహార ప్రియులను కట్టిపడేసే వంటలు, అనేక రకాల జాతులకు చెందిన వానరాలకు ఆలావాలమైన అడవులు....ఇన్ని ప్రత్యేకలతో బాసిల్లుతుంది కాబట్టే బాలి పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హనిమూన్ వెళ్లే జంటలకయినా, కుటుంబంతో ఆనందంగా విహారానికైనా, చివరకూ ఒంటరి పక్షులకయినా చక్కటి అనువైన ప్రదేశం బాలి. ఇండోనేషియాకు ప్రధాన ఆదాయ వనరుగా బాసిల్లితున్న బాలి ఒక ద్వీపం. మరి ఒకసారి అక్కడి ప్రత్యేకలతను చూసొద్దాం పదండి... ఆధ్యాత్మికం... బాలిలో దాదాపు 20వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిని సందర్శించుకోవాలంటే ఈ వేసవి సెలవులు సరిపోవు. కాబట్టి ముఖ్యంగా చూడాల్సిన ఆలయాల జాబితాను తయారు చేసుకుని దాని ప్రకారం దర్శించుకుంటే బాగుంటుంది. వీటిలో సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద వెలసిన ‘తనాహ లాట్’ ఆలయం, సముద్ర జీవుల ప్రదర్శనశాల, అగ్ని చుట్టూ నృత్యం చేసే కళాకారులతో అబేధ్యమైన కొండ మీద వెలసిన మరో ఆలయం ‘ఉలువాటు’. బాలీయులు ఎక్కువగా సందర్శించే మరో ప్రముఖ ఆలయం ‘మాతృ ఆలయం’. ఈ ఆలయాలను తప్పక సందర్శించాలి. ఆహారం... భోజన ప్రియులకు చక్కటి విహార స్థలం బాలి. ఇక్కడ వడ్డించే ఆహారంలో ప్రధానంగా ఉండేవి కొబ్బరి, మసాలాలతో కూడిన మాంసం, సముద్ర ఆహారం. ఇక్కడి ప్రత్యేక వంటకాలు సతాయ్ (వేయించిన మాంసం), బాబీ గులింగ్ (ఉప్పు చల్లి వేయించిన పంది మాంసం), నాసీ గోరెంజ్ (సుగంధ ద్రవ్యాలు, మాంసం, కొబ్బరి, బియ్యంతో కలిపే వండే బాలీ ప్రత్యేక సంప్రాదాయ వంటకం). వరి మడులు... ద్వీపం అంతా పరుచుకున్న పచ్చటి వరిమడులు కనులవిందుగా ఉంటాయి. ఉబుద్స్ తెగలల్లాంగ్, తబనాన్స్ జతిలువిహ ఈ వరిమడులకు ప్రసిద్ధి గాంచాయి. ఫోటోగ్రాఫి అంటే ఆసక్తి ఉన్న వారు తమ కెమరాలకు పని చెప్పి అద్భుతమైన దృశ్యాలను బంధించవచ్చు. ఊయలలో విహరిద్దాం... బాలి వెళ్లిన వారు ఎవరైనా తప్పక సందర్శించాల్సింది, ప్రయత్నించి చూడాల్సినవి ఊయలలు. 20మీటర్ల ఎత్తులో గాలిలో ఊగుతూ సముద్రాన్ని, ఆకాశాన్ని, అడవిని చూడటం ఒక వింత అనుభూతి. బాలిలోని ‘ఉబుద్’ ప్రాంతం ఈ ఊయలలకు ప్రసిద్ధి. ట్రెక్కింగ్, సీతాకోక చిలుకల ఉద్యావనవనానికి సమీపంలో ఉన్న ఉబుద్‌లో నాలుగు చోట్ల నాలుగు వేర్వేరు ఎత్తుల్లో ఉన్న ఈ ఊయలలను సాహిసికులు సందర్శించకుండ ఉండలేరు. కోతులకు అడ్డా ఉబుద్ అడవి... విభిన్న జాతులకు చెందిన కోతులకు ప్రసిద్ది ఈ సంరక్షణా కేంద్రం. ‘పెడంటిగల్’లో ఉన్న ఈ అడవిలో అడవి అందాలను ఆస్వాదిస్తూ వెళ్తు కోతులను చూడొచ్చు, స్వయంగా వాటికి మనమే ఆహారాన్ని పెట్టవచ్చు. -
కనిపించకుండా పోయి మొసలి పొట్టలో..
బాలిక్పాపన్ (ఇండోనేషియా) : కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మొసలికి ఆహారంగా మారాడు. ఆఖరికి అతడి చేతులు, కాళ్లు మాత్రమే ఆ మొసలి పొట్టలో కనిపించాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ పామాయిల్ తోటలో పనిచేసే వ్యక్తి దానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడి బైక్, చెప్పులు మాత్రమే కనిపించాయి. దాంతో పోలీసులు ఆ నదిలో తీవ్రంగా గాలింపులు జరిపారు. అయితే, అందులో కొంత చిద్రమైన దేహం కనిపించింది. అదే సమయంలో ఒడ్డుకు సమీపంలోనే వారికి ఓ మొసలి కనిపించింది. దాంతో పోలీసులు దాన్ని కాల్చి చంపారు. అనంతరం దాని పొట్ట చీల్చి చూడగా అందులో ఆ వ్యక్తి కాలు, చేయి బయటపడ్డాయి. ఆ మొసలి దాదాపు ఆరు మీటర్లు (20 అడుగులు) పొడవుంది. బహుశా అతడు స్నానానికి దిగిన సమయంలో మొసలి దాడి చేసి ఉంటుందని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఆ మొసలి బారిన పడి ఓ రష్యన్ వ్యక్తి చనిపోయినట్లు వారు వెల్లడించారు. -
భారీ భూకంపం.. భయంతో జనాల పరుగులు
జకర్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి రాజధాని జకర్తా భయంతో వణికిపోయింది. పలు భవనాలు, ఇతర నిర్మాణాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్లపాటు తొణికిసలాడినట్లుగా కనిపించాయి. దీని కారణంగా వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారంతా భయంతో బయటకు పరుగులు తీయగా వాహనాలు నడుపుతున్నవారంతా వాటిని ఎక్కడికక్కడే ఆపేశారు. బైక్‌లు నడుపుతున్నవారైతే తమ వాహనాలు వదిలేసి పరుగులు పెట్టారు. అధికారుల వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. జకర్తాకు 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జకర్తాలో 10 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా కూడా ఈ భూకంపం కారణంగా ఆందోళనపడినట్లు అధికారులు చెప్పారు. దీని తీవ్రత గురించి కొంతమంది తమ అనుభవాలను వెల్లడిస్తూ 'నేను ఒక భవనంలో కూర్చొని ఉన్నాను. అప్పుడే అనూహ్యంగా అది కదలడం మొదలుపెట్టింది. వెంటనే నేను బయటకు పరుగులు తీశాను. ఈసారి వచ్చిన భూకంపం చాలా బలంగా అనిపించింది. గతంలో నేనెప్పుడు ఇలాంటిది చూడలేదు' అని సుజీ (35) అనే కార్మికుడు తెలిపాడు. -
అడవి పందితో ఒళ్లు గగుర్పొడిచే..
సికావావో, ఇండోనేషియా : సాధారణంగా గొడవపడుతుంటే సర్దుమణిగేలా చేయడం మానవ నైజం. కానీ, అదే మనుషులు తమ వెర్రి ఆనందం కోసం వింత వినోదాల పేరిట అటవీ జంతువులకు పెంపుడు జంతువులకు ఘర్షణ పెట్టి వాటి మధ్య రక్తం ఏరులై పారుతున్నా చూసి ఆనందిస్తుంటే దానికి ఏమని పేరుపెట్టాలి. ఇండోనేషియాలోని పశ్చిమ జావా దీవుల్లో ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతుందట. వన్యమృగ ప్రేమికులు, సామాజిక ఉద్యమకారులు వద్దని వారిస్తున్నా అలాగే ఒక సంప్రదాయంగా చేస్తుంటారట. తమ పొలాలను నాశనం చేసే అడవి పందులను బంధించి ఓ చిన్న నీటి మడుగులో పెట్టి చుట్టూ కంచె ఏర్పాటుచేస్తారు. వెర్రెత్తిన కోపంతో ఉన్న కుక్కలకు, అడవి పందులకు మధ్య పోరాటం పెడతారు. ఇందుకోసం తమ కుక్కలకు ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడంతోపాటు గెలిచే కుక్కలకు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ కూడా ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారు తమ కుక్కలను మన తెలుగు ప్రాంతాల్లో పందెం కోళ్లను మేపినట్లు మేపుతుంటారన్నమాట. అలా పెంచిన కుక్కలను రిజిస్ట్రేషన్ చేసుకొని వంతులవారిగా సీరియల్లో ఉండి అప్పటికే దెబ్బతిని ఉన్న అడవి పందులపైకి వదులుతారు. దాంతో వాటి మధ్య భీకర పోరు జరుగుతుంతూ చప్పట్లు విజిల్స్‌తో ఆనందిస్తుంటారు. ఈ పోరాటంలో పందులైనా చనిపోవచ్చు.. లేదా కుక్కలైనా చనిపోవచ్చు. ఏది చనిపోయినా వీరి కేరింతలు మాత్రం అస్సలు ఆగవు. దీనిపై ఎన్నిసార్లు సామాజిక ఉద్యమకారులు పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 1960లో బోర్ ఫైటింగ్ పేరుతో బాంబూలు ఏర్పాటుచేసిన రాక్షస క్రీడ ఇప్పటికీ కొనసాగుతోంది. -
కోసి కూర వండుకున్నారు..
సాక్షి : నాలుక ఒకసారి రుచి మరిగితే మళ్లీ మళ్లీ దాన్నే తినాలనిపిస్తోంది. పాములను తినడాని అలవాటుపడిన రాబర్ట్ నబబన్(37) అనే వ్యక్తి అందుకోసం ఓ సాహసం చేశాడు. ఏకంగా దారికి అడ్డొచ్చిన 25.6 అడుగుల(7.8 మీటర్లు) పైథాన్‌తో పోరాడి మట్టి కరిపించాడు. స్థానికుల సాయంతో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న రాబర్ట్ నబబన్ 25.6 అడుగుల భారీ కొండచిలుని హతమార్చాడు. ఈ సంఘటన ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పాములను తినడానికి అలవాటు పడిన రాబర్ట్ నబబబన్ భారీ కొండచిలువను వేటాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది ఎదురు దాడి చేసి అతన్ని మింగేయాలని యత్నించింది. అయితే అది గమనించిన స్థానికులు అంతా కలిసి దానిని చంపేశారు. ఎడమ చేయి తీవ్ర గాయం కావటంతో రాబర్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇక్కడి దాకా బాగానే ఉన్న తర్వాతే అసలు విషయం జరిగింది. చనిపోయిన కొండచిలువతో తొలుత చిన్నారులు ఆడుకున్న ఫోటోలు చూశాం. కానీ, తర్వాత పోలీసులు వచ్చే లోపు గ్రామస్తులు తీసుకెళ్లి కోసి వాటాలు వేసుకున్నారంట. ఆపై ఎంచక్కా దానిని వండుకొని తినేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
మృత్యుంజయుడు
ఇండోనేషియా : చిన్నపాము ఎదురొస్తేనే అమ్మో అనుకొని పారిపోతాం.. అలాంటిది ఏకంగా 23 అడుగుల కొండ చిలువ ఎదురైతే ఇక ఆ ప్రాంతంలో ఒక్కక్షణమైనా ఉండగలమా.. కానీ, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి అలాగే ఉన్నాడు.. ఉండటమే కాదు దాని అంతు చూసి హీరో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రేవ్ రాబర్ట్ నబబన్(37) అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా దారిలో ఓ భారీ కొండచిలువ కనిపించి అతడిని అడ్డగించే ప్రయత్నం చేసింది. దాంతో దానిని ఎలాగైనా మట్టుపెట్టాలని భావించిన రాబర్ట్ 23 అడుగుల పైథాన్‌తో పోరాటానికి దిగాడు. చాలాసేపు దానితో భీకరంగా పోరాడాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని తీవ్రంగా గాయపరిచింది కూడా. అతడి ఎడమ చేయి దాదాపు పోయినంత తీవ్రంగా గాయపరిచింది. అయినప్పటికీ పట్టువదలకుండా ఆ భారీ కొండ చిలువను మట్టి కరిపించాడు. తాను మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాబర్ట్ ఇంద్రగిరి హులు రిజియన్స్ ఆఫ్ రియావు ప్రావిన్స్‌లో పనిచేస్తున్నాడు. కాగా, చనిపోయిన కొండచిలువను స్థానికులు రెండు చెట్లకు మధ్యలో కట్టేయగా, దానిపై కూర్చుని చిన్న పిల్లలు ఏ మాత్రం భయం లేకుండా దానిపై ఉయ్యాల జంపాల ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. -
ఛోటా రాజన్ తరలింపు ఆలస్యం?
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశముంది. ఇండోనేసియా నుంచి మంగళవారం రాత్రి ఛోటా రాజన్‌ను స్వదేశానికి తరలించాలని భారత అధికారులు ప్రయత్నించారు. అయితే బాలి సమీపంలో అగ్ని పర్వతం పేలడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ అధికారులు ఇండోనేసియా వెళ్లారు. -
రేపు భారత్‌కు ఛోటా రాజన్!
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను మంగళవారం భారత్‌కు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఛోటా రాజన్‌ను తొలుత ఢిల్లీకి తీసుకురావచ్చని సమాచారం. రాజన్‌ను స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై భారత అధికారుల బృందం ఇండోనేసియా అధికారులతో చర్చిస్తోంది. ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులతో కూడిన బృందం బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్‌ను కలిసింది. గత వారం ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో రాజన్‌పై 70కిపైగా కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ సరఫరా, బలవంతపు వసూళ్లు, హత్య తదితర కేసులు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ ఎట్టకేలకు ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డాడు. -
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
-
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇండోనేసియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్‌ను కలిశారు. ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్.. ఇండోనేసియా అధికారులతో చర్చించారు. 20 రోజుల్లో ఛోటా రాజన్‌ను భారత్‌కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఛోటా రాజన్‌ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఛోటా రాజన్ భయపడుతున్నాడు
జకర్తా: ఎందరినో గడగడలాడించిన మోస్ట్ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు పోలీసులకు దొరికిసరికే భయం పట్టుకుంది. ఇండోనేసియా పోలీసులకు దొరికిన చోటా రాజన్ చాలా భయపడుతున్నాడు. భారత్‌కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ ఇండోనేసియా పోలీసులను వేడుకుంటున్నాడు. బాలి పోలీస్ కమిషనర్ రెయిన్‌హర్డ్ నయింగోలన్ ఈ విషయాలను వెల్లడించారు. భారత్‌కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 'తనను విడుదల చేయాలని, విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానని ఛోటా రాజన్ కోరాడు. జింబాబ్వేకు పారిపోయేందుకు ఆస్ట్రేలియా నుంచి బాలి వచ్చినట్టు చెప్పాడు. అతను చాలా భయపడుతున్నాడు. వరసపెట్టి సిగరెట్లు కాలుస్తున్నాడు. భారత్‌కు వెళ్లాలని లేదని చెప్పాడు' అని బాలి పోలీస్ కమిషనర్ చెప్పారు. ఛోటా రాజన్ తమ విచారణకు సహకరిస్తున్నాడని తెలిపారు. అతను కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. త్వరలోనే భారత్‌కు పంపుతామని నయింగోలన్ తెలిపారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా.. బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
2014 డిసెంబర్ ఘటన మరువక ముందే..
జకర్తా: ఇండోనేషియా విమానాలంటనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి రోజుల్లో జరిగిన విషాదం అందరి మెదళ్లలో మెదులుతుండగానే.. ఇండోనేషియాకు చెందిన ట్రిగన్ ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం పపువాలో కుప్పకూలింది. ఈ విమానంలో ఉన్న 54 మంది ప్రయాణికులు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. గత డిసెంబర్ 28న జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 162మంది ప్రయాణీకులు జలసమాధి అయ్యారు. అందులో కొంతమంది మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. ఈ ఘటన అప్పట్లో తీరని విషాదంగా మిగలింది. ఇప్పుడిప్పుడే ఆ ఘటనను అటు ఇండోనేషియన్ అధికారులు, ఆ విమానంలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబ సభ్యులు మర్చిపోతున్నారు. ఇంతలోనే తాజాగా మరో ఘటన జరగడం అందరికి దిగ్భ్రాంతిని కలిగించింది. ఇండోనేషియా విమానాలను నిర్వహిస్తున్న సంస్థల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి కూడా. 1997లో కూడా గరుడా ఇండోనేషియా విమానం కూలిపోయి 152 మంది ప్రాణాలు కోల్పోయి అతి పెద్ద విమాన ప్రమాదంగానిలిచింది. ఆ తర్వాత కూడా దాదాపు ప్రతి ఏటా విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2005లో రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకోగా ఒక్క 2007లో మూడుసార్లు విమానాలు కూలిపోయి అందులో ఉన్నవారంతా గాల్లోనే ప్రాణాలు విడిచారు. -
ఎయిర్ ఏషియా 'తోక' కోసం ముమ్మర గాలింపు
జకార్తా: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం తోక భాగాన్ని వెలికితీయడానికి ఇండోనేషియా అన్వేషణ, రక్షణ విభాగం సిద్ధమైంది. ఇండోనేషియా ప్రభుత్వం ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా 15 మంది గజ ఈతగాళ్లను సముద్రంలోకి పంపింది. డిసెంబరు 28న 162 మందితో వెళ్తున్న ఈ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా అదృశ్యమై, సముద్రంలో పడిపోయిన సంగతి తెలిసిందే. తేలియాడే బెలూన్లు, క్రేన్ల సాయంతో తోక భాగాన్ని వెలికితీస్తామని అధికారులు తెలిపారు. జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా క్యుజడ్ 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేయగా వెలుతురు లేని కారణంగా పనిని మధ్యలోనే ఆపేశారు. ఇప్పటిదాకా సముద్రం నుంచి 46 మృతదేహాలను వెలికితీశారు. -
ఎయిర్ ఏషియా మృతదేహాల కోసం వేట
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విమానం శకలాలు తేలిన ప్రాంతంలో గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించారు. ఇందుకోసం ఐదు నౌకలను అందుబాటులో ఉంచారు. విమానంలోని బ్లాక్ బాక్స్‌ను గుర్తించగల పరికరాలను నౌకల్లో అమర్చారు. గజ ఈతగాళ్లతో సాధ్యంకాకపోతే సముద్రంలో వస్తువులను గుర్తించగల అధునాతన పరికరాలను ఉపయోగిస్తామని సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న సుప్రియాడి తెలిపారు. వారం క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 34 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఆదివారం గజ ఈతగాళ్లు ప్రమాద ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించినా వాతావరణం అనుకూలించకపోవడంతో సాధ్యపడలేదు. -
చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు
న్యూఢిల్లీ: అదృష్టమంటే ఇండోనేసియాకు చెందిన ఈ జంటదే. మృత్యువు దగ్గరగా వెళ్లబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. హర్టనో, లానో హర్టనో అనే దంపతులు.. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో వారు ప్రయాణించాల్సివుంది. ఇందుకోసం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలసి గడపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సురబయ నుంచి 162 మందితో బయల్దేరిన విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే హర్టనో దంపతులు షాక్ తిన్నారు. తాము ప్రాణాలతో బయటపడినా.. ఈ ప్రమాదం జరగడం తమను కలచి వేసిందని లానో హర్టనో అన్నారు.