ఎయిర్ ఏషియా మృతదేహాల కోసం వేట
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విమానం శకలాలు తేలిన ప్రాంతంలో గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించారు. ఇందుకోసం ఐదు నౌకలను అందుబాటులో ఉంచారు. విమానంలోని బ్లాక్ బాక్స్ను గుర్తించగల పరికరాలను నౌకల్లో అమర్చారు. గజ ఈతగాళ్లతో సాధ్యంకాకపోతే సముద్రంలో వస్తువులను గుర్తించగల అధునాతన పరికరాలను ఉపయోగిస్తామని సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న సుప్రియాడి తెలిపారు.
వారం క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 34 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఆదివారం గజ ఈతగాళ్లు ప్రమాద ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించినా వాతావరణం అనుకూలించకపోవడంతో సాధ్యపడలేదు.