
ఇండోనేషియా : చిన్నపాము ఎదురొస్తేనే అమ్మో అనుకొని పారిపోతాం.. అలాంటిది ఏకంగా 23 అడుగుల కొండ చిలువ ఎదురైతే ఇక ఆ ప్రాంతంలో ఒక్కక్షణమైనా ఉండగలమా.. కానీ, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి అలాగే ఉన్నాడు.. ఉండటమే కాదు దాని అంతు చూసి హీరో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రేవ్ రాబర్ట్ నబబన్(37) అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా దారిలో ఓ భారీ కొండచిలువ కనిపించి అతడిని అడ్డగించే ప్రయత్నం చేసింది. దాంతో దానిని ఎలాగైనా మట్టుపెట్టాలని భావించిన రాబర్ట్ 23 అడుగుల పైథాన్‌తో పోరాటానికి దిగాడు.
చాలాసేపు దానితో భీకరంగా పోరాడాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని తీవ్రంగా గాయపరిచింది కూడా. అతడి ఎడమ చేయి దాదాపు పోయినంత తీవ్రంగా గాయపరిచింది. అయినప్పటికీ పట్టువదలకుండా ఆ భారీ కొండ చిలువను మట్టి కరిపించాడు. తాను మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాబర్ట్ ఇంద్రగిరి హులు రిజియన్స్ ఆఫ్ రియావు ప్రావిన్స్‌లో పనిచేస్తున్నాడు. కాగా, చనిపోయిన కొండచిలువను స్థానికులు రెండు చెట్లకు మధ్యలో కట్టేయగా, దానిపై కూర్చుని చిన్న పిల్లలు ఏ మాత్రం భయం లేకుండా దానిపై ఉయ్యాల జంపాల ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.




Comments
Please login to add a commentAdd a comment