అయ్యో పులి! | Decreasing Tiger Population | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 3:55 AM | Last Updated on Sun, Oct 28 2018 2:13 PM

Decreasing Tiger Population - Sakshi

మన తర్వాతి తరాలు పులులను చూడాలంటే ’జూ’కు కాకుండా మ్యూజియానికి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇరవై ముప్పై లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన పులులు రాను రాను పూర్తిగా అంతరించి పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల పులి జాతులే మనకు మిగిలి ఉన్నాయి. అవి కూడా మొత్తం 4 వేల పులులే ప్రాణాలతో ఉన్నాయి. కాస్పియన్‌ సముద్ర ప్రాంతం, జావా, బాలి ప్రాంతాల్లోని పులులు ఇప్పటికే పూర్తిగా అంతరించి పోయినట్లు ‘కరెంట్‌ బయోలజీ’అనే సైన్స్‌ జర్నల్‌ ప్రచురించింది. పులుల ప్రస్థానానికి సంబంధించిన తొలి జన్యు అధ్యయనమిది అని బీజింగ్‌లోని పెకింగ్‌ యూనివర్సిటీకి చెందిన షు జిన్‌ ల్యో చెప్పారు.

పులుల్లో ఆసక్తికరమైన అంశాలు.. 

  • పులులు సంచరించే దేశాలు, ప్రాంతాలను బట్టి వాటి లక్షణాల్లో కూడా భిన్నత్వం ఉంటుంది. ఆసియాలోని పెద్ద పిల్లులు (బిగ్‌ క్యాట్స్‌) వాసనని బట్టి కాకుండా చూపును బట్టీ, ధ్వనిని బట్టి వేటాడతాయి. 
  • ఒక్కో పులి ఒక్కసారి దాదాపు 40 కిలోల మాంసాన్ని తింటుంది. 
  • ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లలకి జన్మనిస్తుంది.  
  • పులి పిల్లలు రెండేళ్ల తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి. లైంగిక పునరుత్పత్తి ప్రక్రియలు ఆడ పులుల్లో మూడు నుంచి నాలుగేళ్లకు ప్రారంభమైతే.. మగపులులకు నాలుగు నుంచి ఐదేళ్లకు ప్రారంభమవుతుంది. 
  • ఎక్కువ శాతం పులులు రెండేళ్ళకు మించి జీవించడం లేదు. అయితే పులుల జీవన ప్రమాణం మాత్రం రెండు దశాబ్దాలు.  
  • సైబీరియాలోని అమూర్‌ టైగర్‌ అనే అతిపొడవైన మగ పులిజాతులు 300 కేజీల బరువుంటాయి. చిన్నవైన సుమత్రా టైగర్‌ ఉపజాతులు 140 కేజీలు ఉంటాయి. అయితే అన్ని పులుల్లోనూ మగ పులులు ఆడ పులులకంటే బరువు ఎక్కువగా ఉంటాయి. 
  • అంతరించిపోతున్న పులిజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. అయితే ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. 
  • దీన్నిబట్టి అడవులను కాపాడుకోవడమే అరుదైన పులిజాతులను మన భవిష్యత్‌ తరాలకు అందించే ఏకైక మార్గం అని అర్థం అవుతోంది. 

పెద్ద పిల్లులు ప్రత్యేకం.. 
చూడటానికి ఒకేలా ఉన్నా పులులన్నీ ఒకే రకంగా ఉండవనీ, వాటి శరీర పరిమాణాన్ని బట్టి పులుల్లో వైవిధ్యాన్ని గుర్తించొచ్చని ల్యో అభిప్రాయం. భారతదేశపు పులుల కంటే కూడా రష్యా పులుల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే మలేసియా పులులకు, ఇండోనేసియా పులులకు మధ్య తేడా ఉంటుంది.

పులులు అంతరించి పోవడానికి ప్రధాన కారణాలు.. 

  • మనుగడకు అవకాశం లేకపోవడం 
  • అడవుల ఆక్రమణ 
  • వాతావరణ మార్పుల ప్రభావం 
  • కొన్ని పులిజాతుల్లో రాను రాను జనన సామర్థ్యం పూర్తిగా క్షీణిస్తున్నట్లు జన్యు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 

మిగిలి ఉన్న పులి జాతులివే..

  • బెంగాల్‌ టైగర్‌
  • అమూర్‌ టైగర్‌
  • సౌత్‌ చైనా టైగర్‌
  • సుమత్రా టైగర్‌
  • ఇండోచైనీస్‌ టైగర్‌
  • మలయాన్‌ టైగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement