Tigers Survey
-
పులుల మరణాలపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దేశంలో అభయారణ్యాల్లో పులుల మరణాలపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో పులులు చనిపోతున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్నందున వాటిని రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) గణాంకాల ప్రకారం..దేశంలో 2012 నుంచి ఇప్పటి వరకు 1,059 పులులు మరణించాయి. వీటిలో ఏకంగా 270 పులులు టైగర్ స్టేట్‌గా పేరున్న మధ్యప్రదేశ్‌లోనివే కావడం గమనార్హం. -
Telangana: మళ్లీ గర్జిస్తున్న రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల అభయారణ్యాలు, టైగర్ కారిడార్లలో పెద్దపులులు సందడి చేస్తున్నాయి. కెమెరా ట్రాప్‌లు, అటవీ సిబ్బంది, అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు ‘సైటింగ్స్’ద్వారా వీటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్పష్టమౌతోంది. దేశవ్యాప్తంగా పులుల పెరుగుదలకు సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రతీ నాలుగేళ్లకోసారి (2006 నుంచి) టైగర్ సెన్సస్ నిర్వహించి, సంఖ్యను ప్రకటిస్తోంది. అయితే వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి వాటిని కాపాడేందుకు ఈ ప్రాంతంలో ఇన్ని పులులున్నాయని, వాటి ఆనుపానులు ఇవని కచ్చితమైన సమాచారాన్ని నివేదికల్లో పేర్కొనరు. వాటిని ఇతరులు ట్రాక్ చేయకుండా వీటికి సాంకేతిక పేర్లు మాత్రమే పెట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఏడాది ఆఖరులో సెన్సస్.. 2018లో నిర్వహించిన ‘టైగర్ సెన్సస్’లో తెలంగాణలో 26 పులులున్నట్టు వెల్లడైంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో 14, కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)లో 12 ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఏడాది ఆఖరుకల్లా విడుదలయ్యే 2022 సెన్సస్‌లో ఈ రెండు రిజర్వ్‌లతో పాటు టైగర్ కారిడార్లలో వాటి సంఖ్య 30 లేదా 32 దాకా పెరిగి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2014లో 68 పులులున్నాయి. అందులో తెలంగాణలో 20 (ఏటీఆర్‌లో 17, కేటీఆర్‌లో 3) ఉన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం అమ్రాబాద్‌లో 23 లేదా 24 పులులు, కవ్వాల్ రిజర్వ్‌తోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఇతర టైగర్ కారిడార్ ఏరియాలలో కలిపి 7 లేదా 8 పులులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఏటీఆర్‌లో పులులపై స్పష్టత.. ఏటీఆర్ పరిధిలో కెమెరా ట్రాప్‌లు, అడవుల్లో సైటింగ్లు, టైగర్ సఫారీల్లో కనిపిస్తుండటంతో పులుల వృద్ధిపై స్పష్టమైన అంచనా వేయడానికి వీలవుతోంది. ఇక్కడ 21 పులులున్నట్టు అధికారులు గుర్తించారు. దొరికిన ఆనవాళ్ల ఆధారంగా 23 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కేటీఆర్.. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో, అక్కడి నుంచి పులుల రాకపోకలు ఎక్కువ. అందువల్ల పులులు స్థిరంగా కనిపించడం, కెమెరా ట్రాప్‌లకు చిక్కడం తక్కువే. దీంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర నుంచి సాగే ఈ సుదీర్ఘ టైగర్ కారిడార్‌లో కదలికను బట్టి 7 లేదా 8 పులులు స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అభయారణ్యాలు.. దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలున్నాయి. 2వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న అభయారణ్యాలు ఐదు ఉండగా, ఏపీ, తెలంగాణల్లోనే 3 ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) 3,728 చ.కి.మీలలో విస్తరించింది. తెలంగాణలోని ఏటీఆర్ 2,611 చ.కి.మీ.లుగా విస్తరించగా, కేటీఆర్ విస్తీర్ణం 2,016 చ.కి.మీ.లో ఉంది. రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లున్నాయి. -
ఏపీలో పులులు పెరుగుతున్నాయ్!
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం ఉన్నట్టు అటవీ శాఖ గుర్తించింది. ఈ అభయారణ్యంలో గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాల్లోని నల్లమల అడవుల్లోనే పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల నుంచి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ విస్తరించింది. తరచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. అభయారణ్యం 3,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. 2,444 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా (కేంద్రీకృత ప్రాంతం)గా ఉంది. గతంలో అభయారణ్యాన్ని మూడు బ్లాకులుగా విభజించారు. పులుల కారిడార్ పెరుగుతుండటంతో.. కారిడార్ ఏరియాగా నాలుగో బ్లాక్ ఏర్పాటు చేశారు. ఈ బ్లాకులో రెండేళ్ల క్రితం కొత్తగా ఆరు పులులు కనిపించగా.. గతేడాది మరో మూడు కనిపించాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం అభయారణ్యం పరిధిలో మొత్తం 63 పులులున్నాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య 46 మాత్రమే. ఏటా పులుల సంఖ్య పెరుగుతుండగా.. ఈ ఏడాది కూడా పెరిగే అవకాశం ఉందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. లక్షల ఫొటోలను విశ్లేషించి.. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన రాష్ట్రాల్లో మాత్రం ఏటా జరుగుతుంది. ప్రస్తుతం అభయారణ్యంలో రాష్ట్ర అటవీ శాఖ వార్షిక గణన నిర్వహిస్తోంది. నాలుగు బ్లాకుల్లోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు చొప్పున కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాల చొప్పున అమర్చారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఆటోమేటిక్‌గా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన 10 లక్షలకు పైగా ఫొటోలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి జంతువుల జాడను గుర్తిస్తారు. ప్రధానంగా పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. ప్రతి పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ప్రస్తుతం రెండు బ్లాకుల్లో గణన పూర్తవగా మరో బ్లాకులో చివరి దశకు చేరింది. మరో బ్లాకులో త్వరలో ప్రారంభించనున్నారు. ఆగస్ట్ నాటికి లెక్కింపు పూర్తి కానుంది. రాష్ట్ర అటవీ శాఖ తీసిన ఫొటోలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) పరిశోధించి విశ్లేషిస్తుంది. వాళ్లు ఖరారు చేసిన తర్వాతే పులుల సంఖ్యను నిర్ధారిస్తారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే పెద్దది దేశంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం అతి పెద్దది, ప్రత్యేకమైనది. పులులతోపాటు అనేక జీవరాశుల మనుగడకు ఇక్కడ అవకాశం ఎక్కువ. అందుకే కారిడార్ విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన పులుల గణన ఆగస్ట్ నాటికి పూర్తవుతుంది. ఈ లెక్కింపు వల్ల పులుల పూర్తి సమాచారం తెలుస్తుంది. ప్రతి పులికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. కాబట్టి వాటిని సంరక్షించడం సులభమవుతుంది. – ఎన్.ప్రతీప్‌కుమార్, అటవీ దళాల అధిపతి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం అమర్చిన కెమెరాలు 50 శాతం కారిడార్‌ను కవర్ చేస్తాయి. కాబట్టి పులుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది పర్యావరణ, జీవావరణ సమతుల్యతకు కీలకం. – వై.శ్రీనివాసరెడ్డి, కన్జర్వేటర్, టైగర్ సర్కిల్ ప్రాజెక్ట్, శ్రీశైలం -
ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో 26 పులులు మృతి
భోపాల్: దేశంలో పులుల రాష్ట్రంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 26 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించింది. ఆరేళ్లలో పులుల సగటు మరణాల రేటుకన్నా జననాల రేటు ఎక్కువగా ఉందని మధ్య ప్రదేశ్ అటవీశాఖ మంత్రి తెలిపారు. 2019లో 28 పులులు మరణించాయి. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో 124 పులి పిల్లలున్నాయి. వచ్చే జంతు గణననాటికి 600 పులులుంటాయని మంత్రి తెలిపారు. కర్ణాటక అధిక పులులున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది అక్కడ 8 పులులు మరణించాయి. 2014లో కర్ణాటక(408), ఉత్తరాఖండ్(340)ల తర్వాత మధ్య ప్రదేశ్ (308)మూడో స్థానానికి పడిపోయింది. 2018 గణనలో మధ్యప్రదేశ్ తొలిస్థానానికి వెళ్ళింది. చదవండి: (పిలిభిత్ టైగర్ రిజర్వ్‌కు అవార్డు) -
గిన్నిస్‌లోకి ‘టైగర్ సర్వే’
న్యూఢిల్లీ: భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018–19లో నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. సర్వే గిన్నిస్ రికార్డు పొందడంపై పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అరుదైన ఘనత అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పులుల గణన సర్వేలో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి. పులి పిల్లలు మినహా దేశంలో మొత్తం 2,461 పులులు ఉన్నట్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫొటోలను విశ్లేషించి గుర్తించారు. పిల్లలతో కలిపితే 2,967 పులులు ఉన్నట్లు తేల్చారు. -
గిన్నిస్ ఎక్కిన పులుల గణన
సాక్షి, న్యూఢిల్లీ: భారత పులుల గణన–2018 గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సర్వే కోసం ఇండియా దేశవ్యాప్తంగా అడవుల్లో ట్రాప్ కెమెరాలతో పెద్ద పులులను 76 వేల ఫొటోలు తీసింది. వీటితో పాటు అడవి పిల్లులు, చిరుతపులులకు చెందిన 51 వేల ఫొటోలు సంగ్రహించింది. ఫలితంగా 2018 భారత పులుల గణన ప్రపంచంలోనే అతిపెద్దదైన కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా చరిత్ర సృష్టించింది. (కరోనా : చైనాపై మరో బాంబు) ఈ మేరకు గిన్నిస్ బుక్ సంస్ధ, భారత ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికేట్‌ను అందజేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఆత్మనిర్భార్ భారత్‌కు ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. పులుల గణనలో ఇండియాలోని పులుల సంఖ్య 2,967గా తేలింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 75 శాతానికి సమానం. (మారణహోమానికి పాక్ కుట్ర) పులుల ఫోటోలను తీయడానికి, అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ నిపుణులు 141 స్టడీ సైట్లలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో తీసిన 3.48 కోట్ల ఫోటోలను పరిశీలించిన తర్వాత పులుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చారు. వీటిలో పులుల ఫొటోలు 76,651 కాగా 51,777 ఫొటోలు చిరుతలవి. మిగతా ఫొటోలు దేశంలోని అరుదైన వ్యన్యప్రాణులకు చెందినవి. భారత్ ప్రపంచంలోని అడవి పిల్లులకు అతిపెద్ద, అత్యంత సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా నిలిచింది. 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2018కి 2,967కి చేరింది. కేంద్ర పర్యావరణ శాఖ కింద పనిచేసే వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. -
చెన్నూర్ డివిజన్లో పులులు ఒకటి కాదు.. మూడు
సాక్షి, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో పులుల సంతతి పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఒకే పులి ఉన్నట్లు భావిస్తున్న అటవీ అధికారులు.. ప్రస్తుతం 3 పులులు ఉన్నట్లు గుర్తించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా తొమ్మిది బృం దాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి గతంలో కే–4 పులి సంచారం మాత్రమే కనిపించేది. నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నట్లు ఇటీవల సీసీ కెమెరాల్లో లభించిన పుటేజీల ఆధారంగా నిర్ధారించారు. మూడేళ్ల క్రితం కోటపల్లి మండలం పిన్నారంలో పులి హతమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ పులుల సం చారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. వేట ప్రారంభం డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులులు వేట ప్రారంభించాయి. 15 రోజుల నుంచి ఆవులు, మేకలపై దాడి చేస్తూ హత మారుస్తున్నాయి. కోటపల్లి మండలం పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో బుధవారం ఒకే రోజు ఐదు ఆవులపై పంజా విసిరాయి. పులి దాడి చేసిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. గత నెలలో చెన్నూర్ అటవీ ప్రాంతంలో ఒకే రోజు నాలుగు మేకలపై దాడి చేశాయి. శీతాకాలం కావడంతో పులి ఆకలి తీర్చుకునేందుకు ఆటవీ ప్రాంతంలో సంచరించే అవకాశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వన్యప్రాణుల నుంచి పంటల సంరక్షణ కోసం కొందరు రైతులు అమరుస్తున్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు పులికి తగిలితే పెను ప్రమాదం జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నిర్ధారించిన అధికారులు చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో మూడు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు ద్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో కే–4 ఆడపులి ఒక్కటే సంచరించేదని, ఆసిఫాబాద్ నుంచి ఏ–1, సిర్పూర్ నుంచి ఎస్–1 రెండు మగ పులులు రెండు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతున్నారు. అవి ఆవుల మందలపై దాడి చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. మూడు పులులు సంచరిస్తున్నా.. పులులన్నీ కలసి ఉండవని అధికారులు తెలిపారు. రోజుకో ప్రాంతానికి వెళ్తాయని చెబుతున్నారు. పులులు సంరక్షణకు 9 బృందాలు పులుల సంరక్షణ కోసం 9 బృందాలను ఏర్పాటు చేశామని చెన్నూర్ డివిజన్ ఫారెస్టు అధికారి రాజారావు తెలిపారు. నిత్యం పులుల కదలికనలు గమనిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పులి ఒకే ప్రదేశంలో ఉండదన్నారు. కోటపల్లి మండలంలో పనిచేస్తున్న స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. గ్రామాల్లో పులి సంచారం ఉందని, అటవీ ప్రాంతానికి వెళ్ల వద్దని దండోరా వేయిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన ఘటన మళ్లీ చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. -
అయ్యో పులి!
మన తర్వాతి తరాలు పులులను చూడాలంటే ’జూ’కు కాకుండా మ్యూజియానికి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇరవై ముప్పై లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన పులులు రాను రాను పూర్తిగా అంతరించి పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల పులి జాతులే మనకు మిగిలి ఉన్నాయి. అవి కూడా మొత్తం 4 వేల పులులే ప్రాణాలతో ఉన్నాయి. కాస్పియన్ సముద్ర ప్రాంతం, జావా, బాలి ప్రాంతాల్లోని పులులు ఇప్పటికే పూర్తిగా అంతరించి పోయినట్లు ‘కరెంట్ బయోలజీ’అనే సైన్స్ జర్నల్ ప్రచురించింది. పులుల ప్రస్థానానికి సంబంధించిన తొలి జన్యు అధ్యయనమిది అని బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన షు జిన్ ల్యో చెప్పారు. పులుల్లో ఆసక్తికరమైన అంశాలు.. పులులు సంచరించే దేశాలు, ప్రాంతాలను బట్టి వాటి లక్షణాల్లో కూడా భిన్నత్వం ఉంటుంది. ఆసియాలోని పెద్ద పిల్లులు (బిగ్ క్యాట్స్) వాసనని బట్టి కాకుండా చూపును బట్టీ, ధ్వనిని బట్టి వేటాడతాయి. ఒక్కో పులి ఒక్కసారి దాదాపు 40 కిలోల మాంసాన్ని తింటుంది. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లలకి జన్మనిస్తుంది. పులి పిల్లలు రెండేళ్ల తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి. లైంగిక పునరుత్పత్తి ప్రక్రియలు ఆడ పులుల్లో మూడు నుంచి నాలుగేళ్లకు ప్రారంభమైతే.. మగపులులకు నాలుగు నుంచి ఐదేళ్లకు ప్రారంభమవుతుంది. ఎక్కువ శాతం పులులు రెండేళ్ళకు మించి జీవించడం లేదు. అయితే పులుల జీవన ప్రమాణం మాత్రం రెండు దశాబ్దాలు. సైబీరియాలోని అమూర్ టైగర్ అనే అతిపొడవైన మగ పులిజాతులు 300 కేజీల బరువుంటాయి. చిన్నవైన సుమత్రా టైగర్ ఉపజాతులు 140 కేజీలు ఉంటాయి. అయితే అన్ని పులుల్లోనూ మగ పులులు ఆడ పులులకంటే బరువు ఎక్కువగా ఉంటాయి. అంతరించిపోతున్న పులిజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. అయితే ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దీన్నిబట్టి అడవులను కాపాడుకోవడమే అరుదైన పులిజాతులను మన భవిష్యత్ తరాలకు అందించే ఏకైక మార్గం అని అర్థం అవుతోంది. పెద్ద పిల్లులు ప్రత్యేకం.. చూడటానికి ఒకేలా ఉన్నా పులులన్నీ ఒకే రకంగా ఉండవనీ, వాటి శరీర పరిమాణాన్ని బట్టి పులుల్లో వైవిధ్యాన్ని గుర్తించొచ్చని ల్యో అభిప్రాయం. భారతదేశపు పులుల కంటే కూడా రష్యా పులుల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే మలేసియా పులులకు, ఇండోనేసియా పులులకు మధ్య తేడా ఉంటుంది. పులులు అంతరించి పోవడానికి ప్రధాన కారణాలు.. మనుగడకు అవకాశం లేకపోవడం అడవుల ఆక్రమణ వాతావరణ మార్పుల ప్రభావం కొన్ని పులిజాతుల్లో రాను రాను జనన సామర్థ్యం పూర్తిగా క్షీణిస్తున్నట్లు జన్యు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలి ఉన్న పులి జాతులివే.. బెంగాల్ టైగర్ అమూర్ టైగర్ సౌత్ చైనా టైగర్ సుమత్రా టైగర్ ఇండోచైనీస్ టైగర్ మలయాన్ టైగర్ -
పులుల గణన : హైటెక్ సాంకేతికత
సాక్షి, న్యూఢిల్లీ : పులుల గణనకు కొత్త సాంకేతికతను వినియోగించనున్నట్లు టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్సీఏ), వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. M-Stripes ఆండ్రాయిడ్ ఫోన్ అప్లికేషన్, డెస్క్‌టాప్ వెర్షన్లను ఉపయోగించి ఈ సారీ పులుల గణనలో పారదర్శకతను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పులులపై నిర్వహించిన సర్వేల వివరాలు ఈ మొబైల్ అప్లికేషన్లో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పారు. జియో ట్యాగింగ్ వ్యవస్థను వినియోగిస్తుండటం వల్ల ఆటోమేటిక్‌గా జంతువుల కొత్త ఫొటోలు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 2006లో పులుల ఫొటోలను తీసేందుకు 9,700 కెమెరాలను వినియోగించామని, 2018లో కెమెరాల సంఖ్య 15 వేలకు పెంచామని చెప్పారు. పులులను ఎలా లెక్కిస్తారు..? ఇంతకు ముందు 2006, 2010, 2014లో పులుల గణనను చేపట్టారు. ఫొటోలు, పులుల అడుగులు, మల పరీక్షలతో పులుల సంఖ్యను గణించేవారు. ఫొటోలతో పులుల సంఖ్యను లెక్కించడం అసాధ్యం. ఇందుకు ప్రత్యామ్నాయంగా వాటి చారాల ఆధారంగా గుర్తిస్తున్నారు. మనిషికి వేలి ముద్రలు ఎలా ప్రత్యేకంగా ఉంటాయో.. పులుల చారాలు ఒక్కోదానికి ఒక్కోవిధంగా ఉంటాయి. నాలుగోసారి చేపట్టబోయే పులుల గణనకు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల 22 లక్షలు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకం ప్రొటెక్షన్ టైగర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 7 కోట్లు అందుతాయి. దేశవ్యాప్తంగా 2006లో పులుల సంఖ్య 1,411 ఉండగా, 2010లో 1,706 చేరింది. 2014లో పులుల సంఖ్య 2,226కు పెరిగింది. మూడు పర్యాయాల్లో పులులను లెక్కించడానికి ఒకే విధానం ఉపయోగించారు. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు దశల్లో పులులను లెక్కించేవారు. తొలి దశలో దేశవ్యాప్తంగా పులులు ఉన్న 18 రాష్ట్రాల్లోని స్థానిక ఫారెస్ట్ అధికారులు, వేటగాళ్లు, గిరిజనుల అవగాహనను దృష్టిలో పెట్టుకుని లెక్కించేవారు. రెండో దశలో పులులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన బయాలజిస్ట్లతో చారాలను పరిశీలించి లెక్కించారు. ఈ విధంగా 2014లో 70 శాతం పులుల గణన ఫొటోల ఆధారంగానే జరిగింది. మిగత 30 శాతం పులుల లెక్కింపు అధికారులు అవగాహనతో అంచనా వేశారు. నాలుగో విడత సర్వే కోసం ఆధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. నేషనల్ రిపోసిటరీ ఆఫ్ కెమెరా ట్రాప్ ఫొటోగ్రాఫ్స్ ఆఫ్ టైగర్స్(ఎన్ఆర్సీటీపీటీ)లు టైగర్ల చిత్రాలను తీస్తాయి. వీటిని పరిశీలించి ఫీల్డ్ డైరెక్టర్లు పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయగలుగుతారు.