న్యూఢిల్లీ: భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018–19లో నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. సర్వే గిన్నిస్ రికార్డు పొందడంపై పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అరుదైన ఘనత అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పులుల గణన సర్వేలో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి. పులి పిల్లలు మినహా దేశంలో మొత్తం 2,461 పులులు ఉన్నట్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ ఫొటోలను విశ్లేషించి గుర్తించారు. పిల్లలతో కలిపితే 2,967 పులులు ఉన్నట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment