
దిగమతులు 10 శాతానికి తగ్గాయని నీతి ఆయోగ్ నివేదిక
2036 నాటికి 36 లక్షల టన్నుల మిగులుంటుందని అంచనా
సంక్షేమ పథకాలకు పప్పుధాన్యాల సరఫరా పెంచాలని సిఫార్సు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడిచిన ఏడేళ్లలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని నీతిఆయోగ్ వెల్లడించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి 2015–16తో పోలిస్తే ఏకంగా 60 శాతం పెరిగాయంది. ఇదే సమయంలో దిగుమతులు 10శాతానికి పడిపోయాయని తెలిపింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి సమతుల్య, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిగులు దేశంగా మారుతుందని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ‘ఆత్మనిర్భరత లక్ష్యం వైపు పప్పుధాన్యాల వృద్ధిని వేగవంతం చేసేలా వ్యూహాలు, మార్గాలు’అనే నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. సుమారు 80 శాతం ఉత్పత్తి వర్షాధార ప్రాంతాలపై ఆధారపడి, 5 కోట్లకు పైగా రైతులు, వారి కుటుంబాల జీవనోపాధికి ఊతమివ్వడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు పప్పుధాన్యాల రంగం చాలా కీలకంగా ఉందని నివేదిక పేర్కొంది.
లక్ష్యం చేరాలంటే కేంద్రం మద్దతే కీలకం
2015–16లో 1.63 కోట్ల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరగ్గా, ఆ సమయంలో ఏకంగా ఏడాదికి 60 లక్షల టన్నుల మేర దిగుమతులు చేసుకునే అవసరముండేదని నీతి ఆయోగ్ తెలిపింది. 2022–23 నాటికి, ఉత్పత్తి 59.4 శాతం పెరిగి 2.60 కోట్ల టన్నులకు ఉత్పత్తి పెరగడంతో పప్పు ధాన్యాల దిగుమతి 29 శాతం నుంచి ఏకంగా 10.4 శాతానికి తగ్గిందని తెలిపింది. 2030 నాటికి దేశంలో 3.05 కోట్ల టన్నులు, 2047 నాటికి 4.57 కోట్ల టన్నుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది.
2036 నాటికి 36 లక్షల టన్నుల మిగులుకు దేశం చేరాలంటే సాగులో ఎదురవుతున్న నిర్దిష్ట అడ్డంకులను తొలగించేందుకు తగిన వ్యవసాయ వ్యూహాలను అనుసరించాల్సి ఉందని సూచించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తితో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు దాదాపు 55 శాతం వాటా కలిగి ఉన్నాయని, మొదటి 10 రాష్ట్రాలు జాతీయ ఉత్పత్తిలో 91 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పోషక భద్రతను నిర్ధారించడానికి, పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా దేశం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవరోధాలను అధిగమించడం చాలా ముఖ్యమని పేర్కొంది. పంటల ఉత్పాదకతను పెంచేందుకు యాంత్రీకరణ, బయో–ఫెరి్టలైజేషన్ పరిష్కారాలను ప్రోత్సహించాలని, వాతావరణ అనుకూలత, తెగులు నిర్వహణ వ్యూహాలను ముందుగానే రైతులకు చేరవేసే వ్యవస్థలను వృధ్ధి చేయాలని సిఫార్సు చేసింది.
దీంతో పాటే రియల్ టైం డేటా ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దిగుబడులు మెరుగు పరిచేందుకు, ఉత్తమ పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఉత్పత్తి అంశాలతో పాటు తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రోటీన్ భద్రత కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్), పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాల్లో పప్పుధాన్యాలను ఎక్కువగా కేటాయించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కిచెప్పింది.