Pulses production
-
చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి/గన్నవరం: కరోనా కష్టకాలంలోనూ మొక్కవోని ఆత్మస్థైర్యంతో అధికోత్పత్తి సాధించిన అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. యువత గ్రామాల వైపు మళ్లాలని పిలుపునిచ్చిన ఆయన వరి, గోధుమ వంటి పంటలను వదిలి ఆరోగ్యాన్ని కాపాడే చిరుధాన్యాల సాగువైపు రైతులు దృష్టిపెట్టాలని సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో శనివారం జరిగిన పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతునేస్తం పురస్కారాల ప్రదానోత్సవంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అగ్రి జర్నలిస్టులకు ఉపరాష్ట్రపతి అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఆహారపు అలవాట్లు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సేంద్రీయ ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. జనాకర్షక పథకాలతో మేలు జరగదు రైతులకు సులువుగా రుణాలు అందించాలి. శీతల గిడ్డంగులు పెరగాలి. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విషయంలో ప్రతీఒక్క భాగస్వామి చిత్తశుద్ధితో పనిచేయాలి. నిరాటంకంగా 10–12 గంటలు మేలైన విద్యుత్‌ను సరఫరా చేయాలి. రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గాలి. అదే సమయంలో రైతులు కూడా అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. విద్యావంతులు వ్యవసాయం వైపు మరింత ఎక్కువగా రావాలి. పలు దేశాల్లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంలో తప్పులేదు. కానీ, ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వాల్సిన పనిలేదు. తాత్కాలిక జనాకర్షక పథకాలవల్ల మేలు జరగదు. చేపలు పట్టడం నేర్పాలేగానీ చేపల పంపిణీ కాదు. అలాగే, రైతులకు కావాల్సింది ఉచిత విద్యుత్ కాదు.. ఎటువంటి అంతరాయం లేని కరెంటు కావాలి. సారంపల్లి, ఎర్నేనికి పురస్కారం అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డికి 2021 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారం.. రైతాంగ సమాఖ్య నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌కు కృషిరత్న అవార్డును అందజేశారు. వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 18 మంది రైతులకు 17 మంది శాస్త్రవేత్తలు, ఐదుగురు జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. సభలో నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్, జిల్లా కలెక్టర్ జె. నివాస్, మంత్రి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. అంతకుముందు.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రి వెలంపల్లి, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సాక్షి విలేకరికి అవార్డు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం సాక్షి గ్రామీణ విలేకరి మొలుగూరి గోపయ్యకు ఉపరాష్ట్రపతి రైతునేస్తం పురస్కారాన్ని అందజేశారు. వ్యవసాయ డిప్లొమా చదివి సొంతంగా వ్యవసాయం చేస్తూనే ఆయన విలేకరిగా పనిచేస్తున్నారు. తనను ఎంపిక చేసిన అవార్డు కమిటీకి, వార్తలు ప్రచురించిన సాక్షి పత్రిక సంపాదకవర్గానికి, యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
దిగుబడి లేదు.. ధరా లేదు
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఖరీఫ్ సీజన్లో వచ్చి తిత్లీ తుపానుతో నియోజకవర్గంలోని వరి పంట మొత్తం నాశనమైంది. రైతులకు ఖరీఫ్ వరి పంట పెట్టుబడి కూడా మిగల్లేదు. రబీ సీజన్లో అపరాల పంటలపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అపరాల విస్తీర్ణం పెరిగినప్పటకీ వరుణుడు కరుణించకపోవడం, చీడపీడలు అధికం అవ్వడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ధర కూడా తక్కువగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రైతులకు అందని మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర మాత్రం అపరాల పంట పండించే రైతులకు అందడంలేదు. నియోజకవర్గంలో సుమారు 8 వేల ఎకరాల్లో రబీ సీజన్లో అపరాల పంటను సాగు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను కొనుగోలు చేసి పండించారు. పంట చేతికందక ముందు ధరలు విపరీతంగా పెంచి, పంట చేతికందే సమయానికి గిట్టు బాటు ధర లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు వేసిన నాటి నుంచి వర్షాలు లేవు. వాతావరణం అనుకూలించక పోవడంతో పంటకు చీడపీడలు ఆశించి దిగుబడులు కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకటనలకే పరిమితమవుతోంది. మద్దతు ధరకు బయట మార్కెట్ ధరలకు పొంతన ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు ధర రైతులకు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. బయట మార్కెట్లో 100 కిలోల పెసల ధర రూ.5 వేలు, మినుములు బస్తా రూ.3200లకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసలు వంద కిలోలకు రూ.7 వేలు, మినుములు వంద కిలోలకు రూ.5,600 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెసలు, మినుములు కొనుగోలు చేయడంలేదు. అపరాల పంటను ఎండ వేస్తున్న రైతు పెరిగిన పెట్టుబడి.. అపరాల పంట ఎకరాకు కనీసం 4 నుంచి 5 వందల కిలోల దిగుబడులు వస్తుండేవి. ఈ సంవత్సరం అందులో సగం కూడా రాని పరిస్థితి. పంటకు అనుకూలించక పోవడంతో రెండు నుంచి మూడు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. విత్తనాల పెట్టుబడి, పంట తీయడానికి, నూర్పుడిలు చేయడానికి ఎకరానికి సుమారు రూ.8 వేలవరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. కనీస దిగుబడులు కూడా రాకపోవడంతో మినుము, పెసర పంటను తీయకుండా ఆవులకు మేతగా చాలా చోట్ల విడిచిపెడుతున్నారు.ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గింది ఖరీఫ్ సీజన్లో వరి పంట పూర్తిగా నష్టపోయాం. అపరాల పంటపై ఆశలు పెట్టుకున్నాం. పంట దిగుబడి తగ్గడంతో కూలీలు ఖర్చు కూడా గిట్టు బాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. – ఎం.సోమేశ్వరరరావు, రైతు, లక్కవరం -
పడిపోయిన ‘పప్పు’!
ఖమ్మం వ్యవసాయం : పప్పు పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించక.. పెట్టిన పెట్టుబడులు రాక.. కూలీల ఖర్చులు పూడక.. సాగు వేల నుంచి వందల ఎకరాలకు పడిపోయింది. ధర వచ్చేంత వరకు పంట నిల్వ చేసుకున్నా.. వచ్చే పరిస్థితి కనిపించక రైతులు దిగాలుపడుతున్నారు. పప్పు పంటల సాగుపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. రబీలో నీటి వనరులున్న ప్రాంతాలు.. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరుతడి పంటల కిందకు వచ్చే పప్పు దినుసుల పంటలే కాకుండా మొక్కజొన్న పంటకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఆయా పంటలను సాగు చేస్తారు. ఇదిలా ఉండగా.. మధిర డివిజన్ పప్పు దినుసుల పంటలకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు. ఇక్కడి వ్యవసాయ పరిశోధనా స్థానం వివిధ రకాల పెసర రకాలను పండిస్తుంది. కాగా.. వ్యవసాయ శాఖ ఖరీఫ్‌లో పప్పు దినుసుల సాధారణ సాగును 10,335 హెక్టార్లుగా, రబీలో 2,357 హెక్టార్లుగా నిర్దేశించింది. కానీ.. సాధారణ సాగు లక్ష్యాన్ని కూడా పంటల సాగు చేరుకోలేకపోయింది. 2014 నవంబర్, డిసెంబర్లో పప్పు దినుసుల పంటలకు బాగా డిమాండ్ వచ్చింది. కందుల ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.13వేలకు చేరింది. పెసల ధర క్వింటాల్‌కు రూ.9వేల మార్కును తాకింది. మినుముల ధర కూడా దాదాపు అంతే ఉంది. పప్పు దినుసుల పంటలు ఆఫ్రికన్ దేశాల నుంచి మన దేశానికి కూడా దిగుమతి చేసుకున్నారు. దీంతో ఈ పంటకు డిమాండ్ పెరగటంతో 2015–16లో కేంద్రం పత్తి సాగును తగ్గించి, దాని స్థానంలో పప్పు పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పెసర, కంది పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేసింది. 2015–16లో పెసర సాధారణ సాగుకు 5 రెట్లు పెరిగింది. ఏకంగా 26 వేల ఎకరాల్లో ఉమ్మడి జిల్లాలో సాగు చేశారు. ఇక కంది పంటను దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయానికి ధర గణనీయంగా పడిపోయింది. పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పుడు పండించిన పంట నిల్వలు ఇంకా ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయా పంటలకు ధర రాకపోవడంతో రైతులు వాటి సాగుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. 2017–18లో ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించకపోవటం.. వేరే పంటలకు అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో అక్కడక్కడ పెసర పంట చేశారు. ప్రస్తుత రబీలో సాగర్ నుంచి ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేసినా.. రైతులు పప్పు పంటలను సాగు చేయకుండా మొక్కజొన్నకు ప్రాధాన్యం ఇచ్చారు. ‘మద్దతు’ లభించని దుస్థితి.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పప్పు దినుసుల పంటకు లభించని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది కేంద్రం పెసలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,575, కందులకు రూ.5,450, మినుములకు రూ.5,400 ప్రకటించింది. ఈ ధరలు ప్రైవేటు మార్కెట్లో లేవు. పెసల ధర రూ.3,500 నుంచి రూ.4వేలకు మించి లేదు. కందులు, మినుముల ధర కూడా అంతే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా ప్రైవేటు మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.2వేల వరకు తేడా ఉంది. పెట్టుబడులు కూడా.. ప్రకృతి విపరీత్యాల వల్ల పప్పు దినుసుల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరాకు కేవలం రెండు, మూడు క్వింటాళ్లకు మించటం లేదు. ఎకరాకు పెట్టుబడులు రూ.15వేలకు మించుతున్నాయి. ధర చూస్తే కనీసం మద్దతు స్థాయిలో కూడా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి. ‘వేల’ నుంచి ‘వందల’కు.. గత పరిస్థితులు ప్రస్తుతం కనిపించటం లేదు. ఉమ్మడి జిల్లాలో 20 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు పెసర పంట సాగు చేసేవారు. అటువంటిది.. 10 వేల ఎకరాల లోపునకు పడిపోయింది. రబీలో దారుణంగా 600 ఎకరాలకు పడిపోయింది. కంది, మినుము సాగు కేవలం 300 ఎకరాలకు పరిమితమైంది. నిల్వలు పేరుకుపోవటంతోనే.. కంది పప్పు ధర హోల్‌సేల్‌లో కిలో ఒక్కింటికి రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్‌లో రూ.55 నుంచి రూ.65 వరకు విక్రయిస్తున్నారని, పెసర పప్పు హోల్‌సేల్ ధర రూ.60 వరకు ఉండగా.. రిటైల్ ధర రూ.70 నుంచి రూ.75 వరకు ఉందని విశ్లేషిస్తున్నారు. పంట నిల్వలు పేరుకుపోవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. పంట సాగు తగ్గించాం.. పెసర, కంది పంటలకు తగిన ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రావటం లేదు. దీంతో సాగు తగ్గించాం. ఏటా నాలుగెకరాల వరకు పెసర, కంది పంటలను సాగు చేసేవాన్ని. ఇప్పుడు రెండెకరాల్లో మాత్రమే పంటలు వేశా. – నున్నా వెంకటేశ్వర్లు, అనంతసాగర్, నేలకొండపల్లి మండలం కంది వేసి నష్టపోయా.. కంది పంట వేసి నష్టపోయా. రెండున్నర ఎకరాల్లో పంట వేస్తే.. నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. క్వింటాకు రూ.3,800 ధర మాత్రమే పెట్టారు. మద్దతు ధర లభించలేదు. మొత్తంగా రూ.25వేలకు పైగా నష్టపోయా. – బైరి శ్రీను, వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలం -
పప్పు ధాన్యాల మద్దతు ధర పెంచండి
సుబ్రమణియన్ కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడంతోపాటు, ధరలకు కళ్లెం వేయడానికి కనీస మద్దతు ధరను తక్షణం పెంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘కనీస మద్దతు ధర ద్వారా పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, సంబంధిత విధానాలు’ అనే పేరుతో సుబ్రమణియన్ శుక్రవారం ఒక నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. 2016 రబీ సీజన్‌కు పప్పు శనగలకు క్వింటాల్‌కు రూ.4,000, 2017 ఖరీఫ్ సీజన్‌కు కంది, మినుములకు క్వింటాల్‌కు 6,000ను కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని కమిటీ చెప్పింది. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పప్పు ధాన్యాలను సేకరించాలనీ, 20 లక్షల టన్నుల బఫర్ స్టాకును నిర్వహించాలని సిఫారసు చేసింది. పప్పు ధాన్యాలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వస్తువుల జాబితా నుంచి తొలగించాలనీ, జన్యు పరంగా వంగడాల అభివృద్ధిని ప్రోత్సహించాలని కమిటీ కోరింది. పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు రాయితీలు కూడా ఇవ్వాలని నిర్దేశించింది. పప్పు ధాన్యాల ఎగుమతులు, దేశీయంగా నిల్వలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కమిటీ సూచించింది.