ఖమ్మం వ్యవసాయం : పప్పు పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించక.. పెట్టిన పెట్టుబడులు రాక.. కూలీల ఖర్చులు పూడక.. సాగు వేల నుంచి వందల ఎకరాలకు పడిపోయింది. ధర వచ్చేంత వరకు పంట నిల్వ చేసుకున్నా.. వచ్చే పరిస్థితి కనిపించక రైతులు దిగాలుపడుతున్నారు. పప్పు పంటల సాగుపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. రబీలో నీటి వనరులున్న ప్రాంతాలు.. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరుతడి పంటల కిందకు వచ్చే పప్పు దినుసుల పంటలే కాకుండా మొక్కజొన్న పంటకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఆయా పంటలను సాగు చేస్తారు. ఇదిలా ఉండగా.. మధిర డివిజన్ పప్పు దినుసుల పంటలకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు. ఇక్కడి వ్యవసాయ పరిశోధనా స్థానం వివిధ రకాల పెసర రకాలను పండిస్తుంది.
కాగా.. వ్యవసాయ శాఖ ఖరీఫ్‌లో పప్పు దినుసుల సాధారణ సాగును 10,335 హెక్టార్లుగా, రబీలో 2,357 హెక్టార్లుగా నిర్దేశించింది. కానీ.. సాధారణ సాగు లక్ష్యాన్ని కూడా పంటల సాగు చేరుకోలేకపోయింది. 2014 నవంబర్, డిసెంబర్‌లో పప్పు దినుసుల పంటలకు బాగా డిమాండ్ వచ్చింది. కందుల ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.13వేలకు చేరింది. పెసల ధర క్వింటాల్‌కు రూ.9వేల మార్కును తాకింది. మినుముల ధర కూడా దాదాపు అంతే ఉంది. పప్పు దినుసుల పంటలు ఆఫ్రికన్ దేశాల నుంచి మన దేశానికి కూడా దిగుమతి చేసుకున్నారు. దీంతో ఈ పంటకు డిమాండ్ పెరగటంతో 2015–16లో కేంద్రం పత్తి సాగును తగ్గించి, దాని స్థానంలో పప్పు పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పెసర, కంది పంటలు సాగు చేయాలని విస్తృత ప్రచారం చేసింది. 2015–16లో పెసర సాధారణ సాగుకు 5 రెట్లు పెరిగింది. ఏకంగా 26 వేల ఎకరాల్లో ఉమ్మడి జిల్లాలో సాగు చేశారు. ఇక కంది పంటను దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయానికి ధర గణనీయంగా పడిపోయింది.
పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పుడు పండించిన పంట నిల్వలు ఇంకా ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయా పంటలకు ధర రాకపోవడంతో రైతులు వాటి సాగుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. 2017–18లో ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించకపోవటం.. వేరే పంటలకు అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో అక్కడక్కడ పెసర పంట చేశారు. ప్రస్తుత రబీలో సాగర్ నుంచి ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేసినా.. రైతులు పప్పు పంటలను సాగు చేయకుండా మొక్కజొన్నకు ప్రాధాన్యం ఇచ్చారు.
‘మద్దతు’ లభించని దుస్థితి..
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పప్పు దినుసుల పంటకు లభించని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది కేంద్రం పెసలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,575, కందులకు రూ.5,450, మినుములకు రూ.5,400 ప్రకటించింది. ఈ ధరలు ప్రైవేటు మార్కెట్‌లో లేవు. పెసల ధర రూ.3,500 నుంచి రూ.4వేలకు మించి లేదు. కందులు, మినుముల ధర కూడా అంతే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,400 నుంచి రూ.2వేల వరకు తేడా ఉంది.
పెట్టుబడులు కూడా..
ప్రకృతి విపరీత్యాల వల్ల పప్పు దినుసుల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఎకరాకు కేవలం రెండు, మూడు క్వింటాళ్లకు మించటం లేదు. ఎకరాకు పెట్టుబడులు రూ.15వేలకు మించుతున్నాయి. ధర చూస్తే కనీసం మద్దతు స్థాయిలో కూడా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి.
‘వేల’ నుంచి ‘వందల’కు..
గత పరిస్థితులు ప్రస్తుతం కనిపించటం లేదు. ఉమ్మడి జిల్లాలో 20 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు పెసర పంట సాగు చేసేవారు. అటువంటిది.. 10 వేల ఎకరాల లోపునకు పడిపోయింది. రబీలో దారుణంగా 600 ఎకరాలకు పడిపోయింది. కంది, మినుము సాగు కేవలం 300 ఎకరాలకు పరిమితమైంది.
నిల్వలు పేరుకుపోవటంతోనే..
కంది పప్పు ధర హోల్‌సేల్‌లో కిలో ఒక్కింటికి రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్‌లో రూ.55 నుంచి రూ.65 వరకు విక్రయిస్తున్నారని, పెసర పప్పు హోల్‌సేల్ ధర రూ.60 వరకు ఉండగా.. రిటైల్ ధర రూ.70 నుంచి రూ.75 వరకు ఉందని విశ్లేషిస్తున్నారు. పంట నిల్వలు పేరుకుపోవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు.
పంట సాగు తగ్గించాం..
పెసర, కంది పంటలకు తగిన ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రావటం లేదు. దీంతో సాగు తగ్గించాం. ఏటా నాలుగెకరాల వరకు పెసర, కంది పంటలను సాగు చేసేవాన్ని. ఇప్పుడు రెండెకరాల్లో మాత్రమే పంటలు వేశా.
– నున్నా వెంకటేశ్వర్లు, అనంతసాగర్, నేలకొండపల్లి మండలం
కంది వేసి నష్టపోయా..
కంది పంట వేసి నష్టపోయా. రెండున్నర ఎకరాల్లో పంట వేస్తే.. నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. క్వింటాకు రూ.3,800 ధర మాత్రమే పెట్టారు. మద్దతు ధర లభించలేదు. మొత్తంగా రూ.25వేలకు పైగా నష్టపోయా.
– బైరి శ్రీను, వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment