పప్పు ధాన్యాల మద్దతు ధర పెంచండి
సుబ్రమణియన్ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ: పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడంతోపాటు, ధరలకు కళ్లెం వేయడానికి కనీస మద్దతు ధరను తక్షణం పెంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘కనీస మద్దతు ధర ద్వారా పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, సంబంధిత విధానాలు’ అనే పేరుతో సుబ్రమణియన్ శుక్రవారం ఒక నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. 2016 రబీ సీజన్‌కు పప్పు శనగలకు క్వింటాల్‌కు రూ.4,000, 2017 ఖరీఫ్ సీజన్‌కు కంది, మినుములకు క్వింటాల్‌కు 6,000ను కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని కమిటీ చెప్పింది.
యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పప్పు ధాన్యాలను సేకరించాలనీ, 20 లక్షల టన్నుల బఫర్ స్టాకును నిర్వహించాలని సిఫారసు చేసింది. పప్పు ధాన్యాలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వస్తువుల జాబితా నుంచి తొలగించాలనీ, జన్యు పరంగా వంగడాల అభివృద్ధిని ప్రోత్సహించాలని కమిటీ కోరింది. పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు రాయితీలు కూడా ఇవ్వాలని నిర్దేశించింది. పప్పు ధాన్యాల ఎగుమతులు, దేశీయంగా నిల్వలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కమిటీ సూచించింది.