Arvind Subramanian
-
మామూలు మందగమనం కాదు...
న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ స్పందించారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గణాంకాలను విశ్లేషిస్తే దేశంలో సాధారణ మందగమనం కాకుండా తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 2011 నుంచి 2016 సంవత్సరాలలో దేశ వృద్ధి రేటు 2.5 శాతం పాయింట్లు ఎక్కువగా అంచనా వేయబడిందని గతంలో సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. జీడీపీనే ఆర్థిక వ్యవస్థకు కొలమానం కాదని తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థకు జీడీపీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే చమురేతర రంగాలకు దిగుమతి, ఎగుమతి రేట్లు 6 శాతం, -1శాతం ఉంటే బెటర్ అని సూచించారు. మూలధన వస్తువుల వృద్ధి రేటు (10 శాతం తగ్గడం), వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి వృద్ధి రేటు (రెండేళ్ల క్రితం 5 శాతంతో పోలిస్తే ఇప్పుడు 1 శాతానికి) మెరుగైన సూచికలు కావచ్చని తెలిపారు. సూచికలు సానుకూలంగా లేక వ్యతిరేకంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి వృద్ధి, పెట్టుబడి, ఎగుమతి, దిగుమతి రంగాలు..అన్ని రంగాల లక్ష్యం ఉపాది కల్పించడమే అని తెలిపారు. సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల ఆదాయాలు, వేతనాలు తగ్గడం, ఉద్యోగ కల్పనలో మందగమనం ఇవన్ని ఆర్ధిక వ్యవస్థ మందగమనానికి కొలమానంగా చెప్పవచ్చు అని తెలిపారు. అలాగే ప్రధాన సూచికలు ప్రతికూలంగా ఉన్నా జులై మాసంలో వృద్ధి రేటు కేవలం 7.7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. -
ఆ పజిల్ విప్పితే.. తిరిగి వచ్చేస్తా
అహ్మదాబాద్: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మరోసారి భారత ఆర్థికవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోతోంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం ఉత్సాహంగా పైపైకి దూసుకుపోవడం తనకు ఒక పజిల్‌గా వుందని వ్యాఖ్యానించారు. ఇదొక పజిల్‌గా తనకు గోచరిస్తోందని, దీన్ని తనకు అర్థం చేయిస్తే తాను తిరిగి దేశానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం వుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ), ఎన్ఎస్ఇ, ఎన్ఎస్ఇ ఐసీఎఫ్టి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఎన్ఎస్ఇ సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్స్ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్షీణిస్తుందో, స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోందో వివరించాలన్నారు. మొట్టమొదటి సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్సెస్ డొమైన్ ఈ చిక్కుముడిని విప్పగలిగితే.. తాను అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చేస్తానన్నారు. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కేవలం ఆర్ధికశాస్త్రం, ఫైనాన్స్, మార్కెటింగ్లాంటి వాటికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ పరిమితం కాకుండా ఎకనామిక్స్‌లోని కొన్ని పరిస్థితులకు మానవుల స్పందన ఎలా వుంటుందనే అసాధారణమైన విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం-ఎ డైరెక్టర్ ఎర్రోల్ డిసౌజా , మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్యాకల్టీ సభ్యుడు అరవింద్ సహాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక సేవల్లోని వ్యాపార సమస్యలకు సంబంధించిన అనేక విషయాలలో అవగాహన చేపట్టడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని డిసౌజా తెలిపారు. విధాన రూపకర్తలు, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు, ఫండ్ నిర్వాహకులు, వ్యాపారులు, విశ్లేషకులు, సంపద సలహాదారులు, ఇతర నిర్వాహకులు ఈ విషయంలో తమకు సహాయపడాలన్నారు. ఎన్ఎస్ఈ సీఎండీ విక్రమ్ లిమాయే మాట్లాడుతూ జనాభా , పొదుపు , పెట్టుబడి అలవాట్లను రూపొందించడంలో సామాజిక ప్రవర్తనా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దుతో వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిందనీ, దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్య అని విమర్శించిన అరవింద్ ‘ఆఫ్ కౌన్సెల్– ది ఛాలెంజెస్ ఆఫ్ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 2014 అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అయితే 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ గత ఏడాది అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
అరవింద్ సంచలనం
తమ దగ్గర కీలక స్థానాల్లో పనిచేసి నిష్క్రమించినవారి గురించి పాలకులు బేజారెత్తే రోజులొ చ్చాయి. వెళ్లినవారు మౌనంగా ఉండకుండా తమ జ్ఞాపకాలు గ్రంథస్థం చేయడమే ఇందుకు కారణం. గతంలో ప్రధాని మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు, కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌సింగ్, కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ తదితరులు తమ అనుభవాలను వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడిక కేంద్రంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసి నాలుగు నెలలక్రితం వైదొలగిన అరవింద్ సుబ్రహ్మణ్యం వంతు వచ్చింది. పెద్ద నోట్ల రద్దు చర్యవల్ల మన వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిన్నదని తాను రాసిన పుస్తకంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్యగా ఆయన అభివర్ణించారు. ‘ఆఫ్ కౌన్సెల్– ది ఛాలెంజెస్ ఆఫ్ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఆయన రాసిన ఈ గ్రంథాన్ని వచ్చే శుక్రవారం ముంబైలో, ఆ తర్వాత మరో రెండు రోజులకు ఢిల్లీలో ఆవిష్కరించబోతున్నారు. ఆయన నాలుగేళ్లు సలహాదారుగా పనిచేసిన కాలంలోనే ఎన్నో కీలక విధాన నిర్ణయాలు అమలయ్యాయి గనుక ఆ పరిణామాలన్నిటిపైనా ఆయన ఏం చెబుతారో నన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ సహజంగానే ఉంటుంది. అరవింద్ సుబ్రహ్మణ్యం ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, అహ్మదాబాద్ ఐఐఎం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకుని ఐఎంఎఫ్ తదితర అంతర్జాతీయ సంస్థల్లో ఆర్థికవేత్తగా పనిచేసినవారు. సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రూప కల్పనలో కీలకపాత్ర పోషించారు. ఏదైనా గ్రంథం మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ప్రచురణకర్తలు అందులో సంచలనం సృష్టించగల భాగాలను ఎంచుకుని ముందుగా వెల్లడిస్తారు. అందువల్ల సహ జంగానే ఆ పుస్తకంపై అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతుంది. దానికోసం ఎదురుచూస్తారు. అర వింద్ సుబ్రహ్మణ్యం పుస్తకం విషయంలో అదే జరిగింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాధారణ పౌరుల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపిందో ఎవరూ మర్చిపోరు. దాన్ని నల్లడబ్బుపై బ్రహ్మాస్త్రమని కేంద్రంలోని పెద్దలు చెప్పినా, ఆచరణలో ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’గా పరిణమించింది. సామాన్య పౌరులు పగలనకా, రాత్రనకా గంటల తరబడి ఏటీఎంల ముందు నిల్చుని డబ్బు కోసం ఎదురుచూడటం ఊహించని పరిణామం. బ్యాంకుల్లో వారానికి రూ. 24,000 ఇస్తామని, పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షలిస్తామని హామీ ఇచ్చినా దేశంలో ఎక్కడా దాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు. పలుకుబడి గలవారు మాత్రం తమకు అవసరమైన డబ్బు పొందగలిగారు. అసలు చలామణిలో ఉన్న పెద్ద నోట్ల లెక్కెంతో ఎవరికీ సరైన అంచనా లేదని వివిధ సందర్భాల్లో అటు రిజర్వ్‌బ్యాంకు, ఇటు కేంద్రం చేసిన ప్రకటనలు తెలియజెప్పాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించాక వీటి విలువ రూ. 15,44,000 కోట్లు అని కేంద్రం చెప్పింది. అదే రోజున రిజర్వ్‌బ్యాంకు దాన్ని రూ. 20,51,000 కోట్లని తెలియజేసింది. కేంద్రం చెప్పిన లెక్కే సరైందనుకుంటే...పెద్ద నోట్ల రద్దు తర్వాత అందులో దాదాపు అంతా వెనక్కొచ్చినట్టే. గత ఆగస్టులో రిజర్వ్‌బ్యాంక్ ఒక ప్రకటన చేస్తూ వెనక్కి తిరిగొచ్చిన పాత నోట్ల విలువ రూ. 15.3 లక్షల కోట్లని వెల్లడించింది. దాన్నిబట్టి చలామణిలో ఉన్న 99.3 శాతం డబ్బు వెనక్కొచ్చినట్టే. సారాంశంలో కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ అనుకున్నట్టు చలామణిలో ఉన్న కరెన్సీలో నల్లడబ్బు లేదని తేలిపోయింది. ఈ నిర్ణయంపై అరవింద్ కటువైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఆయన దిగ్భ్రాంతికరమైన చర్యగా అభివర్ణించడంతో ఊరుకోక నిరంకుశమైనదని కూడా అన్నారు. అందరినీ ఆశ్చర్యపరచగల వ్యాఖ్యలివి. పెద్దనోట్ల రద్దుపై దాని వ్యతిరేకులు చాన్నాళ్లుగా ఈ తరహా మాటలంటున్నారు. కానీ ఆ సమయంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా అరవింద్ మాటలకు విలువుంటుంది. అప్పట్లో దానిపై నోరు విప్పేందుకు అరవింద్ సిద్ధపడలేదు. ఆ నిర్ణయం ఆయనకుగానీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి గానీ ముందుగా చెప్పలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే జైట్లీ దాన్ని తోసిపుచ్చినా, అరవింద్ మౌనంగానే ఉండిపోయారు. ఆఖరికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సమయంలో కూడా ఆయన పెద్ద నోట్ల రద్దు అంశానికి సంబంధించిన ప్రశ్నలపై జవాబులు దాటవేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టగల కొన్ని సున్నితమైన అంశాల విషయంలో ఎలా ఉండాలో తాను తెలుసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో ఆయన చమత్కరించారు కూడా. అయితే ఈ గ్రంథ రచనలో దాన్ని పాటించినట్టు లేరు. పుస్తకంలో ఆయన చెప్పిన మరొక మాట ముఖ్యమైనది. పెద్ద నోట్ల రద్దు వంటి తీవ్ర చర్యలు యుద్ధ సమయాల్లో, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు, కరెన్సీ సంక్షోభం లేదా రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే తీసుకోవాలన్నది ఆయన అభిప్రాయం. 2016లో ఇలాంటి పరిస్థితులేమీ లేవు. జీఎస్టీ బిల్లు రూపశిల్పుల్లో అరవింద్ కూడా ఒకరైనా, దాని అమలు తీరుపై ఆయనకు అసంతృప్తి ఉన్నదని పుస్తకం చెబుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత అమలు చేయడం వల్ల దాని ప్రభావం జీఎస్టీపై బాగా పడిందన్నది ఆయన అభి ప్రాయం. అరవింద్ సుబ్రహ్మణ్యం పుస్తకం ఎంతగా సంచలనం రేపగలదో విపక్షాల స్పందనలు చూస్తేనే అర్ధమవుతుంది. అరవింద్ అభిప్రాయాలు వెల్లడై 24 గంటలు గడుస్తున్నా బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడకపోవడాన్ని బట్టి వారెంత సంకటస్థితిలో పడ్డారో గ్రహించవచ్చు. అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో అప్పట్లో ప్రభుత్వానికి తన అభిప్రాయాల్ని ఆయన విస్పష్టంగా చెప్పారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దుపై ఆయనకు ఇంతటి తీవ్రమైన అభిప్రాయా లున్నా... ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉంటున్న తనను ఆ విషయంలో సంప్రదించలేదని గ్రహిం చాక కూడా ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగారన్నది ఆశ్చర్యకరం. పుస్తకావిష్కరణ సమ యంలోనైనా దీనిపై ఆయన వివరణనిస్తారేమో చూడాలి. -
‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రధ్దు చేసి ప్రజలను నూరు పాట్లకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధ్వజమెత్తారు. ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై దుమ్మెత్తిపోశారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచలోని ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదుకదా సమర్థించడం కూడా జరగలేదని, అందరూ అది అనాలోచిత నిర్ణయమని అన్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. అసలు నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్కే తెలియదన్నారు. నోట్ల రద్దు గురించి ఢిల్లీలో మోదీ వివరించిన రోజు సీఈఏ కేరళలో ఉన్నారని, సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అన్నది అవినీతి, తీవ్రవాదం, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి విజయం సాధించిందా అంటూ చురకలు అంటించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు ఎలా అమలుచేస్తున్నారో అడిగి తెలుసుకునేవారని తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌పై కూడా చిదంబరం విమర్శల వర్షం కురిపించారు. అదొక భీమా పథకం లాంటిదని.. 130 కోట్లకుపైగా జనాభా గల భారత్‌లో భీమా పథకాలతో ప్రజలకు లాభం జరగుతుందనే నమ్మకంలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కీమ్‌లు ఏ దేశంలోనూ విజయవంతం కాలేదని వివరించారు. అంతేకాకుండా ఈ పథకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
అర్వింద్ ఎందుకు రాజీనామా చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అందులో అంతగా నిజం లేదని, అమెరికా అకాడమీ పదవి వదిలి వచ్చి మళ్లీ అక్కడికే వెళ్లడం సూచిస్తోంది. ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సలహాదారు పదవి నుంచి తప్పుకున్న మొదటి వ్యక్తి కూడా అర్వింద్ కాకపోవడం ఈ విషయాన్ని మరింత ధ్రువీకరిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ 2016లో తప్పుకున్నారు. ఆయన తనకు రెండో పర్యాయం పదవీకాలాన్ని పొడిగించని కారణంగా పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణాయక మండలిగా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ చైర్మన్ పదవికి అర్వింద్ పణగారియా రాజీనామా చేశారు. ఇప్పుడు అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేయడం కూడా చర్చ నీయాంశం అయింది. కీలక ఆర్థిక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు. పాలకపక్ష బీజేపీకే కాకుండా ఆరెస్సెస్ లాంటి అనుబంధ హిందూత్వ శక్తులకు కూడా విధేయులుగా ఉన్న వారే పదవుల్లో మనుగడ సాగించగలరని, లేకపోతే తప్పుకోవడం తప్పనిసరి అవుతుందని అర్థం అవుతోంది. సమాజంలో హిందువులు, ముస్లింలు అంటూ విభజన తీసుకరావడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందంటూ 2016లో అర్వింద్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్‌కు రుచించలేదు. గోవధ నిషేధంపై తాను ఆనాడే తన అభిప్రాయాలను వెళ్లడించినట్లయితే ఆనాడే తన ఉద్యోగం పోయేదని సుబ్రమణియన్ ఇటీవలనే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన తన పదవిని కోల్పోయి ఉండవచ్చు! సుబ్రమణియన్‌తోపాటు ర ఘురామ్ రాజన్ అభిప్రాయాలు జాతి వ్యతిరేకమైనవని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి బహిరంగంగా విమర్శించడం కూడా ఇక్కడ గమనార్హమే. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, రాత్రి వేళల్లో మహిళలు పనిచేయడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి నీతి అయోగ్‌లో పనగారియా చేసిన ప్రతిపాదనలకు కూడా ఆరెస్సెస్ తీవ్రంగా విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రఘురామ్ రంజన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం బహిరంగంగానే తప్పుపట్టారు. ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలనే ప్రశ్నించే ధైర్యమున్న సుబ్రమణియన్ లాంటి అధికారులు నానాటికి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎంతో అవసరం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దేశ ఆర్థిక విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఫలించినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న సంస్కరణలు ఎందుకు ఫలించడం లేవన్నది మరో ప్రశ్న. ప్రభుత్వ విధానాలకు విధేయులు కాదంటూ ముఖ్య ఆర్థిక సలహాదారులను తీసేస్తూ పోతుంటే ఫలితాల ప్రశ్న అలాగే ఉండి పోతుంది. -
ఆర్థిక సలహాదారు అరవింద్ గుడ్‌బై
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా వ్యవహరిస్తున్న అరవింద్ సుబ్రమణియన్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. కుటుంబానికి మరింత సమయం కేటాయించే ఉద్దేశంతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ అంతకన్నా చాలా ముందుగా వచ్చే రెండు నెలల్లోనే సీఈఏ హోదా నుంచి తప్పుకోనున్నట్లు సుబ్రమణియన్ తెలిపారు. ‘ఈ సెప్టెంబర్‌లో నాకు మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు. ఇలాంటి పూర్తి వ్యక్తిగత కారణాల రీత్యా నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను‘ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని సంప్రతించిన తర్వాత అందరికన్నా ముందుగా ప్రధానికే ఈ విషయం తెలియజేసినట్లు సుబ్రమణియన్ వివరించారు. నెలా, రెణ్నెల్ల వ్యవధిలో తాను విధుల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. 2014 అక్టోబర్ 16న కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. భవిష్యత్ ప్రణాళికలు.. ప్రస్తుతానికి భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించేందుకు సుబ్రమణియన్ నిరాకరించారు. తానేం చేయబోతున్నది మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. కొత్త సీఈఏ ఎంపికకు సంబంధించి అన్వేషణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాగలదన్నారు. పోటీతత్వాన్ని విశ్వసించే కేంద్ర ప్రభుత్వం .. తన వారసుల ఎంపిక విషయంలోనూ అదే ధోరణిని అనుసరించే అవకాశం ఉందన్నారు. పూర్తికాని ఎజెండా గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి రాష్ట్రంలోనూ ఒక సీఈఏ ఉండాలన్నది తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. ‘తమ తమ రాష్ట్రాల్లో సీఈఏలాంటి వ్యవస్థ ఉండాలని చాలా మంది ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. కానీ ఇందుకోసం కావాల్సిన శక్తి సామర్ధ్యాలు, సమయం ప్రస్తుతం నా దగ్గర లేవు. భవిష్యత్‌లో ఇది సాకారం కాగలదని ఆశిస్తున్నాను‘ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. రెండంకెల వృద్ధికి ఆ రెండూ కీలకం.. భారత్ నిర్దేశించుకున్న రెండంకెల స్థాయి వృద్ధి రేటు సాధించాలంటే రెండు అంశాలు కీలకమని సుబ్రమణియన్ తెలిపారు. ముందుగా అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉండాలన్నారు. అలాగే దేశీయంగానూ విధానాలను సంస్కరించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండో అంశం విషయంలో తగు చర్యలు తీసుకుంటోందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. భారత్ నిస్సందేహంగా రెండంకెల స్థాయి వృద్ధి రేటును అందుకోగలదన్నారు. ప్రస్తుతం మినహాయింపు పొందుతున్న రంగాలన్నీ కూడా వస్తు, సేవల పన్నుల పరిధిలోకి వస్తే శ్రేయస్కరమని, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుబ్రమణియన్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాలపై స్పందిస్తూ.. ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనగలిగేలా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ముందుగానే వెల్లడించిన జైట్లీ .. సీఈఏ హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సుబ్రమణియన్ ప్రకటించడానికి ముందుగానే ఆయన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్లో పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘కొద్ది రోజుల క్రితం సీఈఏ అరవింద్ సుబ్రమణియన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నాతో మాట్లాడారు. కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నందున తిరిగి అమెరికా వెళ్లిపోదల్చుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కారణాలు వ్యక్తిగతమైనవి, చాలా ముఖ్యమైనవి. దీంతో నేను ఆయనతో ఏకీభవించక తప్పలేదు‘ అంటూ ఫేస్బుక్లో అరుణ్ జైట్లీ పోస్ట్ చేశారు. గతేడాదే పదవీకాలం ముగిసిపోయినప్పటికీ తన విజ్ఞప్తి మేరకు అరవింద్ సుబ్రమణియన్ మరికొంత కాలం సీఈఏగా కొనసాగేందుకు అంగీకరించారని జైట్లీ చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడైన సుబ్రమణియన్ నిష్క్రమణ తీరని లోటుగా జైట్లీ అభివర్ణించారు. ఎరువులు, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణల అమలుకు సంబంధించి కీలక సూచనలతో ఆయన తోడ్పాటు అందించినట్లు తెలిపారు. సుబ్రమణియన్ తప్పుకోవడం ఊహించిందే: కాంగ్రెస్ సీఈఏగా అరవింద్ సుబ్రమణియన్ నిష్క్రమణ ఊహించిందేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అత్యంత భారీ స్థాయి ఆర్థిక అరాచకత్వాన్ని’ భరించలేకే మోదీ ప్రభుత్వంలోని ’ఆర్థిక నిపుణులు’ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అరవింద్ పనగారియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మొదలైన వారు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా కీలక వ్యక్తుల నిష్క్రమణ.. పదవీకాలం ముగియడానికి ముందుగానే ఇటీవల వైదొలిగిన కీలక ఆర్థిక సలహాదారుల్లో అరవింద్ సుబ్రమణియన్ రెండో వారు కానున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా 2017 ఆగస్టులో తప్పుకున్నారు. ఆయన కూడా పదవీకాలం మరో రెండేళ్లు ఉండగానే వైదొలిగారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ ఆయా హోదాలకు ప్రత్యేకంగా ఎంపిక చేసింది. అయితే పదవీకాలం పూర్తికాకుండానే ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం గమనార్హం. కొంగొత్త ఐడియాల అమలు .. సీఈఏగా అరవింద్ సుబ్రమణియన్ పలు వినూత్న ఐడియాలను అమలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా తొలి ఆన్లైన్ కోర్సును నిర్వహించారు. అలాగే, ఆన్లైన్ విద్యకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ’స్వయం’ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. అలాగే సంపన్నులకు క్రమంగా సబ్సిడీలు తొలగించడం, వాతావరణంలో పెను మార్పులు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తదితర అంశాలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు. -
కేసీఆర్ కిట్స్, ‘పెట్టుబడి’ పథకాలు భేష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం, కేసీఆర్ కిట్స్, రైతులకు పంట పెట్టుబడి సాయం పథకాలను గొప్ప కార్యక్రమాలుగా అభివర్ణించారు. ఈ పథకాలను దేశమంతా అధ్యయనం చేసి అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో అరవింద్ సుబ్రమణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌ను తిలకించిన అనంతరం సుబ్రమణ్యన్ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సుపరిపాలనకు గుండె వంటిదని వ్యాఖ్యానించారు. మొదటి విడతలోనే 93 శాతం భూములకు సంబంధించిన రికార్డులను క్లియర్ చేసి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వడం అద్భుతమని కితాబిచ్చారు. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యయానికి వెనుకాడకుండా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ చాలా గొప్ప కార్యక్రమమని, తననెంతో ప్రభావితం చేసిందని అభినందించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని, ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి విడత సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని, తాను కూడా అందులో పాల్గొంటానని వెల్లడించారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన అభినందించారు. తెలంగాణకు మరింత తోడ్పాటు అందించాలి: కేసీఆర్ అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆదాయవృద్ధిలో ముందంజలో ఉండి అప్పులు తీర్చగలిగే శక్తి ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచి మరింత తోడ్పాటు అందించాలని అరవింద్ సుబ్రమణ్యన్‌ను కోరారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు నిధులు తగ్గించకుండా ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వ విధానం ఉండాలన్నారు. ఈ దిశగా కేంద్రం ఆలోచించేలా చొరవ చూపాలని ఆయనకు సూచించారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ముందడుగు వేసే రాష్ట్రాలను నిలువరించే చర్యలను కేంద్రం మానుకోవాలన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం తెలంగాణలో రాష్ట్రంలో రైతులే ఎక్కువ మంది ఉన్నారని, వారు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గట్టి నమ్మకంతో తామున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న వాటా కేవలం కాగితాలకే పరిమితమని, సమైక్య పాలనలో నీళ్లు తెలంగాణ పొలాలకు రాలేదని వివరించారు. అందుకే తాము సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. 2020 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రెండు పంటలు పండించుకుంటారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంత కుమారి, ఎంపీ బాల్క సుమన్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వృద్ధిరేటులో నంబర్ వన్ దేశ తలసరి ఆదాయం రూ. 1.03 లక్షలుంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదా యం రూ. 1.55 లక్షలు ఉందని సీఎం కేసీఆర్ అరవింద్ సుబ్రమణ్యన్‌కు వివ రించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు ముందు తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 21 శాతం ఉండగా జీఎస్టీ అమలు తర్వాత కూడా 16.5 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే తొలిస్థానంలో నిలిచామని సీఎం చెప్పారు. 2013–14లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ. 1.36 లక్షల కోట్లయితే 2017–18 తెలంగాణ బడ్జెట్ రూ. 1.49 వేల కోట్లుగా ఉందన్నారు. ఇంత ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కోరారు. రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటే దేశ ప్రగతి కూడా కుంటుపడుతుందని సీఎం పేర్కొన్నారు. కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్లు ఇవీ ♦ ఎప్పుడో నిర్ణయించిన కనీస మద్దతు ధరను సవరించాలి. గోధుమలు, ధాన్యానికి రూ. 2,200, మక్కలకు రూ. 2,000 మద్దతు ధర ప్రకటించాలి. ♦ వ్యవసాయ అనుబంధ రంగాలైన గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టే వారిని ఆదాయ పన్ను పరిధి నుంచి తొలగించాలి. ♦ కేంద్ర పథకాల నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ♦ కాంపా నిధుల్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందించాలి. గ్రీన్ కవర్ పెంచడానికి కృషిచేస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి. ♦ పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న కరెన్సీ కొరతను అధిగమిం చేందుకు ఎక్కువ కరెన్సీ విడుదల చేసేలా ఆర్బీఐని ఒప్పించాలి. కేసీఆర్ కిట్ తెప్పించుకొని మరీ పరిశీలన... తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ పథకం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తానని అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమని కొనియాడారు. పేద గర్భిణులు కూలికి వెళ్లలేకపోవడం వల్ల జరిగే వేతన నష్టాన్ని కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోందని ఆయనకు కేసీఆర్ వివరించారు. ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేల నగదు అందించడంతోపాటు తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన రూ. 3 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో సుబ్రమణ్యన్ కేసీఆర్ కిట్‌ను అడిగి మరీ తెప్పించుకుని అందులోని ప్రతి వస్తువునూ పరిశీలించారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమైన పథకమని కొనియాడారు. తాను త్వరలో తెలంగాణ లో పర్యటిస్తానని అప్పుడు కేసీఆర్ కిట్స్, ఎత్తిపోతల పథకాలు, హరితహారం లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని వెల్లడించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 75,116 చొప్పున ప్రభుత్వమే సాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వమే ఆడపిల్లకు కట్నం ఇస్తున్నట్లా అని చమత్కరించారు. -
షేర్ మార్కెట్ పతనం ఊహించినదే!
సాక్షి, న్యూఢిల్లీ : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో రెండు రోజులుగా షేర్లు పతనమవుతూ భారీగా నష్టాలు ముంచుకురావడం ముందుగా ఊహించిందే. ఈ విషయాన్ని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ కూడా ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక నివేదికలో హెచ్చరించారు. గత రెండు, మూడు ఏళ్లుగా భారత్‌లో స్టాక్ మార్కెట్ షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయని, ఈ గాలి బుడగ ఎప్పుడో పేలుతుందని కూడా ఆయన చెప్పారు. వివిధ కంపెనీల షేర్లకున్న వాస్తవ విలువకు అనేక రెట్లు ఎక్కువగా అంచనావేసి షేర్లను అడ్డకోలుగా కొనుగోలు చేయడం వల్లనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లుగా అమెరికాతోపాటు భారత్ షేర్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల్లో పరస్పర విరుద్ధ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ అమెరికాతోపాటు భారత్‌లో కూడా స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పెరగడం ఏమిటని కొంత మంది ఆర్థిక నిపుణులు ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమే కాకుండా అక్కడ కార్పొరేట్ లాభాలు, వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. భారత్‌లో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడమే కాకుండా కార్పొరేట్ లాభాలు భారీగా, వడ్డీరేట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలు మందకొడిగా సాగాలి. లేదంటే షేర్ల ధరలు పది శాతానికి మించి పెరగరాదు. 30,40 శాతానికి మించి పెరగడం ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. పైగా ప్రపంచంలోనే భారత్ షేర్ మార్కెట్‌ను చిత్రమైనదిగా వర్ణిస్తారు. హేతుపరమైన పరిణామాలతో సంబంధం లేకుండా సెంట్మెంట్ ప్రకారం స్టాక్ మార్కెట్ నడుస్తుంది. ‘జయలలితకు జ్వరం వచ్చినా స్టాక్ మార్కెట్ పడిపోతుంది’ గతంలో ఓ సీపీఐ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్య ఇందుకు ఉదాహరణ. జయలలిత మరణించినప్పుడు మార్కెట్ పడిపోవడం ఇక్కడ గమనార్హం. మరో వారం రోజులపాటు షేర్ మార్కెట్ మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆందోళనకర స్థాయిలో షేర్ల ధరలు
న్యూఢిల్లీ: స్టాక్స్ ధరలు భారీ స్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని, తగినంత స్థాయిలో వృద్ధి దన్ను లేకపోతే... షేర్ల ధరలు భారీ పతనానికి గురికావచ్చని హెచ్చరించారు. 2016–17లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.75 శాతానికి మందగించవచ్చన్న అంచనాలున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు భిన్న విధానాలను అనుసరిస్తున్నప్పటికీ... ఈ మధ్య కాలంలో రెండు దేశాల స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించి ధర– రాబడుల నిష్పత్తి దాదాపు ఒకే స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేల్యుయేషన్స్ని నిలబెట్టుకోవాలంటే అందుకు తగ్గట్లుగా వృద్ధి సాధించడంతో పాటు అంచనాలకు అనుగుణంగా కంపెనీల ఆదాయాలు కూడా ఉండాలన్నారు. లేని పక్షంలో కరెక్షన్‌కి లోనయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పారాయన. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉందని అరవింద్ పేర్కొన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశా యి. 2015 డిసెంబర్ ఆఖరు నుంచి చూస్తే రూపాయి మారకంలో నిఫ్టీ 45%, సెన్సెక్స్ 46% పెరిగాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లో స్టాక్‌మార్కెట్ బూమ్ చాలా భిన్నమైనదని అరవింద్ పేర్కొన్నారు. కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, పోర్ట్‌ఫోలియోలో బంగారం... రియల్టీ కాకుండా ఈక్విటీలకు కేటాయింపులు భారీగా పెరగడం, వడ్డీ రేట్లు వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ బూమ్కి కారణమని చెప్పారు. ఈ సందర్భంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. న్యాయ సంస్కరణలకు పెద్దపీట ఆర్థికంగా స్త్రీ, పురుషుల్లో సమానత్వానికి చర్యలు, శాస్త్ర,సాంకేతిక అభివృద్ధిపై దృష్టి, న్యాయ సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలు ఆర్థిక సర్వేలో ఈ దఫా పేర్కొనదగిన ప్రత్యేక అంశాలన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల జోలికి వెళ్లే సాహసం చేయవద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు సూచించినప్పటికీ, ఈ విషయంలో విప్లవాత్మక అంశాలు, సూచనలను సర్వేలో జోడించినట్లు తెలిపారు. -
'చమురు' వదులుతుందేమో!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7– 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017–18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టంచేసింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్టీ పూర్తి స్థాయిలో స్థిర పడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో భారీ కరెక్షన్ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు రూపొందించిన ఈ సర్వేను... మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 1న) బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో సోమవారం లోక్‌సభలో జైట్లీ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ద్రవ్య క్రమశిక్షణ నిలిచిపోయే అవకాశాన్ని సర్వే తోసిపుచ్చలేదు. అంచనాలను మించే వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరంలో (2017–18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016–17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014–15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది. 2017–18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్స్ షీటు చర్యలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది. సవాళ్లు పొంచి ఉన్నాయి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ 10–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది. సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్‌ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది. ఆర్థిక వ్యవస్థ చక్కగా, బలంగా ఊపందుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు తాత్కాలిక ప్రభావాలు సమసిపోయాయి. ఎగుమతులు పుంజుకుంటే వృద్ధి రేటు 7.5 శాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. అయితే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో కరెక్షన్ అన్నవి డౌన్‌సైడ్ రిస్క్‌లు. ద్రవ్యోల్బణం 0.2–0.3 శాతం పెరిగితే జీడీపీ కూడా ఆ మేరకు ప్రభావితం అవుతుంది. చమురు ధరలు బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే కరెంటు ఖాతా లోటు మరింత విస్తరిస్తుంది.’’ – అరవింద్ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఇవీ... ముఖ్యాంశాలు ♦ 2017–18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు. ♦ 2018–19లో ఇది 7–7.5%కి చేరుతుంది ♦ చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం. ♦ వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి. ♦ పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ♦ పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది. ♦ 2017–18లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి. ♦ 2017–18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి. ♦ కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి. ♦ స్వచ్ఛభారత్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి. ♦ సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి. ఇన్ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎన్‌ఐఐబీ), ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి. విదేశీయుల పర్యటనలు పెరిగాయి... పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ–వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి. జీఎస్టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్ జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను తో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు. ఎగుమతులూ పుంజుకుంటాయి.. అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది. డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ఎన్పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్స్ షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్స్ కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి. ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం 2017–18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది. ‘గులాబీ బాల’ను గౌరవిద్దాం! మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే ఆడవారిని గులాబీలతో పోలుస్తారు. అంతటి సుకుమారులు కనకే వారిని ‘గులాబీ బాల’ అని సంబోధిస్తుంటారు. బహుశా.. అందుకేనేమో!! ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది. నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సి బ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు. ఫండ్స్‌పై పెరుగుతున్న మక్కువ గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్స్‌లో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్స్ పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్స్ పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది. వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్డీపీ) 2016–17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014–15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు. -
దేశంలో తగ్గుతున్న పేదరికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహా దారు డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న సుస్థిరాభివృధ్ధి దశల వారీగా పేదరికాన్ని తగిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జరిగిన ‘దేశ పురోగతి విధానం, భవిష్యత్తు’అన్న అంశంపై జరిగిన సద స్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై సుబ్రహ్మణియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
మోదీని భయపెడుతున్నదిదే..
న్యూఢిల్లీః 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ గత ఎన్నికల ఫలితాల మేజిక్‌ను రిపీట్ చేస్తుందనే అంచనాలు బీజేపీలో జోష్ నింపుతున్నాయి. అవినీతిపై పోరాటం, పాలనపై పట్టుతో మోదీ తిరుగులేని ఇమేజ్ను సాధించారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి ఎన్ని అంశాలు కలిసివచ్చినా ఒక విషయం మాత్రం ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. 2016-17 మధ్యంతర ఆర్థిక సర్వేలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ లేవనెత్తిన అంశం మోదీ సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేసేదేనని భావిస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించి విశ్వసనీయ డేటా కొరవడటంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి, నిరుద్యోగితకు సంబంధించిన అంశాలపై సమాచారం పట్ల కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది. సరైన సమాచారం లేకపోవడం ప్రభుత్వ విధాన రూపకల్పనపై ప్రభావం చూపుతున్నదని అరవింద్ సుబ్రమణియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి మోడీ హయాంలో ఉపాథి కల్పన దారుణంగా పడిపోయింది. జాబ్ మార్కెట్లో ప్రవేశించే వారితో పోలిస్తే అతితక్కువగా ఉద్యోగాలు సమకూరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్న కారణాలు చూపుతున్నది. ఉద్యోగాలకు యువత మొగ్గుచూపడం లేదని, తాము చేపట్టిన పలు పథకాలతో వ్యాపారవేత్తలు కావాలని, స్వయం ఉపాథి పొందాలని కోరుకుంటున్నారని పేర్కొంటోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉండటం గమనార్హం. అసలు సరైన జాబ్ డేటానే ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఉద్యోగ కల్పన దిశగా చర్యలు తీసుకోలేని పరిస్థితి మరింత ప్రమాదకరమని, ఇది 2019 సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి సవాల్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఓటర్లలో మెరుగైన ఆదరణ కలిగిన మోడీకి నిరుద్యోగ అంశం కచ్చితంగా ఎదురుదెబ్బ కాగలదని అంచనా వేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కోటి ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని మోదీ వాగ్ధానం చేసిన క్రమంలో దీనిపై వచ్చే ఎన్నికల్లో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఉద్యోగ గణాంకాలు సరైన రీతిలో లేకపోతే, ఉపాథి కల్పనకు చర్యలు చేపట్టకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో యువతకు నచ్చచెప్పడం ఇబ్బందికరంగా మారవచ్చని భావిస్తున్నారు. -
7.5 శాతం వృద్ధి అసాధ్యం
♦ ఈ ఆర్థిక సంవత్సరంపై ప్రభుత్వం అంచనా ♦ ఎన్నో సవాళ్లున్నాయంటూ నిట్టూర్పు ♦ రైతుల రుణ మాఫీతో 0.75 శాతం క్షీణత ♦ పార్లమెంటులో ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ ♦ 0.75 శాతం వరకు రేట్లు తగ్గాలని అభిప్రాయం ఆర్థిక సర్వే ప్రధానాంశాలు ⇔ 2017–18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016–17లో 3.5%. ⇔ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు. ⇔ పాలసీ రేట్లను 25–75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు. ⇔ జీఎస్టీ అమలు తర్వాత పన్ను పరిధి విస్తరణ సంకేతాలు. ⇔ డీమోనిటైజేషన్ ప్రయోజనాలు కొనసాగుతాయి. ⇔ బ్యాంకుల రుణాలకు ఇంకా పుంజుకోని డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు రంగంలోని బ్యాంకుల రుణాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ⇔ రైతు రుణాల రద్దు వల్ల జీడీపీకి 0.7 శాతం విఘాతం ⇔ హెచ్ఆర్ఏ అలవెన్స్‌తో 40–100 బేసిస్ పాయింట్ల మేర ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం. న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. రుణాల రద్దు ద్రవ్యోల్బణానికి దారితీసేదే అయినా స్వల్పకాలానికి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. రేట్ల కోత అవసరం రెపో రేటును 25–75 బేసిస్ పాయింట్ల మధ్య తగ్గించేందుకు అవకాశాలున్నాయని ఈ సర్వే తెలిపింది. గత నెలలో ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. వాస్తవ తటస్థ వడ్డీ రేటు 1.25 – 1.75 శాతం మధ్య ఉండాలి. దీన్ని ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయి 4 శాతానికి అన్వయించి చూస్తే 5.25 – 5.75 శాతం మధ్య ఉండాలి’’ అని సర్వే వివరించింది. ప్రస్తుత రెపో రేటు 6 శాతం కాగా, ఉండాల్సిన దాని కంటే 25– 75 బేసిస్ పాయింట్లు అధిక స్థాయిలో ఉందని పేర్కొంది. ‘‘2016–17లో బ్యాంకుల స్థూల రుణ వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంది. మానిటరీ పాలసీ ప్రయోజనాలను బ్యాంకులు పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదిలీ చేయకపోవడం రుణ డిమాండ్ పెరగకపోవడానికి కారణం’’ అని వివరించింది. అదే సమయంలో బాండ్ మార్కెట్లో మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉండడం కూడా కారణమేనని తెలిపింది. సామర్థ్యం మేర రాణించాల్సి ఉంది ఆర్థిక రంగం తన పూర్తి స్థాయి సామర్థ్యానికి ఇంకా చేరుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. జీడీపీ, ఐఐపీ, రుణాలు, పెట్టుబడులకు డిమాండ్, సామర్థ్య వినియోగం ఇవన్నీ 2016–17 మొదటి త్రైమాసికం నుంచీ తగ్గిపోతున్న విషయాన్ని, డీమోనిటైజేషన్ తర్వాత మరింత పడిపోయిన విషయాన్ని సర్వే గుర్తు చేసింది. జీఎస్టీ అమలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించడం, బ్యాంకులకు సంబంధించి రెండు రకాల బ్యాలన్స్ షీట్ల నిర్వహణ ప్రభుత్వం చేపట్టిన సంస్థాగత సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రారంభమైన తర్వాత పన్ను పరిధి విస్తృతమవుతున్న ప్రాథమిక సంకేతాలు కనిపించాయని తెలిపింది. డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితులు, రవాణా ఆంక్షలకు ముగింపు పలకాలని సూచించింది. వివిధ రంగాలపై.... ఇన్ఫ్రా: మౌలికరంగంపై మరిన్ని నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వే తెలిపింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బహుళ అంచల విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. హైవేల అనుసంధానతను పెంచేందుకు ఉద్దేశించిన భారతమాల ప్రాజెక్టు అమలు, రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను పునరుద్ధరించడం, దేశీయ విమానయాన సంస్థలను సేవల విస్తృతి దిశగా ప్రోత్సహించడం, జల, రైలు రవాణాను అభివృద్ధి చేయడం వంటి చర్యలను ప్రస్తావించింది. ఐటీ: అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల నుంచి ఉద్యోగ వీసాల పరంగా ఉన్న ఇబ్బందులు, డిజిటల్ టెక్నాలజీలకు సరిపడా నైపుణ్య కార్మికుల కొరత వంటివి 150 బిలియన్ డాలర్ల ఐటీ, బీపీఎం రంగం ఎదుర్కొంటున్న సవాళ్లని తెలిపింది. టెలికం: మార్కెట్లో పెరిగిపోయిన పోటీతో ఒకవైపు టెలికం సంస్థల ఆదాయాలు పడిపోతుండగా, మరోవైపు బ్యాంకుల మొండి బకాయిల్లో (ఎన్పీఏ)టెలికం రంగానికి ఇచ్చిన రుణాల వాటా పెరుగుతుండడంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. -
ఈ రేటింగ్లను పట్టించుకోవాలా?
► ఏజెన్సీలు చైనాపై ఒకలా, మనపై ఒకలా వ్యవహరిస్తున్నాయి ► ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విమర్శ బెంగళూరు: భారత్ రేటింగ్ పెంచే విషయంలో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేటింగ్‌కు సంబంధించి భారత్ విషయంలో ఒకలా చైనా విషయంలో మరోలా వ్యవహరిస్తున్నాయని, అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక మూలాలు మెరుగుపడినప్పటికీ భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం లేదని ఆక్షేపించారు. ‘ఇటీవలి కాలంలో భారత ఆర్థిక పరిస్థితులు (ద్రవ్యోల్బణం, వృద్ధి, కరెంటు ఖాతా లోటు మొదలైనవి) మెరుగుపడటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. రేటింగ్ ఏజెన్సీలు మాత్రం బిబిబి మైనస్ రేటింగ్‌నే కొనసాగిస్తున్నాయి. కానీ ఫండమెంటల్స్ మరింత దిగజారినప్పటికీ.. చైనా రేటింగ్‌ను ఎఎ మైనస్ స్థాయికి పెంచాయి. మరో మాటలో చెప్పాలంటే భారత్, చైనా విషయంలో రేటింగ్ ఏజెన్సీలు అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రేటింగ్ ఇచ్చే అనలిస్టుల అభిప్రాయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నదే నా ప్రశ్న‘ అని అరవింద్ పేర్కొన్నారు. వీకేఆర్‌వీ స్మారకోపన్యాసం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ దిగజారితే వడ్డీ పెరుగుతుంది!! రేటింగ్ ఏజెన్సీలు .. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన గ్రేడ్స్‌లో భారత్‌కు అతి తక్కువ రేటింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి రేటింగ్స్ గల దేశాల్లో ఇన్వెస్ట్ చేయడంలో అధిక రిస్కులు ఉన్నాయని ఇన్వెస్టర్లు భావించడం వల్ల .. ఆయా దేశాలు ప్రపంచ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించాల్సి వచ్చినప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి రేటింగ్ ఇచ్చే విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరును గతంలో కూడా కేంద్రం ఆక్షేపించింది. వృద్ధి మందగిస్తూ, రుణభారం పెరుగుతున్న చైనాకు ఎఎ మైనస్ రేటింగ్‌ను కొనసాగించిన ఎస్అండ్పీ సంస్థ భారత గ్రేడ్‌ను మాత్రం జంక్ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువలో ఉంచడాన్ని ప్రశ్నించింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం లేదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ సైతం గత వారం వ్యాఖ్యానించారు. సబ్‌ప్రైమ్ సంక్షోభమే ఉదాహరణ.. రేటింగ్ ఏజెన్సీలు పాటిస్తున్న అసంబద్ధ విధానాలకు సబ్ ప్రైమ్ సంక్షోభం నాటి పరిస్థితులే ఉదాహరణని అరవింద్ పేర్కొన్నారు. ఎందుకూ కొరగాని తనఖా రుణ పత్రాలకు రేటింగ్ ఏజెన్సీలు ట్రిపుల్ ఎ రేటింగ్ ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరించడంలో విఫలమైన రేటింగ్ ఏజెన్సీల సమర్ధతపైనా సందేహాలు రేకెత్తాయని వ్యాఖ్యానించారు. -
రేటింగ్ ఏజెన్సీలపై అరవింద్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ ఏజెన్సీల పేరుతో ఆడుకుంటున్నాయనీ మండిపడ్డారు. వాటివి పూర్ స్టాండర్డ్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలలో భారత్‌లో బలమైన ఆర్థిక పనితీరు ఉన్నప్పటికీ భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చడం లేదని ఆయన విమర్శించారు. వికెఆర్వి మెమోరియల్ లెక్చర్ సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంవత్సరాల్లో ఆర్ధిక ఫండమెంటల్స్ (ద్రవ్యోల్బణం, పెరుగుదల, ప్రస్తుత ఖాతా పనితీరు)లో స్పష్టమైన మెరుగుదలలు ఉన్నప్పటికీ, రేటింగ్ ఏజెన్సీలు భారత్‌కు బీబీబీ రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పటికీ, దానికి రేటింగ్‌ను ఏఏగా అప్ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. మరో మాటలో చెప్పాలంటే రేటింగ్ ఏజెన్సీలు చైనా, భారత్ రేటింగ్ విషయంలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇలాంటి రేటింగ్లను విశ్లేషకులందరినీ మనం సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. దేశీయంగా నిపుణుల విశ్లేషణలకు, అధికారిక నిర్ణయాలకు సారూప్యం ఉంటోందన్నారు. విధాన నిర్ణయాల ముందు, నిపుణ విశ్లేషణ తరచుగా భిన్నంగా ఉన్నా, నిర్ణయాలు తీసుకున్నతర్వాత విశ్లేషణ ధ్వని మరియు స్వరం మారుతోందన్నారు. అధికారిక నిర్ణయాన్ని హేతుబద్ధంగా విశ్లేషిస్తున్నారని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అనేక ఆర్థిక సంక్షోభ సమయాల్లో ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో రేటింగ్ ఏజెన్సీలు వరుసగా విఫలమవుతూ వచ్చాయంటూ దాడి చేశారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన తనఖా-రుణాల సెక్యూరిటీలకు ఏఏఏ రేటింగ్ ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందన్నారు. అధికారంలోకివచ్చిన 2014నుంచి విధానాలను క్రమబద్దీకరించడానికి , ద్రవ్యోల్బణ అదుపునకు చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
జీఎస్టీపై విదేశీ మీడియా ఏమంటోంది?
దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జీఎస్టీకి అనుబంధమైన నాలుగు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, నేడు వాటిని చర్చకు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు భారత్ కు జీఎస్టీ అమలు చేయడం చాలా కఠినమైన పరీక్ష అని విదేశీ మీడియా వ్యాఖ్యానించింది. ''పన్నుల విషయంలో ఇది భారీ మార్పు. కేంద్ర, రాష్ట్రాల పాలనలో మార్పు చోటుచేసుకుంటుంది. చాలా ప్రక్రియలు, విధానాలను, కొత్త వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని అమలుచేయడం అతిపెద్ద సవాలే'' అని ప్రధాని మోదీకి చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ బ్లూమ్ బర్గ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ ఇదంతా తాత్కాలికమేనని, తొలుత ఇది రోడ్డుమీద గుంతలు లాగా ఉంటుందని అభివర్ణించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం భారత్ కు జీఎస్టీ అమలు చాలా కఠినమైన పరీక్షేనని విదేశీ మీడియా పేర్కొంది. సుబ్రహ్మణ్యన్ చేసిన ఈ కామెంట్ల అనంతరం కొన్ని గంటల్లోనే జీఎస్టీ ప్రక్రియ తుదిరూపంపై బిల్లులు లోక్ సభలో చర్చకు వచ్చాయి. ఏప్రిల్ 12తో ముగియనున్న పార్లమెంట్ సమావేశాల లోపల ఇది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడైతేనే అనుకున్న సమయం జూలై 1 నుంచి దీన్ని అమలుచేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అతిపెద్ద ఆర్థికవ్యవస్థను ఒకే మార్కెట్లోకి తీసుకురావాలని ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీని అమలుచేయబోతున్నారు. -
కార్పొరేట్లకూ రుణమాఫీ చేయాలి
⇒ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటివి తప్పవు ⇒ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్య కొచ్చి: విమర్శలొచ్చినా సరే అప్పుడప్పుడు భారీ రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీలను ప్రభుత్వాలు ఒడ్డున పడేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటివి తప్పవన్నారు. ‘‘దీనివల్ల వ్యాపారవర్గాలతో కుమ్మక్కయినట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వంపై ఆరోపణలొస్తాయి. కానీ కొండలా పేరుకుపోయే రుణాల సమస్యను పరిష్కరించేందుకు మరో మార్గం లేదు. నిజానికి పెద్ద ప్రైవేట్ కంపెనీల రుణాలను మాఫీ చేయటమనేది ఏ రాజకీయ వ్యవస్థకూ అంత సులువైన విషయం కాదు. కానీ ఇలాంటి రుణాలను మాఫీ చేయగలగాలి. ఎందుకంటే క్యాపిటలిజం పనిచేసే తీరు ఇదే. మనుషులంతా తప్పులు చేస్తారు.. వాటిని కొన్ని సార్లు కొంత మేరకయినా క్షమించక తప్పదు‘ అని ఆయన వివరించారు. రాజకీయ వ్యవస్థ ఇలా చేయగలగాలని, బ్యాడ్ బ్యాంక్ ఆ కోవకి చెందిన ప్రయత్నమేనని చెప్పారు. దేశీయంగా బ్యాం కింగ్ వ్యవస్థలో 2012–13లో దాదాపు రూ.2.97 లక్షల కోట్లుగా ఉన్న మొండిబకాయిలు (ఎన్పీఏ) 2015–16 నాటికి రెట్టింపై రూ.6.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం రుణాల్లో ఈ మొండిబకాయిల పరిమాణం (పునర్వ్యవస్థీకరించిన ఖాతాలతో సహా) 15 శాతానికి ఎగిసిన నేపథ్యంలో సుబ్రమణియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారీగా పేరుకుపోతున్న ఎన్పీఏల సమస్య పరిష్కారం కోసం ’బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనను సుబ్రమణియన్ సమర్ధించారు. భారీగా బాకీపడిన సంస్థల యాజమాన్యాన్ని, ప్రమోటర్లను మార్చడంతో సహా ఇతరత్రా బకాయిల వసూలుకు తీసుకోదగిన చర్యలన్నీ ఈ తరహా బ్యాంక్ అమలు చేయగలదని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దులను బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించి, ఆ సమస్య పరిష్కారాన్ని దానికి అప్పగిస్తే.. మిగతా బ్యాంకులకు కాస్త వెసులుబాటు లభిస్తుందన్నది పరిశ్రమ వర్గాలు భావిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు అభివృద్ధి చెందాలి
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం న్యూఢిల్లీ: భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు మరెంతో పరపక్వత సాధించాల్సి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ కారణంగా పలు సున్నిత అంశాల్లో ఒక్కొక్కసారి కఠినమైన, మరొకసారి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తున్నట్లు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, సమాజంలో పలు అంశాలు సంక్లిష్టతతో ఇమిడిఉన్న నేపథ్యంలో... రాజకీయ పరిధి నుంచి ఆయా అంశాలను వేరుచేయడానికి స్వతంత్య్ర రెగ్యులేటరీ వ్యవస్థల అవసరం ఎంతో ఉందని కూడా అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. రెగ్యులేటరీ వ్యవస్థల పనితీరు దేశంలో పురోగతిలో ఉందని వివరించారు. అయితే ఆయా వ్యవస్థల్లో సైతం మనం మరింత పరిపక్వత సాధించాల్సి ఉందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఒక సంస్థ పరిపక్వతతో పనిచేసే పటిష్ట వ్యవస్థ ఏర్పాటు ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజకీయ వ్యవస్థ జోక్యం లేని స్వతంత్య్ర రెగ్యులేటరీ వ్యవస్థ వల్ల వ్యవస్థకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని అన్నారు. -
సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే యూబీఐ
అహ్మదాబాద్: ఆర్థిక సర్వే ప్రతిపాదించిన సార్వజనీన ప్రాథమిక ఆదాయ (యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం-యూబీఐ) పథకం అమలు ప్రస్తుత సంక్షేమ పథకాల ఉపసంహరణ తరువాతే ఉంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ప్రకటించారు. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ ప్రాజెక్టుల విరమణ అనంతరం మాత్రమే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం పథక ప్రతిపాదనను అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. అహ్మదాబాద్ ఐఐఎం-ఏలో శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వే విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ యూబీఐ కార్యక్రమం అమలు చాలా ఖర్చుతో కూడుకున్నదనీ, ఇప్పటికే సంక్షేమ పథకాల కార్యక్రమాల ఖర్చును ప్రభుత్వం భరించలేని స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూబీఐ పథకాన్ని జోడించలేమని చెప్పారు. అలా చేస్తే ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి పతనంవైపు వెళ్తుందని సుబ్రమణ్యం తెలిపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు ..లబ్దిదారులు చేరడం లేదన్నారు. అయితే భారతదేశంలో పేదల అభ్యున్నతికోసం నిర్దేశించిన యూబీఐ పథకం ఈ సమస్యల్ని అధిగమిస్తూ సరికొత్త పద్ధతుల్లో ప్రారంభిచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథక ఫలాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా చేయడంమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత (స్వతంత్రం వచ్చిన తర్వాత)30-40 సంవత్సరాల్లో చేయలేని పనికి తాము పూనుకున్నామన్నారు. పేదరిక నిర్మూలనలో ఇది భారీ చారిత్రక సవాలు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పేదల చేతికి (బ్యాంకు ఖాతాల) డబ్బు అందితే వారు విచ్చలవిడిగా ఖర్చుచేసే అవకాశం ఉందనీ, అదే డబ్బు స్త్రీల కిస్తే దుర్వినియోగయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అభిప్రయాపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు మందగించగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వృద్దిరేటు వేగంగా పుంజుకోవడం గమనించాలన్నారు. అయితే మన దేశంలో ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఆశ్చర్యకరంగా గత 15-20 సంవత్సరాలలో వెనుకబడిన రాష్ట్రాలకుగా పిలుస్తున్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం మందగిస్తోంటే.. అభివృద్ది చెందిన రాష్ట్రాలు శరవేంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. దేశంలో రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలను భారీగా పెరుగుదుల ఇది సూచిక అన్నారు కాగా పేదలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమయ్యే కనీసస్థాయి నగదును ప్రభుత్వం అందించాలని ముఖ్య ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే సూచించింది. ప్రస్తుత రాయితీల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసి, వాటిస్థానంలో యూబీఐ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు విశిష్ట ప్రయోగం
దీని మీద 100 పీహెచ్డీ థీసిస్‌లు రావొచ్చు రీమోనిటైజేషన్తో వృద్ధికి ఊతం ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)ను ’ద్రవ్య చరిత్రలోనే ఒక విశిష్ట ప్రయోగం’గా అభివర్ణించారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. అయిదేళ్ల తర్వాత దీనిపై 50–100 పీహెచ్డీ థీసిస్‌లు రాసే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతా భావించిన దానికి భిన్నంగా డీమోనిటైజేషన్ ప్రకటించిన నవంబర్‌లో నగదు కొరత చాలా తక్కువగానే కనిపించిందని పేర్కొన్నారు. నెలా రెణ్నెల్లలో వ్యవస్థలోకి నగదు సరఫరా (రీమోనిటైజేషన్) ప్రక్రియ పూర్తయిపోగలదని, ఆ తర్వాత వృద్ధి మళ్లీ పుంజుకోగలదని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ‘రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది. రీమోనిటైజేషన్ వేగంగా జరగాలన్నది నా అభిప్రాయం. నగదుపై పరిమితులను ఎంత తొందరగా ఎత్తివేస్తే అంత శ్రేయస్కరం’ అని సుబ్రమణియన్ వివరించారు. నగదుపై నియంత్రణ కన్నా ప్రోత్సాహకాల ద్వారానే డిజిటల్ చెల్లింపులకు ప్రాచుర్యం కల్పించవచ్చన్నారు. రియల్టీ రేట్ల తగ్గుదల.. రియల్టీ ధరలను నేలపైకి తేవడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటని సుబ్రమణ్యన్ చెప్పారు. ’రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు, విక్రయాలు, కొత్త ప్రాజెక్టులు రావడంలో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది. ఇది ఎకానమీకి కాస్త ప్రతికూలమే అయినప్పటికీ.. దీర్ఘకాలంలో కొంత మంచే జరగగలదు. ఎందుకంటే రియల్టీ ధరలను తగ్గించడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటి’ అని ఆయన పేర్కొన్నారు. అమితాబ్ సినిమాలా చేద్దామనుకున్నాం.. ఎప్పుడూ నిరాసక్తంగా, నిస్సారంగా అనిపించే ఆర్థిక సర్వేకు కాస్త అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ సినిమా తరహా హంగులు అద్దే ప్రయత్నం చేశామన్నారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. కాస్తంత డ్రామా, కాసింత ట్రాజెడీ, మరికాస్తంత కామెడీని జోడించేందుకు యత్నించామని వివరించారాయన. ’అమితాబ్ బచ్చన్ చెబుతుంటారు కదా.. ఇస్మే డ్రామా హోనా చాహియే.. ట్రాజెడీ హోనా చాహియే .. కామెడీ హోనా చాహియే.. సబ్ కుచ్ హోనా చాహియే అని.. (కథలో డ్రామా ఉండాలి, ట్రాజెడీ ఉండాలి, కామెడీ ఉండాలి.. అన్నీ ఉండాలి). నేను కూడా దాదాపుగా అదే విధంగా సర్వే ఉండేందుకు ప్రయత్నించానని అనుకుంటున్నాను’ అంటూ ఎకనమిక్ సర్వే రూపకల్పన గురించి చమత్కరించారు. ‘సర్వే అనేది వివిధ అంశాల అరుదైన మేళవింపుగా ఉండాలి. ఇందులో గణితం, చరిత్ర, వేదాంతం, రాజనీతిజ్ఞత మొదలైనవన్నీ తగుపాళ్లలో ఉండాలి. సంకేతాలను అర్ధం చేసుకుని.. వాటిని పదాల రూపంలో వ్యక్తపర్చగలగాలి. నిగూఢమైన అంశాలను, వాస్తవికతను ఒకే తీరుగా స్పృశించగలగాలి’ అన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్జ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుబ్రమణియన్ ఉటంకించారు. సర్వే అనేది.. భవిష్యత్ అవసరాలపై దృష్టితో.. గతకాలపు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వర్తమానాన్ని అధ్యయనం చేసే విధంగా ఉండాలన్నారు. మరోవైపు, సర్వేలో డీమోనిటైజేషన్ అంశం గురించి ప్రస్తావించడాన్ని కూడా సుబ్రమణియన్ వివరించారు. దీన్ని గాని స్పృశించకుండా ఉండి ఉంటే .. డెన్మార్క్ రాకుమారుడు (షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నవలలో కథానాయకుడు) లేని హామ్లెట్ నవలలాగా సర్వే ఉండేదని ఆయన పేర్కొన్నారు. -
ఆసక్తికరంగా మారిన ఆర్థిక సర్వే.. ఏం చెప్తారో?
బడ్జెట్ గడియలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే నేటి మధ్యాహ్నం (మంగళవారం) ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వస్తోంది. గడిచిన 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని ఈ సర్వేలో సమీక్షించనున్నారు. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చూపించిన ప్రదర్శనను కూడా ఈ సర్వేలో వివరించనున్నారు. అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీ అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు కలిసి రూపొందించారు. నేడు ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు జీడీపీ అంచనాలు : పెద్ద నోట్ల రద్దు అనంతరం 2017-18 గణాంకాలు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఎంతో కీలకంగా మారాయి. ఐఎంఎఫ్ ఇప్పటికే 2016-17 భారత వృద్ధి రేటును 6.6 శాతానికి కోత పెట్టింది. ఈ సంస్థ ముందస్తు అంచనాలు 7.6 శాతంగా ఉండేవి. కరెన్సీ బ్యాన్ వినియోగాన్ని తాత్కాలికంగా షాకింగ్లోకి నెట్టేసిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి కుదించేసింది. దీంతో జీడీపీ అంచనాలపై ఆర్థిక సర్వేలో చేయబోయే వ్యాఖ్యనాలపై ఎక్కువగా ఫోకస్ నెలకొంది. పెద్ద నోట్ల రద్దు : డీమానిటైజేషన్పై సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు ఏం చెప్తారోనని విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీ ప్రభుత్వ తీసుకున్న రద్దు నిర్ణయంతో నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. వినియోగ వ్యయంపై ఇది భారీగా ప్రభావం చూపింది. వినియోగవ్యయం జీడీపీలో కనీసం 60 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. ఒక్కసారిగా వినియోగ వ్యయం పడిపోవడంతో జీడీపీ వృద్ధి అంచనాలు పడిపోతున్నాయి. యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ : సామాజిక భద్రత పేరిట ఈసారి ఆర్థిక సర్వేలో ప్రత్యేక ఫీచర్‌గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంటుందని సుబ్రహ్మణ్యం ముందస్తుగానే తన రిపోర్టులో పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 కోట్ల మంది తేలినట్టు సమాచారం. అంతర్జాతీయ అంశాలు : మన ఆర్థికవ్యవస్థపైనే కాక, గ్లోబల్ ఎకానమీపై కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పలు వ్యాఖ్యలు చేయనున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రక్షణాత్మక ఆర్థిక విధానాలపై ప్రపంచంలో చాలా దేశాలు దృష్టిసారించడం వంటి వాటిని సుబ్రహ్మణ్యం ప్రస్తావించనున్నారు. బ్లాక్ మనీ : గత ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సుబ్రహ్మణ్యం అధిక పన్ను వేయాల్సినవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత జీడీపీకి మొత్తంగా పన్నుల ద్వారా వచ్చే కేవలం 5.4 శాతమేనని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పన్నులపై ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది. బ్లాక్‌మనీని రూపుమాపడానికి ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందో ఆయన ఈ సర్వేలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
పప్పు ధాన్యాల మద్దతు ధర పెంచండి
సుబ్రమణియన్ కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడంతోపాటు, ధరలకు కళ్లెం వేయడానికి కనీస మద్దతు ధరను తక్షణం పెంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘కనీస మద్దతు ధర ద్వారా పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, సంబంధిత విధానాలు’ అనే పేరుతో సుబ్రమణియన్ శుక్రవారం ఒక నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. 2016 రబీ సీజన్‌కు పప్పు శనగలకు క్వింటాల్‌కు రూ.4,000, 2017 ఖరీఫ్ సీజన్‌కు కంది, మినుములకు క్వింటాల్‌కు 6,000ను కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని కమిటీ చెప్పింది. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పప్పు ధాన్యాలను సేకరించాలనీ, 20 లక్షల టన్నుల బఫర్ స్టాకును నిర్వహించాలని సిఫారసు చేసింది. పప్పు ధాన్యాలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వస్తువుల జాబితా నుంచి తొలగించాలనీ, జన్యు పరంగా వంగడాల అభివృద్ధిని ప్రోత్సహించాలని కమిటీ కోరింది. పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు రాయితీలు కూడా ఇవ్వాలని నిర్దేశించింది. పప్పు ధాన్యాల ఎగుమతులు, దేశీయంగా నిల్వలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కమిటీ సూచించింది. -
ఇంతకీ కాబోయే ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరిని ఎంపిక చేయనున్నారనే దానిపై భారీ అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు గతంలో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ప్రముఖుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ ఈ ఉత్కంఠకు తెరపడలేదు. ఈ పదవికోసం పనాగరియా ఎంపిక దాదాపు ఖాయం అన్న వార్తలు ఇటీవల ప్రముఖంగా వినిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ప్రస్తుత ఆర్బీఐ రఘురామ్ రాజన్ స్థానంలో ఎంపికయ్యే అవకాశాలున్నవారిలో ఇద్దరి పేర్లు మరోసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రేస్ లో టాప్ ప్లేస్ లో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ సుబ్రహ్మణియన్ అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్ధి. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కోసం సీనియర్ ఫెలో గా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా, గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ కు సీనియర్ ఫెలోగా పనిచేశారు. మరోవైపు, ఊర్జిత్ పటేల్ ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన 'ఫ్లెక్సిబుల్ ఇన్ ఫ్లేషన్ టార్గెటింగ్' కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మాజీ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధికి కూడా కాగా ఇంతకుముందు, ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య , ఆర్థిక సలహదారు శక్తికాంత్ దాస్ పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపించాయ. కేంద్ర బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ 4 న ముగియనుంది. మరో టర్మ్ గవర్నర్‌గా కొనసాగదలుచుకోలేదని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ సుబ్రమణియన్, ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని విదేశీ మీడియా ఇటీవల పేర్కొనడం విశేషం. -
బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..!
♦ ఇతర దేశాలతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం ♦ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి ♦ యూకేకు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలకు అవకాశం ♦ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు జరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్రెగ్జిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పదవ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్, స్టాటస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అరవింద్ సుబ్రమణియన్ కీలకోపన్యాసం చేస్తూ భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు అనేక అంశాలపై విసృ్తతంగా మాట్లాడారు. బ్రెగ్జిట్ తదనంతరం రెండు రోజుల పాటు తాము అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని, కరెన్సీ ఒడిదుడుకులను నిశితంగా పరిశీలించిన తరువాత మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉందన్న అంచనాకు వచ్చామని అన్నారు. కాకపోతే బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం కొంచెం నెమ్మదించవచ్చునని చెప్పారు. మౌలికాంశాల పునాదులు దృఢంగా ఉన్నందున భారత్‌కు నష్టం తక్కువేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కారణంగా భారత్ యునెటైడ్ కింగ్డమ్కు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలు జరిపే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. కొత్త అంకెలపై అనుమానాలొద్దు.. స్థూల జాతీయోత్పత్తితోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన కొత్త ప్రమాణాలపై ఎవరూ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలు, నిపుణులు ఈ కొత్త గణాంకాలను తయారు చేశారని ఆయన అన్నారు. జీడీపీ వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయం ఉందన్నది అహేతుకమైందని స్పష్టం చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక శాఖకు సమాచార లభ్యత ఎంతో పెరగిందని, దాదాపు 6 లక్షల కంపెనీల వివరాలను తాము సేకరించగలుగుతున్నామన్నారు. 1 శాతం లోపునకు క్యాడ్... కనిష్ట చమురు ధరల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 1 శాతంలోపునకు దిగివస్తుందని సుబ్రమణియన్ చెప్పారు. విదేశీ కరెన్సీ రాక, పోక మధ్య వ్యత్యాసాన్నే క్యాడ్‌గా వ్యవహరిస్తారు. బంగారం ధర పెరుగుతున్నప్పటికీ, ఇది క్యాడ్‌పై ప్రభావం చూపదని, చమురు దిగుమతి బిల్లుతో పోలిస్తే బంగారం దిగుమతి బిల్లు సగానికంటే తగ్గిపోయినందున నికరంగా క్యాడ్ సానుకూలంగానే వుంటుందని ఆయన వివరించారు. బ్యాంకుల మొండి బకాయిల్ని ఆయన ప్రస్తావిస్తూ చైనాలో బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చిన రుణాలు జీడీపీలో 165 శాతం వున్నాయని, ఇదే ఇండియాలో 35 శాతమేనని చెప్పారు. ఈ సమస్య పరిష్కరించుకోలేనంత సవాలేమీ కాదన్నారు. మొండి బకాయిల సమస్య టైమ్‌బాంబ్‌లా మారకుండా రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. పన్నుల సేకరణ విషయంలో మనం పాశ్చాత్యదేశాలతో పోలిస్తే చాలా దిగువన ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. జీఎస్టీతో పేద రాష్ట్రాలకు మేలు... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తే దేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సుబ్రమణియన్ తెలిపారు. మేకిన్ ఇండియా కావాలంటే... దేశం మొత్తాన్ని ఒకటిగా (పన్నుల విషయంలో) చేయాలని, జీఎస్టీ ఇందుకు ఉపయోగపడుతుం దన్నారు. అంతేకాకుండా జీఎస్టీతో పన్నులు ఎగ్గొట్టే వారు తగ్గుతారని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందేందుకైనా వర్తకులు తాము కొనుగోలు చేసే ముడివస్తువులకు తగిన రసీదులు పొందుతారన్నది దీంట్లోని తర్కమని వివరించారు. కార్యక్రమంలో సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కాగ్నిజెంట్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ వైస్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణన్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ఆర్.రావు తదితరులు పాల్గొన్నారు. పదవ జాతీయ గణాంక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాటస్టిక్స్ ఒలింపియాడ్ విజేతలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు. -
భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్
పాట్నా: ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) విచారించదగిన పరిణామమే అయినా, దీని ప్రభావం భారత్‌పై ఉండదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు. పాట్నాలో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఓ సదస్సులో అరవింద్ పాల్గొని మాట్లాడారు. బ్రెగ్జిట్తో రాజకీయంగా, ఆర్థికంగా బ్రిటన్, యూరోప్లపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. -
అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్‌కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే... స్థిరత్వం కొనసాగుతుంది పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. - జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి కలిసి వచ్చే అంశమే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్‌కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే. - అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు భవిష్యత్ బాగుంటుంది బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్‌పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు భారత్‌కు చక్కటి మార్కెట్‌ను సృష్టించే అవకాశం ఉంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఎగుమతులకు దెబ్బే... భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య భారత్-బ్రిటన్ బంధం పటిష్టం తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్‌వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ -
మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఇపుడు తన దాడిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పై ఎక్కుపెట్టారు. ఆర్ బీఐ రేస్ లోఉన్న శక్తికాంత్ దాస్ పై ట్విట్టర్ లో ఆరోపణలు గుప్పించారు. గురువారం వరస ట్వీట్లతో దాడి చేసిన స్వామి కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవి అభ్యర్థిగా వస్తున్న అంచనాల నేపథ్యంలో ... ఆ పదవికి శక్తికాంత్ దాస్ పనికిరాడంటూ వ్యాఖ్యానించారు. 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఎఎస్ అధికారికి వ్యతిరేకంగా ప్రాపర్టీ డీల్ కేస్ పెండింగ్ లో ఉందని కమెంట్ చేశారు. మహాబలిపురం ప్రధాన భూముల ఆస్తి ఒప్పందం విషయంలో వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను కేంద్ర బ్యాంకు ఉన్నత పదవి అభ్యర్థి రేసు నుంచి తప్పించాలని ట్వీట్ చేశారు. దీన్ని ఆర్థిక మంత్రి జైట్లీ కి ట్యాగ్ చేశారు కూడా. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఫైర్ అయ్యి తుఫాన్ సృష్టించిన స్వామి గురువారం తొలగింపు డిమాండ్ ను ఉపసంహరించుకుంటున్నానంటూనే నర్మగర్భంగా ట్విట్ చేశారు. అరవింద్ పెద్ద ఎస్సెట్ గా ప్రభుత్వం భావిస్తే .. తన డిమాండ్ ను వెనక్కి తీసుకుంటున్నాన్నారు. వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడిన ఈ ఫైర్ బ్రాండ్ నిజం నిరూపించడానికి కొంత వేచి ఉంటానన్నారు. -
ఇక ప్రధాన ఆర్థిక సలహాదారుపై సుబ్రమణ్యస్వామి అస్త్రాలు
♦ అరవింద్ సుబ్రమణ్యంను తప్పించాలని ట్వీట్ ♦ భారత్ ప్రయోజనాలకు ఆయన వ్యతిరేకమని విమర్శలు ♦ తోసిపుచ్చిన ప్రభుత్వం, బీజేపీ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌పై ఇప్పటి వరకూ విమర్శలు సంధించిన బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న మరో సీనియర్ అధికారిపై తాజాగా తన బాణాలను ఎక్కుపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యంను తక్షణం కేంద్రం ఆ పదవి నుంచి తప్పించాలని ట్వీట్ చేశారు. రాజన్ తరహాలోనే అరవింద్ సుబ్రమణ్యం కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థిక వేత్త కావడం గమనార్హం. సుబ్రమణ్యంస్వామి తాజా ట్వీట్ అటు ప్రభుత్వాన్నీ, ఇటు పాలక పార్టీ బీజేపీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వెనువెంటనే సుబ్రమణ్యం స్వామి ప్రకటనను తోసిపుచ్చాయి. సుబ్రమణ్యం స్వామి ప్రకటన వెనుక అటు ప్రభుత్వంకానీ, ఇటు పార్టీకానీ లేదని చెప్పడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరవింద్ సుబ్రమణ్యంను ఎన్డీఏ ప్రభుత్వమే 2014 అక్టోబర్‌లో సీఈఏ పదవిలో నియమించడం గమనార్హం. విమర్శలు ఇవీ... బహుళజాతి ఆర్థిక సంస్థ- ఐఎంఎఫ్ ఆర్థికవేత్తగా పనిచేస్తున్న కాలంలో అరవింద్ సుబ్రమణ్యం 13వ తేదీ మార్చి 2013న భారత్ ప్రయోజనాలకు విరుద్ధ మైన సూచన చేసినట్లు సుబ్రమణ్యం స్వామి తాజాగా ట్వీట్ చేశారు. తన ఫార్మా రంగం ప్రయోజనాల పరిరక్షణకుగాను అమెరికా భారత్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు ఆయన సూచించారన్నది ఈ ట్వీట్ సారాంశం. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పదవీ విరమణ అనంతరం ఆ పదవికి రేసులో అరవింద్ సుబ్రమణ్యం కూడా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఈఏపై విశ్వాసముంది: జైట్లీ సుబ్రమణ్యం స్వామి విమర్శలపై విలేకరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ... సీఈఏ అరవింద్ సుబ్రమణ్యంపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ప్రభుత్వానికి ఆయన ఎప్పటికప్పుడు విలువైన సలహాలు ఇస్తున్నట్లు కూడా జైట్లీ అన్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, సుబ్రమణ్యం స్వామి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఆయన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవనీ అన్నారు. -
స్వామి అసలు టార్గెట్ జైట్లీ:దిగ్విజయ్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ రేసులో ఉన్న ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న స్వామి అసలు టార్గెట్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ.. స్వామికి ఆర్థికమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని అందుకే స్వామి అరవింద్ సుబ్రమణ్యంను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని సింగ్ వ్యాఖ్యలు చేశారు. మోదీకి స్వామికి మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగానే స్వామి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అసలు టార్గెట్ రఘురాం రాజన్, అరవింద్ సుబ్రమణ్యంలు కాదని అరుణ్ జైట్లీ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్‌కు 2013లో సూచించారని, జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి అరవింద్ సుబ్రమణ్యం చెప్పారని స్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
స్వామికి ఝలక్ ఇచ్చిన జైట్లీ, బీజేపీ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఝలక్ ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ ను టార్గెట్ చేసిన స్వామి తాజాగా.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ పై దాడిని ఎక్కుపెట్టడంపై జైట్లీ బుధవారం స్పందించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని తేల్చిపారేశారు. ఆయనపై తమకు పూర్తి నమ్మకముందని మీడియాకు చెప్పారు. అటు స్వామి వైఖరిని బీజేపీ కూడా తప్పుబట్టింది. ఆయనది వ్యక్తిగత అభిప్రాయమని ప్రకటించింది. సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది. కాగా అరవింద్ సుబ్రమణియన్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ట్వీట్ చేశారు స్వామి. అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్ కు 2013లో చెప్పింది ఎవరు.. అరవింద్ సుబ్రమణ్యం. ఎంఓఎఫ్.. (మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ )ఆయనను వెంటనే తొలగించాలంటూ స్వామి తన వరస ట్వీట్స్ లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవింద్ సుబ్రమణ్యమేనని గుర్తు చేసిన ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారును తొలగించాలని స్వామి ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే జైట్లీ స్పందించడం విశేషం. -
తదుపరి టార్గెట్ ఎవరు?
రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌ను పంపేసిన తర్వాత.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తదుపరి టార్గెట్ ఎవరో తెలుసా..? ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం. ఆ పదవి నుంచి సుబ్రమణ్యంను తొలగించాలంటూ స్వామి సంచలన ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు. ‘‘అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్‌కు 2013లో చెప్పింది ఎవరు.. అరవింద్ సుబ్రమణ్యం ఎంఓఎఫ్.. ఆయనను వెంటనే తొలగించండి’’ అని స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవింద్ సుబ్రమణ్యమేనని ఆయన అన్నారు. అరవింద్ సుబ్రమణ్యం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రఘురామ్ రాజన్ తర్వాత అరవింద్ సుబ్రమణ్యమే రిజర్వు బ్యాంకు గవర్నర్ అవుతారన్న కథనాలు వినిపించాయి. కానీ, ఆయన కూడా కాంగ్రెస్ ఏజెంటుగానే వ్యవహరిస్తున్నారన్నది స్వామి వాదన. అందుకే ఆయనను టార్గెట్ చేసి, ముందు ఆర్థిక సలహాదారు పదవి నుంచే పంపేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. Who said to US Cong on 13/3/13 the US should act against India to defend US Pharmaceuticals interests? Arvind Subramanian MoF !! Sack him!!! — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 Guess who encouraged Congi to become rigid on GST clauses ? Jaitely's economic adviser Arvind Subramanian of Washington DC — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 -
స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగంలో పయనిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు. ప్రతికూల, నిరాశాధోరణి వార్తలకు దూరంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పలు సవాళ్లతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్ 8 నుంచి 10 శాతం శ్రేణిలో వృద్ధిని సాధించగలదన్నది తమ అభిప్రాయమని తెలిపారు. ఉన్నత లక్ష్యం ఉంటే... దీని సాధనలో ఎదురయ్యే తాత్కాలిక వైఫల్యాలను సులభతరంగా ఎదుర్కొనవచ్చని అన్నారు. -
తాయిలాలు ఇస్తే... తంటా తప్పదు
2015-16 ఆర్థిక సర్వే చెబుతోంది ఇదే... వృద్ధి పరుగులో ముందుండాలంటే సంక్షేమానికి చోటుండకూడదని ఆర్థిక సర్వే కటువుగానే చెప్పింది. వచ్చే ఐదేళ్లలో 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు సాధించే సత్తా భారతావనికి ఉందంటూనే... అందుకు కఠిన చర్యల్ని తప్పనిసరి చేసింది. సబ్సిడీల కోత, పొదుపు పథకాలపై పన్ను విధించటం, గ్యాస్ సిలెండర్ల సంఖ్యను తగ్గించటం, ఐటీ మినహాయింపుల్ని పరిమితం చేయటం వంటి చర్యల్ని సూచించిన సర్వే... అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయనే కారణాన్ని చూపించింది. కానీ వేలికి దెబ్బ తగిలిందనే కారణంతో చేతిని నరుక్కున్న చందాన... కొంతమంది అనర్హులకు చేరుతున్నాయనే కార ణాన్ని చూపిస్తూ మొత్తానికే ఎత్తేస్తే అర్హుల మాటేంటన్న ఊసే ఈ సర్వేకు పట్టలేదు. ఖజానా పెంచుకునే సూచనలనే కాదు. కొన్ని రంగాల దుస్థితినీ సర్వే కళ్లకు కట్టింది. వైద్యం అందరానిదవుతోందని... ప్రభుత్వాసుపత్రుల్లో అయ్యే ఖర్చుకు నాలుగైదు రెట్లు ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయనే ఆందోళన తాజా పరిస్థితికి అద్దం పట్టేదే. పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ఏర్పడుతున్నా, వాటికి నిధులు దొరకటమైతే కష్టంగా ఉందని, పెట్టుబడులు అందుకున్న వాటి విలువలు కూడా తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ కాలేకపోతున్నారంటూ... స్టార్టప్ ఇండియా సవాళ్లను సర్వే కళ్లకు కట్టింది. బ్యాంకుల దుస్థితినీ గుర్తించిన సర్వే... వాటికి మూలధనం ఇవ్వటానికి కొన్ని పీఎస్‌యూ కంపెనీల్ని విక్రయించటమే శరణ్యమని కూడా సూచించింది. సౌకర్యం కోసం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులపై, ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడుతున్నాయని, మెరుగైన జీతంతో పాటు ఉద్యోగ భద్రత కూడా ముఖ్యమేనని చెప్పిన మాట... అక్షరాలా నడుస్తున్న చరిత్రకు అద్దం. ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు... ♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7-7.75% మధ్య ఉంటుంది. ♦ ఈ ఏడాది వృద్ధి మాత్రం 7.6% ఉంటుంది. ఎగుమతులు వేగంగా పెరిగినట్లయితే దీర్ఘకాలంలో 8-10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది. ♦ అంతర్జాతీయంగా అన్ని దేశాలూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సుస్థిరతకు చిరునామా ఇండియా నిలుస్తోంది. ♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 35 డాలర్ల వరకూ ఉండొచ్చు. ఈ ఏడాది అది 45 డాలర్లుగా ఉంది. ♦ 2016-17 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5-5% ఉండొచ్చు. ♦ {దవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటంతో ధరల్లో స్థిరత్వం వస్తుంది. ♦ {పస్తుతం సంపాదిస్తున్న వ్యక్తుల్లో 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. దీన్ని 20 శాతానికి చేర్చాలి. ♦ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఆర్థిక విధానాలపై ఉంటుంది. ♦ జీడీపీలో ద్రవ్యలోటు 3.9 శాతానికి కుదించాలన్న ఈ ఏడాది లక్ష్యం సాధించగలం. వచ్చే ఏడాది మాత్రం కాస్త కష్టం. ♦ వచ్చే ఏడాది సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా తక్కువే ఉంటుంది. ♦ జీఎస్టీ బిల్లు ఆమోదంలో ఆలస్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ♦ కార్పొరేట్లు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు విపరీతమైన ఒత్తిడిలోనే ఉంటాయి. కారణాలు గుర్తించటం, తిరిగి మూలధనం కల్పించటం, సంస్కరణల బాట పట్టడం ద్వారానే దీన్ని అధిగమించగలం. ♦ 2019 మార్చికల్లా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం కావాలి. ♦ ఫిబ్రవరి మధ్యనాటికి కరెంటు ఖాతా లోటు 1-1.5 శాతంగా, విదేశీ మారక నిల్వలు 351.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ♦ 2015-16లో సేవల రంగం 9.2 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ♦ విదేశీ మూలధనం వెనక్కెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకని దేశీయంగా డిమాండ్ పెంచే చర్యలు చేపట్టాలి. ♦ ఇటీవలి సంస్కరణలతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగం, కార్పొరేట్ రంగం చక్కని పనితీరు కనబరుస్తున్నాయి. ♦ ఆరోగ్య, విద్యా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలి. వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ♦ బడ్జెట్ అంచనాకన్నా ప్రభుత్వ పన్ను ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి. ♦ ఎగుమతుల మందగమనం కొనసాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేగం పుంజుకుంటుంది. ♦ వాణిజ్యంలో రక్షణాత్మక చర్యల్ని భారతదేశం అడ్డుకోవాలి. ♦ ఎరువుల రంగానికి సంస్కరణల ప్యాకేజీ ఇవ్వాలి. డిమాండ్ వృద్ధికి చర్యలు... ఆర్థిక వ్యవస్థలో పటిష్ట డిమాండ్‌కు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. ఇది వృద్ధికి ఊతం ఇస్తుంది. ఈ దిశలో ప్రభుత్వం బడ్జెట్లో తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. - హర్షవర్థన్ నోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్ పెట్టుబడులపై దృష్టి అవసరం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కు వెళుతున్న తీరును జాగ్రత్తగా గమనించడం, ఆ తరహా సవాళ్లను అధిగమించడం కీలకం. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల నేపథ్యంలో రానున్న బడ్జెట్, ఆర్థిక విధాన నిర్ణయాలు అత్యంత సవాళ్లతో కూడుకున్నవనడంలో సందేహం లేదు. - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ సంస్కరణలు కీలకం ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉండడం హర్షణీయం. అయితే వృద్ధి పటిష్టతకు ప్రభుత్వం సంస్కరణల అజెండాను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరాన్ని కూడా సర్వే ఉద్ఘాటిస్తోంది. ముఖ్యంగా ఇన్ఫ్రాపై ప్రత్యేక దృష్టి అవసరం. ఇలాంటి బడ్జెట్‌నే పరిశ్రమ కోరుకుంటోంది. - సుమిత్ మజుందార్, సీఐఐ ప్రెసిడెంట్ ఐటీ మినహాయింపు పరిమితులు పెంచొద్దు.. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపుల పరిమితులను పెంచుకుంటూ పోవటం మంచిది కాదు. ఆస్తి పన్ను పరిధిని మరింత విస్తృతం చేయాలి. వ్యక్తిగత ఆదాయాలు సహజసిద్ధంగా పెరిగేందుకు, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయి. సంపన్న ప్రైవేట్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తున్న పన్ను మినహాయింపుల విధానాలను సమీక్షించి, దశ లవారీగా తొలగించటమే మంచిది. అలాగే వ్యవసాయం కావొచ్చు పరిశ్రమలు, సర్వీసులు, రియల్టీ కావొచ్చు... ఏ మార్గంలోనైనా ఆదాయాల పరంగా మెరుగ్గానే ఆర్జిస్తున్న వారిపై సహేతుక రీతిలో పన్నులు విధించాలి. ప్రస్తుతం ఎకానమీలో ఇంకా 85 శాతం మంది పన్ను పరిధిలోనే లేరు. ఆదాయాలు ఆర్జిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మందే పన్ను పరిధిలో ఉన్నారు. దీన్ని కనీసం 23 శాతానికి చేర్చాల్సి ఉంది. ఆస్తి పన్ను రేట్లు మరింతగా పెంచాలి. ఇలా చేస్తే స్పెక్యులేషన్‌ను కట్టడి చేసే వీలుంటుంది. పొదుపు పైనా పన్ను .. ఒకవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తుండగా... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిపై పన్ను మినహాయింపులను ఎత్తివేయాలని ఎకనమిక్ సర్వే సూచించటం గమనార్హం. ‘‘ఈ మొత్తాలను విత్‌డ్రా చేసుకునేటప్పుడు పన్ను వేయాలి. ఈఈటీ విధానం అనుసరించాలి’’ అని పేర్కొంది. ఈఈటీ విధానమంటే డిపాజిట్ చేసినపుడు, వడ్డీపైన పన్నుండదు. చివర్లో విత్‌డ్రా చేసుకున్నపుడు పన్ను విధిస్తారు. అంటే ఎగ్జంప్ట్, ఎగ్జంప్ట్- ట్యాక్సబుల్ అన్న మాట. పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై కూడా ఈఈటీ విధానం కింద పన్ను విధించాలని సర్వే పేర్కొంది. ‘‘సాధారణంగా ఇలాంటి స్కీములకిచ్చే ప్రయోజనాలు స్థితిమంతులకే ఉపయోగపడుతున్నాయి’’ అని సర్వే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పీపీఎఫ్ కింద 15 ఏళ్ల డిపాజిట్లకు పెట్టుబడి పెట్టే దశలోనూ, వడ్డీ మీద, విత్‌డ్రాయల్ సమయంలోనూ పన్ను ఉండటం లేదు. 2014-15 బడ్జెట్లో పీపీఎఫ్ పెట్టుబడి పరిమితిని రూ.50,000కు పెంచిన తర్వాత డేటాను పరిశీలిస్తే ఎక్కువగా అధిక పన్నులు చెల్లించాల్సిన అధికాదాయ వర్గాలే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నట్లు తేలినట్లు సర్వే వెల్లడించింది. ఐదేళ్లలో వృద్ధి 10 శాతానికి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: భారత్ త్వరలో 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించే స్థాయికి చేరుకుంటుందని, దీనికి రెండు నుంచి ఐదేళ్లు పడుతుందని భావిస్తున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. వ్యవస్థాగత సంస్కరణలు, రాష్ట్రాల మధ్య ఆర్థిక వృద్ధికి సంబంధించి పోటీ తత్వాన్ని పెంచటం వంటి విధానాల ద్వారా ఈ లక్ష్యాన్ని దేశం చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో 2015-16 ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న ఆయన, ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో దేశీయ డిమాండ్ వృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. వస్తు, సేవల పన్ను వంటి వ్యవస్థాగత చర్యలు దేశాన్ని చక్కటి వృద్ధి బాటకు తీసుకువెళతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. లక్ష కోట్ల సబ్సిడీ... సంపన్నులకే దాదాపు లక్ష కోట్ల విలువ చేసే సబ్సిడీలు స్థితిమంతులకే వెళుతున్నాయి. మెరుగైన ద్రవ్య నిర్వహణ కోసం వీటిలో తక్షణం కోత వేయాల్సి ఉంది. వంట గ్యాస్, రైల్వేలు, విద్యుత్, విమాన ఇంధనం, బంగారం, కిరోసిన్ వంటి ఆరు కమోడిటీలకు సంబంధించి సబ్సిడీ విధానాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై రాబడులు... పన్నులపరమైన ప్రయోజనాలు... తదితరాల రూపంలో ఈ సబ్సిడీలు కాస్త స్థోమత ఉన్నవారికి చేరుతున్నాయి. పటిష్ఠంగా దేశీ మార్కెట్లు.. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత పటిష్టంగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్టుబడులకు గమ్యంగా ఎదిగేందుకు భారత్‌కు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 2015 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 31 శాతం ఎగిసి 24.8 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది (2014) ఇదే వ్యవధిలో ఇవి 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సర్వీసులు, ట్రేడింగ్, ఆటోమొబైల్, నిర్మాణ, కెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లోకి ఎఫ్‌డీఐల రాక పెరిగింది. సింహభాగం నిధులు సింగపూర్, మారిషస్‌ల నుంచి వచ్చాయి. గ్యాస్ సిలిండర్లను 10కి తగ్గించాలి.. వంట గ్యాస్ సబ్సిడీని క్రమబద్ధీకరించే దిశగా సబ్సిడీపై ప్రతి కుటుంబానికి అందించే సిలిండర్ల సంఖ్యను వార్షికంగా 10కే పరిమితం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 12గా ఉంది. 14.2 కేజీల సిలిండర్ ఒక్కింటికి మార్కెట్ రేటు ప్రస్తుతం రూ. 575గా ఉండగా, సబ్సిడీపై రూ. 419.26కి లభిస్తోంది. యూపీఏ హయాంలో 2012లో తొలుత ఏడాదికి ఆరు సిలిండర్లు చొప్పున పరిమితిని నిర్ణయించగా.. ఆ తర్వాత ఏడాది జనవరిలో దీన్ని తొమ్మిదికి, 2014 జనవరిలో 12కి పెంచారు. మరోవంక సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్లపై పన్నులు, ఎక్సైజ్ సుంకాల విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. వాణిజ్య సిలిండర్లతో పోలిస్తే సబ్సిడీ సిలిండర్లపై ఎక్సయిజ్, కస్టమ్స్ సుంకాలు ఉండవు కనక వీటిని ఇతర అవసరాల కోసం బ్లాక్‌మార్కెట్‌కు మళ్లించడం జరుగుతోంది. ద్రవ్య లోటు క ట్టడి కష్టమే.. ద్రవ్య లోటును ఈ ఏడాది 3.9 శాతానికి కట్టడి చేయగలిగినా.. వచ్చే సారి మాత్రం ఇది కష్టసాధ్యమే. 7వ పే కమిషన్ సిఫార్సుల అమలు వల్ల పడే అదనపు భారం, అంతర్జాతీయ మందగమనం దీనికి ప్రధాన కారణాలవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.5%కి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఏడాదికి పైగా స్తబ్దుగా ఉన్న ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సర నుంచి పుంజుకునే అవకాశముంది. కమోడిటీల క్షీణతతో వాణిజ్య, కరెంటు అకౌంట్ల లోటులు అదుపులోనే ఉండొచ్చు. 2017 నాటికి అన్ని పోస్టాఫీసుల కంప్యూటరీకరణ.. దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పైచిలుకు పోస్టాఫీసుల కంప్యూటరీకరణ వచ్చే ఏడాది కల్లా పూర్తయ్యే అవకాశముంది. ఇందులో భాగంగా ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు కోసం పోస్టల్ విభాగం దాదాపు రూ. 4,909 కోట్లు వెచ్చిస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా మెయిల్ ఆఫీసులు, అకౌంట్ ఆఫీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు మొదలైన వాటన్నింటినీ అనుసంధానం చేయడం జరుగుతుంది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో పోస్టాఫీసు పొదుపు ఖాతాల సంఖ్య 30.86 కోట్ల నుంచి 33.97 కోట్లకు చేరుకున్నాయి. వీటిలో మొత్తం డిపాజిట్లు, నగదు సర్టిఫికెట్ల విలువ రూ. 6.53 లక్షల కోట్లుగా ఉంది. బ్యాంకులకు నిధుల కోసం పీఎస్‌యూల అమ్మకం.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి, ఆ నిధులను ఇందుకోసం వినియోగిస్తే బాగుంటుంది. ఆర్థికేతర కార్యకలాపాల సాగించే కొన్ని నిర్ధిష్ట సంస్థల్ని ఇందుకోసం పరిశీలించవచ్చు. రుణ సమస్యల పరిష్కారానికి ‘4ఆర్’ సూత్రాలను పాటిస్తే మంచిది. సమస్యాత్మక రుణాలను గుర్తించడం (రికగ్నిషన్), తగు మూలధనాన్ని సమకూర్చుకోవడం (రీక్యాపిటలైజేషన్), పరిష్కారం అమలు(రిసొల్యూషన్), భవిష్యత్‌లో మళ్లీ సమస్య తలెత్తకుండా సంస్కరించుకోవడం (రిఫార్మింగ్) ఇందులో భాగం. దేశంలో 19వేల పైగా స్టార్టప్‌లు.. దేశీయంగా దాదాపు 19,400 టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లున్నాయి. వీటిలో 5వేల పైచిలుకు స్టార్టప్‌లు గతేడాదే ప్రారంభమయ్యాయి. అయితే, ప్రాథమిక స్థాయిలో వీటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వైదొలగాలంటే చాలా తక్కువ వాల్యుయేషన్లే లభిస్తున్నాయి. 2015 ప్రథమార్ధంలో దేశీ స్టార్టప్‌లు 3.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రియాశీలకంగా ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య 2014లో 220గా ఉండగా.. 2015లో 490కి పెరిగింది. ప్రైవేట్ వైద్యం..పెను భారం... వైద్య సేవల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ప్రసూతి మినహాయిస్తే.. ఇతరత్రా వైద్యం ఖర్చులు ప్రభుత్వాస్పత్రులకన్నా బోలెడన్ని రెట్లు అధికంగా ఉంటున్నాయి. అందుబాటు రేటులో వైద్యాన్ని అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది. వైద్యరంగంలో పరిమిత వనరులు, అపరిమిత డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రాధాన్యాంశాలపైనే వ్యయాలు చేయాలి. 2014 జనవరి-జూన్ మధ్య నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) నిర్వహించిన సర్వే ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారి చికిత్స ఖర్చులు సగటున రూ.6,120గా ఉండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అదే చికిత్సకు ఏకంగా రూ.25,850 అవుతోంది. రక్షణాత్మక చర్యలతో ఐటీకి విఘాతం.. వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణుల వల్ల దేశీ ఐటీ-బీపీవో రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యాపారాభివృద్ధికి కంపెనీలు అంతర్గతంగా జరిపే నిపుణుల బదిలీలను... ఆయా దేశాలకు వలసలుగా ముద్ర వేసి, నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నివేదిక ప్రకారం 2015-16లో ఐటీ-బీపీవో రంగం(హార్డ్వేర్సహా) 143 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేయగలదని అంచనా. దేశీ ఐటీ రంగం వృద్ధికి వీసా సమస్యలు మొదలైన వాటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. వ్యవసాయానికి ఊతమిచ్చే చర్యలు.. దేశీ వ్యవసాయ రంగానికి ఊతమివ్వటానికి పలు చర్యలు చేపట్టాల్సి ఉంది. హైబ్రిడ్, జన్యు పరివర్తిత (జీఎం) విత్తనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పంటలకు అధిక మద్దతు ధర లభించేలా చూడటంతో పాటు సాగు నీటి లభ్యతను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపర్చడం వంటివి ఈ చర్యల్లో కీలకం. జీఎం విత్తనాల భద్రతపై చర్చించి, వచ్చే ఆరు నెలల్లోగా వాటిని ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ రంగం మెరుగయ్యేందుకు ఇవి దోహదపడతాయి. గతేడాది దేశమంతటా వాతావరణ పరిస్థితులను తీవ్రంగా మార్చేసిన ఎల్ నినో ప్రభావాలు ఈసారి ఉండకపోవచ్చు. అయితే, అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. మెరుగైన ఉద్యోగాలు రావాలి.. మంచి జీతంతో పాటు భద్రత కూడా కల్పించే ఉద్యోగాల కల్పన కోసం చర్యలు అవసరం. ఇందులో ప్రైవేట్ రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. తయారీ రంగంలో నమోదైన మొత్తం సిబ్బందిలో కాంట్రాక్టు వర్కర్ల వాటా 1999లో 12 శాతంగా ఉండగా.. 2010 నాటికి 25 శాతానికి పైగా పెరిగింది. -
బడ్జెట్ ప్రింటింగ్ షురూ..!!
♦ సాంప్రదాయక ‘హల్వా’ రుచులతో ఆరంభం ♦ బాధ్యతల్లో దాదాపు 100 మంది అధికారులు ♦ బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా వారంతా ఇక అక్కడే... న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ రుచి ఎలా ఉంటుందో గానీ... ఆర్థిక శాఖలో మాత్రం తియ్యని హల్వా తయారయింది. ఈ హల్వాను రుచి చూడటానికి నార్తబ్లాక్ బేస్మెంట్లో... మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులంతా శుక్రవారం హాజరయ్యారు. సహాయ మంత్రి జయంత్ సిన్హా, ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, కార్యదర్శి రతన్ వాటెల్, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కార్యదర్శి నీరజ్ గుప్తా, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అంజులీ దుగ్గల్, బడ్జెట్ రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకరికొకరు హల్వాను తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంతో... బడ్జెట్లో చివరి మెట్టయిన ముద్రణ కార్యక్రమం మొదలైనట్లే. నార్త్‌బ్లాక్‌లోనే ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ ముద్రణ మొదలవుతుంది. ఈ నెల 29న పార్లమెంట్లో 2016-17 సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేదాకా... దీన్లో పాల్గొన్న కీలక అధికారులంతా నార్త్బ్లాక్కే పరిమితమవుతారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కాగా, తొలి మధ్యంతర బడ్జెట్‌ను కలుపుకుంటే మూడవది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తుల్ని ఫోన్లో లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉండదు. మరీ అత్యవసరమైన విషయమైతే ఉన్నతాధికారుల సమక్షంలో వారికి తెలియజేయటం, వారితో మాట్లాడించటం వంటివి చేస్తారు. 100 మందికిపైగా అధికారులు ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అంత గోప్యత ఎందుకు? ఏటా బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు, పలు వ్యాపారాలు ప్రభావితమవుతాయి. అందుకే బడ్జెట్‌ను ఎంతో పకడ్బందీగా, గోప్యంగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇది ముందే బయటకు వెల్లడైతే ఆయా వర్గాలు ముందే అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయం నుంచి వెళ్లే ఫోన్లన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేస్తారు. ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక జామర్లు ఏర్పాటుచేస్తారు. ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. -
జీఎస్టీపై కీలక సిఫారసులు!
- ప్రామాణిక రేటు మాత్రం 17-18 శాతం - అత్యధిక వస్తువులకు వర్తించేది ఈ రేటే - అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ సిఫారసులు - దీన్ని గరిష్ట పరిమితిగా పేర్కొనటానికి మాత్రం విముఖత - గరిష్ట పరిమితిని రాజ్యాంగంలో కూడా చేర్చాలంటున్న కాంగ్రెస్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై సందిగ్ధత వీడటం లేదు. ప్రతిష్టంభన తొలగించటానికి ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యన్ సారథ్యంలోని కమిటీ శుక్రవారం కీలక సిఫార్సులు చేసినా... వాటిలో విపక్ష కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్లుగా 18 శాతం గరిష్ట పరిమితి విధించే అంశం మాత్రం లేదు. అత్యధిక వస్తువులకు వర్తించేలా 17-18 శాతం ప్రామాణిక రేటును కమిటీ సిఫారసు చేసినా... దాన్నే గరిష్ట పరిమితిగా పేర్కొని, సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై మాత్రం విముఖత వ్యక్తంచేసింది. ‘‘దేశాన్ని ఒకటిగా చేయడానికి ఇదో చరిత్రాత్మక అవకాశం. అత్యధిక వస్తువులు, సేవలు ప్రామాణిక రేటు 17-18 శాతంలోనే ఉండాలి’’ అని కమిటీ స్పష్టం చేసింది. ఇతర వస్తువులకు సంబంధించి తక్కువ రేటుండే వస్తువులపై కనిష్ట రేటు 12 శాతంగా, లగ్జరీ కార్లు, సాఫ్ట్‌డ్రింక్స్, పొగాకు వంటి ఉత్పత్తులపై గరిష్ట రేటు 40 శాతంగా సిఫారసు చేసింది. న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) జీఎస్టీ పన్ను రేట్లు కనిష్ఠంగా 15 శాతం... గరిష్ఠంగా 40 శాతం వరకూ ఉంటాయని, కాకపోతే అత్యధిక వస్తువులు 17-18 ప్రామాణిక పన్ను రేటు పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ స్పష్టంచేసింది. కేంద్ర-రాష్ట్రాల మధ్య రెవెన్యూ న్యూట్రల్ రేటును (ఆర్ఎన్ఆర్) 15 - 15.5 శాతంగా నిర్ణయించవచ్చని సూచిస్తూ... 15 శాతానికే మొగ్గు చూపింది. అంతర్రాష్ట్ర అమ్మకాలపై జీఎస్టీ రేటుకి అదనంగా ఒక శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టాలంది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదికను అందజేసింది. ప్రారంభ దశలో ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావొచ్చని సిఫార్సు చేసింది. ఈ సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు.‘జీఎస్టీ అమలుకు ఒక చరిత్రాత్మక అవకాశం దేశం ముంగిట ఉంది. ఇది పన్నుల విభాగాలను పటిష్టం చేస్తుంది. రాష్ట్రాల మధ్య అవరోధాలను తొలగిస్తుంది. ఉమ్మడి మార్కెట్‌ను సృష్టిస్తుంది’ అని నివేదికను సమర్పించిన అనంతరం సుబ్రమణ్యన్ వివరించారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా.. పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులపై తక్షణం నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు తప్పనిసరిగా ఉండాలి కనుకే జీఎస్టీ రేట్లను రాజ్యాంగ బిల్లులో చేర్చడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. పొగాకు ఉత్పత్తులపై గరిష్ట రేటు .. సాధారణంగా జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వివిధ అంశాల కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు మారిపోతాయి. ఇలా పన్ను చట్టాల్లో మార్చినా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా గతంలోలాగే వచ్చే విధంగా చూసేందుకు ఉద్దేశించినది రెవెన్యూ న్యూట్రల్ రేటు (ఆర్ఎన్ఆర్). ఇటు రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ఆదాయ నష్టం కలగని విధంగా ఉండే రెవెన్యూ న్యూట్రల్ రేటును లెక్కించేందుకు సీఈఏ కమిటీ 3 విధానాలను పరిశీలించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) సూచించిన విధానంతో పాటు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు తదితర అంశాలను అధ్యయనం చేసింది. చాలా మటుకు ఉత్పత్తులకు ప్రామాణికంగా 17-18 శాతం రేటును ప్రతిపాదించింది. వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు 12-40 శాతం దాకా శ్రేణిలో జీఎస్టీ రేటుకు కనిష్ట, గరిష్ట పరిమితులు ఉండొచ్చని పేర్కొంది. లగ్జరీ కార్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, ఏరేటెడ్ బెవరేజెస్ మొదలైన వాటిపై గరిష్ట రేటు విధించవచ్చని సూచించింది. విలువైన లోహాలపై 2-6 శాతం శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. కాగా, నివేదికను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. జీఎస్టీ వస్తే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 2 శాతం మేర తోడ్పడగలదని ఫిక్కీ నేత దీదార్ సింగ్ తెలిపారు. జీఎస్టీ వివాదం.. ఎక్సైజ్, సేవా పన్ను, అమ్మకపు పన్ను వంటి వివిధ రకాల పరోక్ష పన్నులు, పన్నుల మీద పన్నుల బాదరబందీ లేకుండా .. ఒకే పన్ను రేటును అమలు చేసేందుకు ఉద్దేశించినది జీఎస్టీ బిల్లు. ఇందులో కీలకమైన ఆర్ఎన్ఆర్ 18 శాతానికన్నా దిగువనే ఉండాలని, వస్తువులపై ఒక్క శాతం అదనపు పన్నును తొలగించాలని, అలాగే ప్రామాణిక రేటును రాజ్యాంగ సవరణ బిల్లులోనూ పొందుపర్చాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే, దీన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేరిస్తే ప్రభుత్వం మార్పులు చేయాల్సి వచ్చిన ప్రతిసారీ పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఆమోదించాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం సుముఖంగా లేదు. ఫలితంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌లోగా జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు ప్రతిష్టంభన ఏర్పడింది. దీన్ని తొలగించి తగు పరిష్కారాన్ని సూచించేందుకు అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ ఏర్పాటు చేశారు. -
గ్రీస్ ప్రభావం భారత్‌పై తక్కువే
అక్కడి సంక్షోభంతో రూపాయిపై ప్రతికూలత.. - పెట్టుబడులు కొంత వెనక్కివెళ్లే అవకాశం ఉంది - ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉండొచ్చని, మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. బెయిలవుట్ ప్యాకేజీ షరతులను గ్రీస్ ప్రజలు రిఫరెండంలో తిరస్కరించిన నేపథ్యంలో అక్కడ సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలతో పాటు, యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యం కూడా డోలాయమానంలో పడిన సంగతి తెలిసిందే. ‘గ్రీస్ సంక్షోభంపై హైడ్రామా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రతికూలతలను తట్టుకోగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. ఎందుకంటే దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు అత్యంత స్థిరంగా ఉన్నాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు కూడా ఉండటంతోపాటు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది’ అని సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. అయితే, డాలర్ పెట్టుబడులు కొంతమేర తరలిపోయే అవకాశాలు ఉండటంతో రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని స్పష్టం చేశారు. మనపై పరోక్ష ప్రభావం..: రాజీవ్ మహర్షి గ్రీస్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురయ్యే ప్రమాదం ఉందని.. దీనిపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లే తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వ్యాఖ్యానించారు. అయితే, యూఎస్ ఫెడ్ గనుక వడ్డీరేట్లను పెంచితే మన మార్కెట్‌పై కొంత ప్రతికూలత ఉండొచ్చని ఆయన చెప్పారు. మనపై గ్రీస్ ప్రభావం పరోక్షోంగానే ఉంటుందని.. అక్కడి పరిణామాలన్నింటినీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. అనిశ్చితిలో గ్రీస్, యూరో... ఎథెన్స్: బెయిలవుట్ ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు ఒప్పుకోవాలంటూ యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ఓటర్లు షరతులకు నో చెప్పగా.. కేవలం 39 శాతం మాత్రమే ఓకే అన్నారు. దీంతో రుణదాతలకు చుక్కెదురైంది. మరోపక్క, ఈ పరిణామంతో ఆర్థిక సాయంలేక, ఇప్పటికే నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదంతో గ్రీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యూరోజోన్‌లో ఆ దేశం ఉంటుందా, బయటికి పోతుందా అనేది తేలాల్సి ఉంది. అటు యూరోజోన్ దేశాల సింగిల్ కరెన్సీ యూరో మనుగడకూడా ప్రశ్నార్థంకంగా మారుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్... గత నెల 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయింది. అధికారికంగా గ్రీస్ దివాలా తీసినట్లు యూరోపియన్ ఆర్థిక స్థిరత్వ యంత్రాంగం(ఈఎఫ్‌ఎస్‌ఎఫ్) ప్రకటించింది. మరో రెండు రోజులు బ్యాంకుల మూసివేత గ్రీసు బ్యాంకుల్ని మరో రెండు రోజులు(మంగళ, బుధవారాలు) మూసివేస్తున్నట్లు గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఏటీఎంలలో 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయిల్ లిమిట్ కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ఆనందం అందరిలోనూ కనబడుతోందని రిఫరెండం ఫలితాల తర్వాత గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘యూరప్ చరిత్రలో ఈ ఆదివారం ఎంతో ప్రకాశవంతమైన రోజు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బ్లాక్మెయిల్ చేయలేరని ఈ రిఫరెండం నిరూపించింది. గ్రీస్ వాసులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’ అని సిప్రస్ వ్యాఖ్యానించారు. 48 గంటల్లో బెయిలవుట్ డీల్ కుదరవచ్చని తమ ప్రభుత్వం భావిస్తోందని.. రుణదాతలతో సంప్రదించి తగిన పరిష్కారం కోసం కృషిచేస్తామని చెప్పారు. గ్రీస్ ఆర్థిక మంత్రి రాజీనామా... బెయిలవుట్ షరతులకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు నో చెప్పినప్పటికీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ దేశ ఆర్థిక మంత్రి యానిస్ వరోఫాకిస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గ్రీస్‌కు బెయిలవుట్ విషయంలో రానున్న రోజుల్లో జరిపే చర్చల్లో నేను పాల్గొనకూడదని యూరప్, యూరోజోన్ భాగస్వామ్యపక్షాల్లో కొందరు కోరుకుంటున్నారు. డీల్ కుదుర్చుకునే విషయంలో ప్రధానికి సహకరించాలన్నదే నా ఉద్దేశం. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నా’ అని యానిస్ పేర్కొన్నారు. రుణదాతలతో జరుపుతున్న సంప్రతింపుల్లో షరతులపై చాలాసార్లు గ్రీస్ ఆర్థిక మంత్రి తీవ్రంగా విభేదించడం గమనార్హం. కాగా, గ్రీస్ కొత్త ఆర్థిక మంత్రిగా యుక్లిడ్ సాకలోటస్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన ఆయన బెయిలవుట్ చర్చల్లో పాలుపంచుకున్నారు. నేడు యూరోజోన్ సదస్సు.. బ్రసెల్స్/బెర్లిన్: రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) యూరోజోన్ నేతలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. ఈ సదస్సుకు ముందు యూరోజోన్ ఆర్థిక మంత్రులు కూడా సమావేశం కానున్నారు. మరోపక్క, తాజా పరిణామాలపై జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం పొద్దుపోయాక టెలిఫోన్లో చర్చించుకున్నారని... రిఫరెండంలో గ్రీస్ ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వారు అభిప్రాయపడినట్లు మెర్కెల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ కమిషన్(ఈసీ) కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది. ఈసీ ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్, ఈసీబీ చీఫ్ మారియో డ్రాగి, యూరోజోన్ ఆర్థిక మంత్రుల బృందం హెద్ జెరోన్ డిసెల్బ్లోయెమ్లు రిఫరెండం తీర్పుపై సోమవారం చర్చించారు. కాగా, గ్రీస్‌తో తాజా చర్చలు జరిపేందుకు ప్రాతిపదిక ఏదీ లేదని మెర్కల్ ప్రతినిధి స్టెఫెన్ సీబెర్ట్ చెప్పారు. యూరోజోన్‌లో కొనసాగాలనుకుంటే, తాజా ప్రతిపాదనలతో గ్రీస్ ముందుకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. -
మోదీ టీమ్‌లోకి కొత్త ఆర్థిక సలహాదారు..
అరవింద్ సుబ్రమణియన్‌కు బాధ్యతలు ఆర్థికశాఖలో తాజా నియామకాలు... పర్యాటక శాఖకు ఆర్థిక కార్యదర్శి మయారామ్ ఆయన స్థానంలో రాజీవ్ మహర్షి న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కీలక నియామకం జరిగింది. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ స్థాయి ఆర్థిక విద్యావేత్త అరవింద్ సుబ్రమణియన్ కొలువుదీరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఈ పదవికి ఆయన పేరు వెల్లడైన గురువారంనాడే బాధ్యతలు స్వీకరించడం విశేషం. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక రంగంలో అరవింద్ సుబ్రమణియన్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సుబ్రమణియన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఈఏగా మూడేళ్లు బాధ్యతలు నిర్వహిస్తారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు ప్రవేశపెట్టబోయే తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందిస్తున్న తరుణంలో కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు అరవింద్ సన్నిహితుడని బ్యూరోక్రాట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిరువురూ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో కలసి పనిచేశారు. ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి అరవింద్‌ను నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఎంపిక చేశారని వినికిడి. గర్వకారణం: అరవింద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం ధ్యేయమని అన్నారు. కీలక బాధ్యతల్లో నియామకం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. దేశాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సంస్కరణలకు, మార్పునకు ప్రజలు అధికారమిచ్చిన ప్రభుత్వంలోని కీలక ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహించడం దేశానికి సేవ చేయడానికి అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. పలు సవాళ్లు ఉన్నప్పటికీ దేశానికి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉజ్వల భవిత ఉందని వివరించారు. అపార అనుభవం.. సుబ్రమణియన్ సొంతం ఆర్బీఐ గవర్నర్ రాజన్ తరహాలోనే అరవింద్ ఐఐఎం అహ్మదాబాద్, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఆయన... ఆక్స్‌ఫర్డ్‌లోనూ విద్యను అభ్యసించారు. ఐఎంఎఫ్‌లో ఆర్థిక వేత్తగా బాధ్యతలను నిర్వహించారు. భారత్, చైనా, ఆఫ్రికాల ఆర్థికరంగాలుసహా పలు అంతర్జాతీయ ఆర్థికాంశాలపై సుబ్రమణియన్ పుస్తకాలను రాశారు. ఆయా అంశాల్లో వృద్ధి, వాణిజ్యం, అభివృద్ధి, ఆర్థిక సంస్థలు, ఆర్థిక సహాయ సహకారాలు, వాతావరణంలో మార్పులు, చమురు, మేధో హక్కులు, ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యకలాపాలు, బాధ్యతలు వంటివి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు రఘురామ్ రాజన్ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అటు తర్వాత ఈ స్థానం ఇప్పటి వరకూ భర్తీ కాలేదు. తాజాగా ఈ స్థానంలో నియమితులైన సుబ్రమణియన్ నియమితులయ్యారు. పరిశోధన, అధ్యయనం వంటి ప్రపంచస్థాయి విద్యావేత్తలు, ర్యాంకింగ్స్(ఆర్ఈపీఈసీ) తొలి వరుసలో అరవింద్ సుబ్రమణియన్ది ప్రముఖ స్థానం. అమెరికా ఆర్థికరంగంపై సమీక్షలు, విశ్లేషణా పత్రాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి విధాన పరిశోధనా పత్రాలు, పలు జర్నల్స్, విద్యా సంబంధ గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి. ఆర్థిక రంగానికి సంబంధించి స్వయంగా ఆయన ఐదు పుస్తకాలను రచించారు. భారత్-అమెరికా సంబంధాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ఈ సంవత్సరాంతంలో ప్రచురణ కానుంది. కాగా, గతంలో భారత్ ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో సలహాలను అందించిన సుబ్రమణియన్, జీ-20పై ఆర్థిక మంత్రికి సంబంధించిన నిపుణుల బృందంలో సభ్యులుగా పనిచేశారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి... ప్రధాన ఆర్థిక సలహాదారు నియామకంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఇప్పటి వరకూ ఆర్థిక కార్యదర్శిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరవింద్ మయారామ్, ప్రాధాన్యత తక్కువగా వుండే పర్యాటక మం త్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. మయారామ్ స్థానంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. మహర్షి పదవీకాలం ఇంకా 10 నెలలు మాత్రమే ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖలోని నాలుగు విభాగాల (ఆర్థిక వ్యవహారాలు, వ్యయాలు, రాబడి, ఫైనాన్షియల్ సేవలు)కు చెందిన కార్యదర్శుల్లో మయారామ్ అత్యంత సీనియర్. గత యూపీఏ ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లో నియమించింది. గురువారం మొత్తంమీద ఆర్థిక మంత్రిత్వశాఖలో 20 నియామకాలు జరిగితే, అందులో మూడవవంతు సెక్రటరీ స్థాయిలోనివే.