ఇక ప్రధాన ఆర్థిక సలహాదారుపై సుబ్రమణ్యస్వామి అస్త్రాలు
♦ అరవింద్ సుబ్రమణ్యంను తప్పించాలని ట్వీట్
♦ భారత్ ప్రయోజనాలకు ఆయన వ్యతిరేకమని విమర్శలు
♦ తోసిపుచ్చిన ప్రభుత్వం, బీజేపీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌పై ఇప్పటి వరకూ విమర్శలు సంధించిన బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న మరో సీనియర్ అధికారిపై తాజాగా తన బాణాలను ఎక్కుపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యంను తక్షణం కేంద్రం ఆ పదవి నుంచి తప్పించాలని ట్వీట్ చేశారు. రాజన్ తరహాలోనే అరవింద్ సుబ్రమణ్యం కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థిక వేత్త కావడం గమనార్హం. సుబ్రమణ్యంస్వామి తాజా ట్వీట్ అటు ప్రభుత్వాన్నీ, ఇటు పాలక పార్టీ బీజేపీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వెనువెంటనే సుబ్రమణ్యం స్వామి ప్రకటనను తోసిపుచ్చాయి. సుబ్రమణ్యం స్వామి ప్రకటన వెనుక అటు ప్రభుత్వంకానీ, ఇటు పార్టీకానీ లేదని చెప్పడమే దీని ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరవింద్ సుబ్రమణ్యంను ఎన్‌డీఏ ప్రభుత్వమే 2014 అక్టోబర్‌లో సీఈఏ పదవిలో నియమించడం గమనార్హం.
విమర్శలు ఇవీ...
బహుళజాతి ఆర్థిక సంస్థ- ఐఎంఎఫ్ ఆర్థికవేత్తగా పనిచేస్తున్న కాలంలో అరవింద్ సుబ్రమణ్యం 13వ తేదీ మార్చి 2013న భారత్ ప్రయోజనాలకు విరుద్ధ మైన సూచన చేసినట్లు సుబ్రమణ్యం స్వామి తాజాగా ట్వీట్ చేశారు. తన ఫార్మా రంగం ప్రయోజనాల పరిరక్షణకుగాను అమెరికా భారత్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు ఆయన సూచించారన్నది ఈ ట్వీట్ సారాంశం. ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ పదవీ విరమణ అనంతరం ఆ పదవికి రేసులో అరవింద్ సుబ్రమణ్యం కూడా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఈఏపై విశ్వాసముంది: జైట్లీ
సుబ్రమణ్యం స్వామి విమర్శలపై విలేకరుల సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ... సీఈఏ అరవింద్ సుబ్రమణ్యంపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ప్రభుత్వానికి ఆయన ఎప్పటికప్పుడు విలువైన సలహాలు ఇస్తున్నట్లు కూడా జైట్లీ అన్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ, సుబ్రమణ్యం స్వామి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఆయన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవనీ అన్నారు.