సాక్షి, న్యూఢిల్లీ : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో రెండు రోజులుగా షేర్లు పతనమవుతూ భారీగా నష్టాలు ముంచుకురావడం ముందుగా ఊహించిందే. ఈ విషయాన్ని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ కూడా ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక నివేదికలో హెచ్చరించారు. గత రెండు, మూడు ఏళ్లుగా భారత్‌లో స్టాక్ మార్కెట్ షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయని, ఈ గాలి బుడగ ఎప్పుడో పేలుతుందని కూడా ఆయన చెప్పారు.
వివిధ కంపెనీల షేర్లకున్న వాస్తవ విలువకు అనేక రెట్లు ఎక్కువగా అంచనావేసి షేర్లను అడ్డకోలుగా కొనుగోలు చేయడం వల్లనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లుగా అమెరికాతోపాటు భారత్ షేర్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల్లో పరస్పర విరుద్ధ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ అమెరికాతోపాటు భారత్‌లో కూడా స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పెరగడం ఏమిటని కొంత మంది ఆర్థిక నిపుణులు ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమే కాకుండా అక్కడ కార్పొరేట్ లాభాలు, వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి.
భారత్‌లో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడమే కాకుండా కార్పొరేట్ లాభాలు భారీగా, వడ్డీరేట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలు మందకొడిగా సాగాలి. లేదంటే షేర్ల ధరలు పది శాతానికి మించి పెరగరాదు. 30,40 శాతానికి మించి పెరగడం ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. పైగా ప్రపంచంలోనే భారత్ షేర్ మార్కెట్‌ను చిత్రమైనదిగా వర్ణిస్తారు. హేతుపరమైన పరిణామాలతో సంబంధం లేకుండా సెంట్‌మెంట్ ప్రకారం స్టాక్ మార్కెట్ నడుస్తుంది. ‘జయలలితకు జ్వరం వచ్చినా స్టాక్ మార్కెట్ పడిపోతుంది’ గతంలో ఓ సీపీఐ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్య ఇందుకు ఉదాహరణ. జయలలిత మరణించినప్పుడు మార్కెట్ పడిపోవడం ఇక్కడ గమనార్హం. మరో వారం రోజులపాటు షేర్ మార్కెట్ మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment