కార్పొరేట్లకూ రుణమాఫీ చేయాలి
⇒ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటివి తప్పవు
⇒ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్య
కొచ్చి: విమర్శలొచ్చినా సరే అప్పుడప్పుడు భారీ రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీలను ప్రభుత్వాలు ఒడ్డున పడేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటివి తప్పవన్నారు. ‘‘దీనివల్ల వ్యాపారవర్గాలతో కుమ్మక్కయినట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వంపై ఆరోపణలొస్తాయి. కానీ కొండలా పేరుకుపోయే రుణాల సమస్యను పరిష్కరించేందుకు మరో మార్గం లేదు. నిజానికి పెద్ద ప్రైవేట్ కంపెనీల రుణాలను మాఫీ చేయటమనేది ఏ రాజకీయ వ్యవస్థకూ అంత సులువైన విషయం కాదు. కానీ ఇలాంటి రుణాలను మాఫీ చేయగలగాలి. ఎందుకంటే క్యాపిటలిజం పనిచేసే తీరు ఇదే. మనుషులంతా తప్పులు చేస్తారు.. వాటిని కొన్ని సార్లు కొంత మేరకయినా క్షమించక తప్పదు‘ అని ఆయన వివరించారు. రాజకీయ వ్యవస్థ ఇలా చేయగలగాలని, బ్యాడ్ బ్యాంక్ ఆ కోవకి చెందిన ప్రయత్నమేనని చెప్పారు.
దేశీయంగా బ్యాం కింగ్ వ్యవస్థలో 2012–13లో దాదాపు రూ.2.97 లక్షల కోట్లుగా ఉన్న మొండిబకాయిలు (ఎన్‌పీఏ) 2015–16 నాటికి రెట్టింపై రూ.6.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం రుణాల్లో ఈ మొండిబకాయిల పరిమాణం (పునర్‌వ్యవస్థీకరించిన ఖాతాలతో సహా) 15 శాతానికి ఎగిసిన నేపథ్యంలో సుబ్రమణియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారీగా పేరుకుపోతున్న ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కోసం ’బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనను సుబ్రమణియన్ సమర్ధించారు. భారీగా బాకీపడిన సంస్థల యాజమాన్యాన్ని, ప్రమోటర్లను మార్చడంతో సహా ఇతరత్రా బకాయిల వసూలుకు తీసుకోదగిన చర్యలన్నీ ఈ తరహా బ్యాంక్ అమలు చేయగలదని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దులను బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించి, ఆ సమస్య పరిష్కారాన్ని దానికి అప్పగిస్తే.. మిగతా బ్యాంకులకు కాస్త వెసులుబాటు లభిస్తుందన్నది పరిశ్రమ వర్గాలు భావిస్తున్న సంగతి తెలిసిందే.