
రూ. 1 కోటి వరకు రుణం
9.99 శాతం నుంచి వడ్డీ రేటు
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ జియో ఫైనాన్స్ (జేఎఫ్‌ఎల్) తాజాగా డిజిటల్ విధానంలో సెక్యూరిటీస్‌పై రుణాల (ఎల్‌ఏఎస్) విభాగంలోకి ప్రవేశించింది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లపై తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియంతా పూర్తి డిజిటల్ రూపంలో పది నిమిషాల్లోనే పూర్తవుతుందని వివరించింది.
జియోఫైనాన్స్ యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీని ద్వారా రూ. 1 కోటి వరకు, గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి రుణాలు పొందవచ్చు. వ్యక్తిగత రిస్క్ సామర్థ్యాలను బట్టి వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఫోర్‌క్లోజర్ చార్జీలు ఉండవు. షేర్లను విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి, అవసరమైన నిధులను పొందేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని జియో ఫైనాన్స్ ఎండీ కుశల్ రాయ్ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీ సర్విసులు, డిజిటల్ గోల్డ్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తదితర సేవలను కూడా జియోఫైనాన్స్ యాప్‌తో పొందవచ్చు.