ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.
రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా డిజిటల్ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్ కోడ్ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ఈ సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సీఈవో చందన్ ఖైతాన్ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్–కోడ్ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment