అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు | Most of States Plan to Increase Debt in this financial year also | Sakshi
Sakshi News home page

అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు

Published Mon, Apr 7 2025 2:42 PM | Last Updated on Mon, Apr 7 2025 2:43 PM

Most of States Plan to Increase Debt in this financial year also

పెరుగుతున్న ఆదాయ వ్యయాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు రుణాలే దిక్కవుతున్నాయి. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ఆధారంగా దేశంలోని 15 అతిపెద్ద రాష్ట్రాలు 2026 ఆర్థిక సంవత్సరంలో అధిక రుణాలు తీసుకునే అవకాశాలున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ రాయితీలు, స్థిరంగా పన్ను ఆదాయ వృద్ధి, సాధారణ కార్యకలాపాలకు పెరిగిన వ్యయం ఇందుకు కారణమని చెబుతున్నారు. దాంతో రాష్ట్రాలు అప్పులకే పెద్దపీట వేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ఈ అప్పుల కుప్పను నియంత్రించకపోతే వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ఇది ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.

రుణ పెరుగుదల

కొవిడ్‌ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం పెంచాయి. తదనంతరం ఆర్థిక రికవరీ ద్రవ్యలోటును కొంతవరకు కట్టడి చేస్తున్నప్పటికీ, రాష్ట్రాలు మళ్లీ అప్పులవైపే మొగ్గు చూపుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి కొన్ని పెద్ద రాష్ట్రాలు మార్కెట్ రుణాలను పెంచాలని యోచిస్తున్నాయి. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తర్వాత వరుసలో మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి.

జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులపై ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. దాంతో రుణాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఇది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఉన్న అప్పులకుతోడు ఉన్నికలవేళ నగదు బదిలీ, ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలు.. వంటి రాజకీయ రాయితీలు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.

రుణం-జీఎస్‌డీపీ నిష్పత్తులు

ఆర్థిక వృద్ధికి కీలకమైన కొలమానం రుణం-జీఎస్‌డీపీ నిష్పత్తి. ఇది ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉందో సూచిస్తుంది. ఇది 25 శాతం వరకు ఉంటే ఆరోగ్యకరమైన నిష్పత్తిగా లెక్కిస్తారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ పరిమితిని మించి ఉన్నాయి. ఈ నిష్పత్తిలో 52.3 శాతంతో బిహార్ అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ 47.3 శాతం, పశ్చిమ బెంగాల్ 38.9 శాతం, ఆంధ్రప్రదేశ్ 35.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సాపేక్షంగా 26.07% నిష్పత్తి ఉన్నప్పటికీ తమిళనాడు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన హామీల వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

పెరుగుతున్న వడ్డీ వ్యయాలు

రాష్ట్ర బడ్జెట్లపై పెరుగుతున్న వడ్డీ భారంలో ఈ రుణాల చెల్లింపులు కీలకంగా మారుతున్నాయి. కొన్ని రాష్టాలపై విధిస్తున్న వడ్డీలు వాటి ఆదాయాల్లో కోతలకు దారిస్తున్నాయి. పంజాబ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అతి తక్కువ వడ్డీ కవరేజీని కలిగి ఉన్నాయి. ఇది 4% నుంచి 6% మధ్య ఉంది. దీనికి విరుద్ధంగా ఒడిశా అత్యధికంగా 35.7% వడ్డీ కవరేజీని కలిగి ఉంది. బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు 10% నుంచి 12% మధ్య వడ్డీ కలిగి ఉన్నాయి.

కష్టంగా క్యాపెక్స్‌ లక్ష్యాలు

ఆదాయ వ్యయాలు పెరుగుతున్నకొద్దీ మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులు(క్యాపెక్స్) తగ్గుతున్నాయి. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలు బడ్జెట్‌లో కేటాయింయిన క్యాపెక్స్ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడుతున్నాయి. ఉదాహరణకు, తమిళనాడు తన 2025 ఆర్థిక సంవత్సరం క్యాపెక్స్ అంచనాను రూ.47,681 కోట్ల నుంచి రూ.46,766 కోట్లకు సవరించింది. మహారాష్ట్ర మినహా చాలా పెద్ద రాష్ట్రాలు క్యాపెక్స్‌లో గణనీయంగా 12% నుంచి 69% వరకు పెంచుతున్నట్లు చూపించాయి. కానీ వాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది.

నిధుల వినియోగం

మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా క్యాపెక్స్‌ కేటాయింపులు చేస్తున్నారు. అయినప్పటికీ దీని అమలు సవాలుగా మారింది. రాష్ట్రాలు అవసరమైన సంస్కరణలను అమలు చేయలేకపోవడం, వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో అసమర్థత కారణంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి రుణాలకు కేటాయింపులను రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు తగ్గించింది. రాష్ట్రాలు ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతే వృద్ధి కుంటుపడుతుంది.

ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఆశలు

పరిష్కారం లేదా..?

ఆర్థిక వ్యయాలు పెరిగేకొద్దీ దీర్ఘకాలిక వృద్ధికి కీలకంగా ఉన్న రాష్ట్రాల మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. రెవెన్యూ వ్యయాలపై పటిష్ట నియంత్రణ లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ మరింత క్షీణించి రాష్ట్రాలు సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా దీనిపై మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు, ఇతరులతో చర్చించి అప్పులు తగ్గేలా మెరుగైన పద్ధతులను సిద్ధం చేసి అమలు చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement