20% రుణ వృద్ధి లక్ష్యం
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ ఈవీపీ విరాట్ దివాన్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం మేర రుణ వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విరాట్ దివాన్జీ వెల్లడించారు. ఒకవైపు ఎకానమీ మెరుగుపడుతుండటం మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ద్వితీయార్థంలో కార్పొరేట్ల నుంచి రుణాలకు డిమాండ్ పెరగగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రుణ వృద్ధి దాదాపు 15% మేర నమోదైనట్లు సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో దివాన్జీ పేర్కొన్నారు.
మార్చి ఆఖరు నాటికి మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1,18,000 కోట్ల పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు విలీనం దరిమిలా శాఖల క్రమబద్ధీకరణ పూర్తి చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో శాఖల సంఖ్యను 1,400కు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,333 శాఖలుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి సుమారు 180 మేర ఉన్నాయని దివాన్జీ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) ఈసారి 4.35-4.5 శాతం మేర ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ రూ. 1 లక్ష పైబడిన సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై తాము గతంలోలాగానే 6% వడ్డీ రేటు కొనసాగించనున్నట్లు దివాన్జీ తెలిపారు.