పీఎంఎంవై రుణ లక్ష్యం 1.22 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన్ (పీఎంఎంవై) కింద బ్యాంకులు రూ.1.22 లక్షల కోట్లను చిన్న వ్యాపార యూనిట్లకు రుణాలుగా అందించనున్నాయి. బ్యాంకింగ్ రంగానికి ముద్రా రుణాల కోసం రూ.1.22 లక్షల కోట్లను కేటాయించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎసాప్‌లకు ఇన్‌సైడర్ నిబంధనలు వర్తించవు
ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ప్రోగ్రాం (ఎసాప్) కింద జరిగే షేర్ల క్రయ విక్రయ లావాదేవీలను ‘ట్రేడింగ్’గా పరిగణించబోమని సెబీ తెలిపింది. ఈ నేపథ్యంలో వీటికి ట్రేడింగ్ నిబంధనలు వర్తించవని వివరణనిచ్చింది. అయితే, ఈ లావాదేవీల వెల్లడి సంబంధించిన నిబంధనలు మాత్రం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
వృద్ధి ఉత్తేజానికి చైనా కొత్త ప్రయత్నం
దేశంలో క్షీణిస్తున్న వృద్ధికి ఊతం అందించడానికి చైనా తాజాగా మరో ప్రయత్నం చేసింది. బ్యాంక్ రుణ రేటు కోత విధించింది. బ్యాంకుల నిధుల నిల్వలకు సంబంధించిన మొత్తాన్ని తగ్గించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మంగళవారం తన వెబ్‌సైట్‌లో ఈ విషయాలను ఉంచింది. ఏడాది బెంచ్‌మార్క్ బ్యాంక్ రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 4.6 %కి దిగింది.
16 ఎఫ్‌డీఐలకు ఆమోదం
దాదాపు రూ.1,153 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎడిల్‌వేజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్‌కోర్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, న్యూస్ లాండ్రీ మీడియా తదితర కంపెనీల ప్రతిపాదనలు ఓకే అయ్యాయి.
ఐఓసీ డిజిన్వెస్ట్‌మెంట్‌లో ఎల్‌ఐసీదే అధిక వాటా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) వాటా విక్రయంలో అధిక భాగం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటా(24.28 కోట్ల షేర్లు)ను ఐఓసీ ఆఫర్ చేసింది. ఎల్‌ఐసీ 8.6 శాతం వాటాను(20.87 కోట్ల షేర్ల)ను కొనుగోలు చేసింది. గతంలో ఐఓసీలో 2.52 శాతంగా ఉన్న ఎల్‌ఐసీ వాటా ఈ షేర్ల కొనుగోళ్లతో 11.11 శాతానికి పెరిగింది.
చైనాను ఇప్పుడే అధిగమించలేం: రాజన్
భారత్ ఎంత వేగంగా ఎదిగినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా చైనాను అధిగమించాలంటే చాలా కాలమే పట్టేస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. చైనా పరిమాణంలో భారత్ నాలుగో వంతో, అయిదో వంతో మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ వృద్ధి రేటులో చైనాను భారత్ అధిగమించినా, చాలా కాలం పాటు దాని ప్ర భావం అతి తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఆయన చెప్పారు.
కాల్ డ్రాప్స్‌కి టెల్కోలపై జరిమానా యోచన
కాల్ డ్రాప్ కష్టాలు తగ్గే అవకాశాలు కనిపించకపోతుండటంతో.. టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ సమస్య మీద ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై టెల్కోల ప్రమోటర్లకు వ్యక్తిగత లేఖలు పంపాలని యోచిస్తోంది. ఒకవేళ సేవల నాణ్యత మెరుగుపడని పక్షంలో లెసైన్సు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆపరేటర్లకు తెలియజేస్తామని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
ఆంధ్రాబ్యాంక్ ముద్రా కార్డు
చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్ష లోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి.
దీపావళికల్లా యాపిల్ వాచ్!
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో ఈ ఏడాదే ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే అప్లికేషన్లు, పనితీరులో తమ ఉత్పాదన ప్రత్యేకమని ఆపిల్ అంటోంది. వాచ్ కలెక్షన్‌లో 18 క్యారట్ యెల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ కేస్‌తో రూపొందిన మోడళ్లూ ఉన్నాయి. భారత్‌లో వీటి ధర రూ.22,000-రూ.11 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు
ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 4 నుంచి 2016-17 బడ్జెట్‌పై వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపనుంది. తొలిగా వాణిజ్య, టైక్స్‌టైల్, విదేశీ వ్యవహారాల శాఖలతో ప్రారంభం కానున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు సెప్టెంబర్ 28న ముగుస్తాయి. సంప్రదింపుల్లో భాగంగా పలు ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు వ్యయ ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిస్తాయి.
అమెరికా వృద్ధి పటిష్టత
అమెరికా వృద్ధి పటిష్టంగా మారుతోందనటానికి తాజా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు అద్దం పడుతున్నాయి. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7%గా నమోదయింది. ఇది తొలి అంచనాలకన్నా (2.3%) అధికం. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదే వడ్డీరేటు 0.25% స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందని కొన్ని వర్గాల అభిప్రాయం.
పీఓఎస్ క్యాష్ విత్‌డ్రాయెల్ పరిమితి పెంపు
చిన్న, మధ్య స్థాయి పట్టణాల్లో (టైర్ 3, 4 సెంటర్లు) అమ్మకం కేంద్రాల వద్ద (పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని ఆర్‌బీఐ రెట్టింపు చేసింది. దీనితో ఈ పరిమితి రూ.1,000 నుంచి రూ.2,000కు పెరిగింది. బ్యాంకులు జారీ చేసే డెబిట్ కార్డులు, ఓపెన్ సిస్టమ్ (ఏ అవసరానికైనా వినియోగించుకునే) ప్రీపెయిడ్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
విమాన టికెట్‌పై సెస్!
విమాన టికెట్లపై 2% సుంకం విధించాలని ప్రభుత్వం యోచి స్తోంది. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సుంకం నిధులతో మారుమూల ప్రాంతాలకు కూడా సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన.
జన్‌ధన్ యోజన్ ద్వారా రూ.22,000 కోట్లు
కేంద్ర ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ యోజనను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది చివరకు వోడాఫోన్ 4జీ సేవలు
వోడాఫోన్ ఇండియా ఈ ఏడాది చివరకు దేశంలో 4జీ సేవలను ప్రారంభించనుంది. నెట్‌వర్క్ ఏర్పాటుకు గ్లోబల్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. డేటా మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండే ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి ప్రాంతాల్లో మొదట 4జీ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
బ్యాంకుల రుణ వృద్ధి మందగమనం
వాణిజ్య బ్యాంకుల రుణ వృద్ధి మందగమన ధోరణి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్పష్టమైంది. 2014 ఇదే క్వార్టర్‌లో వాణిజ్య బ్యాంకుల రుణ వృద్ధి 12.9 శాతం అయితే 2015 ఇదే కాలంలో ఈ రేటు 8.6 శాతానికి పడిపోయింది. కాగా బ్యాంక్ డిపాజిట్లలో వృద్ధి రేటు కూడా ఇదే కాలంలో 11.9 శాతం నుంచి 10.6 శాతానికి పడిపోయింది.
నియామకాలు
- ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) హెడ్‌గా చైనా మాజీ ఉప ఆర్థిక మంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు.
- రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత్ దాస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు.
- ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఉన్న హస్ముక్ అదియా రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు.
- కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న అంజులీ చిబ్ దుగ్గల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
- దుగ్గల్ స్థానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొత్తగా తపన్ రాయ్ నియమితులయ్యారు.
గతవారం బిజినెస్
Published Mon, Aug 31 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement