ప్రత్యేక బడ్జెట్.. పేరుకేనా? | special budget ? | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బడ్జెట్.. పేరుకేనా?

Published Wed, Mar 11 2015 11:30 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రత్యేక బడ్జెట్.. పేరుకేనా? - Sakshi

ప్రత్యేక బడ్జెట్.. పేరుకేనా?

ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా పంటలకు పావలా వడ్డీ రుణాలు, రూ. 3 లక్షలు-అంతకంటే తక్కువగా తీసుకున్న రుణాలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు వంటి అనేక అంశాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయానికి మరింత మెరుగైన విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక అంశాలను ఆ బడ్జెట్ ప్రతిపాదించింది. కొన్నింటిని మినహాయిస్తే మిగిలిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు గుప్పించిన పార్టీలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో మాత్రం చేతులెత్తేశాయి.

2013-2014 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం రూ.13,110 కోట్ల కేటాయింపులతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించింది. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పుకుంది. కానీ రుణమాఫీ హామీలకు ఏ మాత్రం సరిపోని విధంగా కేవలం రూ.5 వేల కోట్లను కేటాయించారు. భూముల మ్యాపింగ్, భూసార పరీక్షల ద్వారా ఖర్చులు తగ్గిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకునే దిశగాచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జిపిఎస్ వంటి సాంకేతిక పద్ధతులను వాడుకుంటామని చెప్పారు. నిజానికి ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వాటితో ఒనగూడిన ఫలితాలు అంతంత మాత్రమే. విత్తన సబ్సిడీ కి రూ. 212 కోట్ల నిధులు కేటాయించినా, కావలసిన విత్తనాలు అందుబాటులో లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు.  

వంచనకు అంకురార్పణ

అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీలు కురిపించిన తెలుగుదేశం ప్రభుత్వం... పాలనా పగ్గాలు చేపట్టగానే ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచించింది. రూ.87 వేల కోట్లకు పైబడిన రైతు, వ్యవసాయ రుణాలను అనేక మెలికలు పెట్టి సగానికి తగ్గించగలిగారు. రైతుల్లో సంతోషాన్ని కానీ, నమ్మకాన్ని కానీ ఈ బడ్జెట్ కలిగించలేక పోయిందనడంలో సందేహం లేదు. మొదటి సంవత్సరం రూ. 50 వేలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పి 2014-15 ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్ల చిల్లర కేటాయింపులు చేశారు.  ఈ వాగ్దానాలను నమ్మిన రైతులు అప్పు చేసి తీరుద్దామనుకున్న బ్యాంకు రుణాలను సైతం తీర్చకుండా అనేక కష్టనష్టాలకు గురయ్యారు.

రూ.50 వేలకు పైబడిన రుణాన్ని తీర్చడానికి నాలుగు సంవత్సరాలు వేచి చూడాల్సిన దుస్థితిలో... రైతుగా కంటే రైతు కూలీగా బతకడమే మంచిదనే భావనకు లోనవుతున్నాడు. రూ. 1,386 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు కానీ సాగుదారుల అవసరాలకు అనుగుణంగా నిధుల వినియోగం ఎలా జరుగుతుందో మాత్రం చెప్పలేదు.  కేటాయింపుల ద్వారా  సాధించిన ప్రగతిని ప్రభుత్వం తన నివేదికల్లో ఎక్కడా ప్రస్ఫుటం చెయ్యలేకపోయింది.
 
కేంద్ర బడ్జెట్‌లోనూ రైతుకు మొండిచేయే..


వ్యవసాయానికి కేంద్రం 2015-16 సంవత్సరంలో రూ.28,050 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం కేటాయింపుల కంటే 10 శాతం తక్కువ. ఇది వ్యవసాయంపై కేంద్రానికి గల చిన్నచూపును ప్రతిబింబిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకాలకు రూ. 5,500 కోట్ల మేర కోత విధించింది. ప్రధానమంత్రి క్రిషి సంచాయీ యోజన, వాటర్‌షెడ్ పథకాలకు గతేడాది మొత్తం కేటాయింపులు రూ.5,623 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్‌లో అవి రూ.5,300 కోట్లకు తగ్గాయి. ఒక ముఖ్యమంత్రి ఈ మధ్య బ్యాంకర్ల సమావేశంలో పేర్కొన్నట్లు.. కేంద్ర ప్రభుత్వం పెంచిన కేటాయింపులు కేవలం పెద్ద రైతులు, కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి.

ఐక్య వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అయితే ఇవి కూడా బడా రైతులకు లేదా కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పరిశోధనలను చిన్నచూపు చూడటం ఆందోళన కలిగించే విషయం. కేంద్రం తగ్గించిన కేటాయింపులను పెంచిన పన్నుల ఆదాయం ద్వారా సర్దుబాటు చేసుకోవాలని మంత్రి రాష్ట్రాలకు సూచిస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పోలవరం నిర్మాణానికి కనీస నిధులను తెలుగుదేశం ప్రభుత్వం సాధించలేకపోవటం విచారకరం.

వ్యవసాయ వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయి, ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్రాలు వ్యవసాయంపై మరింత దృష్టిని కేంద్రీకరించి చిన్న-సన్నకారు రైతులకు మెరుగైన సేవలు అందిస్తాయని ఆశిద్దాం. తదనుగుణంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు జరగాలని కోరుకుందాం.
 (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణుడు, విశ్లేషకుడు)
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement