సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అందరికంటే ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది.
నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీకాలం ఈ మార్చితో పూర్తి కానుంది. ఈ క్రమంలో.. ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ముసాయిదాను సిద్ధం చేసింది. మరోవైపు.. రెండుసార్లు అవకాశం కల్పించినా ఓటర్ నమోదుకు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో.. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment