చిత్తూరు, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ..
‘‘సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది. అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి.
.. తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్ సిస్టమ్ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె.
పవన్‌కు సూటి ప్రశ్న
‘‘సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మరి గేమ్ ఛంజర్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment