సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.
సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.
ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment