తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రంగులు మార్చే బుద్ధి చూపిస్తే... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి కొంత స్వతంత్ర ధోరణి, మరికొంత స్వామి భక్తి చూపే ప్రయత్నం చేశారు. దుర్ఘటన జరిగినందుకు ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా పవన్ ఆ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారులుపై చిర్రుబుర్రులాడినట్లు, వేటు వేసినట్లు కనిపించారు. కానీ.. తనకు కావాల్సిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది.
..ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినా అందులోనూ రాజకీయం చేస్తూ ఎలాగోలా నెపం వైఎస్సార్‌సీపీ(YSRCP)పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రుద్దాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో టీటీడీ పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఉన్నతస్థాయిలో ఉన్నవారి మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో బట్టబయలయ్యాయి.
చంద్రబాబు నాయుడు ఎదుటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు తీవ్ర స్థాయిలో ఏకవచనంతో దాడి చేసుకున్న వైనం, ఆరోపణలు గుప్పించుకున్న తీరును టీడీపీ జాకీ పత్రికే బహిర్గతం చేయడం విశేషం. టీటీడీ అధ్యక్ష పదవికి బీఆర్ నాయుడును నియామకాన్ని ఆ జాకీ పత్రిక యజమాని వ్యతిరేకించారు. అయినా మంత్రి లోకేష్ పట్టుబట్టి నియమించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్‌లో భూ దందాలు చేస్తున్నారంటూ ఈ పత్రిక కొద్ది రోజుల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. అయినా చంద్రబాబు స్పందించకపోగా, తన వెంటే తిప్పుకుంటున్నారు. తిరుపతికి వెళ్లిన సందర్భంలో కూడా చంద్రబాబు వెంటే ఆయన ఉన్నారు. బహుశా ఈ కోపంతోనే గొడవ సమాచారాన్ని ఈ పత్రిక బయట పెట్టి ఉండవచ్చు.
ఉద్దేశం ఏమైనా, రాజకీయాలు ఎలా ఉన్నా, ప్రజలకు కొన్ని వాస్తవాలను చెప్పిందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు వేశారు. కానీ వారిలో కీలకమైన అధికారులు లేరు. తిరుపతి ఎస్పీ సుబ్బనాయుడును బదిలీ చేయాల్సి రావడం ఆయనకు ఇబ్బంది కలిగించేదే.
సాధారణంగా ఇంతమంది మరణానికి బాధ్యుడుగా ఎస్పీని సస్పెండ్ చేయాల్సి ఉండిందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, రెడ బుక్ రాజ్యాంగం అమలుకు ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకోవడం వల్ల బదిలీతో సరి పెట్టారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవో శ్యామలరావును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని టచ్ చేయలేదు. కాకపోతే వారిపట్ల ఆగ్రహం ప్రదర్శించినట్లు వీడియో లీక్ అయ్యేలా చూసుకున్నారు.
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపిన నెయ్యి వాడారని పిచ్చి ఆరోపణను చంద్రబాబు చేసిన అంశంలో వాస్తవాలు శ్యామలరావుకు తెలుసు. పొరపాటున ఆయన అప్పుడు జరిగిన విషయాలపై నోరు తెరిస్తే అది చంద్రబాబుకు ఇరకాటం అవుతుంది. వెంకయ్య చౌదరి చాలాకాలం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. ఇతర సామాజిక వర్గాల అధికారులపై వేటు వేసి తన సామాజికవర్గం అధికారిని మాత్రం చంద్రబాబు రక్షించుకుంటున్నారని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల కొండపై ఈవో కన్నా ,వెంకయ్య చౌదరి పెత్తనమే అధికంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉండడమే కారణమట.
ఈవో, ఏఈవోల మధ్య సఖ్యత లేదు. వీరిద్దరికి, ఛైర్మన్‌కు సత్సంబంధాలు లేవు. బిఆర్ నాయుడు తనకు పదవి రావడంతో చేయవలసింది ఏమిటో తెలియని పరిస్థితిలో పెత్తనం చేయబోతే అధికారులు సహకరించడం లేదు. లోకేష్‌కు ఆప్తుడనైన తననే అవమానిస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తొక్కిసలాట కారణంగా ఆరు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో జన సమూహాలను సమర్థంగా నిర్వహించగల టీటీడీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ ఇంకో కారణం కూడా చెబుతున్నారు.
జనసేనకు నాయకుడు టోకెన్లు ఇచ్చే చోట ఏభై మంది కార్యకర్తలను లోపలికి పంపించడం కూడా తొక్కిసలాటకు ఒక కారణమైందని ఒక పత్రిక రాసింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. గత అనుభవాలను చూస్తే ఆయన ఫలితం ఏమంత గొప్పగా ఉండదని ముందగానే చెప్పేయవచ్చు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మరణించినప్పుడు కూడా ఇలాగే విచారణ కమిషన్ వేశారు. ఉన్నతాధికారుల మాట అటుంచండి.. కనీసం ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు చేసిన ఫొటోషూట్ కళ్లెదుటే ఉన్నప్పటికీ ఆయన తప్పేమీ లేదన్నట్టు కమిషన్ నివేదిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే అవడం గ్యారెంటీ!
చంద్రబాబు ఇప్పటివరకూ బి.ఆర్.నాయుడు రాజీనామా కోరలేదు. టీవీ ఛానల్ యజమాని అని ఊరుకున్నారో.. లోకేశ్ మనిషి కాబట్టి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తెలియదు మరి! నైతిక బాధ్యత వహించి బీఆర్ నాయుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ పదవి, అధికారం రుచి మరగిన తరువాత వదులుకోవడం కష్టమని అనుకుని ఉండాలి.
ఇక చంద్రబాబు మాట్లాడిన కొన్ని అంశాలు చూడండి. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించడం ఎంత దుర్మార్గం?. ప్రభుత్వ, టీటీడీ అధికారుల, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన నెపం వైసీపీపై రుద్దడానిక ప్లాన్ చేశారు. ఎల్లో మీడియా ఇప్పటికే ఈ ప్రయత్నం ఆరంభించింది. ఏటా తిరుపతి వాసుల కోసం ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తుంటే, ‘‘అసలు టోకెన్లు ఇవ్వడం ఏమిటి? తనకు తెలియనే తెలియదు’ అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇది బుకాయింపు అవ్వాలి లేదంటే అవగాహన రాహిత్యం కావాలి.
‘‘వైకుంఠ ఏకాదశికి పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం కల్పించడం ఏమిట’’ని ఆయన అంటున్నారు. దాని ద్వారా లక్షలాది మంది భక్తుల కోరిక ను గత ప్రభుత్వం తీర్చిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అసలు తిరుమలకు సంబంధించి తనకు తెలియని విషయం ఉండదని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. అదే కరెక్టు అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలల తర్వాత, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా దానినే ఎందుకు కొనసాగించారు?. మరోవైపు..
పవన్ కల్యాణ్ కొంత సొంత వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. నాలుగు లక్షల మంది వచ్చిన ప్పుడు కూడా గతంలో జరగని దుర్గటన ఇప్పుడెలా జరిగిందని ఆయన ప్రశ్నించారట. దీనికి చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి బదులు ఇవ్వాలి. అంతేకాదు. భక్తులు, ప్రజలు క్షమించాలని కోరారు. ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ అనగానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ సనాతని వేషం దాల్చి నానా రచ్చగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. ఈసారి అలా కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారన్నమాట. అయితే..
ఆనాడు లడ్డూ విషయంలో అపచారం చేసినందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసి వచ్చిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఈవో,అదనపు ఈవో, ఛైర్మన్‌లను బాధ్యులను చేస్తే చంద్రబాబు మాత్రం వారిని రక్షించే యత్నం చేశారు. టీటీడీలో ఉన్న విబేధాలను ఆయన అంగీకరించారు. చంద్రబాబు ఆ విభేధాల ఆధారంగా విమర్శలు తనపైకి రాకుండా కథ నడిపించారు.
నిజానికి వారందరిని నియమించింది చంద్రబాబే, వారితో శ్రద్దగా పని చేయించకపోగా, రెడ్ బుక్ రాజ్యంగం అంటూ, టీటీడీని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ ఎలాంటి ఆరోపణలు చేయవచ్చో అనేవాటిపైనే పని చేయించారు. ఇప్పుడు వాటి ఫలితం జనం అనుభవించవలసి వచ్చింది. అసలు పనులు మాని చిల్లర వ్యవహారాలకే టిటిడి బాధ్యులంతా పరిమితం అయ్యారని అంటున్నారు. అధికారులపై, ఛైర్మన్ పై చర్య తీసుకోవాలని, వారిపై కేసులు పెట్టాలని మాత్రం పవన్ చెప్పలేదు. హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అర్జున్‌తోపాటు యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానిని పవన్ సమర్థించారు. మరి ఇప్పుడు టీటీడీ యాజమాన్యంపై కేసు పెట్టాలని పవన్ ఎందుకు కోరలేదు. వారిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదు. పైగా కొత్తగా కుట్ర కోణం ఉండవచ్చని పవన్ అన్నారు. అంటే ఇక్కడే చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శించారా? సందేహం వస్తోంది.
ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఆడిన కొత్త డ్రామా అని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోకుండా, మొత్తం డైవర్ట్ చేయడానికి జరుగుతున్న యత్నం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబే తొలి ముద్దాయి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. దానికి కారణం బీఆర్ నాయుడును ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, అంతవరకు సమర్థంగా పనిచేసిన అధికారులను తప్పించి, తనకు కావల్సిన అధికారులను పోస్టు చేసి ఈ తొక్కిసలాటకు కారణం అవడమే అనేది విశ్లేషణ.
తన పబ్లిసిటీ పిచ్చి కారణంగా పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణిస్తేనే బాధ్యత తీసుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనలో బాధ్యత వహిస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు భయం, భక్తి లేవని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి దేవుడును సైతం తన రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు ఎప్పుడు వెనుకాడలేదు.
అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఆ ఘటన జరిగింది తన ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల అజాగ్రత్త వల్ల అని చెప్పకుండా చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందన్న ఆశతో 2003లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ను బద్నాం చేసేందుకు తిరుమల లడ్డూతోసహా అనేక అపచారపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఈ ఉదంతంలో దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని దారుణమైన వ్యాఖ్య చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నట్లుగా ఉంది. ఇది కూడా తిరుమల పట్ల అపచారంగానే భావించాలి. ఏది ఏమైనా ఒక విశ్లేషకుడు అన్నట్లు పాలకుల పాపాలు ప్రజలకు శాపాలవుతుంటాయట. ఇవన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుందా?.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment