2023–24లో 15 శాతం వృద్ధి
గృహ రుణ విభాగంలో మందగమనం
క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడి
కోల్‌కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది.
వ్యక్తిగత రుణాలకు డిమాండ్
ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్‌బీఎఫ్‌సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి.
టూవీలర్ రుణాల జోరు
ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్‌ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్‌ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్‌ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment