న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి ఇంటి రుణాలను మంజూరు చేశాయి. వీటి విలువ రూ.9 లక్షల కోట్లు. రిటైల్ రుణాలపై ఈక్విఫ్యాక్స్, ఆండ్రోమీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రూ.25 లక్షల లోపు ఇంటి లోన్ అందుకున్నవారి సంఖ్య గతేడాది ఏకంగా 67 శాతం ఉండడం గమనార్హం. రూ.75 లక్షలు–రూ.1 కోటి వరకు తీసుకున్న లోన్లు 36 శాతం అధికం అయ్యాయి. 2021తో పోలిస్తే హోమ్ లోన్స్ 2022లో 18 శాతం ఎగశాయి.
అలాగే ఈ రుణాలు అందుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం గృహ రుణాలు 16 శాతం అధికం అయ్యాయి. వ్యక్తిగత రుణాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ రుణ మార్కెట్ విలువ 2022 డిసెంబర్ నాటికి రూ.100 లక్షల కోట్లకు చేరింది. 54 కోట్ల యాక్టివ్ లోన్లు ఉన్నాయి. గతేడాది చివరినాటికి గృహోపకరణాల కోసం రుణాలు అందుకున్న యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 6.5 కోట్లు.
2021తో పోలిస్తే ఇది 48 శాతం అధికం. హోమ్ లోన్స్ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. వినియోగం పెరగడం, సులువుగా లభ్యత, రుణదాతల మధ్య పోటీ వ్యక్తిగత రుణ విభాగం డిమాండ్‌కు కారణం. ఇటీవల ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ గృహ రుణ రేట్ల మాదిరిగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పెరుగుదలను చూడలేదు.
Comments
Please login to add a commentAdd a comment