
రిటైల్ రుణాలన్నింటికీ వర్తింపు...
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు ఎఫెక్ట్
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్‌బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది.
అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్‌బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment