Reduction in interest rates
-
పర్సంటేజ్లతో పండగ చేస్కో!
ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. దేశ వృద్ధికి ఆర్బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకుగాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున (0.25 శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ పేర్కొన్న ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది. కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే. వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గింపు... దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్బీఐ షాక్‌కు గురిచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు... ► ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు. ► ఆర్బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది. ► తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపోను తగ్గించారు. ► క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ► అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ► 2019–20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5–3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ► వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 3–5 తేదీల్లో జరుగుతుంది. వృద్ధి కోసం రేట్ల కోత అవసరమే: దాస్ నిలిచిన వృద్ధి ఇంజిన్‌ను వెంటనే పరుగెత్తించేలా చేయాల్సిన అవసరమే.. రేట్లను దశాబ్ద కనిష్ట స్థాయికి తగ్గించాల్సి వచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘‘వృద్ధి ధోరణి ఇలాగే ఉన్నంత కాలం... అలాగే, వృద్ధి పుంజుకునేంత వరకు ఆర్బీఐ తన ప్రస్తుత సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తుంది’’ అని దాస్ అభయమిచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుండడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపించే అవకాశాలపై ఎదురైన ఒక ప్రశ్నకు... ‘‘బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికి (జీడీపీలో 3.3 శాతం) ద్రవ్యలోటును పరిమితం చేస్తామని కేంద్రం చెబుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని సందేహించాల్సిన అవసరం లేదు’’ అని దాస్ చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలుగా దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యంతర డివిడెండ్ రూపంలో రూ.30 వేల కోట్లను కోరనుందన్న విషయమై తనకు అవగాహన లేదన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం దేశ బ్యాంకింగ్ రంగంపై తలెత్తుతున్న సందేహాలు, వదంతులను తోసిపుచ్చుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా, సుస్థిరంగా ఉందని, భయపడేందుకు కారణాలేమీ లేవన్నారు దాస్. ఒక్క కోపరేటివ్ బ్యాంకులో తలెత్తిన సమస్య పునరావృతం కాబోదన్నారు. దీన్ని బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ పరిస్థితికి ముడిపెట్టి చూడడం తగదన్నారు. అక్రమాలు వెలుగు చూడడంతో ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఎవరేమన్నారంటే... 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతతోపాటు అవసరమైతే తదుపరి రేట్ల కోత ఉంటుందని చెప్పడం అన్నది.. వృద్ధి ఆందోళనలకు ముగింపు పలికేందుకు ద్రవ్య, పరపతి విధానాలు కలసి పనిచేస్తాయన్న భరోసాను ఇస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ 135 బేసిస్ పాయింట్లను ఈ ఏడాది తగ్గించడానికి తోడు ప్రభుత్వం తీసుకున్న పలు ప్రోత్సాహక చర్యలు పలు రంగాల్లో వృద్ధికి దారితీస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి దేశ వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను ఆర్బీఐ తగ్గించడం, వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలీ తీసుకున్న చర్యలకు అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది – కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన మేరకే రేట్ల కోత ఉంది. అయితే, మార్కెట్లు మరింత రేటు కోతను అంచనా వేయడంతో నిరాశ చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25–40 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. – అభిషేక్ బారు, వైస్ ప్రెసిడెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఎఫ్‌ఐల రుణ పరిమితి పెంపు సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు/ఎంఎఫ్ఐ) సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఓ సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణాల లభ్యత పెరుగుతుంది. ఓ రుణ గ్రహీతకు గరిష్టంగా రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.25 లక్షలు చేసింది. ఎంఎఫ్ఐ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) రుణ గ్రహీతలకు సంబంధించి గృహ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు, పట్టణాల్లో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రుణ వితరణ పరిమితులను చివరిసారిగా 2015లో ఆర్బీఐ సవరించింది. -
ఆదుకోండి మహాప్రభో!!
న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్ఏడీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు.. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. రుణ లభ్యత పెరిగేలా చూడాలి.. ‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు. పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. -
ఫిబ్రవరిలో వడ్డీరేట్ల కోత..
మార్చిలోగా ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించొచ్చు ⇒ 181% వృద్ధితో రూ. 334 కోట్లకు చేరిన క్యూ3 నికరలాభం ⇒ 5.77 నుంచి 5.32 శాతానికి తగ్గిన స్థూల ఎన్పీఏలు ⇒ త్వరలో టైర్2 బాండ్స్ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ ⇒ ప్రస్తుతానికి విలీన అవకాశాలు లేవు - ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొన్న ఆర్బీఐ చేసిన పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపును వచ్చే నెలలో ఖాతాదారులకు బదలాయిస్తామని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. డిపాజిట్లు రేట్ల తగ్గిస్తేనే తప్ప రుణాలపై వడ్డీరేట్లు తగ్గించలేమని, వచ్చే నెలలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ చెప్పారు. మంగళవారమిక్కడ బ్యాంకు 3వ త్రైమాసిక (సెప్టెంబర్- డిసెంబర్) ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. మార్చిలోగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందన్నారు. ‘‘రిటైల్ రుణాలకు తప్ప ఇపుడు కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదు. 4వ త్రైమాసికం నుంచి రుణాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే ఏడాది రుణాల్లో 17-18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. వ్యాపార విస్తరణకు కావాల్సిన మూలధనాన్ని టైర్-2 బాండ్ల ద్వారా సేకరించాలని చూస్తున్నాం. ఈ మార్చిలోగా బాండ్లు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పేరెంట్ బ్యాంక్ ఎస్బీఐలో విలీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు’’ అని తెలియజేశారు. నికర లాభంలో రికార్డు స్థాయి వృద్ధి నికర లాభంలో బ్యాంకు రికార్డు స్థాయిలో 181 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.334 కోట్లకు చేరింది. అధిక వడ్డీరేటున్న బల్క్ డిపాజిట్లను రూ.44,295 కోట్ల నుంచి రూ. 31,965 కోట్లకు తగ్గించుకోవడం, ఇతర ఆదాయం 92 శాతం వృద్ధితో 185 కోట్ల నుంచి 356 కోట్లకు పెరగడం దీనికి ప్రధాన కారణాలని ముఖర్జీ చెప్పారు. ఇదే సమయంలో తక్కువ వడ్డీ రేటున్న కాసా డిపాజిట్లను 27 నుంచి 31 శాతానికి పెంచుకోవడంతో నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.04 శాతం నుంచి 3.26 శాతానికి పెరిగింది. నాల్గవ త్రైమాసికంలో కూడా నిమ్ ఇదే స్థాయిలో ఉంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.988 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు చేరింది. తగ్గుతున్న నిరర్థక ఆస్తులు నిరర్థక ఆస్తులను ఎస్బీహెచ్ గణనీయంగా తగ్గించుకుంది. దీనికోసం చేపట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్తో సహా ప్రత్యేక కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని ముఖర్జీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల ఎన్పీఏలు 5.73 నుంచి 5.32 శాతానికి, నికర ఎన్పీఏలు 2.82 నుంచి 2.43 శాతానికి తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రుణ మాఫీ ఖాతాల్లో 94 శాతం పునరుద్ధరించడం పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఆలస్యంగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి కావచ్చని చెప్పారు. -
రాజన్ రూటు మారుతుందా?
రేపు ఆర్బీఐ పాలసీ సమీక్ష వడ్డీరేట్ల తగ్గింపునకు సానుకూల పరిస్థితులు... భారీగా దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల ఆసరా... న్యూఢిల్లీ: వడ్డీరేట్ల తగ్గింపుపై ఇప్పటిదాకా కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి మెత్తబడతారా? ఈ నెల 2న(రేపు) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో అనూహ్యంగా రేట్ల కోతతో ఆశ్చర్యపరుస్తారా? గడిచిన 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే వాదనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో కూడా భారీగా దిగిరావడం... మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు నాలుగున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కార్పొరేట్లు వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పదేపదే డిమాండ్ చేసినప్పటికీ గత 4 సమీక్షల్లో పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం తెలిసిందే. అన్నీ మంచి శకునములే... రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.52 శాతానికి దిగిరాగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి శాంతించడం తెలిసిందే. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా 40 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ 70 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది దేశీయంగా పెట్రో ధరలు తగ్గేందుకు.. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత శాంతించేందుకు దోహదం చేసే అంశం. అంతేకాకుండా అత్యధికంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది శుభపరిణామమే. ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా... ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయి కొనసాగవచ్చన్న అంచనాలతో ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను నిర్దేశించింది. 2015 జనవరినాటికి 8 శాతం, 2016 జనవరికి 6 శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలు ఇప్పటికే సాకారమయ్యాయి కూడా. ఆర్బీఐ అంచనాలతో పోలిస్తే చమురు ధర 30 శాతం క్షీణించడంతో రాజన్ ఆలోచనలో మార్పు వచ్చి, రేట్లు తగ్గించే అవకాశం లేకపోలేదు. మంగళవారం సెంటిమెంట్! రాజన్‌కు మంగళవారం సెంటిమెంటు ఉందా? ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్) నుంచి ఇప్పటిదాకా జరిగిన నాలుగు పాలసీ సమీక్షలతో పాటు రేపటిది కూడా మంగళవారమే కావడం చూస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతోంది. 2013 సెప్టెంబర్ 4న బాధ్యతలు చేపట్టిన రాజన్.. గత ఆర్థిక సంవత్సరంలో జరిపిన 4 సమీక్షల్లో 2 మంగళవారమే నిర్వహించారు. పాలసీ యథాతథమే: బ్యాంకర్లు ద్రవ్యోల్బణం దిగొచ్చినప్పటికీ.. రేపటి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. బహుశా ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో(మార్చి) రేట్ల కోత ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ కూడా ఆర్బీఐ మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశం ఉందన్నారు. ‘వడ్డీరేట్ల తగ్గింపునకు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నప్పటికీ... రుణాలకు డిమాండ్ పెద్దగా లేదు. పావు శాతం రేటు తగ్గించడం వల్ల గణనీయంగా డిమాండ్ పెరిగే అవకాశాల్లేవు. అందుకే వృద్ధికి చేయూతనివ్వాలంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం కోసం ప్రస్తుతానికి యథాతథంగానే ఆర్బీఐ పాలసీని కొనసాగించే చాన్స్ ఉంది’ అని నారంగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4% వద్ద ఉన్నాయి. తగ్గించొచ్చు: యస్ బ్యాంక్ అయితే, యస్ బ్యాంక్ సీఈఓ, ఎండీ రాణా కపూర్ మాత్రం రేపటి ఆర్బీఐ సమీక్షలో పావు శాతం వడ్డీరేట్ల కోతకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం శాంతించడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధర భారీ పతనం.. భవిష్యత్తులో మరింత తగ్గొచ్చనే అంచనాలే దీనికి కారణమ న్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు చాన్స్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కోటక్ అన్నారు. కాగా, విశ్లేషకులు మాత్రం ఈ సారి సమీక్షలో రేట్లను మరోసారి యథాతథంగానే కొనసాగించవచ్చని అంటున్నారు. రేట్లు తగ్గించాల్సిందే: కార్పొరేట్లు ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం నేపథ్యంలో ఆర్బీఐ కచ్చితంగా వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించాలని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(క్యూ1లో 5.7 శాతం) పరిమితమైన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వడ్డీరేట్లను తగ్గించి రేట్లను తగ్గించడం ద్వారా వృద్ధికి చేయూతనివ్వాలని పదేపదే చెబుతూవస్తున్నారు. నేడు రాజన్‌తో జరగనున్న భేటీలో రేట్ల కోత అంశాన్ని జైట్లీ ప్రస్తావిస్తారని పారిశ్రామిక రంగం గంపెడాశలతో ఉంది. ‘వృద్ధి ఇంకా గాడిలోపడలేదు. మరోపక్క, అంచనాలకు మంచి ద్రవ్యోల్బణం దిగొచ్చింది. క్రూడ్ ధర కూడా భారీగా దిగొచ్చింది. ఇప్పట్లో ఇది పెరగే అవకాశం లేకపోగా.. 60 డాలర్ల(నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ రేటు) స్థాయికీ పడిపోవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులన్నీ దృష్టిలోపెట్టుకొని కనీసం అర శాతం వడ్డీరేట్ల(రెపో) కోతను ఆర్బీఐ ప్రకటించాల్సిందే’ అని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. తయారీ రంగం ప్రస్తుత గడ్డు పరిస్థితులకు అధిక వడ్డీరేట్లూ ప్రధాన కారణమే. ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపరచాలంటే ఆర్బీఐ రేట్ల తగ్గింపుతోనే సాధ్యమని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ ఇకనైనా తన స్టేటస్ కో(యథాతథ) ధోరణిని పక్కనబెట్టి వడ్డీరేట్ల కోతతో పరిశ్రమకు, సామాన్య రుణ గ్రహీతలకూ ఉపశమనం కల్పించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.