ఫిబ్రవరిలో వడ్డీరేట్ల కోత..
మార్చిలోగా ఆర్‌బీఐ మరోసారి రేట్లు తగ్గించొచ్చు
⇒ 181% వృద్ధితో రూ. 334 కోట్లకు చేరిన క్యూ3 నికరలాభం
⇒ 5.77 నుంచి 5.32 శాతానికి తగ్గిన స్థూల ఎన్‌పీఏలు
⇒ త్వరలో టైర్2 బాండ్స్ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ
⇒ ప్రస్తుతానికి విలీన అవకాశాలు లేవు
- ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొన్న ఆర్‌బీఐ చేసిన పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపును వచ్చే నెలలో ఖాతాదారులకు బదలాయిస్తామని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. డిపాజిట్లు రేట్ల తగ్గిస్తేనే తప్ప రుణాలపై వడ్డీరేట్లు తగ్గించలేమని, వచ్చే నెలలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ చెప్పారు. మంగళవారమిక్కడ బ్యాంకు 3వ త్రైమాసిక (సెప్టెంబర్- డిసెంబర్) ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు.
మార్చిలోగా ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందన్నారు. ‘‘రిటైల్ రుణాలకు తప్ప ఇపుడు కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదు. 4వ త్రైమాసికం నుంచి రుణాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే ఏడాది రుణాల్లో 17-18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. వ్యాపార విస్తరణకు కావాల్సిన మూలధనాన్ని టైర్-2 బాండ్ల ద్వారా సేకరించాలని చూస్తున్నాం. ఈ మార్చిలోగా బాండ్లు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పేరెంట్ బ్యాంక్ ఎస్‌బీఐలో విలీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు’’ అని తెలియజేశారు.
నికర లాభంలో రికార్డు స్థాయి వృద్ధి
నికర లాభంలో బ్యాంకు రికార్డు స్థాయిలో 181 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.334 కోట్లకు చేరింది. అధిక వడ్డీరేటున్న బల్క్ డిపాజిట్లను రూ.44,295 కోట్ల నుంచి రూ. 31,965 కోట్లకు తగ్గించుకోవడం, ఇతర ఆదాయం 92 శాతం వృద్ధితో 185 కోట్ల నుంచి 356 కోట్లకు పెరగడం దీనికి ప్రధాన కారణాలని ముఖర్జీ చెప్పారు.
ఇదే సమయంలో తక్కువ వడ్డీ రేటున్న కాసా డిపాజిట్లను 27 నుంచి 31 శాతానికి పెంచుకోవడంతో నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.04 శాతం నుంచి 3.26 శాతానికి పెరిగింది. నాల్గవ త్రైమాసికంలో కూడా నిమ్ ఇదే స్థాయిలో ఉంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.988 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు చేరింది.
తగ్గుతున్న నిరర్థక ఆస్తులు
నిరర్థక ఆస్తులను ఎస్‌బీహెచ్ గణనీయంగా తగ్గించుకుంది. దీనికోసం చేపట్టిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌తో సహా ప్రత్యేక కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని ముఖర్జీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల ఎన్‌పీఏలు 5.73 నుంచి 5.32 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.82 నుంచి 2.43 శాతానికి తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రుణ మాఫీ ఖాతాల్లో 94 శాతం పునరుద్ధరించడం పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఆలస్యంగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి కావచ్చని చెప్పారు.