రాజన్ రూటు మారుతుందా?
రేపు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
వడ్డీరేట్ల తగ్గింపునకు సానుకూల పరిస్థితులు...
భారీగా దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల ఆసరా...
న్యూఢిల్లీ: వడ్డీరేట్ల తగ్గింపుపై ఇప్పటిదాకా కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి మెత్తబడతారా? ఈ నెల 2న(రేపు) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో అనూహ్యంగా రేట్ల కోతతో ఆశ్చర్యపరుస్తారా? గడిచిన 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే వాదనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో కూడా భారీగా దిగిరావడం... మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు నాలుగున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కార్పొరేట్లు వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పదేపదే డిమాండ్ చేసినప్పటికీ గత 4 సమీక్షల్లో పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం తెలిసిందే.
అన్నీ మంచి శకునములే...
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.52 శాతానికి దిగిరాగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి శాంతించడం తెలిసిందే. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా 40 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ 70 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది దేశీయంగా పెట్రో ధరలు తగ్గేందుకు.. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత శాంతించేందుకు దోహదం చేసే అంశం. అంతేకాకుండా అత్యధికంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది శుభపరిణామమే. ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా... ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయి కొనసాగవచ్చన్న అంచనాలతో ఆర్‌బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను నిర్దేశించింది. 2015 జనవరినాటికి 8 శాతం, 2016 జనవరికి 6 శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలు ఇప్పటికే సాకారమయ్యాయి కూడా. ఆర్‌బీఐ అంచనాలతో పోలిస్తే చమురు ధర 30 శాతం క్షీణించడంతో రాజన్ ఆలోచనలో మార్పు వచ్చి, రేట్లు తగ్గించే అవకాశం లేకపోలేదు.
మంగళవారం సెంటిమెంట్!
రాజన్‌కు మంగళవారం సెంటిమెంటు ఉందా? ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్) నుంచి ఇప్పటిదాకా జరిగిన నాలుగు పాలసీ సమీక్షలతో పాటు రేపటిది కూడా మంగళవారమే కావడం చూస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతోంది. 2013 సెప్టెంబర్ 4న బాధ్యతలు చేపట్టిన రాజన్.. గత ఆర్థిక సంవత్సరంలో జరిపిన 4 సమీక్షల్లో 2 మంగళవారమే నిర్వహించారు.
పాలసీ యథాతథమే: బ్యాంకర్లు
ద్రవ్యోల్బణం దిగొచ్చినప్పటికీ.. రేపటి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. బహుశా ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో(మార్చి) రేట్ల కోత ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ కూడా ఆర్‌బీఐ మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశం ఉందన్నారు. ‘వడ్డీరేట్ల తగ్గింపునకు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నప్పటికీ... రుణాలకు డిమాండ్ పెద్దగా లేదు. పావు శాతం రేటు తగ్గించడం వల్ల గణనీయంగా డిమాండ్ పెరిగే అవకాశాల్లేవు. అందుకే వృద్ధికి చేయూతనివ్వాలంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం కోసం ప్రస్తుతానికి యథాతథంగానే ఆర్‌బీఐ పాలసీని కొనసాగించే చాన్స్ ఉంది’ అని నారంగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4% వద్ద ఉన్నాయి.
తగ్గించొచ్చు: యస్ బ్యాంక్
అయితే, యస్ బ్యాంక్ సీఈఓ, ఎండీ రాణా కపూర్ మాత్రం రేపటి ఆర్‌బీఐ సమీక్షలో పావు శాతం వడ్డీరేట్ల కోతకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం శాంతించడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధర భారీ పతనం.. భవిష్యత్తులో మరింత తగ్గొచ్చనే అంచనాలే దీనికి కారణమ న్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు చాన్స్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కోటక్ అన్నారు. కాగా, విశ్లేషకులు మాత్రం ఈ సారి సమీక్షలో రేట్లను మరోసారి యథాతథంగానే కొనసాగించవచ్చని అంటున్నారు.
రేట్లు తగ్గించాల్సిందే: కార్పొరేట్లు
ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం నేపథ్యంలో ఆర్‌బీఐ కచ్చితంగా వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించాలని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(క్యూ1లో 5.7 శాతం) పరిమితమైన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వడ్డీరేట్లను తగ్గించి రేట్లను తగ్గించడం ద్వారా వృద్ధికి చేయూతనివ్వాలని పదేపదే చెబుతూవస్తున్నారు. నేడు రాజన్‌తో జరగనున్న భేటీలో రేట్ల కోత అంశాన్ని జైట్లీ ప్రస్తావిస్తారని పారిశ్రామిక రంగం గంపెడాశలతో ఉంది. ‘వృద్ధి ఇంకా గాడిలోపడలేదు. మరోపక్క, అంచనాలకు మంచి ద్రవ్యోల్బణం దిగొచ్చింది. క్రూడ్ ధర కూడా భారీగా దిగొచ్చింది. ఇప్పట్లో ఇది పెరగే అవకాశం లేకపోగా.. 60 డాలర్ల(నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ రేటు) స్థాయికీ పడిపోవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులన్నీ దృష్టిలోపెట్టుకొని కనీసం అర శాతం వడ్డీరేట్ల(రెపో) కోతను ఆర్‌బీఐ ప్రకటించాల్సిందే’ అని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. తయారీ రంగం ప్రస్తుత గడ్డు పరిస్థితులకు అధిక వడ్డీరేట్లూ ప్రధాన కారణమే. ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపరచాలంటే ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుతోనే సాధ్యమని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ ఇకనైనా తన స్టేటస్ కో(యథాతథ) ధోరణిని పక్కనబెట్టి వడ్డీరేట్ల కోతతో పరిశ్రమకు, సామాన్య రుణ గ్రహీతలకూ ఉపశమనం కల్పించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.