
బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్‌బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్‌లో అనిల్ పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?
ఆర్‌బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్‌బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment