Q3 net profit
-
సెయిల్ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 542 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,529 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25,398 కోట్ల నుంచి రూ. 25,140 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 23,210 కోట్ల నుంచి రూ. 24,825 కోట్లకు ఎగశాయి. ముడిస్టీల్ ఉత్పత్తి 4.531 మిలియన్ టన్నుల నుంచి 4.708 ఎంటీకి పుంజుకుంది. అమ్మకాలు సైతం 3.84 ఎంటీ నుంచి 4.15 ఎంటీకి బలపడ్డాయి. కంపెనీ వార్షికంగా 21 ఎంటీ స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి..
ముంబై: ఆభరణాల విక్రేత కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 16 శాతంపైగా బలపడి దాదాపు రూ. 135 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 3,435 కోట్లను అధిగమించింది. షోరూముల రీలొకేషన్, సిబ్బందికి బోనస్ నేపథ్యంలో రూ. 8 కోట్లమేర ఒకేసారి వ్యయాలు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మధ్యప్రాచ్యం నుంచి ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 515 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. కోవిడ్–19 తదుపరి అత్యధిక శాతం షోరూముల్లో అమ్మకాలు కరోనా మహమ్మారి ముందుస్థాయికి మించి నమోదైనట్లు వెల్లడించింది. ఈకామర్స్ విభాగం క్యాండీర్ విక్రయాలు 40 శాతం ఎగసి రూ. 47 కోట్లను తాకాయి. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా 21 రాష్ట్రాలు, మధ్యప్రాచ్యంలోని నాలుగు దేశాలతో కలిపి మొత్తం 151 స్టోర్లు నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 68 వద్ద ముగిసింది. -
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్..!
ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 డిసెంబర్, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం(క్యూ3 ఎఫ్ వై22) ఫలితాలను విడుదల చేసింది. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ₹18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది క్రితం 3వ త్రైమాసికంలో పొందిన లాభం కంటే (₹13,101 కోట్ల) 41 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన చమురు-రిటైల్-టెలికామ్ ఆదాయం ₹1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 54% పెరిగి ₹1.91 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాల విడుదల ముందు శుక్రవారం రిలయన్స్ ఎన్ఎస్ఈలో ₹2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్ గత ఏడాది కాలంలో 18.26% పెరిగింది. రిలయెన్స్ జియో అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త కస్టమర్లను పొందింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు. "మా రిలయన్స్ అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్ వై22లో సంస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది అని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ & డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలు నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, మేము భవిష్యత్తు వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు & భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. (చదవండి: యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!) -
సామాన్యుడినే కాదు..! డీమార్ట్నుకూడా వదల్లేదు..!
అధిక ద్రవ్యోల్భణ రేటుతో సామాన్యులే కాకుండా డీమార్ట్ కూడా కాస్త సతమతమైంది. డీమార్ట్ జోరుకు ద్రవ్యోల్భణం స్పీడ్ బ్రేకర్‌గా నిలిచింది. 2021 క్యూ3లో కంపెనీ తక్కువ లాభాలను గడించింది. ఆశించిన దాని కంటే..! రిటైల్ చైన్ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (అక్టోబర్-డిసెంబర్) 2021 త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం వరుసగా 32శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. క్యూ3లో డీమార్ట్ సుమారు రూ. 603 కోట్ల లాభాలను బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వ్యాపారాన్ని దెబ్బతీసిందని డీమార్ట్ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటీకి కంపెనీ మార్జిన్లకు అనుగుణంగా అంచనాలు కాస్త అటుఇటుగా ఉన్నాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే..! 2020-21లో ఇదే కాలంలో లాభం రూ.446.05 కోట్లతో పోలిస్తే ఈసారి 23.62 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిర్వహణ ఆదాయం రూ. 7542 కోట్ల నుంచి 22.22 శాతం పెరిగి రూ.9,217.76 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6977.88 కోట్ల నుంచి 21.72 శాతం పెరిగి రూ.8,493.55 కోట్లకు చేరాయి.ఇదే సమయంలో నికర లాభం కూడా రూ.686 కోట్ల నుంచి రూ.1086 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాలు..! ద్రవ్యోల్భణం కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా అన్నారు. సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉన్నాయని, అయితే నిత్యావసర వస్తువులు (ఎఫ్ఎమ్సీజీ) అమ్మకాలు నెమ్మదించాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆయా వస్తువులను పొదుపుగా వాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చదవండి: అప్పట్లో అందరి రాతలు ఆయన పెన్నులతోనే! ప్చ్.. ఆయన రాతే బాగోలేదు! -
సీఈవోకు క్లీన్ చిట్, షేర్లు జూమ్
సాక్షి,ముంబై: అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం భారీగా లాభపడుతున్నాయి.శుక్రవారం మార్కెట్‌ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో మెరుగైన లాభాలను సాధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇన్ఫీ షేర్లలోకొనుగోళ్లకు ఎగబడ్డారు. దీనికితోడు సవరించిన రెవెన్యూ గైడెన్స్, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సీఈవో సహా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లకు క్లీన్చిట్ ఇవ్వడం కూడా సెంటిమెంట్‌ను బాగా ప్రభావితం చేసింది. దీంతో 4 శాతానికి ఎగిసిన ఇన్ఫీ షేరు మార్కెట్లో టాప్ విన్నర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఐటీ మేజర్ ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను సాధించింది. జనవరి 10న ప్రకటించిన ఫలితాల్లో 2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో లాభం 23 శాతం ఎగిసి రూ .4,466 కోట్ల నమోదు చేసింది. ఆదాయం 7.95 శాతం పెరిగి రూ .23,092 కోట్లకు చేరింది. దీనికి తోడు భారీ ఆర్డర్లు లభించడంతో 2020 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్ 10 -10.5 శాతానికి సవరించింది. మరోవైపు సంస్థలో ఆర్థిక తప్పులు, దుష్ప్రవర్తనకు సంబంధించి బోర్డు ఆడిట్ కమిటీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 21న విజిల్ బ్లోయర్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ అనైతిక పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సంస్థ తాజాగా ఈ విషయాలను సంస్థ వెల్లడించింది. -
అదరగొట్టిన యాక్సిస్ బ్యాంకు
సాక్షి,ముంబై : ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనా వేసినదానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నికర లాభాల్లో ఏకంగా 131 శాతం పుంజుకుంది. గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన క్యూ3లో రూ.1681 కోట్ల నికరలాభాలను ఆర్జించింది. ఇది రూ.1197కోట్లుగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నిరర్థక ఆస్తుల్లో స్వల్పంగా క్షీణత నమోదైంది. బ్యాంకు మాజీ సీఈవో శిఖా శర్మ ఆధ్వర్యంలో నికర లాభం, వడ్డీ లాభం సహా అన్ని విధాలుగా మెరుగైన ప్రదర్శనతో బ్యాంకు ఆకట్టుకుంది. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 2.54 నుంచి 2.36 (రూ.12233.3 కోట్లు) శాతానికి తగ్గగా, గ్రాస్ ఎన్పీఏ 5.9 నుంచి 5.7 (రూ.30854.70 కోట్లు)శాతానికి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.5603.60 కోట్లు గా నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.47 శాతం, ప్రొవిజన్స్ రూ.3054 కోట్లు, రిటైల్ లోన్ బుక్ వృద్ధి 20 శాతంగా ఉన్నాయి. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రేపటి ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంకు కౌటర్లో లాభాలను అంచనావేస్తున్నారు ఎనలిస్టులు. -
అదరగొట్టిన ఐఓసీ: బోనస్, డివిడెండ్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి భారీ లాభాలను సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఐవోసీ ఫలితాల్లో నికర లాభం గత క్వార్టర్లోని రూ. 3994 కోట్ల తో పోలీస్తే ప్రస్తుతం రూ. 7883 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 22.2 శాతం ఎగిసి రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ లాభం 8.1 శాతం పుంజుకుని రూ .7,373 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ. 807 కోట్ల నుంచి రూ. 1353 కోట్లకు పుంజుకోగా... ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) బ్యారల్‌కు 8.28 డాలర్లుగా నమోదైనట్లు ఐవోసీ తెలియజేసింది. అంతేకాదు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఐవోసీ బోర్డు అనుమతించింది. అంటే ప్రతీ 1 షేరుకీ మరో షేరుని అదనంగా జోడించనుంది. అంతేకాదు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. -
హైవే బ్యాన్ దెబ్బ: చతికిలపడిన యునైటెడ్ స్పిరిట్స్
సాక్షి,ముంబై: లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ క్యూ3లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను అందుకోలేక పోయింది. నికర లాభాలు 9 శాతం క్షీణించగా ఆదాయం కూడా భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో ఇవాల్టీ మార్కెట్లో యునైటెడ్ స్పిరిట్స్ షేరు భారీగా నష్టపోయింది. 6.7శాతం పతనమై రూ. 3,501ని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యునైటెడ్ స్పిరిట్స్ లాభం 9 శాతం క్షీణించి రూ. 135 కోట్లను తాకగా..మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ. 2,263 కోట్లకు పరిమితమైంది. ఇబిటా సైతం 7శాతం నీరసించి రూ. 272 కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్ మార్పులకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో తమ నికర విక్రయాలపై ప్రతికూలంగా ప్రభావం కనిపించిందని యునైటెడ్ స్పిరిట్స్ సిఇఓ ఆనంద్ క్రిపాలు వెల్లడించారు. ముఖ్యంగా హై వేలపై మద్య నిషేధం తమ లాభాలను కొంతవరకు దెబ్బతీసిందని చెప్పారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 25శాతం జంప్..కానీ..
సాక్షి,ముంబై: యాక్సిస్బ్యాంకు క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో వృద్దిని నమోదు చేసింది. నికర లాభంలో 25శాతం పెరుగుదలను నమోదు చేసింది, అధిక వడ్డీ, ఫీజు ఆదాయాలు,బ్యాడ్ లోన్ల తగ్గుదల నేపథ్యంలో లాభాల్లో మెరుగుపడింది. యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నికరలాభం 25 శాతం పెరిగి రూ .726 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .580 కోట్ల నుంచి రూ .780 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్ల బెడద 5.28 శాతానికి దిగివచ్చింది. ఇది గత క్వార్టర్లో 5.90శాతం ఉండగా, గత ఏడాది 5.22శాతంగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ ఫలితాలు భళా: లాభం 20శాతం జంప్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. డిసెంబర్ 31తో ముగిసి క్యూ3 లో నికర లాభం భారీగా జంప్ చేసింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు నికర లాభం 20 శాతం ఎగిసి రూ. 4643 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 3,865 కోట్ల రూపాయలను ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 24 శాతం పెరిగి రూ. 10,314 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) స్వల్పంగా పెరిగాయి. గత క్వార్టర్1.26 శాతంతో పోలిస్తే ఈ క్వార్టర్లో 1.29 శాతానికి చేరాయి.. నికర ఎన్పీఏలు సైతం 0.43 శాతం నుంచి నామమాత్రంగా 0.44 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 1476 కోట్ల నుంచి రూ. 1351 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలోహెచ్డీఎఫ్సీ కౌంటర్ భారీ లాభాలతో రూ. 1958 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశ మార్కెట్ చరిత్రలో రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించిన మూడో సంస్థగా హెచ్డీఎఫ్సీ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన ఐటీ దిగ్గజం
ముంబై: దేశీయ్ నాలగవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్వార్టర్ 3లో మెరుగైన ఫలితాలను సాధించింది. నికర లాభాల్లో 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2,070 కోట్ల లాభాలను సాధించింది. గత ఏడాది లాభాలు రూ.1,920కోట్లగా ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.11,814 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.10,341కోట్లగా ఉంది. డాలర్ రూపంలో నికర లాభాలు 5.2 శాతం వృద్ధిని నమోదు చేసి 306 మిలియన్ డాలర్లను రిపోర్ట్ చేసింది. డాలర్ ఆదాయం 11.4శాతం ఎగిసి 1.74 బిలియన్ డార్లను ఆర్జించింది. అలాగే షేర్ కు 6 బోనస్ ప్రకటించింది. నోయిడా ఆధారిత హెచ్ సీఎల్ ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే ఫలితాలను అంచనావే స్తున్నట్టు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ తెలిపారు. హెచ్‌సిఎల్ టెక్ అన్ని రెవెన్యూ విభాగాల్లో విస్తృత వృద్దిని నమోదు చేసినట్టు తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో రూ 2,214.5 కోట్ల నగదు సమానత వచ్చిందన్నారు. అమెరికా, యూరప్ ఆదాయం వరుసగా 13.6 శాతం 17.6 శాతంగాఉంది. కాగా 8,467 మంది అదనంగా చేరగా... 2016 డిసెంబర్ నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,11,092. ఉద్యోగుల వలన 17.9 వద్ద నిలిచింది. మార్కెట్ ఆరంభంలో 2.37 శాతానికిపై గా నష్టపోయిన హెచ్ సీఎల్ షేరు నష్టాలను తగ్గించుకొంది. -
అదరగొట్టిన టీసీఎస్
ముంబై: ఐటీ మేజర్ టీసీఎస్ క్యూ 3 ఆర్థిక ఫలితాల్లో అంచనాలను అధిగమించింది. నికరలాభాల్లో 2.9 శాతం జంప్ చేసి మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. దేశీయ అతి పెద్ద ఐటీ సంస్థ గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో నికర లాభం రూ 6,778 కోట్లుగా నమోదు చేసింది. ఆదాయం 1.5 శాతం పెరిగి రూ. 29,735 కోట్లుగా నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ. 6,432 కోట్ల లాభాన్ని నమోదు చేయనుందని విశ్లేషకులు ఊహించారు. ఒక పక్క మిస్త్రీ- టాటా బోర్డ్ వార్, మరో పక్క హెచ్ 1 వీసాలపై నెలకొన్న ఆందోళన వాతావరణం నేపథ్యంలో టీసీఎస్ ఫలితాలు ఆకర్షణీయంగా నిలిచాయి. డాలర్ ఆదాయం 4,387మిలియన్ డాలర్లుగా నిలిచిందని కంపెనీ తెలిపింది. స్థిరమైన కరెన్సీ పరంగా, కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ తో 26.01 శాతంగా నమోదైంది. ఎబిటా మార్జిన్ 26.22 శాతం పెరిగి రూ.7733కోట్లను సాధించింది. అలాగే ఈ త్రైమాసికంలో 18.362 ఉద్యోగులు చేరినట్టు, ఈ క్వార్టర్ చివరినాటికి మొత్తం ఉద్యోగులు 3,78,497 వద్ద నిలిచిందని టీసీఎస్ బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ 6,586 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ 29.280 కోట్ల ఆదాయాన్ని వెల్లడిచే యగా , ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ మూడవ త్రైమాసికంలో రెవెన్యూ 1.55 శాతం పెరిగింది. దీంతోపాటు ప్రతి షేర్‌కి రూ.6.50 డివిడెండ్ ను కూడా ప్రకటించింది. కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం దేశీయ ఐటీ రంగానికి చేటు తప్పదనే అంచనాల నేపథ్యంలో టీసీఎస్ మెరుగైన ఫలితాలను వెల్లడించింది. దీంతో ఐటీ రంగంపై భరోసా పెరిగిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆంధ్రాబ్యాంక్ ఫలితాలు ఆకర్షణీయం
⇒ క్యూ3లో నికరలాభం 339 శాతం వృద్ధి ⇒ వచ్చే ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి లక్ష్యం ⇒ తొమ్మిది నెలల్లో రూ. 2,000 కోట్ల నిధుల సమీకరణ ⇒ మార్చిలోగా వడ్డీరేట్లు మరో పావు శాతం తగ్గే అవకాశం ⇒ ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్. రాజేంద్రన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదిలించుకొని, ఇదే సమయంలో అధిక వడ్డీ ఉన్న రుణాలపై దృష్టిసారించడం ద్వారా ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(క్యూ3) నికరలాభంలో 339 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 46 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 202 కోట్లకు చేరింది. సమీక్షకాలంలో డిపాజిట్ల సేకరణ వ్యయం 17 బేసిస్ పాయింట్లు తగ్గితే, రుణాలపై ఈల్డ్స్ 51 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ తెలిపారు. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీరేట్లు ఉన్న బల్క్ డిపాజిట్లను వదిలించుకొని, చౌకగా విదేశీ నిధులను సేకరించడం ద్వారా డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకున్నట్లు తెలిపారు. సమీక్షా కాలంలో డిపాజిట్ల సేకరణ వ్యయం 7.84 శాతం నుంచి 7.66 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో రుణాలపై రాబడి 11.15 శాతం నుంచి 11.66 శాతానికి పెరిగింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 3,901 కోట్ల నుంచి రూ.4,540 కోట్లకు చేరింది. బ్యాంకు వ్యాపార పరిమాణం 11 శాతం వృద్ధితో రూ. 2.34 లక్షల కోట్ల నుంచి రూ. 2.60 లక్షల కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలంలో వ్యాపారంలో 14 శాతం వృద్ధి నమోదయ్యిందని, వచ్చే ఏడాది 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. తగ్గని నిరర్థక ఆస్తులు ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు స్థిరంగా ఉంటే, నికర నిరర్థక ఆస్తులు స్వల్పంగా తగ్గాయి. స్థూల నిరర్థక ఆస్తులు రూ. 7,118 కోట్లు(5.99%), నికర నిరర్థక ఆస్తులు రూ.4,264 కోట్లు (3.70%)గా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో కొత్తగా రూ. 430 కోట్ల ఎన్పీఏలు జతైనట్లు రాజేంద్రన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ మాఫీ నిధులను ఆలస్యంగా విడుదల చేయడం వల్ల ఈ త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గలేదని, దీని ప్రభావం ప్రస్తుత త్రైమాసికంలో కనిపిస్తుందన్నారు. దీంతో మార్చి నాటికి స్థూల ఎన్పీఏ 5%కి పరిమితమవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇక వడ్డీరేట్ల విషయానికి వస్తే ఆర్బీఐ మార్చిలోగా మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రుణాలను తక్కువ రేటుకే అందిస్తుండటంతో బేస్ రేటును తగ్గించలేదని, మార్చిలోగా బేస్‌రేటు తగ్గిస్తామన్నారు. నిధుల సేకరణ వ్యాపార విస్తరణకు కావల్సిన మూలధనం కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో బాండ్ల రూపంలో నిధులను సేకరించే యోచనలో ఉన్నట్లు రాజేంద్రన్ తెలిపారు. వడ్డీరేట్లు తగ్గితే వచ్చే తొమ్మిది నెలల్లోగా రూ. 2,000 కోట్ల వరకు సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చిలోగా రూ. 500 కోట్లు టైర్-2 బాండ్లను జారీ చేయడంతో పాటు, వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో మరో రూ. 1,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. మార్చిలోగా కొత్తగా 200 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్యను 2,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఫలితాల నేపథ్యంలో ఆంధ్రా బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1.1% లాభపడి రూ. 91 వద్ద ముగిసింది. -
ఫిబ్రవరిలో వడ్డీరేట్ల కోత..
మార్చిలోగా ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించొచ్చు ⇒ 181% వృద్ధితో రూ. 334 కోట్లకు చేరిన క్యూ3 నికరలాభం ⇒ 5.77 నుంచి 5.32 శాతానికి తగ్గిన స్థూల ఎన్పీఏలు ⇒ త్వరలో టైర్2 బాండ్స్ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ ⇒ ప్రస్తుతానికి విలీన అవకాశాలు లేవు - ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొన్న ఆర్బీఐ చేసిన పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపును వచ్చే నెలలో ఖాతాదారులకు బదలాయిస్తామని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. డిపాజిట్లు రేట్ల తగ్గిస్తేనే తప్ప రుణాలపై వడ్డీరేట్లు తగ్గించలేమని, వచ్చే నెలలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ చెప్పారు. మంగళవారమిక్కడ బ్యాంకు 3వ త్రైమాసిక (సెప్టెంబర్- డిసెంబర్) ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. మార్చిలోగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందన్నారు. ‘‘రిటైల్ రుణాలకు తప్ప ఇపుడు కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదు. 4వ త్రైమాసికం నుంచి రుణాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే ఏడాది రుణాల్లో 17-18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. వ్యాపార విస్తరణకు కావాల్సిన మూలధనాన్ని టైర్-2 బాండ్ల ద్వారా సేకరించాలని చూస్తున్నాం. ఈ మార్చిలోగా బాండ్లు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పేరెంట్ బ్యాంక్ ఎస్బీఐలో విలీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు’’ అని తెలియజేశారు. నికర లాభంలో రికార్డు స్థాయి వృద్ధి నికర లాభంలో బ్యాంకు రికార్డు స్థాయిలో 181 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.334 కోట్లకు చేరింది. అధిక వడ్డీరేటున్న బల్క్ డిపాజిట్లను రూ.44,295 కోట్ల నుంచి రూ. 31,965 కోట్లకు తగ్గించుకోవడం, ఇతర ఆదాయం 92 శాతం వృద్ధితో 185 కోట్ల నుంచి 356 కోట్లకు పెరగడం దీనికి ప్రధాన కారణాలని ముఖర్జీ చెప్పారు. ఇదే సమయంలో తక్కువ వడ్డీ రేటున్న కాసా డిపాజిట్లను 27 నుంచి 31 శాతానికి పెంచుకోవడంతో నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.04 శాతం నుంచి 3.26 శాతానికి పెరిగింది. నాల్గవ త్రైమాసికంలో కూడా నిమ్ ఇదే స్థాయిలో ఉంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.988 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు చేరింది. తగ్గుతున్న నిరర్థక ఆస్తులు నిరర్థక ఆస్తులను ఎస్బీహెచ్ గణనీయంగా తగ్గించుకుంది. దీనికోసం చేపట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్తో సహా ప్రత్యేక కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని ముఖర్జీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల ఎన్పీఏలు 5.73 నుంచి 5.32 శాతానికి, నికర ఎన్పీఏలు 2.82 నుంచి 2.43 శాతానికి తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రుణ మాఫీ ఖాతాల్లో 94 శాతం పునరుద్ధరించడం పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఆలస్యంగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి కావచ్చని చెప్పారు.